చదువుల గారడీ
ఆంధ్రప్రదేశ్ లో ఓ తమాషా వుంది.
అదేమిటంటే ఎప్పుడూ ఏదోవొక తమాషా జరుగుతూనే వుండడం. హఠాత్తుగా జర్నలిస్టులను చావగొట్టి వాళ్ళ కెమెరాలు విరగ్గొటటం పోలీసులకు ఓరోజు తమాషా అయితే, పోలీసులను నక్సలైట్స్ కిడ్నాప్ చేసుకెళ్ళటం మరో రోజు తమాషా! ఎంట్రెన్స్ పరీక్షల్లో కొశ్చెన్ పేపర్లు తెగ లీక్ అవటం ఓరోజు తమాషా! దేశంలోని నగరాలు మేయర్లందరూ రోడ్లు ఊడవటం ఓ రోజు తమాషా అయితే అసలు రోడ్లనేవే కనిపించకుండా పోవటం నగరంలోని చాలా లొకాలిటీల్లోని మరో తమాషా!
మన ప్రజలు ఈ తమాషాలన్నిటికీ 'ఇమ్యూన్' అయిపోయారనుకుంటే మా కాలనీ వాళ్ళు ఇంకో అడుగు ముందుకెళ్ళి వాటికి 'ఎడిక్ట్' అయిపోయారు.
రోజూ ఏదో ఒక వింతగానీ, ఏదో ఒక తమాషాగాని జరగకపోతే కాలనీలో ఎవరికీ మనశ్శాంతి వుండదు. నిద్రపట్టదు. తిండి సయించదు- అహహ! సారీ! తిండి బాగానే సయిస్తుంది.
ఎడిక్షన్ తీవ్రత తాలూకూ ప్రథమ విక్టిమ్ మా కాలనీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శాయిరామ్.
ఆదివారం అందరం ఇంకా నిద్రయినా లేవలేదు. ఈలోగా పెద్దగా ఓ కుర్రాడి ఏడుపూ, వాడి వెంటపడి కొంతమంది పెద్దాళ్ళు వాడిని చావగొట్టటానికి చేస్తున్న ప్రయత్నం మాకు కనపడింది. మేమంతా సంగతేమిటో కనుక్కుందామని వెళ్ళేసరికే శాయిరామ్ ఆ కుర్రాడినీ, అతని కుటుంబ పెద్దలనూ వేరుచేసి ఆ కుర్రాడిని కొట్టవద్దని వారికి నచ్చజెప్తున్నాడు.
"ఏం జరిగింది?" ఆవేశంతో ఊగిపోతున్న ఆ కుర్రాడి తండ్రి శంకర్రావ్ నీ, అతని బాబాయినీ అడిగాము.
"ఇంకేం జరగాలండీ! ఈ గాడిద కొడుకు మేము భయపడినంత పనీ చేశాడు" కసిగా అన్నాడు శంకర్రావ్.
"ఏం చేశాడు? దొంగతనం చేశాడా?" అడిగాడు శాయిరామ్.
శంకర్రావ్ శాయిరామ్ వేపు పిచ్చాడిని చూసినట్లు చూశాడు.
"దొంగతనం చేస్తే మేమెందుకు కొడతామయ్యా! అదేం తప్పుపనా? బోఫోర్స్ కుంభకోణాలూ, నాచారం కుంభకోణాలూ, హెల్మెట్ భాగోతాలూ, రామకృష్ణా స్టూడియో పన్ను మినహాయింపులూ- వీటిముందు దొంగతనాల్ని ఇంక దొంగతనాలని ఎవడంటాడయ్యా?" కోపం అణచుకుంటూ అన్నాడు.
"పోనీ ఎవరితోనయినా కొట్లాడాడా?" అనుమానంగా అడిగాడు రంగారెడ్డి.
"ఏమిటి? కొట్లాడితే మేము గొడవ చేయటానికి పిచ్చాళ్ళమనుకున్నారా? అసెంబ్లీలో, పార్లమెంటులో కొట్లాటలు, మర్డర్ ప్రయత్నాలూ, వీటిముందు వీధి కొట్లాటలేముందయ్యా? వీటిల్లో ఏం తప్పుందని?" మరింత రెచ్చిపోతూ అడిగాడు శంకర్రావ్.
"ఒకవేళ ఏ అమ్మాయినయినా మానభంగం లాంటిది చేశాడా?" హాస్యంగా అడిగాడు జనార్ధన్.
"ఏయ్! ఏం మాట్లాడుతున్నావయ్యా! మానభంగం చేస్తే నేనెందుకు కొడతాను? మావాడు ఎమ్మెల్యే అయ్యే రోజొచ్చిందని మురిసిపోతాను! జయలలితను అసెంబ్లీలో మానభంగం చేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినప్పటినుంచీ అది నేరం కాదని రుజువయిపోయింది కదా! అలాంటి పనులేం చేసినా నెత్తిన పెట్టుకుని పూజించేవాళ్ళం. కానీ వీడు వాటన్నింటికంటే దారుణమైన ఘోరం చేశాడండీ!"
