Home » Sri n t rama rao » Sri N T Rama Rao Prasangalu

 


                    అడుగడుగున కనిపించాలి భగవానుడు


    
    ఈ మహా పర్వదినాన కైంకర్యమైన మనస్సుతో స్వామిని మనసులో అహర్నిశలు ధ్యానించుకుంటూ నలుమూలలనుండి విచ్చేసిన భక్తవారేణ్యులకు పూజ్యులకు, పెద్దలకు, సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మతం అన్నది ఈ నాటిదికాదు. ఎప్పుడో మానవుడు పుట్టినప్పుడే మనస్సులో మెదిలినటువంటి పవిత్రభావము మతము. నాకన్నా శక్తి ఈ ప్రపంచంలో యేమున్నదో దానిని నేను ఆరాధిస్తాను. అదే నామతము అనేటటువంటి రోజులవి. ఎన్నో యుగాలక్రితం సృష్టి తర్వాత మానవుడు మానవుడిగా పరిగణించబడటానికి పరిపూర్ణమైన ఆకృతిని రూపొందించటానికి నీతిదాయకమైన సామాజిక పరమైన సంస్కారాత్మకమైన జ్ఞానం అతని మనస్సులో ఉద్భవించడానికి ఎన్నో యుగాలు గడిచాయి. కాబట్టి ఏ మతాన్ని మనం ఆరాధించాలి అనేది మన విజ్ఞానానికి, స్ఫూర్తిగా అనుగుణంగా మనం నిర్ణయించుకోవాల్సిన విషయం. ఏ భగవంతూడూ మతాన్ని గురించి చెప్పలేదు. కేవలం శిష్ట రక్షణ దుష్ట శిక్షణకోసం 'సంభవామీ యుగేయుగే'-అని "ఏ యుగములోనైనా సరే అధర్మం ఎప్పుడైతే పెచ్చుపెరిగిపోతుందో. అన్యాయం ఎప్పుడైతే మితిమీరుతుందో, దుర్మార్గం ఎప్పుడైతే అన్నిటికంటే సర్వవ్యాప్తంగా వస్తుందో అప్పుడే ఆ దుష్టులను శిక్షించటానికి శిష్టులను రక్షించటానికి నేను అవతరాన్ని ఎత్తుతాను" అని చెప్పాడు గీతా వాక్యాలుగా అది స్వరూపుడైన పరమాత్మ. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి బోధించిన సత్యాలు మానవులలో మానవులకు భేదాలులేవు, సర్వసమాజం ఒక్కటే, భేదాలు లేనటువంటిసమానమైనటువంటి సమాజం కావాలిమనది అని. తనకు నల్గురుఅన్నదమ్ములు పుట్టారు కాని ఆయన ఏమన్నాడు గుహుడ్ని చూసి నపుడు-నాయనా గుహా! నీతో మేము ఐదుగురము సోదరులము అన్నాడు ఆయన. అదే విధంగా సుగ్రీవుడిని చూసినపుడు- 'నాయనా సుగ్రీవా! నీ విరహమేమిటో నాకు తెలుసు. నీకు జరిగిన అన్యాయమేమిటో నాకు తెలుసు. ఆ దుర్మార్గాన్ని నేను ఖండిస్తాను. మేము యిప్పటికి ఐదుగురు సోదరులం అయినాము. యీనాటితో ఆరుగురం కాబోతున్నాము అన్నాడు ఆ మహానుభావుడు. అదేవిధంగా విభీషణున్ని చూసినపుడు 'నీ సోదరుడు నీమీద ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో నాకు తెలుసు కాబట్టి నీకు సరియైన ధర్మరక్షణ కలిగిస్తాను. నీతో మేము ఎదుగురం సోదరులం అన్నాడు ఆయన. ఒకాయనజ్ఞాని, ఒకాయనేమో వన్యజాతిలో ఉన్నటువంటి ఒక మర్కట స్వరూపుడు సుగ్రీవుడు. అట్టడుగున ఉన్నటువంటి బడుగువర్గాల ప్రతినిధి ఒక పల్లెకారు. మరి వీరందరిని కూడా సోదర భావంతో తమతో చేరదీసుకున్నాడంటే ఆయన స్వరూపం ఏమి చెప్పింది. సమాజంలో ఏమయినా భేదాలు ఉన్నాయని చెప్పిందా? మీరే ఆలోచించండి ఒకసారి. ఏవి పనికివస్తాయో, మన స్వార్ధానికి ఉపయోగపడతాయో వాటినిమాత్రం మనం ఉంచుకుంటున్నాం, మిగిలినవాటిని మనం చెప్పకుండా ఎగురవేస్తున్నాం- కేవలం అసూయతో స్వార్ధంతో అని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు రామచంద్రమూర్తి ధర్మపరాయణుడైనటువంటి భగవత్ స్వరూపుడు అని చెప్పుతాం కాని సర్వమత సమన్వయ, సామాజిక సంస్కర్త అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం ఆలోచించమని మీ అందరికి సవినయంగా మనవి చేస్తున్నాను.
