ఒకవేళ రాంగ్ అడ్రస్ ఎందుకు కాకూడదు అనిపించేసరికి ఉత్సాహమంతా నీరుగారింది హరికి.
సరిగ్గా పదకొండున్నరకు వచ్చాడు పోస్ట్ మాన్. రూంవైపు అనుమానంగా చూస్తూ-
"హరి సాబ్, మీరేనా సాబ్?" అడిగాడు బ్యాగ్ లోంచి రెండు కవర్లు తీస్తూ.
"నేనే హరి... బిల్హరి" చెప్పాడు ఆత్రుతగా.
రిజిష్టర్ పోస్ట్ కవరిచ్చి సంతకం తీసుకున్నాడు.
"ఎమ్.ఓ. కూడా వచ్చింది సార్ మీకు" చెప్పాడతను సంచిలోకి చేయి పెడుతూ.
"ఎంత?" ఆత్రుతగా అడిగాడు హరి.
"ఐదువేలు సార్" చెప్పాడు పోస్ట్ మేన్.
కళ్ళు తిరిగినంత పనైంది హరికి.
ట్రాన్స్ లో వున్నట్లుగా డబ్బు లెక్కపెట్టుకుని సంతకం చేశాడు. పోస్ట్ మేన్ కి పదిరూపాయలిచ్చి థాంక్స్ చెప్పాడు.
గబగబా కవర్ చింపి, తెల్లని పేపర్ బయటకు తీశాడు. అందంగా టైప్ చేసిన ఎలక్ట్రానిక్ టైపింగ్ అక్షరాలతో పంపిన అపాయింట్ మెంట్ ఆర్డర్ అది.
విశ్వాత్మ ఫౌండేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగంలో చేరమని పంపిన ఆర్డర్. అంతా ఆశ్చర్యంగా చదివి, ఫ్రమ్ అడ్రస్ చూశాడు హరి.
'అన్వేషి, విశ్వాత్మ ఫౌండేషన్' అని వుంది.
ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో ఏర్పడ్డ ముఖపరిచయం. ఇన్నేళ్ళ తరువాత గుర్తుపట్టి, ఆదుకున్న అన్వేషి స్నేహభావానికి ఉక్కిరిబిక్కిరయ్యాడు హరి.
అతనికి తెలియకుండానే కళ్ళు చెమర్చాయి.
* * * *
చదువుతున్న పుస్తకాన్ని మూసేసి కిటికీవైపు నడిచాడు అన్వేషి. బిల్హరి వెళ్ళాక మిత్రతో జరిగిన వాదన అతని మెదడులో గింగురుమంటోంది.
సూక్ష్మరూపంలో వుండే విశ్వాత్మ ఆత్మస్వరూపుడ్ని సర్వవ్యాప్తమైన ఆయన అగోచర శక్తిని ఫోటో తీయగలిగే కెమేరాని ఏ శాస్త్రజ్ఞుడైనా కనిపెట్టి వుంటే ఎంత బావుండేది? ఏది ఏమైనా, విశ్వాత్మ సృష్టించి నిక్షిప్తం చేసిన క్రిప్టోగ్రాఫ్ కోడ్ ను కనుగొనడం ఊహించినంత సులభం కాదనిపించింది అన్వేషికి.
భవిష్యత్తులో ఏ వ్యక్తి అయినా క్రిప్టోగ్రాఫ్ పరీక్షలో నెగ్గితే, అతనే రహస్యాన్ని ఛేదించిన వీరుడవుతాడు. అతడే విశ్వాత్మ- అన్న విశ్వాత్మ విల్లులోని మాటలు గుర్తుకొచ్చాయి అన్వేషికి.
తను చేసే జాబ్ తనజే వింతగా వుంది. ఈ జాబ్ లో తను ఇమడగలడా? ఇది తన సామర్థ్యానికి తగ్గదేనా? 3.170 కోట్ల ఆస్తుల్ని కాపాడడం అన్నది గొప్ప బాధ్యతతో కూడుకున్నదే అయినా, ఆ అపారమైన ఆస్తి వెనక వున్న ఆధ్యాత్మిక నమ్మకం మాటేమిటి? తన ఆలోచనలెలా ఉన్నా, బిల్హరి సంఘటన తర్వాత, విశ్వాత్మ ప్యాలెస్ కు సంబంధించిన రూల్స్ లో చాలా మార్పులు చేశాడు అన్వేషి.
ప్యాలెస్ చుట్టూ రక్షణగా కాపలా వుండే గార్డ్స్ తో పాటు, అందరికీ పై అధికారిగా ఒక మాజీ సైనికాధికారిని నియమించాడు. ప్యాలెస్ సింహద్వారం దగ్గర ఎలక్ట్రానిక్ అలారమ్ ఏర్పాటు చేసి, క్రిప్టోగ్రాఫ్ మెషిన్ చుట్టూ క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను తక్షణమే అమర్చమని ఆదేశించాడు.
