Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    వేణు మొహం సీరియస్ గా వుంది. "చూడండి నా శక్తిని ఇప్పటివరకూ మీరు శంకిస్తూనే వచ్చారు. ఇప్పుడు నిరూపణ అయింది కదా! ఇప్పటినుండీ ఇక నేనే ప్లానులు వేస్తాను. నేను చెప్పినట్టు మీరు వింటారు. అలా అయితేనే మన అగ్రిమెంటు కొనసాగటానికి నేనొప్పుకుంటాను" అన్నాడు వేణు.

    ఇంకా దిగ్భ్రాంతి నుండి తేరుకొని ప్రసాదరావు అప్రయత్నంగా తలూపాడు.

    అయితే అంతలోనే వూహించని ఆపద ఒకటి వచ్చి పడింది. ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఫిల్మెంట్స్ ఉత్పత్తిదారుల సమావేశానికి హాజరవడం కోసం జగపతిరావు ప్రసాద్ ని తీసుకుని వారం రోజులపాటు గోవా వెళుతున్నాడన్న వార్త తెలిసింది.

    "దొరికిందోయ్ ఛాన్సు"! అన్నాడు ప్రసాదరావు ఆనందంతో తలమునకలవుతూ.

    "వారం రోజులపాటు మీరిద్దరూ ఒకటే కాంపౌండ్ లో వుంటున్నారన్నమాట!"

    "లాభంలేదు. ప్రేమ కూడా వాళ్ళతోపాటు గోవా వెళ్తోంది."

    లక్ష ఓల్టుల కరంట్ షాక్ తగిలినట్టు ఆ ప్రసాదరావు అదిరిపడి_ "నో.... అన్యాయం.... అక్రమం.... ఇలా జరగటానికి వీల్లేదు. ప్రసాద్ గాడు అక్కడ పెళ్ళికి ఏకంగా ప్రధానం నిశ్చయం చేసేసుకుని వచ్చేస్తాడు. మనం నోట్లో వేలేసుకుని కూర్చోవలసిందే!" అన్నాడు శివతాండవం చేస్తూ.

    వేణుకి కూడా అది నిజమే అనిపించింది.

    "చూడు వేణూ! రోషనారా వ్యవహారం జరిగి ఇప్పటికి నెలరోజులైంది. నువ్వు చెప్పినట్టే నే నీ విషయంలో ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బైటపడతావో ఇక నీ యిష్టం."

    ప్రసాదరావు చెప్పింది నిజమే. ఈ నెల రోజులూ పాపం అతనొక్కమాట అనలేదు. జగపతిరావు తనని కొద్దికొద్దిగా నమ్మకస్థుడిగా భావిస్తూ చిన్న చిన్న ఆఫీసు రహస్యాలని చెప్పుతూ పనులు అప్పగించటంతో ఆ వ్యవహారంలో మునిగిపోవలసి వచ్చింది ఇంతకాలం. తనదే తప్పు.

    వేణు తల పంకించి "సరే, ఈ విషయం నా కొదిలిపెట్టండి. నాకు కొన్ని వస్తువులు కావాలి" అన్నాడు.

    "ఓ- అలాంటివి ఎన్నైనా చెప్పు! చేస్తాను."

    "అన్నింటికన్నా ముందుగా చిన్న హార్లిక్స్ సీసాడు మంచినూనె" ప్రసాదరావు కళ్ళప్పగించి చూశాడు.

    "ఒక చిన్న మొబైల్ ఎక్స్ రే మిషను."

    ప్రసాదరావుకి స్పృహ తప్పింది_ వేణు అడిగినవి చూస్తే.


                                                  *    *    *    *


    గోవా ప్రయాణం సరిగ్గా ఒక రోజుందనగా జగపతిరావు బాత్ రూంలో జారిపడ్డాడు.

    "ఏం లేదమ్మా.... ఏం లేదు" అని ఆయన మామూలుగా నడిచి బైటకి వచ్చేసినా ప్రేమ వూరుకోలేదు. ఆస్థాన ధన్వంతరి పిలిపించబడ్డాడు. వేణు వచ్చి అరగంటసేపు ఆయన ఎడమకాలు పరీక్షించి కాలు విరిగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

    "డాక్టర్ ని పిలిపిద్దాం" అన్నాడు ప్రసాద్.

    "ఇటువంటి పరిస్థితుల్లో ఈయన్ని ఇక్కడ నుండి కదపటం అంత మంచిపని అనుకోను. ఒక ఎక్స్_రే మిషన్ ని ఇక్కడికే తెప్పిద్దాం" అన్నాడతను.

    అరగంటలో మిషన్ వచ్చింది. అనుభవంతో పండిన గడ్డంతో ఆ మిషన్ లోంచి ఫిల్మ్ అప్పటికప్పుడు తీసి పరీక్షించి చూసిన డాక్టరు, "చీలమండలదగ్గర వెంట్రుకవాసంత విరిగినట్టుంది. మీరు పేషెంటును కదపకుండా వుంచి చాలా గొప్పపని చేశారు. ఒక వారంరోజులవరకూ ఈయన కదలకుండా వుండాలి" అని కాలికి బేండేజి కట్టేసి వెళ్ళిపోతూ పోతూ వేణు భుజం తట్టి, "ఎక్స్ రే మిషన్ కూడా పట్టుకోలేని ఎముక విరుగుడుని నీ కళ్ళు పట్టుకున్నాయంటే చాలా గొప్ప విషయం. నీవి నిజంగా ఎక్స్ రే కళ్ళు" అని అభినందిస్తూ వెళ్ళిపోయాడు.

    ప్రేమ కళ్ళలో అదోలాంటి భావం మొట్టమొదటిసారి కనబడింది వేణుకి. అది అభినందనో_ కృతజ్ఞతో అతడికి తెలియలేదు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఆ తర్వాత చర్చకి వచ్చింది.

    "చాలా ముఖ్యమైన మీటింగు! నేను వెళ్ళకపోతే ఎలా?" అన్నాడు బెంబేలుపడుతూ.

    "ప్రయాణం కాన్సిల్ చేసుకుందాం నాన్నా!" అంది ప్రేమ.

    "రేపు ప్రయాణం_ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. ఇప్పుడు కాన్సిల్ ఎలాగ?" అన్నాడు ప్రసాద్.

    అతడికి ప్రేమతో కలిసి ఇలా వంటరిగా గోవా వెళ్ళటం అనే ఛాన్సు ఇంత యాదృచ్చికంగా కలిసిరావటం అమితమైన సంతోషాన్నిస్తోంది.

    వేణు గుండెలో మాత్రం రాయి పడింది. ఇదేదో మొదటికే మోసం వచ్చేటట్టుందే అనుకున్నా, తాను మొట్టమొదటిసారి ప్రసాదరావు సహాయం లేకుండా వేసిన ప్లాను ఈ విధంగా ఫెయిల్ అవుతుందేమిటా అని భయపడ్డాడు.

    ఈ లోపులో ప్రక్కనున్న దయానందం_ "అదేమిటి ప్రసాద్! అలా అంటావ్? ఈ పరిస్థితిలో ఆయన ఎలా కదుల్తాడు?" అన్నాడు.

    ప్రసాద్ విసుగ్గా తండ్రివైపు చూశాడు. తనకన్నా తండ్రి తెలివైనవాడని అతనికి తెలీదు.

    ఇంతలో ప్రేమ_ "ఇంకా ప్రయాణం ఏమిటి_ నాన్నకిలా వుంటే?" అంది.

    "అదేనమ్మా నేను చెప్పేది__ నువ్వలా అంటావని నాకు తెలుసు. నాన్నగారికి నువ్వు తప్ప మేం ఎవ్వరమూ లేమా? గోవాలో ఓషనోగ్రఫీ లైబ్రరీ స్టడీ చేద్దామనుకున్న దానివి, ఏదో చిన్న ప్రమాదం జరిగిందని ఆగిపోవటం, మా మీద నీకున్న నమ్మకాన్ని తక్కువ చేయటమే."

    "అయ్యో! అంతమాట ఎందుకండీ?"

    "లేకపోతే మరేమిటమ్మా! ప్రతిరోజూ ప్రొద్దున్నా, సాయంత్రం డాక్టర్ని తీసుకువచ్చి చూపించే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. మా ప్రసాద్ తోడుంటాడు."

    ప్రేమ ఇబ్బందిగా చూసింది.

    "వెళ్ళమ్మా? ఇంత చిన్నదానికి నువ్వాగిపోవటం దేనికి?" అన్నాడు జగపతిరావు.

    ప్రసాదు తండ్రివైపు మెచ్చుకోలుగా చూశాడు. ఎలాగైనా ఇటువంటి విషయాల్లో తన తండ్రి తనకన్నా ఎక్కువ వయసూ, అనుభవమూ వున్నవాడు కదా!

    తండ్రీ కొడుకులు ఒకరినొకరు చూసుకుంటున్న వేళ జగపతిరావు వేణువైపు తిరిగి, "ఏమోయ్! దాదాపు నెలరోజుల్నుంచీ ఈ పనులన్నీ నువ్వుకూడా చూస్తున్నావు కదా! నువ్వూ అటెండవు. చాలా ముఖ్యమైన మీటింగు కదా!"

    వేణూ గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది.

    "అలాగేనండీ!" అన్నాడు నమ్రతగా, ప్రసాద్ మొహంలోకి చూడాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ.

    తరువాత దయానందం వైపు తిరిగి అదే నమ్రత నిండిన కంఠంతో "నేనుండను. ప్రేమగారుండరు. మీరే కాస్త సొంత మనిషిలాగా చూసుకోవాలి" అన్నాడు.

    బలవంతంగా కసిని దిగమింగుకొని, "తప్పుతుందా మరి" అన్న టోన్ లో_ "తప్పకుండా?" అన్నాడు దయానందం.

    "మా అమ్మాయి జాగ్రత్తోయ్"!

    "ఏమిటి నాన్నా! నేనేమన్నా చిన్నపిల్లనా?"

    వీళ్ళ సంభాషణ ఇలా కొనసాగుతూ వుండగా వేణు దయానందం వైపు తిరిగి, "ఫ్యాక్టరీ బాలెన్స్ షీటు చూపిస్తాను వస్తారా?" అని అక్కడి నుండి తీసుకువెళ్ళాడు. మళ్ళీ అతడు కొత్త ప్లాన్ వేసే ఆలోచన చెయ్యకముందే ఫుల్ స్టాఫ్ పెట్టేస్తూ.

    ఇద్దరూ బైటికి నడిచారు.

    తేనెలో పడిందో లేదో తెలీదు కానీ రొట్టె మాత్రం విరిగింది.


                       *    *    *    *


    హోటల్ సీవ్యూ!

    వేణు పనిలో చేరిన తర్వాత ప్రతీపనీ సిస్టమాటిక్ గా జరుగుతోంది. అతడు వారంరోజుల ముందే ఆ హోటల్లో రెండు రూములు బుక్ చేసి వుంచాడు. ఒకటి జగపతిరావు కుటుంబానికీ, ఒకటి ప్రసాద్ కీ. ఇప్పుడు ముగ్గురు రావటంతో ఇంకో రూమ్ కావలసి వచ్చింది. ఆ హోటల్లో అంత సులభంగా వసతి దొరకదు.

    "నువ్వింకేదయినా హోటల్లో రూమ్ తీసుకోవోయ్"! అన్నాడు, ప్రసాద్ నౌఖరికి చెప్పినట్టు.

    వేణూ మొహం మ్లానమవ్వడం ప్రేమ గమనించింది. ఎంత కాదనుకున్నా తండ్రి రాకపోతే అతడి తరపు ప్రతినిధిగా మీటింగ్ కి వచ్చాడు. అటువంటివాణ్ణి ఇలా అగౌరవపరచటం తగదన్నట్టు.

    "అదేమిటి ప్రసాద్! ఇంకో హోటలెందుకు? మనతో పాటే వుంటాడు" అంది.

    "ఈ హోటల్లో ఖాళీ లేదుగా!"

    "నీది డబుల్ రూమేగా! ఇద్దరూ వుండచ్చు" అని మరి వాదన ప్రసక్తి లేకుండా కొట్టిపారేసింది ప్రేమ.

    రెండూ పక్క పక్క గదులే దొరికాయి. ఈ వారం రోజులలోనూ ప్రేమకి కాస్త దగ్గరవ్వచ్చనుకున్నాడు వేణు. కానీ అతడి ఆశ ఏమీ ఫలించేటట్టు కనబడలేదు. రూమ్ లో దిగగానే ప్రసాద్ తొందరగా తయారై వెళ్ళిపోయాడు. తీరాచూస్తే అతడు వెళ్ళింది పక్కగదికి. ప్రేమని కూడా హడావిడి పెట్టేసి తనతోపాటు తీసుకు వెళ్ళిపోయాడు. వాళ్లు తిరిగి తిరిగి వచ్చేసరికి రాత్రి పదయింది. ప్రేమ తన గదిలోకి వెళ్ళి తలుపు ఏసుకుని డ్రస్సింగ్ టేబిల్ ముందు కూర్చునేసరికి బల్లమీద చిన్న చీటి కనబడింది. 

    "నాన్నగారికి ఫోన్ చేశాను. ఆరోగ్యంగా వున్నాననీ, కంగారు పడవద్దనీ మీకు చెప్పమన్నారు_వేణు" అని వుంది అందులో.

    ఆ కాగితాన్ని అలాగే చాలాసేపు చూస్తూండిపోయింది ప్రేమ. తన సెక్రటరీకి వున్న ఇంట్రెస్టు-రాగానే ఫోన్ చెయ్యాలన్న వూహ తనకి రాలేదు. ఆమెకి సిగ్గేసింది.

    ప్రక్కనే వున్న ఫోన్ అందుకుని పక్క రూమ్ కి కనెక్షన్ ఇమ్మంది.

    ప్రసాద్ "హలో" అన్నాడు.

    "నేనూ, ప్రేమని."

    ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. పదింటికి గది దగ్గర దిగబెట్టిన పది నిముషాల్లో తిరిగి ఫోన్ చేసిందంటే తన ఆలోచనలతోనే సతమతమౌతోందన్నమాట. ఓరగా వేణూవైపు చూసి అతడు టేబిల్ లైటు వెలుతురులో మీటింగ్ పేపర్లని ఏకాగ్రతతో చదవటంలో లీనమవటం గమనించి, సంతృప్తి చెంది కంఠం తగ్గించి ప్రేమగా_ "హలో! ఏమిటి ప్రేమా?" అన్నాడు రహస్యాన్ని పంచుకుంటున్నట్టు.

    "కొంచెం వేణుని పిలువ్."

    పిడికిలి బిగించి ఎవరో మొహంమీద బాదినట్లయింది.

    "వేణూనా?" అన్నాడు నమ్మలేనట్టు.

    "అవును."

    అతడు గొణుక్కుంటూనే వేణుని పిలిచాడు.

    వేణు వచ్చి రిసీవర్ అందుకున్నాడు.

    "థాంక్స్ వేణూ! నాన్నగారికి ఫోన్ చేసినందుకు. అసలు నేనే చెయ్యాల్సింది. కానీ, సర్లే....ఎనీహౌ థాంక్యూ" అని ఫోన్ పెట్టేసింది.

    ఆ రాత్రి చాలా సేపటివరకూ ఆమె మాటలు, ఆ కంఠంలో సిన్సియారిటీ అతడ్ని వెంటాడుతూనే ఉన్నాయి.

    మరుసటి రోజునుంచీ వేణు వూపిరి సలపనంత పనిలో మునిగిపోయాడు. ప్రతిరోజూ, తర్వాత రోజుకి సంబంధించిన విషయాలు చూసుకోవడం - కాన్ఫరెన్స్ పేపర్లు చర్చించటం.... వాటితోనే సరిపోయేది. ప్రొద్దున్న ఎనిమిదింటికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నరా పదయ్యేది.

    ఈ ట్రిప్ ని ప్రసాద్ బాగా ఉపయోగించుకున్నాడు.

    ప్రసాద్ చాలా ఉత్సాహంగా వున్నాడు. ఆ మరుసటిరోజు రాత్రి బీచ్ రెస్టారెంట్ లో కాటేజ్ బుక్ చేశాడు. పౌర్ణమినాడు సముద్రాన్ని చుట్టానికి చాలామంది టూరిస్టులు గోవాకి పాతిక కిలోమీటర్ల దూరంలో వున్న ఆ రెస్టారెంట్ ని బుక్ చేసుకుంటారు. ప్రసాద్ ఉద్దేశ్యం వేరు. ఆ రాత్రికి ఎలాగయినా ప్రేమను వివాహానికి ఒప్పించాలని.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra