Home » Sri n t rama rao » Sri N T Rama Rao Prasangalu

 


            విదేశాల్లోని తెలుగు వారికి...


    
    సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతీ దీపికలు వెలిగించి మాతృభూమికి ఖ్యాతి ఆర్జించుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు ఆరుకోట్ల తెలుగు ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన యివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలులు.
    మీ మీ శేముషీ ప్రాభవంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర ప్రావీణ్యంతో, వివిధ విషయ పరిజ్ఞానంతో వివిధ దేశాలలో ఉన్నత పదవుల నలంకరించి, భగవంతుని అనుగ్రహంవల్ల లబ్ధ ప్రతిష్టులైన తెలుగు తల్లి గర్భశుక్తి ముక్తాఫలాలు మీరు. మీ కర్తవ్యదీక్ష, కార్యదక్షత, నీతి, నిజాయితీ, సంస్కారం, సహృదయత మీకు అక్కడి ప్రజలలో ప్రేమానురాగపూరిత గౌరవస్థానాలను ఆర్జించి పెట్టాయి-శాశ్వతంగా. మీతోపాటు మీ మాతృభూమికి కూడా వన్నెతెచ్చాయి-సమధికంగా.
    'ఏ దేశమేగినా ఎందు కాలిడినా'- ప్రబోధకవి రాయప్రోలు చెప్పినట్టు -తల్లినేలను మరువని మనీషులు మీరని నాకు తెలుసు. మరువ సాధ్యమా తెలుగు తల్లిని?
    ఏనాటిదీ తెలుగు తేజం?
    శాతవాహనులనాడే అలల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం. కాకతీయుల కరవాలాల కణకణలు దిగ్దిగంతాల ప్రతిధ్వనిస్తూనే వున్నాయి- 'విన నేర్చిన మనసుంటే వినవోయి తెలుగు బిడ్డా' - అంటూ.
    విజయనగర రాజవీధులలో, రతనాల రాసులుపోసి వ్యాపారం సాగించారట బేహారులు నాడు.
    'గాపట బీస టే చదివి గాథలు త్రవ్వు తెనుఁగువారికి' ఆదికావ్యాన్ని అందించాలని ఆంధ్రమహాభారత సంహితారచన బంధురుడయ్యాడ ఆదికవి నన్నయ్య ఆనాడు.
    ఆ మహనీయుడారంభించిన బృహత్ప్రయత్నానికి సాఫల్యంసాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా, నవరస మధు మందాకినిగా మలచాడు కవిబ్రహ్మ తిక్కన్న.
    'కాటుక కంటినీరు చనుకట్టు బయింబడ ఏల ఏడ్చెదో కైటభదైత్య మర్ధణుని గాదిలి కోడల!' కాసుకోసం కక్కుర్తిపడి నిన్ను కీచకుల కమ్ముకోనని బాసచేసి, కావ్య సరస్వతి నోదార్చి, భగవదర్పితంగా మహాభాగవతాన్ని రచించాడు భక్తపోతన.
    'తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువగా ఎరుగనే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తు శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు ఏనాడో. ఆ రసమయ స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర మహాంధ్రకావ్యం అముక్తమాల్యద.
    ఆటవెలదుల రోసి, ఆశుకవితలు దూసి అలవోకగా జీవితసత్యాలనందించాడు ఆటవెలదులతో తేట తెలుగులో అలనాడు వేమన్న.
    -అట్టి మహత్తర సాహితీ సంపదకు మనం వారసులం. ఆ మహా సారస్వత సంప్రదాయాలను ఎలా మరవగలం?
    త్యాగయ్య సుమధుర సంగీతలయవీచికా రవళులు-
    క్షేత్రయ్యసులలిత మొవ్వగోపాల శృంగార భక్తిమయ జావళీలు-
    అభినవ నటరాజు సిద్దేంద్రుని అంగాంగ భంగిమానంద లాస్యాలు, మంజుల మంజీరా విలాస్యాలు-
    అమరావతీ, లేపాక్షీ, రామప్ప దేవాలయాల అద్భుత శిల్పవిలాసాలు-
    అజంతా గుహలలో అపురూప రీతిలో తెలుగు చిత్రకారుల తూలికా విన్యాసాలు-పుణికి పుచ్చుకుని పునీతమైన జీవగడ్డ మనది.
    'కోహం' అన్న జిజ్ఞాసతో ప్రారంభించి, 'తత్వమసి' అన్న ఎరుకను సంపాదించి, 'అహం బ్రహ్మస్మి' అన్న స్థాయికి ఎదిగిన ఆధ్యాత్మిక భావసంపద మనది. 'తొలగు తొలగు ఛండాలుడా!' అన్న అహంకారాన్ని నిలవేసి 'తొలగవలసింది ఎవరు? అనిత్యమైన దేహమా, అనశ్వరమైన ఆత్మయా?' -అని ప్రశ్నించిన జ్ఞానం సమాధాన మిచ్చింది-చండాలోస్తు సతుర్ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమః-అని ఆదిశంకర భగవత్పాదుల అమర వాక్కులలో.


    జ్ఞాన సాక్షాత్కారాన్నందుకొన్న తథాగతుని ఆశ్రయించారు 'బుద్ధం శరణం గచ్ఛామి'-అని. ఆయన బోధలతో తెలివి తెచ్చుకుని స్వార్ధాన్ని జయించి సామాజిక దృష్టి నలవరచుకొన్నది 'సంఘం శరణం గచ్ఛామి'- అని. స్వార్ధరహిత సంఘసేవతో తరించి, ధర్మమే రక్ష అని గ్రహించారు 'ధర్మం శరణం గచ్చామి' - అని. 'మానవసేవే మాధవసేవ' యని చాటిన మహోన్నత మానవతా వాదం మనది. విశ్వజనీనమైన, విస్ఫారిత మైన, విశాల సమతా భావపూరితమైన నిండుమనసు మనది. కనుకనే 'త్రైలోక్యం మంగళం కురు' అంటూ భక్తి భావనలో భగవంతుని ఆమంత్రించారు మనవారు.
    'చిట్టి నాబొజ్జకు శ్రీరామరక్ష' అన్న సంకుచిత దృష్టితో సరిపెట్టుకోక సర్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షించారు. ఏ మతమైనా, ఏ నిజమైనా పురోగమించాల్సింది ఆ సమతావాదంవైపే, ఆ మమతావాదం వైపే.
    మన సమతావాదం మిధ్యా నినాదంగా మిగిలిపోలేదు. ఇంటింటా, వూరూరా కుటీర పరిశ్రమలతో, హస్త కళాకారుల నైపుణ్య దీప్తులతో వెలుగులు చిమ్మింది. అగ్గిపెట్టెలో చీరను అమర్చి ఐరోపాకు ఎగుమతి చేసిన అలనాటి అపూర్వ కళాకౌశలం మనది. ఖండ ఖండాలలో అఖండ వాణిజ్య సంబంధాలను నెలకొల్పిన ఐశ్వర్య విలసితమైన శోభా నిలయం మనది.
    అదంతా గత చరిత్ర.
    మరువలేని, మరపురాని తీయనిగాథ.
    ఆ మహోజ్వల వైభవాన్ని మరల చూడగలుగుతున్నాం-మీ అందరి విజయ సాధనలో.
