"నళినీ! నళినీ ఈ సాహసం బాగులేదు."
ఆమె లక్ష్యం చెయ్యనట్లు నవ్వి "డాక్టర్ ! మిమ్మల్ని మృదుల ప్రేమించిందా ?" అనడిగింది.
"ఉహు, లేదు. నేనే ఆమెను ప్రేమించాను. నా ప్రేమ నామె తిరస్కరించింది.
నళిని కిలకిలమని నవ్వింది. నా ఫాల భాగంమీద చిన్న దెబ్బవేసి "కోతలు కొయ్యకండి. మీరెవర్నీ ప్రేమించరు. మీ జీవిత ధ్యేయం వేరు. మీ గురించి అందరికంటే ఎక్కువగా నేనర్ధం చేసుకున్నాను. మృదుల మిమ్మల్ని ప్రేమించింది. ఆమె ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించి వుంటుంది ఆమె అంత స్వార్ధరహితంగా వుంటుందని నేననుకోను. కాని నేను....నేను డాక్టర్. మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారనీ తెలుసు, ఈ హాస్పిటల్ లో మీ పని అయిపోయిన మరుక్షణం మీరెవరో, నేనెవరో అయిపోయి జీవితంలో మళ్ళీ కలుసుకోక పోవచ్చుననీ తెలుసు. అయినా మిమ్మల్ని ప్రేమించాను. విన్నారా ?" అంది.
"విన్నాను, కాని మీ ప్రేమ సంపదను నాబోటి వాడిమీద గ్రుమ్మరించి వృధాచేసుకున్నారని చెప్పటానికి చింతిస్తున్నాను."
"వృధాచేసుకున్నానా ! లేదే, ప్రేమకు వృథా అంటూ లేదు. వృథా అయేవి సంఘటనలు అనుకున్న సంఘటనలు జరగపోతే ప్రేమకు సంపూర్ణత్వం సిద్ధించదు, అంతేగాని వృథా కాదు."
నే నాశ్చర్యంగా ఆమె వైపు చూశాను. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఉదర నిమిత్తం నర్సింగ్ వృత్తిలో చేరిన అమ్మాయిలో ఎంత లోతైన భావాలు! కాని అనవసరపు బాధలు !
"డాక్టర్ ! ప్యాసయితే ప్రెజంట్ ఇస్తానని మాట ఇచ్చారు. నేనిప్పుడు ప్యాసయ్యాను. అన్నమాట తప్పరుగా"
"ఏం కావాలి ?"
ఆమె యింకా ముందుకి నా ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టింది కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నది. మెల్లిగా పెదవుల్ని నా పెదవుల మీద ఆన్చింది.
"ఉహు. మనం చాలా దూరం పోతున్నాం నళినీ !"
"మీరు యివ్వకపోతే నేనే తీసుకుంటాను"
అంటూ పెదవుల మీద గాఢంగా, ఊపిరి సలపనట్లుగా చుంబించింది. ముఖం కొంచెం పైకెత్తి నా వంక చూసి నవ్వింది.
"నన్నిట్లా చేశావుకదా ! నేను ఎక్సయిట్ అయి, నీలో చెలరేగిన బలహీనతను ఆధారంగా చేసుకుని శృతిమించి రాగానపడి నా కోరిక తీర్చుకుంటే ఏమవుతుంది ?"
"ఏమవుతుంది ? నా కోరికా తీరుతుంది" నళిని మళ్ళీ నవ్వింది.
"అంతేనా ? ఇంకా నీకు అపకారం జరిగితే ?"
"అంటే ? నలుగురికీ తెలిసి నిన్ను డిస్మిస్ చేస్తేనా ? సూదిమొన అంత కూడా కేర్ చెయ్యను ఈ అనుభూతిని మూట కట్టుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి బ్రతకగలను"
"ఇంకా ఆగక, నీకు మరీ ప్రమాదం జరిగితే !"