"అంటే ఏం చేశాడు?"
"టెన్త్ క్లాస్ పాసయ్యాడండి! ఇదిగో చూడండి మార్క్స్ లిస్టు! ఇవాళే వచ్చింది! అసలు వీడిని టెన్త్ లో చేర్చవద్దే, ఆ దిక్కుమాలిన కంప్యూటర్ మనరాష్ట్రంలో అందరినీ ముందు ఫెయిల్ చేసి, రివాల్యుయేషన్ కి అప్లయ్ చేశాక అందరినీ ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తుందే అని మా ఆవిడతో మొత్తుకుంటూనే ఉన్నా! వింటేనా? వినకుండా వాడిని వెధవ గారాంతో టెన్త్ లో చేర్పించింది! ఈ దౌర్భాగ్యపు వెధవ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాసయి అఘోరించాడు" మేమంతా శంకర్రావ్ మీదా, ఆ పక్కనే నిలబడి కళ్ళొత్తుకుంటున్న అతని భార్యమీదా జాలిపడ్డాము.
"పోనీలేండి! జరిగిందేదో జరిగిపోయింది. పాసయి పోయాక ఇప్పుడింక ఎవరు మాత్రం ఏం చేయగలం?" ఓదారుస్తూ అన్నాడు రంగారెడ్డి.
"నేనూ అలాగే అనుకున్నానండీ! ఛస్తే చావనీ అని వదిలేద్దామనుకున్నాను. కానీ ఏం జరిగింది? ఇప్పుడు కాలేజీలో చేరతానని కూర్చున్నాడు" అందరం ఉలిక్కిపడ్డాం.
"ఏమిటి? కాలేజీలో చేరతానంటున్నాడా? వీడికేంపోయేకాలమొచ్చింది" ఆడవాళ్ళందరూ మెటికలు విరిచారు.
ఆ కుర్రాడి తల్లి కూడా భోరున ఏడ్చేయసాగింది.
"నిన్న రాత్రినుంచీ ఇదే వరుస పిన్నిగారూ- కాలేజీలో చేరతా అని ఒకటే గొడవ. ఇంక వీడెలా బతికి బట్టగడతాడు?" ఏడుస్తూనే అందామె.
రంగారెడ్డి ఆ కుర్రాడి దగ్గరకు నడిచాడు.
"ఏదో పాపం తెలీని వయసు! ఈ వయసులో అందరూ ఇలాగే తప్పులు చేస్తుంటారు. మనందరం నచ్చజెప్తే వాడే తెలుసుకుంటాడు లెండి- ఏరా రమణా? ఈ రోజుల్లో చదువులేమిట్రా? తప్పుకదంట్రా? మీ వంశం ఎలాంటిది? మీ నాన్నగారు వాళ్ళ పెద్దల మాట వినకుండా చదువుకోబట్టే కదా ఈనాడిలా అడుక్కుతినే పరిస్థితిలో ఊరి బయటపడున్నారు? మేమంతా కూడా మా పెద్దల మాట విని చదువుకునే కదా! ఇవాళ ఈ కుక్క బ్రతుకు బ్రతుకుతున్నాము?" అతనికి నచ్చచెప్పబోయాడు ప్రేమగా.
వాడికి ఏడుపొచ్చేసింది.
"నేను చదువుతానంకుల్! నాకేం డబ్బు ఖర్చుచేయనక్కర్లేదు. నాకు అన్ని కాలేజీ ఎంట్రెన్సుల్లోనూ ఫస్ట్ రాంక్ వచ్చింది. చదువంతా గవర్నమెంట్ స్కాలర్ షిప్ తోనే చదివేయగలను-" అన్నాడు ఏడ్చేస్తూ. యాదగిరి వాడి భుజం మీద చేయివేశాడు ఆదరంతో.
"ఒరేయ్ రమణా! గవర్నమెంట్ సంగతి నీకెరుకలేదురా! గిట్లనే నీ స్కాలర్ షిప్ లని, స్పెషల్ కోటా సీట్లనీ పోరగాండ్లకు ఆశపెట్టి కాలేజీల సదివేట్లు జేస్తరు. కొనాకు ఈ చదువుకున్నోడ్లేంజేస్తరు? అడుక్కుతినానికి గూడా పనికిరారన్నట్లు! సమజయిందా? ఎంతమందిని సూడటం లేదురా నువ్? మొన్నే గదా మన కాలనీలో ఎమ్మే సదివినోడు కోడిగుడ్లు వాడితాన కొనమని అందరినీ బ్రతిమలాడిండు! గుర్తులే?"