ఈ కొత్త ఏర్పాట్లన్నీ గమనించిన డైరెక్టర్ మిత్ర అన్వేషికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడు. ఆయన మాటల్లో తనపట్ల కోపం పూర్తిగా తగ్గిపోయినట్లు పసికట్టాడు అన్వేషి.
కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనల్లోంచి తేరుకుని తలుపు తీశాడు అన్వేషి, ఎదురుగా బిల్హరి.
సరైన సమయానికి తనను ఆదుకున్నందుకు ఎంతో కృతజ్ఞతను ప్రకటించాడు బిల్హరి. సమాధానం ఇవ్వకుండా పెదవులతోనే నవ్వాడు అన్వేషి.
"కనిపించకుండా గాల్లో సంచరించిన ఒక వ్యక్తి ఆత్మకు సంబంధించిన అపారమైన ఆస్తిని కాపాడడం అన్నది నాకు జీర్ణం కావడంలేదు. ఆ విశ్వాత్మ కోరిక నెరవేరలేదా?" చిన్నగా అన్నాడు హరి.
"నెరవేరుతుందా లేదా అన్న మీమాంస మనకుండకూడదు. కొన్ని బాధ్యతలు అవతలివారి నమ్మకం అనే ప్రాతిపదికపైనే నిర్వర్తించాలి తప్ప వ్యక్తిగత నమ్మకాలను ఆసరా చేసుకోకూడదు. విశ్వాత్మ కోరిక నెరవేరకపోతే ఈ ఆస్తి ఏమయిపోతుంది?
నెరవేరినా ఎప్పటికి? ఆ నెరవేరడం అన్నది కొన్ని శతాబ్దాల తరువాతయితే? అప్పటివరకు ఈ ఆస్తిని ఎలా కాపాడాలి? ఎవరు కాపాడాలి? ఇలాంటి సందేహాలు నాకు వున్నాయి. అయినాసరే ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే వాటి జోలికి మనం వెళ్లకూడదు" నిట్టూరుస్తూ అన్నాడు అన్వేషి.
హరికింకా అయోమయంగానే వుంది.
"ఇక ఇప్పటినుంచీ నువ్వు నా అసిస్టెంట్ వి. సిన్సియారిటీ, క్రమశిక్షణ ఇక్కడుండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీస్" అన్నాడు అన్వేషి.
"కంప్యూటర్ ఇంజనీర్ ని, డిటెక్టివ్ గా మారుస్తున్నావన్న మాట" అన్నాడు హరి నవ్వుతూ.
"నువ్వు నా అసిస్టెంట్ వన్న విషయం నీకు, నాకు, మిత్రగారికి తప్ప మరెవరికీ తెలియకూడదు. గుర్తుంచుకో" అన్నాడు అన్వేషి.
కాసేపయ్యాక బిల్హరి వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళాక టైమ్ చూసుకున్నాడు అన్వేషి.
ఆరుదాటింది. కిటికీ దగ్గరకెళ్ళి సూర్యాస్తమయాన్ని చూస్తూ నిలబడ్డాడు. సూర్యుడు నెమ్మదిగా పడమటి కొండల్లో ఒరిగిపోతున్నాడు.
సూర్యాస్తమయాన్ని పరిశీలించడం ఎప్పుడూ అన్వేషికి అలవాటు లేదు- కానీ కొత్తగా ఈ అలవాటు తనకు రావడం ఆశ్చర్యంగా వుంది.
తెల్లటి ఉదయాలు, వెచ్చటి సాయంకాలాలు చల్లటి ప్రకృతి, కొండలూ, కోనల్ని చూడాలన్న ఆసక్తి, తనలో రానురాను పెరుగుతోంది. ఆ విచిత్రమైన మార్పు ఎందుకో అనూహ్యంగా వుందతనికి.
సరిగ్గా అదే సమయంలో- అన్వేషి కళ్ళను మృదువైన రెండు అరచేతులు కప్పేశాయి. "శృతీ!" అన్నాడు సౌమ్యంగా.
గూటిలో పక్షులు చేసిన రెక్కల సవ్వడిలా, మంద్రంగా, మధురంగా నవ్వింది. ఎక్కడో దూరంగా చిరుగంటలు చేసిన సవ్వడి.
ఆమె చేతులను సుతారంగా తీస్తూ తిరిగాడు ఆమెవైపు. మెజెంటా కలర్ డ్రస్ లో మేఘమాలలోంచి ప్రత్యక్షమైన దేవకన్యలా వుంది శృతి.
కన్నార్పకుండా శూన్యంవైపు చూస్తున్న అన్వేషి-
"కాస్త ఈ లోకంలోకి వస్తారా?" అంటూ చెంపమీద సుతారంగా తట్టింది శృతి.
"ఆఫీసు నుంచేనా?" అడిగాడతను తేరుకుని.
"అవును! ఇవాళ ఆఫీసుకు రాలేదేమిటి?"
"ఒక ముఖ్యమైన పనిమీద రోజంతా తిరగాల్సి వచ్చింది" అన్నాడతను.


