"నా అని చెప్పుకోలేని ఎవరూలేని అనాధలాంటి వాడిని. ఒంటరిని. మీరందరూ ఇంత ప్రేమగా రామయ్యా మా దగ్గర వుంటావా అని అడుగుతుంటే ఎలా కాదనగలను మీతోనే వుంటాను తాతా."
పరుశురాంని ఒక్కసారిగా భుజాల మీద ఎత్తేశారు కుర్రాళ్లు.
ఆ రోజు జాతరని ఆనందంగా చేసుకున్నారు జనం.
23
కన్నతో పనిచేసే మెకానిక్ షాప్ ఓనర్ తెలిసినవాళ్లతో పరుశు రామ్ కి టాక్సీకి ఇప్పించాడు. కారును శుభ్రంగా కడిగి, తుడిచి పూజచేశాడు పరుశురాం. రాణి ఆ కారుచుట్టూ తిరిగి ముందుకొచ్చింది.
"నాక్కూడా తోలడం నేర్పుతావా?" అడిగింది రాణి.
పరుశురాం కొంటెగా నవ్వి అన్నాడు -
"తోలించుకోవాలేగానీ తోలడానికి ఆడాళ్ళు ప్రయత్నించకూడదు."
"ఏం ఎందుకు తోలకూడదు?"
"తోలలేరు అంతే!"
"క్లచ్ విడుస్తూ ఏక్సిలేటర్ని గట్టిగా తొక్కుతూ స్టీరింగ్ రాపిడి ఎక్కువ చేస్తుంటే ఆనందంగా ప్రయాణం చేయాలి ఆడాళ్లు. కానీ పని చేయడానికి ప్రయత్నించి అలసిపోకూడదు"
"ఛీ నువ్వేం మాట్లాడుతున్నావో కానీ అంతా బూతులా అనిపిస్తోంది నాకు."
పరుశురాం నవ్వాడు.
"ఏదో చేస్తూనే "అది" "అది" అన్నాడట ఎవడో. దుప్పట్లో దూరితే లేదు కానీ నోటితో అంటే వచ్చింది నీకు"
"ఏయ్? మాటిమాటికీ దూరావు దూరావు అంటావు. దూరితే ఏమయ్యిందయ్యా! నీ బండారం బయటపడిందా?'ఆశ్చర్యంగా చూశాడు పరుశురాం మూతి తిప్పుతూ.
"పు... పు.... అందరికీ చెప్పేస్తాన్లే!" తుర్రుమంది రాణి.
"పు.... పు... అంటే!" బుర్ర గోక్కున్నాడు.
ఆ మాటకి అర్దం ఏమిటో ఎందుకన్నదో అతనికి తెలీలేదు.
బస్తీలో పిల్లలు కారు చుట్టూ మూగారు. అక్కడే మొదటిసారి పరుశురాం టాక్సీ నడపడానికి తీసుకెళ్తుండడంతో ఓ పెద్ద ముత్తయిదువ ఎదురొచ్చింది.
పరుశురాం టాక్సీ కదిలింది.
జనం ఈలలు కేకల మధ్య బాణంలా దూసుకెళ్లింది.
ఓ కిలోమీటరు దూరం పోయేసరికి రోడ్ కి మధ్యగా నిలబడి జడని ముందేసుకుని ఒయ్యారంగా చేత్తో గిరగిరా తిప్పుతూ నిలబడి వుంది రాణి.
టాక్సీ కీచుమని చప్పుడు చేస్తూ ఆగింది.
"ఏంటిక్కడ దారి కాశావు?" కారు దిగి అడిగాడు పరుశురాం.
"దారితో పెట్టుకోవడానికి దారి కాయక తప్పలేదు. అక్కడ బస్తీ జనంలో కుదరడంలేదు" అంది అతని భుజంపైన గెడ్డాన్నిఆనిస్తూ.
"నువ్వెన్ని దారులు కాసినా నీ దారిలోకి మాత్రం రాను. నీ దారిన నువ్వు వెళ్లు."
"ఉహూ నీ దారే నా దారి" ఆగింది.
"ఏయ్ పిచ్చి పిచ్చిగా వుందా?" అడిగాడు తను.
రాణి అతన్ని భుజంతో కొట్టింది.
"ఓయ్ ఓయ్ నువ్వీ గుప్పిటలో వున్నావు. గుప్పిట విప్పితే పి.... పు.... అన్నావంటే నీ పని గోవిందా" అంది.
రాణి చెవి మెలేశాడు పరుశురాం.
"నీ అల్లరికి హద్దులేకుండా పోతోంది. 'పు... పు' అంటే ఏమిటో చెప్పు" అదిలించాడు.
"చెవి వదలు చెపుతాను" అంది.
అతను చెవి వదలిపెట్టాడు.
రాణి కిసుక్కున నవ్వింది.
చేతులు తిప్పుతూ మూతి వంకర చేసి -
"సూడు పిన్నమ్మ పాడు పిల్లోడు" అని అర్దం అయిందా! అంటే 'పువ్వుల పున్నయ్య'
"ఓసినీ ఇంకా నయం గవీజ్ ఖాన్ అన్లేదు" రాణిని ముద్దుపెట్టుకోబోయాడు.
రాణి రెండు గజాల దూరం పరిగెత్తి ఆగింది.
"రాత్రయ్యాక వస్తాను. కాదని నిరూపించుకో! బస్తీమే సవాల్"
అని కన్నుగీటి చేతిని తొడపైన ఆనించి కొడుతున్నట్లు చూపించి రోడ్ పక్క చెట్లలోకి పరుగుదసింది రాణి.
"దీనికి "పని" చేసినంత పని చేస్తేనేగానీ బుద్దిరాదు" అనుకున్నాడు.
టాక్సీ స్టాండ్ లో కారాపి దిగి నించున్నాడు. అక్కడున్న మిగిలిన డ్రైవర్లు, క్లీనర్లు అతని వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. టాక్సీ బిజినెస్ లో ఎప్పుడెలా వుండాలో అనుభవం గడించిన ఓ డ్రయివర్ చెప్పాడు.
వాళ్ళింకా తనను కొత్తవాడిగా చూడకుండా తమలో ఒకడిగా కలుపుకోవడంతో చాలా ఆనందం కలిగింది పరుశురాంకి.
టాక్సీని ఆనుకుని నించున్న పరుశురాం కళ్లు ఓ యువతిని ఆకర్షించాయి.
ఆమె ఓ షాప్ లోంచి బయటకొస్తోంది.
సాంప్రదాయ సిద్దంగా వుంది.
ఆమే.... అతని మేనమామ కూతురు.
ఊర్మిళా.
ఆమె నగరంలోనే వుంటుందా? ఎందుకొచ్చినట్టు? ఊర్మిళకి పెళ్లయిందా? ఎన్నో ఆలోచనలు ఆ ఒక్క క్షణంలో.
ఆమెను చూడగానే ఎంత ప్రాణం లేచి వచ్చిందో, కళ్ళల్లో నీరు సుడులు తిరిగింది.
గుండెల్లో ముల్లు దిగినట్టనిపించింది.
తనంటే ఊర్మిళకి ప్రాణంకదూ!