    ఆ తరువాత కృష్ణపరమాత్ముడు వచ్చాడు. కృష్ణపరమాత్ముడు వచ్చినప్పుడు ప్రపంచంకూడా మారింది. ఆనాడు త్రేతాయుగంలో ఉన్నటువంటి పవిత్రత తగ్గిపోయింది. శబరి రామచంద్రమూర్తిని లాలించిన విధానం, ఆమె ఎంగిలి పండ్లను ఆ మహానుభావుడు నిండు ఆదరంతో, ఆప్యాయతతో ఆరగించిన విధానం, జటాయువుకు సంస్కారం చేసిన విధానం ఆ మార్గాలన్నీ కూడా పోయాయి. ధర్మం మూడు పాదాలుగా నడిచే మార్గం పోయి రెండు పాదాలతో నడచే ద్వాపరయుగం వచ్చింది. ఆ ద్వాపరంలో కేవలం ధర్మం, న్యాయంకంటే లౌక్యం, తెలివి తేటలు పెరిగాయి. కొంచెం రాజకీయం ఎక్కువయింది ఆనాడు. ఆయన చెప్పుకున్నాడు నేనే దేవుడనని, యిక దానికి అడ్డేలేదు. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణంవ్రజ' అని. అన్నిటిని వదలి నన్నే శరణుజొచ్చు, రక్షిస్తానన్నాడు. అసలు నీవెవరు? నిమిత్తమాత్రుడివి. నీ విద్యుక్తధర్మాన్ని నీవు చేయి. చేయించేవాడ్ని నేను. ఆ ఫలితాన్ని యిచ్చే వాడ్నికూడా నేను కాబట్టి సర్వం నేనే, నేనే భగవంతుణ్ణి అని చాటి చెప్పుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆనాటికది అవసరం అయింది. ఎందుకంటే ఎప్పుడైతే అర్జునుడు మాయామోహితుడై ఈ ప్రతిబంధాలకు దాసుడై, అంతా నావాళ్ళు, నా సోదరులు, నా తాతలు, తండ్రులు, వారిని నేను చంపలేను అని అస్త్రసన్యాసం చేసినప్పుడు, చేయడానికి నీవెవరు, చేయించేవాణ్ణి నేను అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
    ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరస్వామి కలియుగంలో వేంచేసారు. ఈ కలియుగంలో మానవులకు మోక్షం ఇవ్వడానికి ప్రత్యక్షంగాం వెలసినటివంటి దేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి. కలియుగంలో ఆచరణ అక్కరలేదు. తపస్సు అక్కరలేదు. స్మరణచేస్తే, ఆ వెంకటేశ్వరస్వామి స్మరణచేస్తే చాలు పాపాలన్నీకూడా పోతాయనిచెప్పి ఆ భగవంతుడికి, ఆ ఏడుకొండల మీద ఉన్న స్వామికి మనవారు ఒక విధమైనటువంటి సమన్వయపరమైన భక్తి దాయకమైన అర్ధం చెప్పారు. కాబట్టి ఈ వెంకటేశ్వరస్వామి ఈనాడు ఆరుకోట్ల ఆంధ్ర అశేషప్రజానీకానికే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులవారికి, అనేక మతాలవారికి, అనేక కులాల వారికి అందరికీకూడా ఆదర్శవంతమైనటువంటి దేవుడయ్యాడు, ఆరాధ్యుడయ్యాడు. కాబట్టే ఏనాటికానాడు స్థలమహత్యం పెరుగుతోంది. స్వామి ప్రభావం వెలుగుతున్నది. అందుకే ఆదాయంకూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నది. కాబట్టి అటువంటిస్వామి దీక్షలో, ఆరాధనలో తరింప వలసిన బాధ్యత మనందరికీ ఉన్నదని నేను మనవి చేస్తున్నాను.
    ఆయన కలియిగంలో పుట్టాడు గనక మాయామోహితాలు మాత్రం ఆయన నుంచి దూరం కాలేదు. ప్రేమ ఉన్నది. పెండ్లి జరిగింది ఆయనకు. మీకందరకూ తెలుసు. పర్వతరాజు కుమార్తెను పద్మావతీ దేవిని ఆయన శ్రీనివాసుడుగా పరిణయం ఆడాడు. కాని ఆ తర్వాత సవతులపోరుకూడా తప్పలేదు మహానుభావుడైనప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవికి.
    ఇక్కడ మహత్తరమైనటువంటి మనకు ఆదర్శం తిరుపతిక్షేత్రం. ఎందుకంటే ఎంతోమంది దాడులు చేశారు. ఎన్నో మహామహా శక్తి వంతమైన దేవాలయాలను కూడా ఛిన్నాభిన్నం చేశారు. మహా ప్రసిద్ద వంతమైటువంటి ఆ సోమనాథాలయాన్ని కూడా వదలలేదు. ఈ వెంకటేశ్వరస్వామికి సంబంధించి ఎవరూ ద్వేషభావంతో ఆ స్వామిని చూడలేదే. ఆ స్వామి సన్నిధికి దురుద్దేశంతో వెళ్ళలేదే. ఎవ్వరూకూడా దేవాలయానికి హాని చేయలేదే. అదే ఒక పవిత్రమైన విశేషభావంగా మనం గుర్తించాలని, ఆ స్వామి ప్రభావాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను.

    
    ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు. ఎన్నో మార్పులు కూడా చేశారు. కాని, మన ఈ తిరుమల స్వామి దేవాలయాన్ని వారు తాకలేదు. ఏ మాత్రం విగ్రహానికి మలినం కల్గించలేదు. అటువంటి పవిత్రత స్వామిలో ఉన్నదని మరొక్కసారి భక్తబృందానికి మనవి చేస్తున్నాను.
    మీకందరకి తెలుసు. ఈనాడు సమాజ సంక్షేమానికి అంకితమైన ప్రజాస్వామ్య విధానానికి అనుగుణ్యమైనటువంటి పరిపాలన జరిగితీరాలి. ఇంతడబ్బు స్వామికి వస్తుందన్నారు. ఎక్కడినుంచి వస్తుంది? భక్తపరాయణులైన సామాన్య మానవులు, స్వామివారు తామనుకున్నది కలుగజేసారని, ఆశీర్వదించారని భక్తి భావంతో యిచ్చిన ముడుపులు, హుండీలో వేసిన డబ్బులు యివన్నీ. ప్రజలనుంచే స్వామికి అందుతున్నది, కాబట్టి ప్రజా స్వామ్యానికి ఆరాధ్యుడైన దేవత వెంకటేశ్వరుడే. ప్రత్యేకంగా ఆయన ఏడుకొండలమీదే ఉంటున్నాడంటే నేను నమ్మను. ఏడుకొండలమీద ఎక్కి కూర్చుంటే అక్కడే ఉండేవాడు. అందరి హృదయాలలో ఈనాడు ఉండేవాడు కాదు. ఈ అఖిల భారతంలో కాకుండా యితర దేశాలలో కూడా వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తున్నారంటే ఆయన నా నిర్వచనంలో ఒక దైవమూర్తి అయినటువంటి ప్రజా ప్రతినిధి. ప్రజలకు కలిగిన కష్టాలను, వారికి ఉన్న యిబ్బందులను ఈనాడు ప్రభుత్వం ఏ విధంగా గమనించాలో అదేవిధంగా ఆయన ఆ అతస్థునుండి ఎప్పటికప్పుడు గమనిస్తూ, తన భక్తులకు అందరికీ ఎప్పుడు కూడా శ్రేయోదాయకమైన వాతావరణాన్ని కలిగిస్తుండే దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వరస్వామి.
