శృతిమించిన అపశృతి
నేను కాలేజీలో చేరుతున్నాను..."
రాజారావు వంక చూస్తూ ఉత్సాహంగా అంది ఇందిర.
రాజారావు ఉలిక్కిపడ్డాడు. దెబ్బతిన్నట్లు ఆమె వంక చూశాడు.
ఇందిర అదేమీ గమనించలేదు.
"నాన్నగారు వప్పుకొన్నారు... సాయంత్రం నిన్నోసారి రమ్మన్నారు కూడా. వాకంతా కొత్తకదా! నువ్వే నన్ను తీసుకెళ్ళి చేర్పించాలి..."
రాజారావుకి కలవరం పుట్టుకొస్తోంది. చిరాగ్గా కిటికీలోనుంచి బయటకు చూడసాగాడు.
"రోజూ మనిద్దరం చక్కగా కలసి కాలేజీకి పోవచ్చు కదూ...."
"సరేలే! కాసేపు నన్ను రికార్డ్ రాసుకోనీ! తర్వాత మాట్లాడుకుందాంరా."
విసుగ్గా అనేసి ఏదో పుస్తకం తీసి రాయడానికి సంసిద్దుడయ్యాడు రాజారావు.
అతని విసుగు చూసి ఇందిర కొద్దిగా నిరుత్సాహపడింది.
"సరే రాసుకో - సాయంత్రం మాట్లాడదాం లే! మనం - గ్రూప్ ఏం తీసుకోవాలో కూడా నువ్వే చెప్పాలి మరి!"
రాజారావు ఏమీ మాట్లాడలేదు. తలవంచుకొని ఆమె మాటలేమీ విననట్లే నటించాడు.
ఇందిర మెల్లగా బయటకు వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిం తర్వాత రాజారావు రెండు చేతుల్తోనూ తలపట్టుకొని కూర్చుండిపోయాడు.
'ఇందిర కాలేజీలో చేర్తుంది. కాలేజీలో ముందస్తుగా తనే ఆమె నుంచి తప్పించుకు తిరగాలి . కాలేజీల ఆవరణలోగాని, రోడ్డుమీదగాని తనతో మాట్లాడొద్దని ఖచ్చితంగా చెప్పెయ్యాలి. లేకపోతే తనని కూడా అందరూ ఆటలు పట్టించేస్తారు. తనసలు మొదట్నుంచే ఆమెకు దూరంగా వుంటే బావుండేది. ఇందిరవాళ్ళు తమ ప్రక్కనున్న ఇంట్లో అద్దెకు దిగి నాలుగయిదేళ్ళు అవుతుందేమో! ఇందిరతో ఆ చుట్టు ప్రక్కల పిల్లలెవ్వరూ స్నేహం చేసే వాళ్ళుకాదు. ఒకరిద్దరు ఆడపిల్లలు తప్పితే మరెవ్వరూ ఆమెని దగ్గరకు చేరనీరు. మొహమాటం కొద్దీ తను ఇందిరతో మాట్లాడక తప్పటం లేదు. అంచేత ఇందిరకి తనంటే అభిమానం. ఏ విషయమయినా ముందుగా తనతోనే చెబుతుంది. ఇంతకీ భగవంతుడు ఇందిర నెందుకు ఇంత కురూపిగా సృష్టించాడో. ఆమె మొఖం వంక చూస్తూ ఓ నిమిషం కూడా మాట్లాడ బుద్దికాదు.
ఆ సాయంత్రం రాజారావు కోసం అతని ఇంట్లో కొచ్చింది ఇందిర.
'వాడలా బజారు వేపు వెళ్ళాడమ్మా!" అంది రాజారావు తల్లి.
ఇందిర నీరు కారిపోయింది.
"సాయంత్రం రాజారావుని పిలుచుకొస్తాన్నాన్నా.... మీరు మాట్లాడండి!" అని చెప్పింది తన తండ్రితో. తన కాలేజీ చదువు గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలనికొన్నారాయన. కాలేజీలో చేరడానికి తనెంతో గొడవ చేస్తేనేగాని ఒప్పుకోలేదాయన. మెల్లగా వెనక్కు తిరిగి తన ఇంట్లోకి నడిచిందామె.
"రాజారావు ఏదో పనిమీద బజారు కెళ్ళాట్ట నాన్నా... వచ్చాక పిలుచుకొస్తాను అంది తండ్రితో-
ఆయన సంగతి గ్రహించుకొని లోలోపలే బాధపడ్డాడు.
"అవును! ఇంత వికృతంగా ఉన్న ఆడపిల్లతో మాట్లాడ్డానికి ఎవరికి మనసొప్పుతుంది? నువ్వూ ఓ యువకుడివే రాజారావ్... నీది తప్పులేదు. ఒకోసారి అర్థం లేని పనులు చేసే భగవంతుణ్ణనుకోవాలి... అంతే!" అనుకొన్నారాయన.
"పోనీలేమ్మా... వచ్చాకే మాట్లాడదాం లే!"
రాత్రి రాజారావు భోజనం చేస్తూంటే ఇందిర వచ్చి వచ్చి గడపలో నుంచుంది.
"ఏయ్.... సాయంత్రం ఉంటానని వెళ్ళిపోయావ్ కదూ?"
