అంతే!
రాష్ గా ఆ అమ్మాయి పక్కకి వచ్చి సడెన్ బ్రేక్ తో మోటార్ సైకిల్ ని ఆపాడు.
మరుక్షణం మోటార్ సైకిల్ ని అలాగే నేలమీద పడేలా వదిలేసి చిరుతపులి లంఘించి లేడి మెడ పట్టుకున్నంత ఒడుపుగా ఆ ఆడకూతురి జడను పట్టుకుని ఆపాడు.
అతను ఆమెని అలా పట్టేసుకోవడం అలా పొదల్లోకి లాక్కెళ్ళిపోవడం కన్నుమూసి తెరిచిపోయేలోగా జరిగిపోయాయి.
ఆ తర్వాత క్షణంలో -
ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఆ తుప్పలమీదకి తోసేశాడు అతను.
వెల్లకిల పడింది ఆ అమ్మాయి.
"అయ్యో రక్షించండి! రక్షించండి! రక్షించండి" అని నిస్సహాయంగా ఆర్తనాదాలు చేసింది ఆ అమ్మాయి.
అప్పుడు వెల్లకిలా పడివున్న ఆ అమ్మాయికి ఆకాశంలో అల్లంత దూరాన అతి చిన్న చుక్కలా ఏదో కనబడింది.
మరుక్షణంలో అదొక ప్లేటులాగా, ఆ తర్వాత క్షణంలో అదొక విష్ణుచక్రంలాగా భ్రమ కలిగించింది.
అది బాగా దగ్గరకి వచ్చాక అదొక రేకు అని అర్ధమైపోయేలోగానే వంద కిలోమీటర్ల అవతల వున్న ఫ్యాక్టరీ కప్పులో నుంచి విడివడిన ఆ రేకు అలా వైకుంఠపురంబులో శ్రీలక్ష్మీసమేత శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన గజేంద్రుడిని మొసలి బారినుంచి రక్షించడానికి గానూ ప్రయోగించిన సుదర్శన చక్రంలా వచ్చి ఆ వడ్డీ వ్యాపారి మెడని ఎక్స్ పర్ట్ సర్జన్ ఆపరేట్ చేసినట్లుగా కట్ చేసేసింది.
అంతలోనే మళ్ళీ గాలి పుంజుకోవడంతో అంతే వేగంతో ఆ రేకు మళ్ళీ గాల్లోకి లేచి ఇంకో చోట ఇంకో దుష్టుడిని సంహరించి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికా అన్నట్లుగా నింగికి ఎగిసి క్షణంలో అదృశ్యమైపోయింది.
అధర్మం నాలుగు పాదాల నడుస్తూ వుంటే క్షమకి మారుపేరైన భూదేవి సహనం నశించి దుష్ట సంహారం చెయ్యమని దేవతలను కోరితే యమధర్మరాజే స్వయంగా భూమిమీదకు దిగివచ్చి అప్పుడే అక్కడే విచారణ జరిపి శిక్షలు వేసేస్తున్నట్లుగా-
గూండాలు, పాపాత్ములు, కిలాడీలు, చలాకీ రాయుళ్ళు, రాజకీయ బ్రోకర్లు, తార్పుడు గాళ్ళు, బ్లాక్ మార్కెటీర్లు, స్కామ్ లలో వేల కోట్లు మింగినవాళ్ళు, మతాల మారణహోమం చేయించే వాళ్ళు, దొంగ సాధువులు, దొంగ సన్యాసులు, దొంగ నాయకులు, దొంగ వర్తకులు, దొంగ ఉపాధ్యాయులు, దొంగ విద్యార్థులు, దొంగ సారాగాళ్ళు.
ఒక్క మాటలో చెప్పాలంటే సగటు మనిషి జీవితాన్ని శోకమయం చేస్తున్న భ్రష్టులు, త్రాష్టులు, పదవీ ధన బాల మదాంధులు అందరూ కూడా చిత్రాతి చిత్రమైన పరిస్థితుల్లో చావును ఎదుర్కొని విగత జీవులయ్యారు.
"మా కుర్చీల నుంచి మమ్మల్ని ఎవ్వరూ కదల్చలేరు" అని విర్రవీగుతూ తరతరాలపాటు వంశపారంపర్యంగా పదవులు అనుభవిస్తున్న నేతలు దూదిపింజల్లాగా సుడిగాలిలో చిక్కుకుని అపరిమితమైన వేగంతో ఆకాశంలోకి వెళ్ళిపోయి భూమి తాలూకు వాతావరణపు అంచున కొన ఊపిరితో త్రిశంకు స్వర్గంలో ఉన్నవాళ్ళలాగా కాస్మిక్ డస్ట్ లుగా, భూభ్రమణం చెయ్యడం మొదలుపెట్టారు.
ఒక వైపు గాలి-
ఇంకో వైపు అగ్ని-
మరోవైపు వానలు, వరదలు-
ఇంకోవైపు భూకంపాలు-
అగ్నిపర్వతాల పేలుళ్ళు -
అంతా బీభత్సం!
అదలా వుండగా -
మనిషి తనపాటి మనిషిని చంపడానికిగాను జాతులకి జాతులనే నిర్మూలించడానికిగాను సిద్ధంచేసి పెట్టుకున్న మారణాస్త్రాలన్నీ బాణాసంచాలా పేలడం మొదలుపెట్టాయి.
కుక్క గొడుగుల్లాగా అణు ధూళి ఆకాశంలో లేచింది.
ఇది ఇలా జరిగిపోతుండగానే -
అక్కడ -
ప్రొఫెసర్ అన్ వేషి తన స్వాధీనంలోకి తెచ్చేసుకున్న స్పేస్ షిప్, కెప్టెన్ టూటూని భూమిమీదే వదిలి కాంతి వేగాన్ని మించిన వేగంతో వై గ్రహం వైపు పయనం మొదలుపెట్టింది.
క్షణంలో సగం సమయంలోనే వాళ్ళు అంతరిక్షంలో ఎంత దూరం వెళ్ళిపోయారంటే -
భూగోళం మీద మొదలైన ప్రళయం గురించి వాళ్లకి అసలు తెలియనే తెలియదు.
"మై డియర్ ఓల్డ్ బోయ్! వై గ్రహంలోని బంగారాన్ని కొల్లగొట్టుకు వచ్చిన తరువాత ఇంక మనకి తిరుగు అనేదే వుండదు" అన్నాడు అన్ వేషి ఉల్లాసంగా పైపు వెలిగిస్తూ.
భుజాలు ఎగరేసి ముసిముసిగా నవ్వాడు సర్వాధికారి.
"నాన్నా! మనం వై గ్రహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ మన రిప్రజెంటేటివ్ గా మా ఆయన్నే వేయాలి. ముందే చెబుతున్నాను" అంది సర్వాధికారి కూతురు కామిని.


