"నేనేక్కడున్నాను?" అన్నాడు సత్యమూర్తి.
"మాటాడకూడదు. కదలకూడదు!" హెచ్చరించేడు ఆనందం.
"నేనెక్కడున్నాను?" రెట్టించి అడిగేడు సత్యమూర్తి.
"ఆసుపత్రిలో వున్నావు. నీకేమీ ఫర్లేదని డాక్టర్ హామీ ఇచ్చేడు" అన్నాడు ఆనందం.
"అవుటాఫ్ డేంజరన్నమాట!" అని ఇంగ్లీషులో చెప్పేడు సింహాచలం.
ఆనందాన్ని చూచి సత్యమూర్తి ఘొల్లున ఏడవబోయాడు. మొహమంతా కట్లు కట్టడం వల్ల కుదరక, కుళ్లి కుళ్లి లోలోన ఏడుస్తున్నాడు.
"తప్పు! ఏడవకూడదు" అన్నాడు ఆనందం.
"ఏడవక ఏం చేయమంటారు? పగబట్టిన పాములాగా నన్ను దురదృష్టం వెంటాడుతోంది, సార్! నాకు ఏదీ కలిసి రాదు. నేనేం చేసిన ఉల్టా రిజల్ట్! ఒళ్లు కుళ్ల బోడిచేడు. కదల్లెను. మీరు చేస్తున్న సాయానికి చేతులెత్తి నమస్కరించలేను ఒళ్లంతా కట్లే!"
"వద్దు ... ఇప్పుడు ఆ ప్రయత్నాలేమీ చేయవద్దు. పూర్తిగా రెస్టు తీసుకో!"
"లేదు, సార్! నా జీవితానికి రెస్టుండదు. సుఖముండదు, సంతోషముండదు. శాంతి అస్సలే ఉండదు."
"సత్యమూర్తి!"
"అంతే, సార్, అంతే! దేవుడు నా మొహాన అదే రాసిపెట్టేడు, నేను బంగారం ముట్టుకుంటే మట్టి గడ్డవుతుంది. రత్నాలు పట్టుకుంటే తాళ్లవుతాయి. నా చేతులు మంచివి కావు!"
"సత్యమూర్తీ!"
"ఎంతో మంచి మనసుతో అయిదు లక్షలిచ్చేరు. అవి నా చేతుల్లో పిచ్చి కాగితాలుగా మారిపోయేయి."
"జరిగింది మరిచిపో!"
"ఎలా మరిచిపోను, సార్? ఒకటీ, రెండూకాదు .... అయిదు లక్షలు! అదంతా మీ కష్టార్జితం. వద్దు, సార్! నా పెళ్లి చేయడం మీ వల్ల కాదని తెలిసిపోయింది!"
"అంత మాటనకు నా దీక్షదీపం ఆరిపోతుంది!"
"నాకు పెళ్లి చేయటమే మీరు దీక్షగా పెట్టుకుంటే - మీరు కూడా ...."
"వద్దొద్దు! ఇంకేం మాటాడోద్దు. రెస్టు తీసుకో!" అని ఆనందం లేచేడు. గది నుంచి వెళ్లబోతూ - "సింహాచలం!" అన్నాడు.
"చిత్తం!"
"సత్యమూర్తిని జాగ్రత్తగా చూసుకో!"
"చిత్తం!" అన్నాడు సింహాచలం.
ఆనందం అక్కడ్నించి తిన్నగా డాక్టర్ దగ్గరకి వెడుతుండగా అతనికి శారద ఎదురైంది. ఆమెను చూచి ఆగి"అమ్మాయ్!" అని పిలిచేడు.
శారద కూడా ఆగింది.
"నీ పేరు?"
"శారద."
"సత్యమూర్తిని చూడటానికి వెడుతున్నావా?"
"అవును."
"అతన్ని పరామర్శించడమే కాదు ... మీ పెళ్లి తప్పకుండా జరుగుతుందని దైర్యం కూడా చెప్పాలి!" అని హెచ్చరించి వెళ్లిపోయేడు ఆనందం.
వెళ్లిపోతున్న ఆనందం వేపు కన్నార్పకుండా చూస్తోంది శారద అప్పుడు శారడకి సత్యమూర్తి వివరించిన 'దేవుడు లాంటి మనిషి గుర్తుకొచ్చేడు.
"ఆయన పేరు ఆనందం గారు" అన్నాడు సింహాచలం.
"నువ్వు?" సింహాచలాన్ని చూస్తూ అడిగింది శారద.
"ఆనందం గారి గుమాస్తాని."
"అసలు మీరంతా ఎవరు?"
"సత్యమూర్తిగారి క్కావాల్సిన మనుషులం! రండి సత్యమూర్తిగారు మీ కోసం కలవరిస్తున్నారు!"
అని శారదను బెడ్ నెంబరు 43 దగ్గరికి తీసుకువెడుతున్నాడు సింహాచలం.
* * *
డాక్టర్ పశుపతి తల పట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
అతని ముందు ఆనందం కూచుని వున్నాడు. తనని చూచి గుర్తించి కూడా పలుకరించకుండా ఆలోచనా ముద్రలో వున్న డాక్టర్ పశుపతి మీద ఆనందానికి కోపం వచ్చింది.
పశువుల డాక్టరు మనుషుల డాక్టరైతే ఇంతే అని లోలోన విసుక్కున్నాడు ఆనందం.
"డాక్టర్!" అన్నాడు కొంచెం గట్టిగా.
డాక్టరు ఆ పిలుపుకి ఉలిక్కిపడి ఆనందం వేపు చూసేడు.
"సత్యమూర్తి పూర్తిగా కోలుకుని లేచి తిరగడానికి ఎన్నాళ్లు పడుతుంది?"
డాక్టర్ పశుపతి కొన్ని శబ్దాలు చేసేడు. అవి చాలా విచిత్రంగా వున్నాయి. పశువులను అదలిస్తున్నట్టు "చ్చో ... చ్చో .... చ్చో ... చ్చో... అయ్!" అనే శబ్దాలకు అర్థమేమిటో తెలీక ఖంగారు పడ్డాడు ఆనందం.
అంబా అన్నాడు డాక్టర్ పశుపతి ఆ తర్వాత - -
"నెల - నెల పదిహేను రోజులు పట్టొచ్చు!చ్చో!" అన్నాడు డాక్టర్ పశుపతి.
"వీల్లేదు. అతను వారం రోజుల్లో లేచి తిరగాలి!" అన్నాడు ఆనందం.
"చ్చో .. చ్చో ...!" అని డాక్టర్ పశుపతి తల అడ్డంగా తిప్పేడు.
"ఎంత ఖర్చయినా సరే!" ఆశ పెట్టేడు ఆనందం.
డాక్టర్ పశుపతి నెమరువేస్తున్నాట్టు నోరు కదుపుతూ, క్షణం ఆలోచించి నొక్కి నొక్కి అన్నాడు-
"పది! పదివేలివ్వగలరా?"
""పదిహేను ... పదిహేను వేలిస్తాను. సరిపోతుందా?"
ఆ రేటు వినగానే డాక్టర్ పశుపతి ప్రసన్న వదనంతో అన్నాడు-
"అంబా! పదిహేనిస్తే సరే! వారం రోజుల్లో లేపేస్తాను. అంబా!"
ఆనందం నిబ్బరంగా లేచి నిలబడ్డాడు. అక్కడ్నించి గబగబ వెళ్లిపోయేడు.
ఒక అనామకుడైనా రోగి మీద పదిహేను వేలు ఖర్చు చేసే అవసరం ఈ పెద్దమనిషికేమిటని డాక్టర్ పశుపతి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
* * *
ఇప్పుడు సత్యమూర్తి తల పక్కన శారద కళ్లోత్తుకుంటో కూచుని వుంది.
సింహాచలం కాఫీ కలిపే ఏర్పాటులో వున్నాడు. అంతలో ఆ గదిలోకి ఖంగారుగా వచ్చేడు పరమానందం.
పరమానందాన్ని చూచి సంహాచలం చేతులు జోడించేడు. ఎవరో పెద్దమనిషి కాబోలని శారద లేచి నించుంది.
శారదను చూస్తో అడిగేడు పరమానందం -
"నీ పేరు శారద కదూ!"
శారద ఆశ్చర్యంగా అవునని తలూపింది. ఇంతకుముందు ఆ పెద్దమనిషి కూడా తాను ఆయనకీ తెలిసినట్టే పలకరించేడు. ఇప్పుడీయన! ఎవరు వీళ్లు! సత్యమూర్తి చెప్పిన 'దేవుడులాంటి మనిషి' ఆ ఇద్దర్లో ఎవరై వుంటారు?
పరమానందం సత్యమూర్తిని పరామర్శిస్తున్నాడు -
"పెద్ద గండమే గడిచింది!"
"అవునండీ! ఏ ముహూర్తాన మీ పెద్దలిద్దర్నీ కలిసేనో గాని, ఆ నాటి నుంచి నా బతుకు గండాల్తోనే గడుస్తోంది!" అన్నాడు సత్యమూర్తి.
అతనిమాట పట్టించుకోకుండా అడిగేడు పరమానందం.
"పూర్తి ఆరోగ్యంతో లేచి తిరగడానికి ఎన్నాళ్లు పడుతుందన్నాడు డాక్టరుగారు?"
"అది కనుక్కోడానికే మా అయ్యగారు డాక్టర్ దగ్గరికి వెళ్లేరండి!" అన్నాడు సింహాచలం.
"అల్లాగా? మంచిది. రెస్టు తీసుకోవయ్యా, సత్యమూర్తీ!" అని పరమానందం ఆ గది నుంచి గబగబా బయటికి నడిచేడు.
శారద సింహాచలాన్ని తనతో రమ్మని సైగ చేసింది.
సత్యమూర్తి గదికి దూరంగా వున్న కారిడార్లో సింహాచలాన్ని అడిగింది శారద -
"ఈయనెవరు?"
"పరమానందం గారండి! ఈయన కంటే ముందు మిమ్మల్ని పలకరించిన పెద్దాయన పేరు -"
"ఆనందమన్నావు గదా!"
"చిత్తం!"
"అసలీ ఆనందం పరమానందం ఎవరు?'
సత్యమూర్తి గారికి క్కావల్సిన పెద్దమనుషులండి. మిగతా వివరాలు నన్నడక్కండి."
"నేను తెలుసుకోవాలి."
"చిత్తం! ఆ పెద్దల్ని అడిగినా చెప్పరండి!"
"ఎవర్నడగాలి?"
"దేవుడు చెరువు గట్టున స్వాముల వారు తిరుగుతుంటారు. వారిని అడిగితే పూర్తి వివరాలు చెబుతారు."


