"ఫర్లేదు చెప్పు."
"అయిదేవేలు బహుమానమని చదవగానే పత్రికల్లో పనిచేసే ప్రూఫ్ రీడర్లంతా రైళ్ళెక్కేసేరండి."
"అదేమిటోయ్?"
"చాలా పెద్ద బహుమతి గదండీ! లక్కు బాగుంటే బుజ్జులు వాళ్ళకే దొరకొచ్చు గదండీ! దొరికితే అయిదువేలు గదండీ?"
"అయిదువేలూ పంకజమే పుచ్చుకుంటుంది!" అన్నది సుభద్ర అక్కడికి వస్తూ-ఆమె చేతిలో కూడా పేపరుంది.
"అంటే?" ఆందోళనగా అడిగేడు శివుడు.
"విశాఖపట్నంనుంచి ఫోన్ వచ్చింది. జగన్నాధమింట్లో పిల్లా పిల్లవాడూ క్షేమంగా వున్నారుట. వచ్చి తీసుకెళ్ళమని జగన్నాధం పంకజానికి ఫోన్ చేసేడు. పంకజం అప్పుడే కార్లో వెళ్ళనుకూడ వెళ్ళిపోయింది."
ఆ మాటకి శివుడు కోపం తెచ్చుకున్నాడు.
"ఒక్కర్తీ అంత దూరం కార్లో వెళ్ళిందా?"
"నీకు చెబితే నువ్వు తోడు వెళ్ళేవాడివా?" వ్యంగ్యంగా అన్నది సుభద్ర.
"తప్పేముంది? మనిషికి మనిషి తోడు. ఆవిడిగారికి వసుంధర ఎంత ముఖ్యమో-నాకు కిష్టుడూ అంతే! పిల్లలు క్షేమంగా వున్నారని ఒక్కమాట...ఒక్కమాట నాతో చెబితే ఆవిడ సొమ్మేం పోదుగా!...కైలాసం-"
"సార్"
"కారు సిద్ధం చెయ్యమని చెప్పు!"
"ఇప్పుడు కారెందుకు?" అడిగింది సుభద్ర.
"విశాఖపట్నం వెళ్ళాలి!" అన్నాడు శివుడు.
* * *
ఆ రాత్రి-
జగననాధమింట్లో భోజనాలయ్యాయి. అందరికీ హాల్లోనే పక్కలు వేయబడ్డాయి.
రెండు పెద్ద మంచాలు. ఒక మంచమ్మీద విమలా-వసుంధర! ఇంకో మంచమ్మీద జగన్నాధం-కిష్టుడూ!
రాత్రి ఒంటిగంట దాటింది.
కిష్టుడికి నిద్ర పట్టడంలేదు. తెల్లవారితే పంకజంగారు దిగిపోతారు. వసుంధరని తీసుకుపోతారు. ఆ తర్వాత కష్టాలూ, కన్నీళ్ళు.
ఈ గండం గడిచేదెట్లా?
కిష్టుడు తప్ప మిగతా ముగ్గురూ గాఢనిద్రలో వున్నారు. అలిసి పోయిందేమో వసుంధర ఆదమరిచి నిద్రపోతోంది.
కిష్టుడి మెదడ్లో ఒక ఆలోచన మెదిలింది.
అతను కాగితాన్ని వుండగా చుట్టి వసుంధర మీదకి గురిచూసి ప్రయోగించేడు.
గురి తప్పింది.
ఆ ఉండ సాక్షాత్తు విమలకు తగిలింది. ఏమి రభస జరుగుతుందో నన్న ఆందోళనతో-కిష్టుడు తనకేమీ తెలీనట్టు అటు తిరిగి పడుకున్నాడు. గురితప్పినందుకు ఎంతో వర్రీ అవుతూ గాఢనిద్ర నటిస్తున్నాడు.
ఉండ తనమీద పడగానే విమల కళ్ళు విప్పేసింది. ఎంతైన పోలీసు బిడ్డ. చిన్న అలికిడికే కళ్ళు విప్పడం లక్షణం.
విమల కళ్ళు విప్పగానే-
నిద్రలో కదిలిన జగన్నాధం ఆమె కంటపడ్డాడు. కాగితపు వుండనీ, కదిలి పడుకున్న జగన్నాధాన్నీ మార్చి మార్చి చూసింది.
("ఉండ విసిరిందిచాలక ఇంకా బెట్టు పోతున్నారు బెట్టు. రెండు రోజులు ఆలస్యమైతే చాలు-అన్నీ కోతి వేషాలే!")
తన తలలో పూలచెండు తీసి జగన్నాథమ్మీదికి ప్రేమగా విసిరింది. పోలీసు బిడ్డ గనక గురి తప్పలేదు.
తన మీద పడ్డ పూలచెండుకి ఉలిక్కిపడి కళ్ళు విప్పేడు జగన్నాథం. విమల వేపు చూసేడు. ఆమె మేలుకుని ఇంటి కప్పు వేపు తదేకంగా చూస్తోంది.
"ఎక్కడలిగినా ఫర్లేదు. మగాడన్నవాడు ఈ ఘట్టంలో అలక్కూడదు!"
జగన్నాథం మంచం దిగగానే విమల కూడా మంచం దిగింది.
ఆ ఇద్దరూ చప్పుడు చేయకుండా తూర్పువేపు గదిలోకి వెళ్ళి తలుపుమూసుకున్నారు.
అదే అదనుగా భావించేడు కిష్టుడు.
గబగబా వసుంధర దగ్గరకు వెళ్ళేడు. ఆమెను తట్టి నిద్రలేపేడు. కళ్ళు విప్పి "ఏమిటీ" అని అడుగబోయింది వసుంధర. గబుక్కున ఆమె నోరు మూసి అసలు సంగతి చెప్పేడు కిష్టుడు-రహస్యంగా...
"మనం ఇక్కడ్నించి వెంటనే పారిపోవాలి! మీ అంకుల్ పంకజంగారికి ఫోన్ చేసేడు. తెల్లవారితే ఆవిడ వస్తారు-మనల్ని పట్టుకుంటారు."
"అమ్మో! ఇప్పుడెట్లా?"
"ఇంకా ఎట్లాగని కూచుంటే ఎట్లా? ఇక్కడ్నించి పారిపోదాం. లే త్వరగా!" అని ఆమెను లేవదీసేడు.
వీధి తలుపువరకు పిల్లుల్లా వెళ్ళి, ఆ తలుపులు మెల్లిగా తీసి అక్కడ్నించి వీధిలోకివచ్చి-లేడి పిల్లల్లాగా ఒకటే పరుగు.
ఆ ఇద్దరికీ విశాఖపట్టణం వీధులుగానీ, ఆ ఎత్తు పల్లాలుగానీ బొత్తిగా తెలీవు. అయినా...ఆ చీకట్లో ఎటు పరుగెత్తుతుందీ తెలీకుండానే పరుగెత్తుతున్నారు.
వసుంధర పడుతూ లేస్తూ పరుగెత్తడం వల్ల కిష్టుడు తన వేగాన్ని చంపుకోవలసి వస్తోంది.
పడిన ప్రతిసారీ బుజ్జులో అని వసుంధర అరవడం, బుజ్జులు కాళ్ళకి బ్రేకులు పడటం, అతనొచ్చి ఆమెను లేపడం, మళ్ళా పరుగు ప్రారంభించడం-ఇట్లా వాళ్ళు ఎన్నెన్నో వీధులు తిరిగేరు.
ఒకానొక వీధిలో .....
రెండో ఆట సినీమానుంచి వచ్చే రౌడీ కుర్రాళ్ళు వెనకబడ్డ వసుంధరని చూసేరు. వసుంధర దారికి అడ్డుగా నిలబడ్డారు.
వసుంధర ఆగిపోయింది.
అందులో ఒకడు మేకలాగా నెమరువేస్తూ సరదాగా అడిగాడు-
"దారి తప్పేవా పాపా! నీకు భయంలేదు. మాతోపాటు వచ్చేయ్!"
"ఇక్కడే మా ఇల్లు! కులాసాగా వుండొచ్చు" అన్నాడు ఇంకోడు.
మూడోవాడు ఏకంగా వసుంధర చేతిని పుచ్చుకున్నాడు. దా...దా...దా...అంటూ గేదెలాగా అరుస్తూ తనవేపు లాక్కుంటున్నాడు.
ఆ ముగ్గురూ బాగా తాగేసి వున్నారు.
వాళ్ళు ముగ్గురూ వసుంధరని పట్టేసుకున్నారు. ఆమె నోరు మూసి ఎటో లాక్కుపోతున్నారు.
వసుంధర ఒకడ్ని కొరికింది.
ఆ దెబ్బతో ఒకడు 'నీయమ్మ' అంటూ కెవ్వున అరిచి ఆమె నోటి మీదినుంచి చెయ్యి తీసేసేడు.
"బుజ్జులూ" అని ఆందోళనగా అరిచింది, వసుంధర.
ముందు పరుగెత్తుతున్న కిష్టుడు ఆ కేక విని అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆ పిలుపు వచ్చిన దిక్కుకి-వెనక్కి వేగంగా పరుగెత్తాడు.
ముగ్గురు రౌడీ కుర్రాళ్ళ మధ్య గింజుకుంటున్న వసుంధరని చూడగానే బుజ్జులు తనని తాను సంభాళించుకోలేకపోయాడు.