    ఈ దేవాలయ నిర్మాణమైన తర్వాత శివాజీ మహారాజుగారు వచ్చి ఇక్కడ స్వామికి కైంకర్యాలు, పూజలు, కానుకలు సమర్పించాడు. అదే విధంగా కర్నాటకాంధ్ర మహా సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు వచ్చి వారికి సేవలు చేశాడు. అదేవిధంగా స్వామివారి ఎదుట తెరతీయగరాదా అని సుమధుర సుస్వరాన్ని గానం చేశాడు ఆనాడు త్యాగరాజు. అటువంటి మహనీయులందరూ పునీతం చేసినటువంటి పుణ్యక్షేత్రం యిది. 
    తెరతీయగరాదా అనేదానిలో అర్ధం ఎంతైనా ఉన్నది. ఈనాడు మనం చూస్తున్నాం సుప్రభాతానికి వెళ్ళినప్పుడు తెర తొలగిస్తారు. స్వామిని మనకు ప్రత్యక్షింపచేస్తారు. అది భౌతికపరమైన తెర. మానవుని కళ్ళకున్నటువంటి మాయ తెరను తొలగించి మహానుభావుడైన నిన్ను దివ్యంగా చూసేటటువంటి ఆ పరివర్తన మానవ హృదయంలో వచ్చేట్టు చేయు స్వామీ అని ఆరాధించడం కూడా కావచ్చు. అది ఆధ్యాత్మికభావన. ఏమో మహానుభావుల హృదయాలలో ఏమేమి ఉన్నదో కాని ఎప్పటికప్పుడు ఆ స్వామి యొక్క ఆరాధనలో పునీతమైనటువంటి మహానుభావులు వారందరూ.
    బుద్ధుడు ప్రవచించాడు "సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి" అని. సంఘం శరణం గచ్చామి అని ఎందుకు అన్నాడు? నువ్వు సంఘంలో పుట్టావు, సంఘం చేత మనిషిగా గుర్తింపబడ్డావు, ఏ సంఘంలో నువ్వు మనిషిగా గుర్తింప బడ్డావో ఆ సంఘానికి ఎప్పుడూ నువ్వు బద్దుడవే. సంఘానికి శరణు జొచ్చాలి అన్నాడు. ఈనాడు మనిషి జన్మ ఎత్తినటువంటి ఒక జీవి, తన తల్లి ఎవరో పెళ్ళాం ఎవరో తెలుసుకోగలిగిన విచక్షణా జ్ఞానం ఉన్న మనిషి ఎప్పటికప్పుడు ధర్మబద్ధుడు కూడాను. ఎప్పుడైతే మానవుడు మానవ జన్మ ఎత్తాడో, సమాజం చేత ఒక మనిషిగా గుర్తింపబడ్డాడో ఆ మానవుడు ధర్మబద్దుడుకూడ అయ్యాడు. కాబట్టి ధర్మానికి మనం శరణుజొచ్చటం తప్పదు అన్నాడు ఆ బుద్ధభగవానుడు. బుద్ధమంటే ఏమిటి? బుద్ధభగవానుడు తాను దేవుడనని చెప్పుకోలేదు-కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా. బుద్ధమంటే ఆలోచన. మంచి మనిషికి మంచి ఆలోచన రావాలి. నేను మంచిపని చేయాలి. సమాజ శ్రేయస్సు కోరాలి. నేను నాకున్నటువంటి ఈ యొక్క విజ్ఞాన విశేష ప్రభావాలన్నిటిని కూడ సమాజ క్షేమానికి సమాజం శ్రేయస్సుకు అంకితం చేయాలి అని అనుకునే వ్యక్తికి సరియైనటువంటి భావన, ఆలోచన రావాలి. దుష్టమైన ఆలోచన రాకూడదు. దొంగతనం చేద్దామనో మరొకటి చేద్దామనేటటువంటి అప్రాచ్యమైన ఆలోచన లేకుండా తాను సంఘానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తి కావాలి. అదే బుద్ధం శరణం గచ్ఛామి.


    ఆ తరువాత ఎందరో ధర్మయోగులు వచ్చారు- వీరబ్రహ్మేంద్ర స్వామి వంటివారు. వారందరూ కూడ ఏమి చెప్పారంటే కేవలం దేవుడంటే ఎక్కడో లేడు నువ్వు చేసే భజనలోను, మెక్కే ప్రసాదాలలోను దేవుడు లేడు. దేవుడనేవాడు నీ ఆత్మలోనే ఉన్నాడు. అదివరకు వేదాంత పరమైనటువంటి నిర్వచనం దేవుడికి యిచ్చాడు. ఆత్మ సంయమనంతో కూడినటువంటి ఆ ఆత్మస్వరూపుడు భగవంతుడు అన్నాడు. దానికి దీనికి ఎంతో చక్కని పోలిక ఉంది.
    దేవుడనేవాడు మీ మనసుల్లోనే వున్నాడు. కాని అది తెలుసుకోలేని మూఢత్వంతో, మమకారంతో, ఆశలతో, స్వార్ధంతో మానవుడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ఈనాడు తనలో ఆ దేవుడిని చూడగల్గినప్పుడు, తన ముందున్న వారి అందరిలో కూడా దేవుడిని చూడగల్గినప్పుడు ఆ మానవుడు ఎప్పుడు యిక తప్పుచేయలేడు. అటువంటి ఆలోచన రాదు. అటువంటి విజ్ఞానపరమైనటువంటి ఆలోచనలను మనం పెంపొందించుకోవాలి.
    కేవలం మతమనేది మన ఒంటికి పూసుకున్న బురద. ఈ కులమనేది కేవలం పశుత్వంతో మనం అనుకున్నతువంటి ఒక భావం. కులం లేదు, మతం లేదు, మానవులందరూ ఒక్కటే. అందరిలోనూ దేవుడు న్నాడు. అటువంటి సరియైన మానవతా వాదానికి మనందరం కైంకర్యం కావాలి, అంకితం కావాలి.
    అందరిని బిడ్డల్లా చూసుకొనే ఆ భగవంతుడు కొంతమందిని పస్తుఉండమంటూ కొంతమందిని కేవలం పంచభక్షపరమాన్నాలు తినమంటూ ఆశీస్సులు అందించడు. ప్రతివారికి తనపేర మేలు జరగాలనే దివ్యమైన భావన ఆ దేవదేవుడిలో వుందనే నేను నమ్ముతున్నాను-ఆయన భక్తుడిగా. ఎన్నో కార్యక్రమాలు ఈనాడు దేవస్థానంవారు చేపడుతున్నారు. విద్యా వ్యవస్థలు ఏర్పరుస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఊరు ఊరు వాడ వాడ స్వామి యొక్క ఈ దివ్య క్షేత్రాలు ఆలయాలుగా కట్టిస్తున్నారు. ఎన్నో కళ్యాణమండపాలు ఏర్పరుస్తున్నారు. ఎంతో మహత్తరమైన ప్రజాస్వామ్య విధానాలకు వారు అంకితమౌతున్నారు. ఈనాడు ప్రత్యేకంగా మీకు మనవి చేసేది ఏమిటంటే నేను ఈ తిరుపతి శాసనసభ్యుడిగా ఎన్నుకోబడివుండటం నా అదృష్టం. ఎప్పటికీ నేను స్వామికి సన్నిహితున్ని, స్వామికి అంకితుడ్ని- అని మరొక్కసారి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను.
    ఈ తిరుపతి క్షేత్రం దివ్యక్షేత్రం. ఎంతో మహత్తరమైన పవిత్ర స్థలంగా మనందరమూ దీనిని రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ స్వామికి వస్తున్న యీ ఆదాయాన్ని మానవ కళ్యాణానికి వాడటం మనందరి యొక్క అభిమతం కావాలని నేను మనః పూర్వకంగా కోరుకుంటున్నాను. అందుకే నేను కొన్ని నిర్మాణకార్యక్రమాలు చేపట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాలు ఈ సదస్యులముందు తెలియజేయటం యీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికి తెలియపర్చటం నా విధ్యుక్తధర్మంగా నేను భావిస్తూ వాటి నన్నిటిని ఈనాడు ప్రకటిస్తున్నాను.
    వెంకటేశ్వర ఆధునిక విశిష్ట చికిత్సాలయాన్ని యిక్కడ ఏర్పాటు చేద్దామనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. చికిత్సకై మనవాళ్ళు యితర దేశాలకో, యితర రాష్ట్రాలకో వెళ్ళటం అప్రతిష్టాకరం. అటువంటి ఆధునిక చికిత్సా విధానాలను మనం ప్రోత్సహించటం, పేదప్రజలకు అందించడం మనయొక్క విధ్యుక్తధర్మంగా భావిస్తూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి యిక్కడ వెంటనే ఒక 5 కోట్ల వ్యయంతో నిర్మించటానికి నిర్ణయం తీసుకొన్నామని మనవి చేస్తున్నాను.
    వికలాంగులు ఎందరో ఉన్నారు మనలోపాపం. పూర్వజన్మ పాపపరిపక్వం అంటామా, లేకపోతే విధిరాత అంటామా....కొంతమంది సోదరులు అంధులై అవయవాలు లేక మన ముందు నిరాశ్రయులుగా జీవితం గడుపుతున్నారు అంటే వారికేదైన చక్కని ఒక మార్గం, జీవితాన్ని గడుపుకునేటట్టు ఒక విధానం కల్పించటం మన అందరి ధర్మం. మనం తింటేచాలదు. మనం అనుభవించితే చాలదు. మన ప్రక్కన లేనివాడిని, అవిటివాడిని చేరదీసి చేయూతనిచ్చి మనతోపాటు నడిపించ గలిగినవాడే మానవత వెల్లివిరుస్తుంది. మన ధర్మం మనం నెరవేర్చిన వారమౌతామనే భావంతో ఈనాడు 1కోటి వ్యయంతో శ్రీ బాలాజీ వికలాంగుల సంక్షేమ సంస్థ ఒకటి యిక్కడ ఏర్పాటు చేయబడుతుందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అవిటివారికి, వారికి పోయిన అవయవాలను జైపూర్ విధానంలో తయారుచేసి యివ్వటమే కాకుండా వారిజీవనాన్ని సక్రమంగా గడుపుకోవటానికి, భ్రుతిని సంపాదించుకోవడానికి అనువైనటువంటి ఒక వృత్తివిద్యావిధానం కూడా బోధించబడుతుంది. వారి జీవితానికి ఒక వెలుగు చూపబడుతుంది. అదే విధంగా టి.టి.డి. రక్త నిధి ఒకటి ప్ర్రారంభించాలి అనుకుంటున్నాము. యిక్కడకు వచ్చే భక్తులు కూడా రక్తదానాన్ని చేయదలచినవారు చేస్తే అది ప్రాణరక్షణకు ఉపయోగించబడుతుంది. అటువంటి రక్త నిధిని 5లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేయడానికి ఈనాడు నిర్ణయం తీసుకోబడింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కేవలం పరమాత్ముడికి దండం పెడితేనే భక్తులు కారు.మానవతాదృక్పథంతోపాటు మానవుడికి సాయపడటమే మానవతా ధర్మం. మానవసేవే మాధవసేవగా నిరూపించబడ్డది ఎందరి మహనీయులచేతో. కాబట్టి ఈ మానవసేవ కూడా మాధవసేవగా ఒక కైవల్యానికి దారితీసేటటువంటి పవిత్ర విధానంగానే ఉండబోతుందని భక్త బృందానికి, భక్త శ్రేష్టులకు, భక్త వరేణ్యులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. తిరుపతి మహాపట్టణం ఒక నిశ్శబ్దమైన ఒక పవిత్రమైన స్థలంగా భక్తులకు యిది అంతరాయం కలిగించకుండా ఉండే విధంగా లారీలు పెద్దవాహనాలు ప్రక్కగా వెళ్ళేవిధంగా ఒక రింగురోడ్డు వేసి, ట్రాఫిక్ ఆ రింగు రోడ్డు మీదుగా వెళ్ళాలి తప్ప కేవలం పట్టణంలో ఉన్నటువంటి ప్రశాంతిని భంగం కల్గించకూడదు, ఎవరికీ ఏ ఆపద కల్గించకూడదు అనే ఉద్దేశంతో 32 కి.మీ. రింగురోడ్డును 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించటానికి నిర్ణయం తీసుకోబడింది.


    ఈ పవిత్ర క్షేత్రాన్ని అతి ఆరోగ్యవంతంగా, నిర్మలంగా వుంచడం, పరిశుభ్రంగా ఉంచుకోవటం మనధర్మం. నాడు డ్రైనేజీలన్నీకూడా ఈ రోడ్లమీదే ఉన్నాయి. ఆ మురుగు నీరంతా రోడ్లమీదకు వస్తుంది. ఒకవిధమైన దుర్గంధం, ఒక విధమైన అనాగరిక విధానం ఈనాడు మనం చూస్తున్నాం. వెంటనే రు.3 కోట్ల వ్యయంతో తిరుపతిపట్టణానికి డ్రైనేజి స్కీమును కూడ చేపట్టాలనే నిర్ణయం తీసుకోబడింది.