"అంటే ? నేనూ మాతృమూర్తినైతే ఏమవుతుందంటారా ? అంతకన్నా ఏం కావాలి ? మీరు మరెన్నడూ కనిపించకపోయినా, మీ ప్రతిమని యింటిలో దాచుకున్నట్లే అయి, అమితానందంలో మునిగిపోతాను"
"నీకు ....నీకు .... మనస్సు సరిగ్గాలేదు అలా కుర్చీలో కూర్చో చెబుతాను !"
"ఇక్కడే వుంటాను చెప్పండి" ఆమె తన మోచేతిని నా హృదయం మీద సున్నితంగా ఆన్చి, మీద వ్రాలినట్లుగా కూర్చుని, అంది.
"నళినీ ! ఇందాకటి నుంచి నువ్వు చెప్పినట్లు నేను విన్నాను. ఇహ నేను చెప్పినట్లుగా నువ్వు విను లేచి అలా కుర్చీలో బుద్ధిమంతురాలుగా కూర్చో. నామాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? నీ నుండి అవలీలగా విడిపించుకుని యిక్కణ్నుంచి బలవంతంగా వెళ్ళిపోతాను జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. మంచిగా కాదు, చెడుగా."
నా కంఠంలో కాఠిన్యం విని ఆమె చలించినట్లుంది. మెల్లగా లేచి కుర్చీలో కుదురుగా కూర్చుని "చెప్పండి" అంది.
"చూడు నళినీ !" అన్నాను. "నువ్వంటే నా కెంతో అభిమానం ,గౌరవం. మనం వ్యక్తిగతంగా ఎలాంటివాళ్ళమైనాగానీ, అతి పవిత్రమైన వృత్తిని స్వీకరించాలి. నేను డాక్టర్ని, నువ్వు నర్సువి, వృత్తిరీత్యా మన యిద్దరకూ కొన్ని నైతిక ధర్మాలున్నాయి. మనసుల్లో మనకెన్ని వ్యక్తిగతమైన వ్యామోహాలున్నా ఉండనియ్యి. ఆలోచన మానవ సహజం. అది తప్పులేదు, ఆ ఆలోచన బయటకు వెలిబుచ్చటం అరికట్టటానికి వీలైన బలహీనత. ఎటొచ్చీ మనం ప్రయత్నించం. వ్యక్తిగత ఆకర్షణలను లోపలే అణిచి వుంచి, ఆ అణచివేత కల్పించే ప్రకంపన ద్వారా జీవిత మార్గానికి వొరవడి పెట్టుకుంటే మనిషి ధన్యజీవి అవుతాడు. నళినీ ! డాక్టర్ల గురించీ, నర్సుల గురించీ, హాస్పిటళ్ళ గురించీ మిగతా జనం యింత చెడ్డగా చెప్పుకుంటున్నారే, దీనికి కారణం ఏమిటి ? మనలో లోపం వుండబట్టే కదా, అనేక చెడు సంఘటనలు మనలో వాళ్ళు చూడబట్టే కదా.
దీనికి విముక్తి లేదా ? నళినీ ! నువ్వు ఒక్క అడుగు మిగతా వారికంటే ముందుకు వేసి, ఒక్కసారి కర్తవ్యాన్ని నెమరు వేసుకుని, అప్పుడు కళ్ళు తెరిచిచూడు. నీ ప్రపంచం ఎంత బంగారుమయమో నీ బాట ఎంత స్వచ్ఛమో, నీ ఉనికి ఎంత నిర్మలమో గోచరిస్తుంది. ఆలోచించు నళినీ ! మంచివాళ్ళు ఎక్కువమంది వుండరు. కాని వారి ప్రభావం వేలమందిమీద ప్రసరిస్తుంది. నువ్వు అలాంటి మంచిదానివి కా నళినీ !"
నళిని అలిగిపోయినట్లు, మంత్రబద్దయినట్లు కళ్ళు మూసుకుంది. నిమిషాలు గడుస్తున్నాయి. నే నామె వంకే దృష్టి నిల్పి చూస్తున్నాను.
చివరి కామె కళ్ళు తెరిచింది. ఆమె కన్నులు బాష్ప పూరితాలయి వున్నాయి.
