భారతదేశ చరిత్రలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిన సంవత్సరం. భారత జాతినే ఒక మలుపు తిప్పిన సంవత్సరం.
కోటయ్య తన బట్టల ఖర్చుకూడా మానుకొని భద్రయ్యగారు కట్టి తీసేసిన పాతబట్టలు కట్టుకుంటూ, తినీ తినకుండా, తన కష్టార్జితమంతా కొడుకు చదువు కోసం వినియోగించేవాడు.
భద్రయ్యగారి పొలం నూర్పిళ్ళు అయాక కోటయ్య డబ్బు తీసుకుని ఒకరోజు గుంటూరు వెళ్ళాడు.
కోటయ్య ఇంటికి వెళ్లేసరికి రాముడు తన స్నేహితుడు సత్యనారాయణతో రాజకీయాలు చర్చిస్తున్నాడు.
కొడుకు వాగ్థాటికి మురిసిపోతూ, వాళ్ళ సంభాషణ వింటూ కూర్చున్నాడు కోటయ్య.
ఆ చర్చలో కోటయ్యకు బ్రిటిష్ ప్రభుత్వమూ, గాంధీగారూ, సత్యాగ్రహమూ, ఆ మూడు మాటలు మినహా ఇంకేమీ అర్థం కాలేదు.
కోటయ్య మంత్ర ముగ్థుడిలా వింటున్నాడు.
హృదయం ఆనందంతో పొంగిపోతూ వుంది.
సత్యనారాయణ ఆ ఊళ్ళో పేరుమోసిన డాక్టరు రామకృష్ణగారి కొడుకు.
కోటయ్య కొడుకుని తనివితీరా చూసుకుంటూ ఆలోచించాడు.
తన కొడుకు ప్రయోజకుడు. తన కొడుక్కి పెద్ద పెద్దవాళ్ళ కొడుకులతో స్నేహం వుంది. తన కొడుకూ, బాగా చదివిస్తే భద్రయ్యగారి పెద్దకొడుకులా పెద్ద ఉద్యోగస్థుడు అవుతాడు.
తనింకా రెండు మూడేళ్ళు కష్టపడాలి. అంతే! ఆ తర్వాత తనూ కొడుకు దగ్గిరే వుండొచ్చు. తనకూ చాకిరిచేసే ఓపిక తగ్గిపోతూవుంది. తను హాయిగా కాలుమీద కాలు వేసుకుని కూర్చోవచ్చు.
తను పెద్దవాడై పోతున్నాడు. ముందున్న శరీర పటుత్వం ఇప్పుడు లేదు.
"ఐతే బాబూ! ఈ చదువులు పూర్తికాగానే ఏం వుద్యోగాలు చెయ్యాలనుకుంటున్నారు?"
చదువు పూర్తికాగానే అడిగిన ఉద్యోగం వస్తుందని కోటయ్య నమ్మకం.
సత్యనారాయణ రాముడి ముఖంలోకి చూశాడు. రాముడు ముసిముసిగా నవ్వాడు.
"నాకు తెలవక అడుగుతాను. భద్రయ్యగారి కొడుక్కు వచ్చినంత పెద్ద ఉద్యోగం మీకూ వస్తుందా?" మళ్ళీ ప్రశ్నించాడు కోటయ్య.
"నా సంగతేమోగాని మీ అబ్బాయికి వస్తుంది." అన్నాడు సత్యనారాయణ.
"ఎందుకని బాబూ?"
"వెనకబడిన తరగతి వాళ్ళకు త్వరగా ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్స్ పెద్ద ఉద్యోగాలు కూడా వస్తాయి. మీ కులాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువకదా!"
కోటయ్యకు సత్యనారాయణ చెప్పింది సరిగా అర్థం కాలేదు!
తన కొడుక్కి డాక్టరుగారి కొడుక్కంటే పెద్ద ఉద్యోగం రాబోతుందని మాత్రం అర్థం అయింది.
కోటయ్య ఆనందంతో పరవశించాడు. కొడుకుని మురిపెంగా చూసుకున్నాడు.
"మేం వెధవ ఉద్యోగాలు చెయ్యం బాబాయ్!" అన్నాడు సత్యనారాయణ.
బాబాయ్! తనను డాక్టరుగారి అబ్బాయి 'బాబాయ్' అన్నాడు. ఎందుకు తన కొడుకుని చూసేగా! కోటయ్య మురిసిపోయాడు.
"ఇంత చదువూ చదివి వెధవ ఉద్యోగాలు ఎందుకు చెయ్యడం మంచి ఉద్యోగాల్లోనే చేరండి" ఉత్సాహంగా అన్నాడు కోటయ్య.
సత్యనారాయణ తన ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. రాముడు కళ్ళతో వారిస్తున్నా అర్థం చేసుకొనే ధోరణిలో లేడు.
"అదికాదు. అసలు మేం ఉద్యోగం చెయ్యం."
కోటయ్య వెర్రిముఖం వేశాడు. కొడుకునీ, సత్యనారాయణనూ మార్చి మార్చి చూశాడు.
"ఏంటీ ఉద్యోగం చెయ్యరూ? మరెందుకు చదువుతున్నారు?"
"చదువులు కేవలం ఉద్యోగం కోసమే కాదుగా!" సత్యం అన్నాడు.
కోటయ్య అయోమయంగా చూశాడు.
"ఏందిరా, రాముడూ! ఉద్యోగం చెయ్యవా?" కోటయ్య కొడుకుని చూస్తూ విస్మయంగా అడిగాడు.
రాముడు తల వంచుకున్నాడు.
"అదికాదు బాబాయ్! ఈ ప్రభుత్వం కింద పనిచెయ్యడం అంటే బానిసత్వం అన్నమాట."
అదేమిటో అర్థం కాలేదు కోటయ్యకు.
"మరి ఉద్యోగం చెయ్యక ఏం చేస్తారు?" అయోమయంగా అడిగాడు కోటయ్య.
స్వరాజ్యం కోసం పాటుపడతాం. దేశమాతను బంధవిముక్తను చేస్తాం. తెల్లవాళ్ళను పారదోలి స్వేచ్చను సంపాదిస్తాం." అన్నాడు సత్యనారాయణ.
కోటయ్య పిచ్చి చూపులు చూశాడు. కొడుకు ముఖంలోకి చూశాడు.
"ఏరా మాట్లాడవ్. నిజంగా ఉద్యోగం చెయ్యవా?" నీరుకారిపోయి అడిగాడు కోటయ్య.
"ఇంకేం ఉద్యోగాలూ, ఇంకేం చదువులూ...."
"ఏంటీ చదువులు కూడా మానేస్తారా?" సత్యనారాయణ మాటల్ని మధ్యలోనే అందుకున్నాడు కోటయ్య.
"అవును, అవసరం అయితే చదువు కూడా మానేస్తాం! దేశం యావత్తూ అగ్నిపర్వతంలా ఉడికి పోతూ వుంటే మేము మాత్రం అదేమీ పట్టనట్టు ఎలా చదువుకోగలం! రేపోమాపో గాంధీగారు క్విట్ ఇండియా నినాదం యివ్వబోతున్నారు. యువకులంతా యుద్ధరంగంలోకి దూకాలి. అవసరమైతే ప్రాణాలకు అర్పించాలి."