    వృత్తివిద్యా పరమైనటువంటి ఆధునిక విద్యావిధానంతో, వారికి సరియైనటువంటి విజ్ఞానాత్మకమైన బోధనా దృక్పథంతో, వారి భవిష్యత్తుకు ఉద్దీపమైన ఒక వృత్తి పరమైనటువంటి విద్యతో వారిని సంస్కరించాలనే భావంతోనే ఈనాడు ఈ తిరుపతి దివ్యక్షేత్రంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పరచడం జరిగింది. వేంకటేశ్వరుని విశ్వవిద్యాలయం ఉన్నది. దాని ప్రక్కనే అమ్మవారిపేరిట పద్మావతి విశ్వవిద్యాలయం ఉండాలి అని నేను భక్తిభావంతో యీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సోదరీమణులందరికీ నేను మనవి చేస్తున్నాను.
    ఈనాడు ఆర్ధికంగా చితికివున్నవారికి కానీ, పేదవారికి కానీ, సరియైన విజ్ఞానాత్మకమైన విద్యాబోధనం, లలితకళలో శిక్షణ, అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ఆ దేవి పేరిట స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయంలో వారికి తగిన వృత్తిపరమైన విద్యను స్వీకరించి, వారి జీవితాలను స్వతంత్రంగా తమ కాళ్ళమీద వారు నిలబడేటటువంటి శక్తితో మహిళలందరూ రూపొందించబడాలని నా కోరిక. ఒకనాటి పల్నాటినాగమ్మ కాదు, ఈనాడు రాణిరుద్రమ్మ కాదు, తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడబడుచు ఒక రాణిరుద్రమ్మగా ఈ దేశానికి ఉద్దీపన కలిగించే ఒక జ్యోతిగా వెలగాలని నా పరిపూర్ణమైన విశ్వాసం. డానికే మేము దోహదం చేస్తున్నామని మనవి చేస్తున్నాను.
    ఇకపోతే తిరుపతి దివ్యక్షేత్రాన్ని చాలాకాలం బాలాజీ జిల్లా అనీ అదీ ఇదీ అనీ, ఏదో రూపం దిద్దాలని అనుకుంటున్నారు పెద్దలందరూ. కాని ఈనాడు నా భావన అంతకుమించి పైకే వెళ్ళింది. వాటికన్ సిటీ అని మీరు చదివే ఉంటారు ఇంగ్లీషు చదివేవారు, అది పవిత్రమైనటువంటి క్రైస్తవ మహానగరంగా, పవిత్రమైన స్థలంగా రూపొందించబడింది. ఈనాడు వెంకటేశ్వరస్వామి కేవలం ఆంధ్రులకే కాదు. ఇతర రాష్ట్రాల వారిచేత, అందరిచేత ఆరాధించబడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుని క్షేత్రం, అటువంటి పవిత్రత కలిగించబడిననాడే మనకి బాగుంటుంది.
    ఈనాడు కేవలం ఎవరి యిష్టం వచ్చినట్టు వారు ఈ క్షేత్ర అధికారాన్ని వినియోగించటం- అటు ప్రభుత్వం కానివ్వండి యిటు అధికారులు కానివ్వండి వారి వారి స్వభావాలను బట్టి భావాలను బట్టి వినియోగించటం-మంచిది కాదని నాభావన. అటువంటి దివ్యక్షేత్రానికి దివ్యత్వం మనం కల్పించాలి. కాబట్టి ఈ తిరుపతిక్షేత్రాన్ని బాలాజీదివ్యక్షేత్రంగా నేను రూపొందించాలని అనుకొంటున్నాను. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతివ్యక్తికి అడుగడుగునా ఆ భగవానుడు కన్పించాలి. అటువంటి పవిత్రత రూపొందించాలి. ఈనాడు ప్రతి ఒక్కరు వుద్వేగమైన భక్తిభావంతో, పని శ్రద్ధతో, ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనం పని చేసినప్పుడుకానీ మనం అనుకున్న ఆలోచనలకు ఒక రూపం ఇవ్వలేమని, అటువంటి ఆలోచనలకు మీ అందరూ కూడా తోడ్పడాలని ప్రతి ఒక్కరికి నేను  విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానం స్వర్ణోత్సవాలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
    
    తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవాల సందర్భంగా 1984 ఏప్రిల్ 22న చేసిన ప్రసంగం

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra