Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    ఆఫీసర్లు అతడికి పిస్తోళ్ళు గురిపెట్టి తీసుకెళుతున్నారు. నా పక్కనుంచి నడుస్తూ అతడు ఆగి- "బదులు తీర్చుకునేవరకూ ఈ విషయము మర్చిపోను బేబీ-" అన్నాడు.

    అప్పటివరకూ ఆవేశాన్నీ, కోపాన్నీ, నిస్సహాయతనీ నొక్కిపట్టి, ఆజ్ఞలు జారీచేస్తున్న నాన్న- ఇక కంట్రోలు చేసుకోలేక పిడికిలి బిగించి లాగిపెట్టి అతడి గెడ్డంమీద బలంగా కొట్టాడు. అంత దృఢకాయుడూ వెనక్కి విరుచుకుపడ్డాడు. అతడి పళ్ళ సందుల్లోంచి రక్తం స్రవించసాగింది. వేళ్ళతో తడిమి రక్తాన్ని చూసుకున్నాడు. అలాంటి పరాభవం జరగటం అదే ప్రధమంలా, "ఈ విషయం కూడా మర్చిపోను" అన్నాడు. నాన్న మళ్ళీ ముందుకు వెళ్ళబోయారు. మిగతావాళ్ళు ఆపుచేసి అతడిని తీసుకువెళ్ళారు. ఆ రాత్రి చాలాసేపటివరకూ అధికారులందరూ కలిసి భద్రతా చర్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని చర్చలు జరిపారు. మావైపు మరణించింది ఒక సైనికుడే. కానీ వాళ్ళవైపు అయిదుగురు. అందువల్ల మా వాళ్ళు సంతోషంగా వున్నారు. యుద్ధంలో జీవితాలు కన్నా అంకెలు బాగా తృప్తినిస్తాయి.

    మరుసటిరోజు ప్రొద్దున్నకల్లా గూఢాచారి వర్గాలద్వారా విశేషమైన వార్త తెలిసింది. అజ్మరాలీని తీసుకువెళ్ళడానికి వచ్చిన నలుగురూ విశేషానుభావం వున్నవాళ్ళు. విదేశీ గూఢచారి శాఖలో చాలా పెద్ద పొజిషన్ లోని కమాండోలు.

    ఈ వార్త తెలిసేసరికి నాకు ఉన్నట్లుంది గౌరవం పెరిగిపోయింది. దేశానికి దూరంగా వున్న ఆ ఆర్మీ క్యాంప్ లో అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయి వుంటారు. ప్రొద్దున్నించీ నాకు అభినందనల పరంపర మొదలైంది.

    ఆ రోజు నా పుట్టినరోజు.

    ముందు చిన్నదిగా చేద్దామనుకున్నారు. కానీ ఈ విజయంతో పెద్ద పార్టీ కావాలన్నారు.

    ఇంటి బయట, గార్డెన్ లో పార్టీ ఏర్పాటు చేశాము. దాదాపు ఆఫీసర్స్ అందరూ వచ్చారు.

    సాయంత్రం అయిదయింది.

    కేక్ కోస్తూ వుండగా విమానాల శబ్దం వినిపించింది.

    అందరం తలెత్తి చూశాం.

    మేము ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. విమానాల్లోంచి బాంబుల వర్షం కురవసాగింది.

    పుట్టినరోజు కోసం ఏర్పాట్లు చేసినవన్నీ చెల్లాచెదురయ్యాయి. మా సైనికాధికారులకి ఏం జరుగుతూ వుందో అర్ధం కాలేదు. సరిహద్దు దాటి శత్రు విమానాలు ఇంతదూరం ఎలా వచ్చాయి? మన రాడార్లు ఏం చేస్తున్నాయి? అంటే... ఎవరో మాలోనే శత్రువులకు సాయం చేస్తున్నారు.

    నాకు విషయం అర్ధమైంది.

    అజ్మరాలీ మాకు పట్టుపడటం- అంతా ఒక నాటకం! చాలా హై లెవల్లో మాలో ఎవరితోనో సంప్రదింపులు జరపటం కోసం అతడు వచ్చాడు. తన పని పూర్తిచేసుకుని వెళ్ళిపోబోతుండగా దురదృష్టవశాత్తు నా కంటపడి దొరికిపోయాడు.