"నీ దీవెన అందుకున్నాను డాక్టర్" అంది ఆమె గొంతులో ఎంత గాద్గద్యం వుందో, అంత నైర్మల్యంకూడా వుంది. "నువ్వు చూపించిన బంగారు బాటవెంట నడవటానికి ప్రయత్నిస్తాను. నీ స్మృతి నన్ను ఉన్నతురాలిని చేయనియ్" అంది.
* * *
రెండు నెలలు గడిచాక....
మెయిల్ ప్లాట్ ఫారంమీద స్థిరంగా వుంది. తర్డుక్లాస్ కంపార్టుమెంటంతా క్రిక్కిరిసి వుంది. నా బెడ్డింగూ, సూట్ కేసూ కష్టంమీద అందులో చోటుచేసి పెట్టి ప్లాట్ ఫారం మీదకు దిగి వచ్చాను.
మృదుల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నా కభిముఖంగా నిలబడింది. ఇద్దరి మధ్యా మాటలయిపోయాయి. మౌనం ఆక్రమించింది. అసలు ఏం మాట్లాడుతున్నామో నాకు గుర్తులేదు. అంత యాంత్రికంగా గడిచింది సంభాషణ.
రెక్క వాలింది.
మృదులవైపు చూశాను.
నల్లటి అద్దాల వెనుక ఆమె నేత్రాలు లీలగా కదుల్తున్నట్లు కనిపిస్తున్నాయి. అవును వాటిని ఆమె కావాలనే నల్లతెరల వెనుక దాచేసింది.
ఆమె పెదవులు కదిలాయి. "ఇంకో మూడు రోజుల్లో విమానంలో వుంటావు. ఏం? ఆ తర్వాత మరో రోజు గడిచేసరికి యునైటెడ్ కింగ్ డమ్ లో వుంటావు" అన్నమాటలు వినిపించాయి.
నేనేం జవాబు చెప్పలేదు.
గార్డు విజిల్ ఊదాడు.
నేను కంపార్టుమెంటువైపు అడుగు వెయ్యబోయాను. పట్టుకుని ఆపినట్లయింది. చూసేటప్పటికి నా చెయ్యి ఆమె చేతిలో వుంది.
"నీవు ఎప్పటికొస్తావో, అసలు వస్తావో రావో కూడా తెలీదు. పోనీ వస్తావు నీవు వచ్చేసరికి పూలహారం చేతిలో పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ వుంటాననుకున్నావా ? అదేంలేదు పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని నా కుటుంబంతో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ వుంటాను. ఈ లోపల నిన్ను గురించి తలచనైనా తలచను. నువ్వు నాకు గుర్తుండవసలు. అలా ఆనందంగా మేము కాలం గడుపుతూంటే ఎప్పుడో నువ్వు వస్తావు. అప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైతే మాత్రం నాకేం లెక్క ! ఏముంది నీ దగ్గర ఏమీలేదు. నీ వంటి గొప్పవాళ్ళననేక మందిని లెక్కచెయ్యనట్లే నిన్నూ లెక్క చెయ్యను. చూస్తావు దూరం నుంచి. అంతకంటే ఏం చేస్తావు ? చూస్తావు చూసి చూసి చూసి...." ఆమె గొంతుకేదో అడ్డుపడినట్లయి హృదయ విచారకమైన రోదన వినిపించింది.
నేను విభ్రాంతినుంచి తేరుకుని "మృదులా !" అంటూ ఏదో అనబోయాను. రైలు ఎప్పుడు కూతవేసిందో తెలియదు గాని, కదలటం గమనించి దభాలున ప్రక్కకు తిరిగి కమ్మీని పట్టుకుని ఫుట్ బోర్డుమీద కాలు నిలద్రొక్కుకున్నాను. లోపలకు పోవటానికి సందులేదు.
అట్లా నిలబడే తల వెనక్కి త్రిప్పి చూశాను. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని చలనం లేకుండా మృదుల నిలబడి వుండటం గోచరించింది. ఆమె చేతిలో కర్చిఫ్ లేదు. ఆమె చెయ్యి ఊపటంలేదు.
(శుభం)


