జుష్టోవాచో భూయాసం జుష్టోవాచస్పతయే దేవీవాక్ |
యద్వాచో మధుమత్తస్మిన్నాధాః స్వాహా సరస్వత్యై || 3-1-10-1
రెండవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. పవమాన స్తోత్రములను అనుక్రమముగా పొందుటకు గ్రహించిన యజమాని పవమాన స్తోత్రములను అనుక్రమముగా పొందును. పవమానముల నుండి విచ్చిన్నుడు అగుటలేదు.
బహిష్పవమాన స్తోత్రమా! నీవు డేగ వంటి శీఘ్రగతి గలదానవు. గాయత్రి ఛందస్కవు అగుచున్నావు. నేను నిన్ను అనుక్రమముగా అందుకొనుచున్నాను. నీవు నిరాటంకముగా నాకు ఈ కర్మసారమును అందజేయుము.
మధ్యందిన పవమానస్తోత్రమా! నీకు గరుడునివలె ఎగురగల శక్తి ఉన్నది. నీవు త్రిష్టుప్ ఛందస్కవు. నీవు నిరాటంకముగా నాకు ఈ కర్మ సారమును అందజేయుము.
ఆర్భవ పవనమానస్తోత్రమా! నీవు సఘవు అగుచున్నావు. జగతీ ఛందస్కవు. నేను నిన్ను అనుక్రమముగా పొందుచున్నాను. నిరాటంకముగా నాకు ఈ కర్మసారమును అందజేయుము. అట్లని 'శ్యేన్కోపి' మంత్ర త్రయము చెప్పినది.
పవమానముల అన్వారోహణ విధమును తెలిసికొని యాగము చేసినవాడు పరమానములను అనుక్రమముగా పొందును.
2. పవమానపు అవిచ్చేద ప్రకారమును గ్రహించిన యజమానికి పరిపూర్ణ ఆయువు కలుగును. అపమృత్యువు కలుగదు. పశువంతుడు, సంతానవంతుడు అగును.
పవమాన సంబంధములగు ద్రోణకలశాది గ్రహములు మంత్రోచ్చారణమున తీసికొనబడుచున్నవి. అట్లుకాక ద్రోణ, ఆధవనీయ, పూతభృత్ గ్రహములను మంత్రము లేకనే తీసికొనబడుచున్నవి. మంత్రముచే గ్రహించక ఉపాకరణ చేసినచో పవమానమును విచ్చిన్నము చేసిన వాడగుచున్నాడు. అందువలన అధ్వర్యుని ప్రాణము విచ్చిన్నము అగును.
3. సోమరసమా! నిన్ను మట్టి ద్రోణకలశముచే గ్రహించుచున్నాను. నిన్ను ప్రజాపతి కొరకు ముట్టుకొనుచున్నాను.
నిన్ను మట్టితో చేసిన ఆదవనీయ పాత్రచే గ్రహించుచున్నాను. నిన్ను ఇంద్రుని కొరకు స్పృశించుచున్నాను.
నిన్ను మృణ్మయమగు పూతభృత పాత్రచే గ్రహించుచున్నాను. నిన్ను విశ్వేదేవతల కొరకని తాకుచున్నాను.
ఆయామంత్రములచే ఆయా కలశములను అభిమర్శించవలెను - తాకవలెను.
అందువలన అధ్వర్యుడు పవమానమును కొనసాగించిన వాడగును. అప్పుడు యజమాని పరిపూర్ణ ఆయువు కలవాడు అగును. అపమృత్యువు కలుగదు. పశువంతుడు సంతానవంతుడు అగును.
రెండవ అనువాకము
1. సవనములు మూడు - ప్రాతఃకాల, మధ్యందిన, తృతీయములు. వానిలో తృతీయ సవనము నందు సోమము అభిషుతము కాదు. అందువలన తృతీయ సవనమును నశింపచేసినవారు అగుచున్నారు.
ఆ దోషమును నివారించవలసి ఉన్నది. అందుకు ఉపాంశు గ్రహమును హోమము చేయవలెను. ఆ ఉపాంశుపాత్ర యందు అభిషుతము కాని సోమలతాంశమును ఉంచవలెను. దానిని బాణలి యందు వసతీవరీ జలముతో కలిపి అభిషవము చేయవలెను. వసతీవరి జలములతో తడుపుట వలన తృతీయసవనము అంశుమంత మగును. సోమాంశువును బాణలి యందు అభిషవము చేయుట వలన సమస్త సవనములను రసవంతములు, వీర్యవంతములు చేసినట్లగును.
2. ఆదవనీయ, పూతభృత్తులు అనునవి రెండుపాత్రలు. అవి సముద్రము వంటివి. విశాలములు అవినాశ్యములు. సముద్ర తరంగముల వలె ఆ పాత్రలు ఒకదాని తరువాత మరొకటి ప్రవర్తిల్లుచుండును.
ఆ రెండును అహోరాత్రి రూపములు. అందు ఒకటి పగలు జనులు చూచుచు దాటుచున్నారు. రాత్రి కానలేనివారై సేతువు వంటి సాధనమున దాటుచున్నారు.
సూర్యుడు కిరణకేశి. అతడు ఒక్కడే సకలలోకములను ప్రకాశింపచేసి తెలిసికొనుచున్నాడు. రాత్రింబవళ్లు ఎడతెగక సాగుచున్నవి. సూర్యుడు రాత్రులందు నల్లని బట్టకప్పుకొని దాటిపోవుచున్నాడు. రాత్రి జీర్ణమైనంత నల్లని బట్టను విడిచి ధవళ వస్త్రధారియై ఉదయించుచున్నాడు.
3. దేవతలు తమ విజయమునకు యజ్ఞములు చేసినారు. అసురులు సహితము ఆ యజ్ఞములనే అనుష్ఠించినారు. అందువలన దేవతలకు విజయము కలుగలేదు.
అప్పుడు దేవతలు తమకు విజయము కలుగుటకు సోమయాగమును కనుగొన్నారు. దానిని అసురులకు తెలియనీయలేదు. రహస్యముగా అనుష్ఠించినారు.
దేవతలు అగ్నిహోత్రమును ఆచరించుచున్నామని ప్రకటించినారు. దీక్షావ్రతమును ఆచరించినారు. ప్రాతః సాయంకాలములందు అగ్నిహోత్రము చేయుచు క్షీరపాన వ్రతమును అవలంబించినారు. అందువలన రెండు వ్రతములు చేసినవారు అయినారు.
దేవతలు పౌర్ణమాస యజ్ఞము చేయుచున్నామని ప్రకటించినారు. రహస్యముగ అగ్నిషోమీయ పశుకర్మను ఆచరించినారు.
దర్శయాగము చేయుచున్నామని ప్రకటించినారు. రహస్యముగా ఆగ్నేయ పశుకర్మను చేసినారు.
చాతుర్మాస్య వైశ్వదేవము చేయుచున్నామని ప్రకటించినారు. ప్రాతః సవనమును ఆచరించినారు.
వరుణ ప్రఘాసము చేయుచున్నామని ప్రకటించినారు. మాధ్యందిన సవనమును ఆచరించినారు.
సాకమేధ, పితృయజ్ఞ, త్ర్యంబకములను ఆచరించుచున్నామని ప్రకటించినారు. రహస్యముగ తృతీయ సవనమును ఆచరించినారు.
అసురులు దేవతలు చేయుచున్న యజ్ఞ క్రమమును తెలిసికొనదలచినారు. కాని తెలిసికొనలేక పోయినారు. అప్పుడు అసురులు దేవతలను మనము హింసింపజాలము అనుకున్నారు.
అట్లగుటవలన సోమయాగమునకు అధ్వరత్వము కలిగినది. ఈ అధ్వరానుష్ఠానమున దేవతలకు విజయము లభించినది. అసురులు పరాజితులు అయినారు.
(అసురులు దేవతలను "అధ్వర్తవ్మాః" అన్నారు. హింసింపజాలినవారు కారు అని అర్థము. అందువలన సోమయాగమునకు అధ్వరత్వము సిద్ధించినది.)
4. ఈ విషయములన్నియు గ్రహించి సోమయాగము చేసినవాని శత్రువులు పరాజితులు అగుదురు.
మూడవ అనువాకము
1. సోమమా! నీవు అగ్నిని అంతట వ్యాపింపచేసినావు. ఇంద్రుని అంతట వ్యాపింపచేసినావు. విశ్వేదేవతలను సర్వత్ర వ్యాపింపచేసినావు. నన్ను బ్రహ్మవర్చస్సు కలవాడనుగా చేయుము. సర్వత్ర పావనుని చేయుము.
సోమరాజా! నీవు గోవులకు సుఖశాంతులు కలిగించుము. ప్రజలకు సుఖ శాంతులు కలిగించుము. అశ్వములకు సుఖ శాంతులు కలిగించుము. ఓషధులకు సుఖ శాంతులు కలిగించుము.
ధనపతీ! నీ అనుగ్రహమున మాకు అవిచ్చిన్న సంతానము, ధన సమృద్ధి కలుగునుగాక. మేము దాతలము అగుదుము గాక. దానము చేయుటకు మాకు ధనము ప్రసాదించుము.
నీవు అంతటిదానవు. లభించినపుడు నేను నీ యొక్క రసమును సేవింతును. అందువలన నాకు అపేక్షిత ఫలము కలుగునట్లు చేయుము.
2. ఉపాంశు గ్రహమా! నీవు బలమును ఇచ్చుదానవు. నాకు ప్రాణమును, బలమును కలుగజేయుము.
అంతర్యామగ్రహమా! నీవు బలమును ఇచ్చుదానవు. నాకు అపానమును, బలమును కలుగజేయుము.
ఉపాంశు సవన పాత్రమా! నీవు బలమును ఇచ్చుదానవు. నాకు వ్యానమును, బలమును కలుగజేయుము.
ఐంద్రవాయవ పాత్రమా! నీవు బలమును ఇచ్చుదానవు. నాకు వాక్కును, బలమును కలుగజేయుము.
మైత్రావరుణ పాత్రమా! నీవు బలము కలుగజేయు దానవు. నాకు ప్రాణాపానములను, బలమును కలుగజేయుము.
శుక్రా, మన్దిపాత్రలారా! మీరు బలము కలుగజేయువారు. నాకు నేత్రములను, బలమును ప్రసాదించండి.
అశ్వినీపాత్రమా! నీవు బలము కలుగజేయుదానవు. నాకు చెవులను, బలమును ప్రసాదించుము.
అగ్రాయణ గ్రహమా! నీవు బలము కలిగించుదానవు. నాకు జీవాత్మను, బలమును ప్రసాదించుము.
ఉక్థ్యపాత్రమా! నీవు బలము కలిగించుదానవు. నాకు అవయవములందు బలము కలిగించుము.
ధ్రువపాత్రమా! నీవు బలము కలిగించుదానవు. నాకు ఆయుష్యమును, బలమును కలిగించుము.
షోడశిగ్రహమా! నీవు బలమును ఇచ్చుదానవు. నాకు సామర్థ్యమును, బలమును ప్రసాదించుము.
ద్రోణకలశమా! నీవు విష్ణువు యొక్క ఉదరము అగుచున్నావు. బలము కలిగించుదానవు అగుచున్నావు. నాకు వర్చస్సు కలిగించుము.
ఆధవనీయ పాత్రమా! నీవు ఇంద్రుని ఉదరమవు అగుచున్నావు. బలము కలిగించుదానవు అగుచున్నావు. నాకు వర్చస్సు కలిగించుము.
పూతభృతపాత్రమా! నీవు విశ్వేదేవతల జఠరమవు. వర్చస్సును ఇచ్చుదానవు అగుచున్నావు. నాకు వర్చస్సు ప్రసాదించుము.
ఆహవనీయమా! నీవు కః ప్రజాపతివి అగుచున్నావు. నీ పేరు కః. అందువలన 'కస్మై' ప్రజాపతి యందు నిన్ను దర్శించుచున్నాను. సుఖము కొరకు నిన్ను దర్శించుచున్నాను.
ఆహవనీయమా! నిన్ను సోమము సమర్పించి తృప్తి చెందించుచున్నాను. సోమము వలన నిన్ను హర్షింపచేయుచున్నాను. నన్ను అనుగ్రహింపుము. అందువలన నాకు ప్రజ, సేవకులు, వీరులగు పుత్ర, పౌత్రాదులు, వర్చస్సు, బలము, ధనము, పుష్టి కలుగును గాత. సర్వ పాత్రలందు సమిష్టిగా ఉన్న సోమమా! నాకు ప్రాణ, అపానాది సర్వసిద్ది కలిగించుము. బలము, వర్చస్సు మున్నగునవి ప్రసాదించుము.
3. ఐశ్వర్యవంతుడు కావలెనను కోరిక కలవాడు పాత్రయందలి సోమమును చూడవలెను. పాత్రయందలి సోమము ప్రజాపతి స్వరూపము కదా! యజ్ఞమే ప్రజాపతి అగును. కావున అతడు ప్రజాపతిని తృప్తి చెందించిన వాడు అగును. సంతృప్తి చెందిన ప్రజాపతి యజమానికి ఐశ్వర్యము ప్రసాదించును.
బ్రహ్మవర్చస్సు కోరువాడు పాత్రయందలి సోమమును చూడవలెను. పాత్రయందలి సోమము ప్రజాపతి స్వరూపము. యజ్ఞమే ప్రజాపతి అగును. కావున అతడు ప్రజాపతినే తృప్తిచెందించుచున్నాడు. సంతృప్తుడైన ప్రజాపతి అతనికి బ్రహ్మవర్చస్సు కలిగించును.


