అతను ప్రళయకాలరుద్రుడల్లె ఎగిరి ఆ ముగ్గురిమీద పడ్డాడు.
అందిన వాడ్ని అందినట్లు కొడుతున్నాడు.
వాళ్ళు ముగ్గురు, తను ఒక్కడు, వాళ్ళు కూడా తిరగబడ్డారు. కిష్టుడు బెల్టు ఊడదీసేడు. ఆ ముగ్గురికీ తానుగా ముప్పైమందిలా కనిపిస్తూ చెరిగి పారేస్తున్నాడు.
అన్నయ్య దగ్గిర కసరత్తులో గట్రాల్లో శిక్షణ పొందివుండటం వల్ల కిష్టుడు చాకులాగా, గొప్ప వీరోచితంగా పోరాడగలుగుతున్నాడు.
ఒకడి కడుపులో, ఇంకొకడి మూతిమీద, మరొకడి డొక్కలో కాళ్ళూ చేతులు ప్రయోగించి ఒకేసారి ఎడాపెడ కొట్టేస్తున్నాడు.
తనకున్న రెండు కాళ్ళూ, రెండు చేహ్తులూ ఆ ముగ్గురికీ ఒకేసారి సమాధానం చెబుతున్నాయి. పిడుగులా మీదపడుతున్నాడు. పిడి గుద్దులు గుద్దుతున్నాడు. ఒక్కో దెబ్బా మణుగు బరువుతో తగుల్తోంది. ఉడుంపట్టుతో మనుషుల్ని విసిరేస్తున్నాడు.
అసలే తాగివున్నారు వాళ్ళు, అంచేత తమమీద పడుతున్నది ఒక్కడో ఇరవైమందో తెలీకుండా ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇన్ని దెబ్బలు తినలేదు. ఇంతగా వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మలేదు.
అంచేత-
కిష్టుడికి సమాధానం చెప్పే స్థోమత లేక ఆ ముగ్గురూ కాళ్ళకి బుద్ధిచెప్పి పారిపోయారు.
కిష్టుడు బాగా అలిసిపోయాడు.
ఆ స్థితిలోనే అతడు వసుంధర చేతిని పట్టుకుని మరో వీధిలోకి పరుగెత్తేడు.
వసుంధర కాళ్ళు తేలిపోతున్నాయి. ఆమె ఒకచోట కుప్పలా కూలిపోయింది. పరుగెత్తే ఓపికలేక.
అక్కడికి -దూరంగా ఒక గుడి కనిపిస్తోంది.
కిష్టుడు వసుంధరను ఎత్తుకున్నాడు. ఆ గుడి వేపు నడిచేడు. గుడిని చేరిన తర్వాత అక్కడ ఒక మూల కూర్చున్నాడు. వసుంధరని తన వళ్ళో పడుకోబెట్టుకున్నాడు-పసిపాప మాదిరి.
గుళ్ళో దేవుడు ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేడు.
నవ్వే దేవుడిమీద కిష్టుడికి వళ్ళు మండిపోయింది. మనిషిగా పుట్టు, ఎవర్నైనా ప్రేమించు. అప్పుడు తెలుస్తాయి బాధలు. అప్పుడు ప్రశాంతంగా నవ్వలేవు-అంటూ పాడుతున్నాడు కిష్టుడు.
తెల్లవారింది!
ఇంటికొచ్చిన పంకజంతో గొప్ప బాధపడిపోతూ చెబుతున్నాడు జగన్నాధం.
"...రాత్రికూడా మా దగ్గిరే పడుకోబెట్టుకున్నాం. మా కళ్ళు కప్పి ఎట్లా మాయమైపోయేరో ఏమో తెలీకుండా వుంది" అంటూ అతను విమలవేపు కోపంగా చూసేడు.
విమల కూడా సంజాయిషీ చెప్పుకుంది.
"అసలా ఇద్దర్నీ చూడగానే నాకు అనుమానం కలగనే కలిగింది. పంకజం! అల్లరి చేస్తే పారిపోతారని మాయమాటలు చెప్పి వాళ్ళని బుజ్జగించేం కూడాను. మా కళ్ళల్లో కారంకొట్టి రాత్రికి రాత్రే పారిపోయేరు."
"ఎక్కడికి పారిపోతారు? ఇక్కడే యీ ఊళ్ళోనే వుండివుంటారు. బస్టాండుకీ, రైల్వేస్టేషన్ కీ మనుషుల్ని పంపితే తప్పకుండా దొరుకుతారు" అన్నది పంకజం.
"ఆ ఏర్పాట్లేవో నాకు వదిలెయ్! అవన్నీ నేను చూసుకుంటాను. ఇంక నువ్వు నిశ్చింతగా వుండు!" అన్నాడు జగన్నాధం బయటకు నడుస్తూ.
34
కిష్టుడి వళ్లో రెస్టు తీసుకుంటున్న వసుంధర మెల్లిగా కళ్ళు విప్పింది. కిష్టుడు నవ్వుతూ పలకరించేడు.