    అతడు దొరికిపోయినప్పుడు కూడా అంత ధైర్యంగా ఎందుకున్నాడో నాకు తెలుస్తోంది.

    నాకు 'కుదించుకుపోతున్న' భావం కలిగింది. మన రోడ్డు గతుకుల్తో నిండిపోతూంటే మనం బస్సులు తగలబెడుతూ ఆవేశంగా ఆనందిస్తాం. రిజర్వేషన్ లు క్యాష్ చేసుకుందామని కొందరు ప్రయత్నిస్తే వారి వెనుక భజన్లు చేసుకుంటూనో, వారికి వ్యతిరేకంగా ఆత్మాహుతులు చేసుకుంటూనో ఆనందాన్ని పొందుతాం. మనలో చాలామందికి 'పని' పట్ల ఆసక్తిలేదు. ఒక ఫీలింగ్ లేదు. ఏ దేశంలో వ్యక్తులు ఈ విధమైన గుణాన్ని కలిగి వుంటారో, ఆ దేశంలో ప్రజలకి దేశంలో వుండటం కన్నా, దేశంనుంచి విడిపోవటంలో ఎక్కువ ఆనందం వుంటుంది. దేశంకన్నా ఎక్కువగా 'ఆకలి' గురించి ఆలోచిస్తారు. ఆ దేశపు సైన్యంలోకి విదేశీయులు చాలా సులభంగా ప్రవేశించగలరు. తమకి ఇష్టం వచ్చినప్పుడు రాగలరు. ఇష్టం లేనప్పుడు పోగలరు. అది అక్షరాలా నిరూపించాడు అజ్మరాలీ! మాలోవున్న కొన్ని స్వార్థపూరిత శక్తుల ఆకలిని అజ్మరాలీ సంతృప్తి పరచాడన్న విషయం తెలుస్తూనే వుంది.

    ఈ ఆలోచన అంతా క్షణాల్లో జరిగింది. విధ్వంసం కూడా ఆ క్షణాల్లోనే జరిగింది.

    అంతా హాహాకారాలూ, ఆర్తనాదాలూ.

    వేసిన టెంట్ కూలిపోయింది. రక్తం ధారగా ప్రవహిస్తూంది. పొగతో ఎవరు మరణించారో, ఎవరు బ్రతికి వున్నారో తెలియటంలేదు. దూరంనుంచి శతఘ్నుల ధ్వని వినిపిస్తూంది.

    కూ(ప్) అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను.

    నేలలోంచి పుట్టుకొచ్చినట్లు పారాచూట్స్ లోంచి దిగుతున్నారు శత్రు సైనికులు. మనవాళ్ళూ పోరాడుతున్నారుగానీ అది ఊహించని పరిణామం అవటం వల్ల పూర్తిగా ప్రిపేర్ అయిలేరు.

    కొద్దిసేపట్లోనే ఆ ఏరియా శత్రువుల వశమైంది. తరువాత అదే ఆక్రమిత కాశ్మీర్ లో భాగం అయింది. అది వేరే సంగతి.

    బహుశా మా వైపు మిగిలి వున్నది మేము ముగ్గురమే అనుకుంటాను.

    నేనూ, అమ్మా, నాన్నగారూ.... కొద్దిగా సైనికులు...

    చుట్టూ శత్రు సైనికులు వలయంగా తుపాకులు గురిపెట్టి వుండగా, మధ్యలో మేము ముగ్గురమూ నిలబడి వున్నాం.

    అప్పుడు నవ్వేడు అజ్మరాలీ. అతను నవ్వటం మొదటిసారి చూశాను. విజయగర్వంతో నవ్వినా నవ్వు అది.

    నా తండ్రితో అతనన్నాడు... "నన్ను నిన్నరాత్రి నువ్వు కొట్టావు. నా మీద చెయ్యి ఎత్తిన వాడెవడూ ప్రాణాల్తో బ్రతికి బట్ట కట్టలేదు. చెప్పు నిన్ను ఏ రకంగా చంపను."

    "నన్ను ఎలా చంపినా ఫర్వాలేదు. కానీ చనిపోబోయే ముందు నా ఒక్క అనుమానం తీర్చు చాలు. మాలో నీకు సహాయపడిన ఆ ఉన్నతాధికారి, ఆ దేశద్రోహి ఎవరు?" నా తండ్రి అడిగాడు.

    దానికి అజ్మరాలీ సమాధానం చెప్పకుండా నావైపు, నా తల్లివైపు పరిశీలనగా చూసి "నీకూ ఒక అనుమానం పట్టి పీడిస్తోంది. దాన్ని తీర్చు. నీ భార్య అందమైనదా? నీ కూతురు అందమైనదా?" అని అడిగాడు.

    నాన్న మొహం ఎర్రబడింది.

    అజ్మరాలీ అన్నాడు- "టాస్ వెయ్యి. ఇద్దరిలో ఎవరు అందమైన వారో టాస్ వేసి, వాళ్ళని అనుభవిస్తాను."

    అతని మాట పూర్తికాలేదు. నాన్న ఒక్క ఉదుటున ముందుకెళ్ళి అతడిని పట్టుకోవాలనుకున్నాడు. పక్కనున్న వాళ్ళు బలంగా పట్టుకుని ఆపకపోతే అంతపనీ జరిగేదే. ఒక తుపాకీ మడమ నాన్నని వెనుకనుంచి బలంగా కొట్టింది. నాన్న మోకాళ్ళమీద వాలిపోయారు. నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

    "లే. లేచి టాస్ వెయ్యి" అన్నాడు అజ్మరాలీ.

    రక్తం చిమ్మే కళ్ళతో నాన్న అతనివైపు చూశాడు. అతనన్నాడు- "సరిగ్గా నిముషం టైమిస్తున్నాను. టాస్ వేసి ఇద్దరిలో ఎవర్ని అనుభవించాలో నువ్వు నిర్ణయిస్తావు. లేదా ఇద్దర్నీ చంపేస్తాను. నువ్వు ఏ మాత్రం తెలివయిన వాడివయినా టాస్ వేసి ఇద్దరిలో ఒకర్ని రక్షించుకొంటావు."

    మనుషుల్లో అంత శాడిస్టులుంటారని నాకు తెలీదు. నీ భార్యనీ అనుభవించనా, నీ కూతుర్ని అనుభవించనా? టాస్ వేసి చెప్పు...... ఇంతకన్నా అవమానకరమైన, నీచమైన పరీక్ష మరొకటి వుంటుందా?

    నాన్న కదల్లేదు.

    అజ్మరాలీ చేతిలో పిస్టల్ పేలింది. టపటపా రెండు బుల్లెట్లు ఇద్దరు సైనికుల శరీరాల్లోంచి దూసుకుపోయాయి. కుప్పకూలి పోయారు.

    "నేనెలాంటి వాడినో నీకు అర్ధమైందనుకుంటాను. కేవలం అది చూపించడానికే నీ సైనికులిద్దర్నీ చంపాను. ఇంకా అయిదు సెకన్లే టైం వుంది. కనీసం ఒకర్ని చంపమంటావా? ఇద్దర్నీ బలిస్తావా?"

    అమ్మ వణికిపోతోంది. నేను అచేతనురాలినై నిలబడి వున్నాను. నాన్న కంపించే వేళ్ళతో అతడి చేతిలో నాణాన్ని తీసుకున్నాడు. ఆత్మాభిమానం కోసం, ఆత్మీయుల్ని బలిపెట్టకూడదన్న అత్యంత అవమానకరమైన నిజాన్ని ఒప్పుకుంటూ, అవహేళనా పూరితమయిన అతడి మొహం ముందు నాణేన్ని ఎగరేశాడు. "బొమ్మపడితే కూతురు- బొరుసైతే తల్లి."

    నాణెం పడే నాలుగు క్షణాలు నాలుగు యుగాలు.

    అజ్మరాలీ నవ్వుకున్నాడు. అతడి పక్కనే పడివున్న నిర్జీవమైన సైనికులు అతడి శాడిజానికి ప్రతీకల్లా వున్నారు.

    నాణెం నేలమీద పడింది.

    నాన్న కళ్ళు రెండూ గట్టిగా మూసుకున్నాడు.

    అజ్మరాలీ దానివైపు చూస్తూ లేచాడు... "బొరుసు" అన్నాడు. అమ్మ కూలిపోయింది.