    సస్యశ్యామలంగా, సర్వాంగ సుందరంగా, సమతా సంక్షేమ సమాజంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్న ఉత్సాహం ఉరకలెత్తుతోంది ఆరుకోట్ల తెలుగు ప్రజానీకం ఈనాడు ఒక్కటై కదిలింది కడలి తరంగంలా. తిరుపతి వెంకన్న ఘంటారావంతో సుప్రభాతం పాడింది. శ్రీశైలం మల్లన్న శంఖారావంతో చైతన్యం రగిలించింది. భద్రాద్రి రామన్న అభయ ముద్రలో పరవళ్ళు తొక్కింది. ఉవ్వెత్తుగా, ఉత్తుంగ తరంగంలా నింగి కెగసింది యువత. హారతులద్ది, తిలకాలు దిద్ది ఆహ్వానించారు నూతన వ్యవస్థను తెలుగింటి ఆడపడుచులు. సై సై నాదాలతో, జై జై నినాదాలతో స్వగతం పలికారు బాలబాలికలు కేరింతలతో. ఆ ఆదర్శం తోనే ప్రపంచ చరిత్రలోనే మరువలేని మధురఘట్టంగా, సువర్ణాక్షరాలతో లిఖించదాగిన మహోజ్వల సంఘటనగా అత్యధికమెజారిటీతో అధికార బాధ్యతలు అప్పగించారు-ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగుదేశానికి, యీ అన్నపై ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయతతో. నన్ను తను కలలు పండించే ప్రతినిధిగా, తమ ఊహలకు వాస్తవ రూపకల్పన చేసే సాధకునిగా ప్రజలు భావించారు. రామరాజ్య ప్రధాతగా ఊహించారు.
    అయితే-
    నేను ఒక సామాన్య మానవుణ్ణి. మీ అందరిలో ఒకడిని. నా జీవితాన్ని ప్రజాసేవకు ధారపోసి తరించాలని ఊహిస్తున్న ఒక మామూలు మనిషిని.
    తెలుగునేల నాలుగు చెరగులా సిరులు పొంగి పొరలాలని, తెలుగు ప్రజల బ్రతుకు బాటలలో వెలుగువానలు కురవాలని, అన్ని రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దు కొనాలని ఆదినుంచి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోంది- చిత్త శుద్ధితో, కర్తవ్య దీక్షతో పని చేస్తోంది- విరామ మెరుగని ఆచరణతో, వెనుకడుగులేని నిరంతర పురోగమనతో.
    ప్రజాభ్యుదయ దిశగా ఎన్నెన్నో సరికొత్త పథకాలు. సంక్షేమ దిశగా మరెన్నో నూతన కార్యక్రమాలు...... అమలు పరుస్తున్నాం- అవిశ్రాంతంగా.
    అయితే-
    ప్రజల భాగస్వామ్యంలేని ఏ కృషీ పూర్తిగా విజయవంతం కాదు. ప్రజల తోడ్పాటులేని ఏ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఎప్పుడూ అందివ్వలేదు. ఖండఖండాంతరాలలో ఉన్న మీరందరూ అండదండ లిస్తారని, తెలుగుసీమను అభివృద్ధి పథకాలతో అదరిస్తారని ఎదురు చూస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం.
    విదేశాలలో మాతృదేశ కీర్తి పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. పరాయి సీమలో తెలుగు కీర్తిచంద్రికలను దశదిశలా విస్తరింపజేస్తున్న విజ్ఞానజ్యోతులు మీరు. మీ మీ రంగాలలో, మీ మీ వృత్తులలో నిష్ణాతులై మీకూ, మీ మాతృభూమికీ, కీర్తి ప్రతిష్టలు సముపార్జించి పెడుతున్న విజ్ఞులు మీరు. మీరు, మీవెంట తీసుకొని వెళ్ళినది మీ విజ్ఞానం, సామర్ధ్యం, ప్రతిభావ్యుత్పత్తులు మాత్రమే కాదు- అశేష తెలుగుభాషా, సంస్కృతీ, సంప్రదాయాలను; మన జాతి ఔన్నత్యాన్ని; అమూల్య చారిత్రక వారసత్వాన్ని మీ వెంట తీసుకొని వెళ్ళారు. మీరు మన సంస్కృతికి నిజమైన రాయబారులు. మీ ఆనందాలకు, మీ విజయాలకు మా హృదయాల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. మేము మిమ్మల్ని తలచుకొని గర్విస్తున్నాం.
    ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక సరికొత్త చైతన్య సాహసయాత్ర ప్రారంభమయింది. రాష్ట్రాన్ని ఫ్యాక్టరీల శంఖారావాలతో, యంత్రచక్రాల నిరంతర పరిభ్రమణంతో చైతన్యమాయం చేయడానికి పెద్దయెత్తున కృషి సాగించేటందుకు అంకురార్పణ జరిగింది.
    రాష్ట్ర పారిశ్రామికీకరణ దిశగా ప్రస్థానం ప్రారంభమయింది. ఈ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలి. ఈ కృషిలో సహాయ సహకారాలను అందించడానికి మీరందరూ ముందుకు రావాలి.
    పారిశ్రామికీకరణ ద్వారానే లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించగలం. పారిశ్రామికీకరణ ద్వారానే మన శక్తి సామర్ధ్యాలను ప్రయోజనకరమైన మార్గంలోకి మళ్ళించగలం. పారిశ్రామికీకరణ ద్వారానే ప్రకృతి ప్రసాదించిన అపారవనరులను వినియోగించుకొని అష్ట్రైశ్వర్యాలను సృష్టించుకోగలం. శాంతి పూరితమైన, అభ్యుదయకరమైన, సౌభాగ్య విలసితమైన జాతిని, పటిష్టమైన దేశాన్ని నిర్మించుకోగలం.


    మీలో కొంతమంది ఎన్నో ఏళ్ళక్రితం స్వరాష్ట్రాన్ని, స్వదేశాన్ని వదలి వచ్చి వుండవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతున్నదో ఏమిటో మీకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి నావారికోసమే యీ పరిచయం.
    సంప్రదాయానికి, ఆధునికతకు మేలి కలయికగా, సుసంపన్నమైన సాంసృతిక విలువలకు, అభ్యుదయకరమైన దృక్పథాలకు చక్కని సమ్మేళనంగా అవతరిస్తోంది నేడు ఆంధ్రప్రదేశ్. దక్షిణాది ధాన్యాగారంగా, ఆసేతు హిమాచలానికి అన్నపూర్ణగా అందుకున్నది అందరి మన్ననలను అత్యుత్తమ స్థాయిలో. ఎరువులు, రసాయనిక కర్మాగారాలు అవతరిస్తున్నాయి పెద్ద ఎత్తున యిక్కడ. ఎలక్ట్రానిక్ కర్మాగారాలు సముదాయాలు తలెత్తుతున్నాయి-కొత్త రూపంలో, కొంగ్రొత్త రీతుల్లో పెద్ద ఎత్తున సిమెంటు ఫ్యాక్టరీలు, బ్రహ్మాండమైన థర్మల్, జల విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు రూపొందుతున్నాయి యీ గడ్డమీద. అత్యాధునికమైన భారీ ఉక్కు కర్మాగారం, అవతరిస్తోంది విశాఖలో.
    -ఇలాంటివి ఎన్నో.....ఎన్నెన్నో......ఇంకెన్నో.....మరెన్నో-రాష్ట్రం నలుచెరగులా నవ్యరీతుల్లో రూపాలు దిద్దుకొంటున్నాయి. ఇవన్నీ మన రాష్ట్రం సాధించిన సాంకేతిక విజ్ఞానవ్యాప్తికి సంకేతాలు. ప్రగతికి చిహ్నాలు. మన ఆధునిక దేవాలయాలు. భవిష్యత్ ఆశాసౌధాలు.
    పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ సాధించినది ఎంతో ఉన్నా, యింకా సాధించవలసినది మరెంతో వుంది. విదేశాల్లో వుంటున్న మీరు మీ విజ్ఞాన వెల్లువను, ప్రతిభాసామర్ద్యాలను, మీ వనరులను యిక్కడ మేము చేస్తోన్న మా యీ కృషివేపుకు మళ్ళించగలరు- మీరు తలచుకొంటే, అనుకుంటే, ప్రపంచంలోని ఉత్తమ సాంకేతిక ప్రతిభను యిక్కడకు తీసుకొనివచ్చి,ప్రగతి పరిధులను విస్తరించి ఆంధ్రప్రదేశ్ ను ఒక పటిష్టమైన, అగ్రగణ్యమైన పారిశ్రామిక శక్తిగా రూపొందించే కృషిలో తోడ్పడవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాను.
    రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు లభించగలవని ఆశిస్తున్నాను. అత్యాధునిక పారిశ్రామిక ప్రగతికి ఆహ్వానిస్తున్నాను మిమ్మందరినీ. చిరకాలంగా మనం కంటున్న కలలకు సమీప భవిష్యత్తులో సుస్టిర రూపకల్పన చేసేటందుకై మనమంతా ఒక్కటై చేయి చేయి కలిపి పరిశ్రమిద్దాం, పరిక్రమిద్దాం.
    అవిగో! వినిపిస్తున్నాయి
        -అలనాటి విజయధ్వానాలు
    అవి కావాలి నేటి వైతాళిక గానాలు
    అదిగో-ఆశ్వాసిస్తోంది-
        అమరకవి గురజాడ కంఠం
    'దేశమనియెడి దొడ్డ వృక్షం
    ప్రేమలను పూలెత్తవలెనోయ్
    నరుల చెమటను తడిసి మూలం
    ధనం పంటలు పండవలెనోయ్!'
    ఆరుకోట్ల తెలుగు ప్రజల ఆశీస్సులతో, మీ అందరి అండదండలతో తెలుగునాడును వెలుగునడుగా తీర్చిదిద్దుకోవాలన్నది నా తీయని కల. ఆ సురుచిర, సుమధుర స్వప్నాన్ని తొందరలోనే నిజం చేసుకోగలమన్న దృఢ విశ్వాసం, ఆశాభావం నాకున్నాయి.
    అదిగో-క్రాంతి కల్పవల్లి, తెలుగుతల్లి నా కన్నులముందు కదలాడుతోంది- మిరుమిట్లు గొలిపే కాంతులు వెదజల్లుతూ.
    పంటకాలువలతో, పచ్చని పైరులతో, పసిడి పంటలతో పాలు తేనెలు పారే భాగ్యసీమగా పరిమళిస్తోంది. పారిశ్రామిక ప్రగతి పతాకాలతో పరిఢవిల్లుతోంది. సంతృప్తి వెల్లివిరుస్తున్న శ్రామిక, కార్మిక, కర్షకజనాళి జైజై ధ్వానాలతో పరవశిస్తోంది.
    అరుగో! పసుపు కుంకుమలతో పచ్చగా నిండుగా వున్న మన ఆడపడుచులు సుమధుర మందహాసాలతో, మంగళారతులతో స్వాగతం చెబుతున్నారు.
    నేటి తన ప్రభావానికి కారకులైన తన ముద్దుబిడ్డల విజ్ఞానాన్ని, మేథాశక్తిని, మేథభక్తిని చూసి మురిసిపోతోంది తెలుగుతల్లి చిరునవ్వులు చిందగా, నిండుగా, నిండువగా.
    ఇదే ఇదే నేను ఆకాంక్షించే తెలుగు సీమ
    ఇదే నేను మీనుండి కోరే సహకారం
    ఇదే నా వాంఛితం
    ఇదే ఇదే ఇదే నా ధ్యేయం.
    స్వస్తి ప్రజాభ్య? పరిపాలయంతాం
    న్యాయేన మార్గేన మహిం మహీశాం
    గోబ్రహ్మణేభ్య? శుభమస్తు నిత్యం
    లోకాసమస్తా సుఖినోభవంతు
    
                జై తెలుగునాడు - జై హింద్

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra