విద్య అతనివెంట నడుస్తూ- "అదేమిటి..... పలకరిస్తే మిమ్మల్ని కాదన్నట్టు వెళ్ళిపోతారేం?" మనసులో కోపం, అవమానం కలిగినా వీలయినంతవరకు ఆ భావాలు కనబడకుండా లేని నవ్వు తెచ్చుకుని అంది.
ప్రభాకర్ ముఖం చిట్లించి, "నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు" అన్నాడు.
"అదేమిటి..... కట్టుకున్న పెళ్ళాం విదేశాలు వెడుతున్న మొగుడికి సెండాఫ్ ఇవ్వడానికి వస్తే మాటలవసరం లేదంటారేం? ఆరునెలలదాకారారుగదా అని కష్టపడి ఇంతదూరం వస్తే ఇదేం ట్రీట్ మెంట్?"
"నిన్నెవడు రమ్మన్నాడసలు? ఎందుకొచ్చావు, ఎలా వచ్చావు? మొగుడు, కాపురం అక్కరలేని దానికి మొగుడెక్కడికి వెడితే ఏం కావాలి? నీతో మాకు మాటలనవసరం! నీలాంటి పొగరుబోతు దానితో, నీలాంటి..... నీలాంటి దానితో..... నాకేం సంబంధం లేదు." మొహం ఎర్రపరుచుకుని మాటలు తడబడగా కోపంగా అన్నాడు.
"ష్..... ఎందుకలా అరుస్తారు, ఇది ఇల్లనుకున్నారా? పదండి..... లగేజి సంగతి చూసి ఏదన్నా హోటల్ కి వెళ్ళి మాట్లాడుదాం. మీ ప్లైట్ తెల్లవారుజామునగదా! ఈలోగా మనం మాట్లాడుకోవచ్చు.
"నీతో నాకు మాటలనవసరం అని చెప్పాను. నీకూ, నాకూ ఏం సంబంధం లేదు "తీవ్రంగా అన్నాడు.
"లేదంటే పోవడానికి, వద్దనుకున్నంత మాత్రాన సుళువుగా తెగిపోవడానికి ఇదేం బొమ్మల పెళ్ళి కాదు. మీరు నేను అక్కరలేదనుకుంటే, మీకూ నాకూ సంబంధం లేదనుకుంటే ఆ తతంగం అంతా కోర్టుద్వారా జరగాలి. అప్పటివరకు మీకు నేను భార్యని, మీరు నాకు మొగుడు" విద్య కూడా కాస్త తీవ్రంగానే అంది.
ప్రభాకర్ చురచుర చూశాడు. నాతో ఏం మాట్లాడాలి - "ఇప్పుడే చెప్పు." కోపంగా అన్నాడు. "కోర్టు ద్వారా విడిపోవడానికి వస్తే నాతో మాటలక్కరలేదు. లాయరు ద్వారా నోటీసు పంపు. ఉత్తరానికి జవాబివ్వడం ఇష్టం లేనివాళ్లతో నాకేం సంబంధం వుంచుకోవాల్సిన అవసరం లేదు."
"ఉత్తరం మీరు రాస్తే తప్పకుండా జవాబు వచ్చేది. పెళ్ళానికి ఉత్తరం రాయడానికి కూడా తండ్రి పర్మిషన్ కోరే భర్తకి ఏ ఆడదీ జవాబివ్వదు. మీ నాన్నగారు రాస్తే నాకూ మా నాన్నగారున్నారు కనక ఆయనే జవాబిచ్చేరు. ఉత్తరం రాస్తే జవాబివ్వనిది మీరుగాని నేను కాదు. నేను ఉత్తరం రాసినా, జవాబివ్వకపోయినా మీరెప్పుడు వెడుతున్నదీ వీళ్ళద్వారా వాళ్ళ ద్వారా ఆరా తీసి వచ్చింది నేను. ఎందుకొచ్చాను..... నా మొగుడు కనక, వద్దనుకున్నా అంత సుళువుగా ఈ సంబంధం పోదుగనకవచ్చాను. అర్థమైందా- ఇంకా నాతో మాటలాడాలని అనుకోకపోతే నేను వెడతాను..... ఇలాంటి మొగుడితో నాకూ సంబంధం అక్కరలేదు." తీవ్రంగా అంది.
ప్రభాకర్ మొహం బెట్టుసడలింది - ఏదో చెప్పబోయేంత లోకనేయర్ బెల్టు మీద తన లగేజి కనిపించి పెట్టెలు రెండూ తీసుకుని ముందుకు నడిచాడు. టాక్సీ కోసం వెయిట్ చేసినంత సేపూ ఏం మాట్లాడలేదు- విద్య ఓపిగ్గా అతనివంక చూస్తూ కోపం కంట్రోల్ చేసుకుంటూ నిల్చుంది. టాక్సీ దొరకగానే విద్యముందుగా తలుపు తీసి ఎక్కి కూర్చుంది. ప్రభాకర్ విద్య వంక మింగేసినట్టు చూసి టాక్సీ డ్రయివరు ముందు సీను అవుతుందన్న భయంతో ఇంకేం మాట్లాడకుండా సూట్ కేసులు రెండూ పెట్టి తనూ ఎక్కాడు. టాక్సీకి హోటలు పేరు చెప్పాడు. టాక్సీ దిగి, హోటల్ రూంకి వెళ్ళేవరకు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. హోటల్ రూంలోకి వెళ్ళాక విద్యే చొరవగా బెల్లు నొక్కి బాయ్ ని పిలిచి కాఫీకి ఆర్డరిచ్చింది. ప్రభాకర్ బాత్ రూంలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని టేబిల్ మీద పేపర్ అందుకుని చదవడం మొదలు పెట్టాడు. విద్య ఆ గదిలో లేనట్టే.