    "లోపలికి తీసుకెళ్ళి వుంచండి. వీళ్ల సంగతి తేల్చి నేను వస్తాను" అంటూ మావైపు తిరిగాడు. "నేను ఆడిన మాట తప్పను. నీ కూతుర్ని వదిలిపెడతాను. నీ భార్యని అనుభవిస్తాను.... ఇకపోతే నిన్నేం చేయను? ఆలోచించి చెప్పు."

    ఆ క్షణం నాన్న ఏం ఆలోచించాడో చెప్పటం కష్టం. ఆయన చేతుల్లోకి అంతబలం ఎలా వచ్చిందో... ఒక్క ఉదుటున తనని పట్టుకున్న వాళ్ళని వదిలించుకుని వెళ్ళాడు. అజ్మరాలీ ఏం జరిగిందో గ్రహించే లోపులో అతడి నడుముకున్న రివాల్వర్ లాక్కుని అదే వేగంతో అమ్మవైపు తిరిగాడు. అప్పటికే హాహాకారాలు చేస్తున్న అమ్మని వందగజాలు లాక్కెళ్ళారు వాళ్ళు. గురి తప్పకుండా పేల్చటం నాన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్య అమ్మని చంపటానికి ఉపయోగపడింది.

    అమ్మ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. అదే వేగంతో నాన్న నా వైపు తిరిగాడు. తల్లి కూతుళ్ళన్ని ఆ కిరాతకులకి బలి పెట్టడం కన్నా-తుపాకీకి బలి చెయ్యడమే మంచిదనుకున్నాడో ఏమో రెండోసారి నావైపు పేల్చాడు.

    విధికి అది ఇష్టం లేకపోయింది.

    'టప్' మన్న శబ్దంతో పిస్టల్ ఆగిపోయింది. అందులో బుల్లెట్ లేదు.

    అప్పటివరకూ జరిగినదంతా నిశ్చేష్టులై చూస్తున్న వాళ్ళు నాన్నమీద పడ్డారు. కనురెప్పపాటు కాలంలో జరిగిన ఆ సంఘటనకు అజ్మరాలీ కూడా వెంటనే తేరుకోలేకపోయాడు. ఎప్పుడయితే నాన్న చేతిలో బుల్లెట్ లేదని తెలిసిందో, అప్పుడు కదిలాడు. వెనుకనుంచి ఎగిరి తన్నాడు. నాన్న ముందుకు పడిపోయాడు. అయితే నాన్న సైన్యంలో వున్నవాడు. అదే వేగంతో వెనుదిరిగి, అజ్మరాలీ మీదకూడా దూకబోయాడు.

    "షూట్" అరిచాడు. పిస్టల్స్, రైఫిల్స్ చప్పుళ్ళు.

    నాన్న శరీరం జల్లెడ అయింది.

    నేను కెవ్వున అరుస్తూ ముందుకు వెళ్ళాను.

    బుల్లెట్ గాయం రక్తం చిందిస్తూండగా అమ్మ వచ్చి నాన్నకి నాలుగు అడుగుల దూరంలో, మరి శక్తిలేనట్టు కూలి పోయింది. ఆమె ప్రాణం పోయింది. నాన్న నా వైపు కళ్ళెత్తి చూశాడు. ఆయన శరీరం ఛిద్రమైంది. కళ్ళల్లో మాత్రం కాస్త జీవం వుంది. ఏదో తెలియని సందేశం అందులోంచి నాకు ప్రవహించింది. ఆ తరువాత ఆ కళ్ళు నిర్జీవమయినాయి. దుఃఖించటానికి కూడా స్పృహ కావాలి. అదీలేనట్టు వుండిపోయాను. అజ్మరాలీ దగ్గరకు వచ్చాడు.

    "నా మీద చెయ్యి ఎత్తినవాడు చూశావా ఎలా చచ్చాడో" అన్నాడు.

    ఆవేశాన్నీ, దుఃఖాన్నీ ఆపుకుంటూ "దుర్మార్గుడా! నువ్వు ఇంతకంటే కుక్కచావు చస్తావు" అన్నాను.

    అజ్మరాలీ నవ్వాడు.

    "లేదు. నేను నా దేశ సైన్యపు జనరల్ నవుతాను. సైనిక వందనంతో మరణిస్తాను" గర్వంగా అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra