9
అరవింద రాగానే గోపాలరావుకి కొత్త సమస్యలు పట్టుకున్నాయి. రవణ కోసం వచ్చే కుర్రాళ్ళను తప్పించాలని ప్రయత్నించాడు. రవణతో రాత్రులు మాట్లాడ్డం సులభమయింది, ఒకరాత్రి నవ్వుతో మాట్లాడుతుంది, మళ్ళీ కొన్ని రాత్రులు కనపడదు. ఒక్కమాట నొచ్చుకునేట్టు అన్నాడా, మూడురోజులు అసలు కనపడదు. ఈ చర్యలన్నీ ఆరితేరిన కులటలు చేసే పనులని పుస్తకాల్లో చదివాడు. కాని ఆరితేరిన కులటలు కావాలని జ్ఞానంతో చేసే పనులే, ఏమీ తెలియని అమాయకురాలైన రవణ సృష్టిశక్తి చేత ఉద్భోతరాలై చేస్తోంది.
"సాయంత్రం వొస్తారే కుర్రాళ్ళు వాళ్ళతో మరీ చనువుగా వుంటున్నావు"
రవణ మాట్లాడక వూరుకొని-
"అదేనా యేమిటి, మీ కోపానికి కారణం"
"మరి నువ్వు అంత అన్యాయంగా ప్రవర్తిస్తూవుంటే."
రవణ నవ్వింది.
"మీకు పిచ్చి" అంది.
ఎంతో అనుభవమున్నట్టు తనని అదమాయించడంమేమిటి? ఇదో వేషం!
"వీల్లేదు. నువ్వు వాళ్ళతో-"
రవణ నవ్వుతో- "ఛా, వూరుకోండి, వాళ్ళెవరు?
గోపాలరావు "సీరియస్ గా" మాట్లాడుతున్నాడని అనుకోదు. రవణ, వాళ్ళకీ తనకీ సంబంధం కట్టడమంత దూరంపోదు ఆమె నిర్మలమైన మనసు. ఆటలాగుంది. తనని ఉడికించడానికి అంటున్నాడను కుంటుంది.
"కాని, చూసేవాళ్ళకి-"
ఇట్లానే అనుమాన మలినంతో, నిర్మలమైన మనుషుల్ని దుర్మార్గంలోకి పరిచయం చెయ్యడం.
"మాట్లాడకండి-పాపం, నన్ను విడవలేక. నాన్నగారున్నప్పుడు ఎంత ఆనందంగా వుండేది! ఎన్ని ఆటలాడుకునే వాళ్ళం!"
"ఇప్పుడు బావుండలేదా?"
"ఆ రోజులు వేరు."
గోపాలరావు మనసు శాంతించలేదు. పగలంతా యోచించాడు. రాత్రి ఎన్ని విధాలా ఆజ్ఞాపించినా వినదు. నవ్వుతుంది, వెక్కిరిస్తుంది ఇంకేమో మాట్లాడుతుంది. కారణా లడుగుతుంది.
"వాళ్ళను పొమ్మను-రానీయకు"
"రాగానే, పొండి అంటాను."
"అంటావా?"
"వాళ్ళు పోకపోతే నాకు తెలీదు."
"ఎందుకు పోరేం?"
"నేను పొమ్మంటానని, అనుకోరు,"