విద్యకి ఎంత ఆపుకుందామన్నా ఆగని కోపం వచ్చింది. ఛుర్రున అతని చేతిలోని పేపర్ లాగేసి పక్కన పడేసింది. "ఏమిటి మీ ఉద్దేశం? నేనంతదూరం నుంచి వస్తే ఏమిటిలా ట్రీట్ చేయడంలో మీ ఉద్దేశం.... ఏమిటి?"
"మొగుడు, కాపురం అక్కరలేని భార్యతో మాట్లాడవలసిన అవసరం నాకులేదు. రెండు మూడు నెలలయివెళ్ళి, ఇన్నాళ్ళు ఎందుకురాలేదో ముందు సంజాయిషీ ఇయ్యి - తరువాత మిగతా విషయాలు." బింకంగా అన్నాడు.
"నేనెందుకు వెళ్ళానో మీకు తెలుసు. నేనెందుకు రాలేదో కూడా మీకు తెలుసు. తెలియకపోతే తెలియచెప్తూ ఉత్తరం రాశాను. నా అన్న పెళ్ళికి వెళ్ళడం తప్పా. దానికి కూడా మీ నాన్నగారి పర్మిషన్ కావాలా? నాకు మొగుడున్నాడు, ఆ మొగుడి అధికారం కాకుండా వీళ్ళు వాళ్ళు నామీద జులుం చలాయిస్తే నేను సహించను." కొంచెం తీవ్రంగా అంది విద్య.
"వాళ్ళూ వీళ్ళూ ఎవరు..... మా అమ్మ నాన్న..... నీ వాళ్ళు నీకు ఎంతో నా వాళ్ళు నాకు అంతే! ఇంటికి పెద్దవాళ్ళు సలహా ఇస్తారు. మంచీ చెడ్డా చెప్తారు. వినకుండా నీవెవరు, నీవెంత అనే పొగరు నేను సహించను." కోపంగా అన్నాడు.
"పెద్దవాళ్ళు మంచి చెడ్డా తప్పకుండా వింటారు..... సలహా అయితే ఆచరిస్తారు. అంతేగాని, కోడలని జులుం చలాయించి, క్రుకెడ్ గా దీన్ని అణగదొక్కి, గుప్పెటలో పెట్టుకోవాలి అనుకుంటే నేను సహించను. అయినా ఎవరంత వాళ్ళు వాళ్ళయ్యాక, కొడుక్కి పెళ్ళయ్యాక, ప్రతి చిన్న విషయంలో జోక్యం కలిగించుకుని, వాళ్ళ విషయాల్లో వేలుపెట్టే పెద్దరికం - అది పెద్దరికం కాదు - నిజంగా పెద్దవాళ్ళయితే వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకుంటే చిన్నవాళ్ళు గౌరవిస్తారు. అంతేగాని కూరకి, చీరకి, కుర్చీకి అన్నింటికీ వాళ్ళ అధికారమే కావాలంటే నేనేకాదు, ఏ భార్యా సహించదు. అది మీరర్థం చేసుకోండి - మీరు కట్టుకున్న భార్య గౌరవం, అభిమానం కాపాడటం మీ ధర్మం. అది లేకపోగా మీ వాళ్ళచేత నన్ను అవమానపరుస్తుంటే సహించడానికి నేనేం చీము నెత్తురులేనిదాన్ని కాదు."
"అంత అభిమానం, పౌరుషం వున్నదానివి పాపం కాళ్ళబేరానికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు..... ఆత్మాభిమానం కాపాడుకుంటూ పుట్టింట్లో కూర్చో, ఆడదానివి నీకే అంత ఆత్మాభిమానం, పౌరుషం వుంటే మగాణ్ని నాకెంత వుండాలి?" వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు.
"ఓహో..... ఆత్మాభిమానం, పౌరుషాలు మగవారి సొత్తుగాబోలు. ఆడదానికి అవి వుండకూడదన్నమాట!"
"నీలాంటి ఇస్కో అంటే ఇస్కో అనేదానితో నాకు మాటలనవసరం. ఇక్కడికొచ్చి దెబ్బలాడవలసిన అవసరం లేదు. నాకు టైము లేదు. నీవెళ్ళొచ్చు ఇక్కడి నుంచి. మాట్లాడవలసింది వుంటే కోర్టులో మాట్లాడుకుందాం." నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా దులపరించాడు.