"మర్చిపోయానిందిరా... ఆ సంగతి గుర్తులేదు" అన్నాడు రాజారావ్.
"అవును.... నే చెప్పేవేవీ నీకు గుర్తుండవ్..." అంది కోపంగా.
"ఛఛ! అదేం కాదు... కాసేపుండు వస్తున్నాను..........."
రాజారావ్ ఇందిర ఇంటికెళ్లేసరికి అప్పుడే థర్మామీటరు చూస్తున్నారాయన.
"ఇంకా జ్వరం తగ్గలేదాండీ!" అడిగాడు రాజారావు.
"ఫరవాలేదు... ఇవాళ నార్మల్ కి వచ్చేసింది..." అన్నారాయన.
కాసేపాగి "నువ్వో చిన్న సహాయం చెయ్యాలి బాబూ" ఇందిర కాలేజీలో చేరతానని గొడవ చేస్తోంది. నేను లేవలేని స్థితిలో వున్నాను. కాస్త నువ్వే అమ్మాయిని తీసుకుపోయి చేర్పించాలి...."
"అలాగేనండీ! రేపే చేర్పిద్దాము!" అన్నాడు రాజారావు.
"అమ్మాయ్.... కొంచెం మంచినీళ్ళు తేమ్మా....." అడిగారాయన.
ఇందిర లోపలికి వెళ్ళింది.
"బాబూ! రాజూ! ఇందుని అభిమానించే స్నేహితులెవరూ లేరు. అందుక్కారణం నీకు తెలుసు! దాని మనసు మంచిదేగానీ కొంచెం అనాకారి. నేను నిన్ను కోరేది ఒక్కటే. దాన్నెప్పుడూ అసహ్యించుకోకు. కనీసం దానికలా అనిపించనీయవద్దు. దానికి నీమీద అంత అభిమానం వుంది..." తరువాత మాట్లాడలేక పోయాడాయన.
"ఇందిర మంచినీళ్ళు తీసుకువచ్చింది.
మరి కొంచెంసేపనీ ఇవీ మాట్లాడిం తరువాత రాజారావు ఇంటికొచ్చేశాడు. అతని వెనుకే ఇందిర కూడా వచ్చింది.
"రేపెన్నింటికి వెళ్ళాలి మనం?" అంది ఉత్సాహంగా.
"తొమ్మిదింటికల్లా బయల్దేరాలి..." ముక్తసరిగా జవాబిచ్చాడు రాజారావు.
"సరే- నేను రడీగా వుంటాను. ఓ వేళ నన్ను మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోవు గదా?"
"ఛప్! మరీ అంత మతిమరుపను కొన్నావేమిటి?"
చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది ఇందిర.
ఆ రాత్రి చాలాసేపటివరకూ రాజారావుకి నిద్రపట్టలేదు.
"ఇందిరని తనవెంబడి తీసుకువెళ్తే, అందరూ తమిద్దరినే చిత్రంగా చూస్తారు. తన క్లాస్ మేట్స్ గొడవ చేసినా చేసేస్తారు. ఆ 'రంభ' ఎక్కడ దొరికిందిరా అని ఎగతాళి చేస్తారు - అంచేత ఇందిర నొక్కర్తెనే ముందు వెళ్ళి ప్రిన్సిపాల్ గది దగ్గర నుంచోమన్జెప్పాలి. అక్కడ తను కలుసుకొని ఇంటర్వ్యూ అయింతరువాత మళ్ళీ ఆమెను తప్పించుకోవచ్చు.
ప్రొద్దున ఎనిమిదిన్నరకల్లా ఇందిర తయారయిపోయి రాజారావు దగ్గరికొచ్చింది.
"చూశావా? నువ్వు తొమ్మిదంటే, నేను ఎనిమిదిన్నరకే రడీ అయిపోయాను!" అంది నవ్వుతూ.
రాజారావు ఆమెవంక పరీక్షగా చూశాడు.
"నీలంరంగు పరికిణీ, దానిమీద తెల్లని పువ్వుల ఓణి వేసుకొంది. నీలం జాకెట్టు ఇవన్నీ ఆమె యవ్వనాన్ని చాటుతోన్నాయ. కాని, అందాన్నివ్వలేకపోతున్నాయి. మరింక చూడబుద్ధికాక తల దించుకొన్నాడతను.
"ఇందిరా ఓ చిన్న పని చేస్తావూ?"
"ఏమిటది? విస్మయంగా చూసిందామె.
"నీకు కాలేజీ తెలుసు కదా? వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ గది దగ్గర నుంచో! నేను ఓ అరగంటలో సైకిల్ మీద వచ్చేస్తాను. ఏం?"
ఇందిర మారాం చేసింది.
"అలా ఎందుకు? నాకసలే కొత్త - నాతో రాకూడదేమిటి నువ్వు?"
"కుదరదు. మా స్నేహితుడింట్లో చిన్న పనుంది- వెళ్ళి అలా వచ్చేస్తాను. ప్లీజ్!"
ఇందిర అతని మొఖంలోకి ఓ క్షణం చూసి "సరే! నేను అక్కడే నీ కోసం - ఎదురు చూస్తుంటాను- మర్చిపోకేం?" అంటూ వెళ్ళిపోయింది.