"హౌ ఆర్యూ?"
వసుంధర నీరసంగా నవ్వింది.
ఆమె వంట్లో శక్తి పూర్తిగా క్షీణించింది. లేచి కూచోబోయి తూలిపడిపోయింది. కిష్టుడు ఆమెను పొదివి పట్టుకున్నాడు.
కిష్టుడి స్థితీ అంతంతమాత్రంగానే వుంది. రాత్రి చూసుకోలేదు గాని అతని వళ్ళంతా దెబ్బలే.
"నడుద్దామా?" అన్నాడు కిష్టుడు.
"........."
"కొంచెం ఓపిక తెచ్చుకో వసూ! దగ్గరలో డాక్టరెవరైనా ఉండొచ్చు. వెంటనే డాక్టర్ని చూడటం ముఖ్యం. ఊ...లేచి నిలబడు."
అతి ప్రయత్నం మీద వసుంధర లేవగలిగింది. ఆమెను మెల్లిగా నడిపించుకుపోతున్నాడు కిష్టుడు.
* * *
అదొక ఇల్లు? బాగా మాసిపోయిన పెంకుటిల్లు.
దానికో బోర్డు-
"తిరువెంగళాచార్యులు-వైద్యులు"
ఇంట్లో తిరువెంగళాచార్యులు దగ్గుతూ ఆయాసపడుతూ కల్వంలో ఏవో వేరులు నూరుతున్నాడు.
శ్రీమతి తిరువెంగళాచార్యులు నడ్డిమీద చేయి వేసుకుని వచ్చి అడిగింది-
"ఏమిటీ నూరుతున్నారు?"
"నీ నడుం నొప్పికి మందు" అన్నాడతను ఆయాసపడిపోతూ.
"ముందు మీ ఆయాసానికీ, ఆ మిడిమేళం దగ్గుకీ నూరుకోండి. మీ మందుల్తో నా నడుం నొప్పి తగ్గదు" అన్నదామె వ్యంగ్యంగా.
"విసుర్లు ప్రయోగించకు, చిరాకు నాకు. (దగ్గేడు) వైద్యంలో నాకు ఆరో ఏట నుంచి ప్రవేశమనేమాట మరిచిపోయేవా? (ఆయాసం) ఈ చేతులతో, ఈ మందుల్తో ఎన్ని వందలూ వేల ప్రాణదానాలు చేసేనోకూడా మరిచిపోయావా? (ఆయాసం, దగ్గు) చివరికేదో కొంచెం అస్వస్థత చేసి ప్రాక్టీసు తగ్గించుకుంటే నా వైద్యానికే వంకలు పెడుతున్నావా మంగతాయారూ? (దగ్గూ, ఆయాసం) చెబుతున్నా విను! నీ నడుంనొప్పి తగ్గాలంటే చాముండీ చారు ముక్తాంత మొక్కటే సరయిన మందు. అది చేయడం ఈ భూలోకంలో నా ఒక్కడికే తెలుసు! (ఆయాసం, దగ్గు) క్షణమాగు. ఒక పట్టు పడతాను" అన్నాడు తిరువెంగళాచార్యులు.
"మీ పట్లుకీ, మీ మందులకీ శతకోటి నమస్కారాలు. పక్క వీధిలో ఇంగ్లీషు డాక్టరు దగ్గరే ఇంజక్షను తీసుకువస్తాను. అంతేగాని-చచ్చినా సరే మీ మందు వాడను-వాడలేను" అంటూ ఆమె నడుం పట్టుకుని బయటకు నడిచింది.
ఆ ఇంటిముందు కిష్టుడూ, వసుంధరా నిలబడివున్నారు.
"డాక్టరుగారున్నారాండీ!" అడిగేడు కిష్టుడు.
"ఉన్నారు" అంటూ నడుం బాధకి మూలుగుతూ ఆమె వెళ్ళి పోయింది.
కిష్టుడూ, వసుంధరా ఇద్దరూ డాక్టరుగారి ఇంట్లోకి వచ్చేరు.
కొత్త పేషంట్లని చూడగానే తిరువెంగళాచార్యులు బోలెడు ఆనందించేడు. కల్వం ముందునించి లేచి నిలబడ్డాడు. దగ్గునీ, ఆయాసాన్నీ అదుపులో పెట్టుకోడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ కుతూహలంగా అడిగేడు-
"ఏమిట్నాయనా మీ కంప్లేంటు?"
"ఈ అమ్మాయికి కాళ్లు రెండూ బెణికేయండి. నాకేమో వళ్ళంతా దెబ్బలండి!"
ఆచారి వాళ్ళిద్దర్నీ పరిశీలనగా చూస్తూ అడిగేడు-
"దెబ్బలాడుకున్నారా? జారి పడ్డారా?"
"రెండూనండి. అర్జంటుగా మా బాధ నయం కావాలండి" అన్నాడు కిష్టుడు అసహనంగా.


