"ఓ గాడ్! ఉదయం నుంచీ కరెంటు లేకపోతే నా పని ఏమయ్యేది? త్వరపడాలి" అనుకుంది. కరెంట్ వస్తే వెలుగు దేనికని అన్ని గదుల్లో స్విచ్ లని ఆఫ్ చేసింది.
తలుపు కంతలోంచి బ్యాగ్ ని, పెట్టెని ముందుగా బయటకు నెట్టి, వంగి తలుపు కంతలోంచి తానూ బయటకొచ్చింది నందితాదేవి.
సాయంత్రం దాటి రాత్రి ప్రవేశించబోతున్నది. చెట్లమీద పక్షులు కువ కువలాడుతున్నాయి.
తలుపుకడ్డంగా క్రోటన్స్ చెత్తకుండీలు వుంచి నాలుగు మొక్కలు పీకి తలుపుకంత ఏ మాత్రం కనిపించకుండా కప్పింది.
బ్యాగ్ చంకకి తగిలించుకుని సూట్ కేసు చేతిలోకి తీసుకుంది. స్వేచ్చాజీవిలా హాయిగా ఊపిరి పీల్చి ముందుకు అడుగు వేసింది నందితాదేవి.
అప్పటికింకా కరెంటు రాలేదు.
13
ఈ హోటల్ నుంచి మకాం మార్చి మరో హోటల్లో దిగటానికి, వేరే పనిమీద రాజు బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే జాగ్రత్త అంటూ మరీ మరీ హెచ్చరించి వెళ్ళాడు. కొద్ది ఆలస్యం అయినా భయపడవద్దని చెప్పాడు.
"జాగ్రత్తగా వుండడం నాకు తెలియదా ఏమిటి? ఒకటికి పదిసార్లు చాదస్తం మగడులా చెప్పిందే చెప్పి వెళతాడు, నేనేం పసిపిల్లనా? ఆపదలో ఎలా మెలగాలో ఆ మాత్రం నాకూ తెలుసు.ఆ మాత్రం ధైర్యం, తెలివితేటలు నాకూ వున్నాయ్..." అటూ ఇటూ పచార్లు చేస్తూ అనుకుంది నందితాదేవి.
"అక్క ఎక్కడికెళ్ళింది. ఎలా వుందో? పృధ్వీరాజ్ మాత్రం ఎక్కడికెళ్ళినట్లు! టూర్ మీద పృథ్వి అప్పుడప్పుడు తిరుగుతుంటాడు. అలా వెళితే తనకి చెప్పిగాని వెళ్ళడు. చెప్పటానికి వీలు లేకపోతే ఎప్పటిలాగానే కబురుచేస్తా..."
దడ దడ తలుపు చప్పుడయింది.
"రాజు వచ్చాడా!" ఆతృతగా అటు అడుగులేసిన నందితాదేవి చటుక్కున ఆగిపోయింది. "ఇప్పుడే వెళ్ళి యిప్పుడే ఎలా వస్తాడు?" అనుకుంది.
మరోసారి దడదడలాడింది తలుపు.
"వచ్చింది ఎవరైతేనేం. తలుపు తీయటం ముఖ్యం. లోపలికి ఆహ్వానించకుండా అటునుంచి అటే పంపాలి" అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.
ఎదుటి దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది ఆమె.
రూపాయంత కుంకంబొట్టు జరీ చీర, ఆమె నుంచొని వుంది. బొట బొట కన్నీరు కారుస్తున్నది, "నా గీత సరీగా లేదు అమ్మాయ్!" అంది కన్నీరు తుడుచుకునే ప్రయత్నం చేయకుండానే.
ఆమె చెప్పేది అర్ధంగాక అయోమయంగా చూసింది నందితాదేవి.
"ఈ వయసులో ఆయన మారిపోతాడనుకోలేదు. యాత్రలకని కిందటి నెల పదిహేను మా వూరునుంచి బైలు దేరామా! మొన్న మొన్నటిదాకా బాగానే వున్నారు. ఇంతలో..."
ఆమె చెపుతూనే వుంది. నందితాదేవి ఎదుటిరూమ్ బైట తాళంవేసి వుంది. "ఇష్, తర్వాత మీ కష్టం గురించి చెపుదురుగాని. కారిడార్ చివరిరూంలో వుంటున్నామని చెప్పి మొన్న ఎదుటి రూంలో దూరారేమిటి?"
"నేను ఆ రూంలోకి వెళ్ళటం చూశావా?" ఆమె కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
"కళ్ళారా చూశాను. మీరు చాలా సేపటిదాకా ఆ రూంలోంచి రాలేదుకూడా" జేమ్స్ బాండ్ ఫోజు పెట్టి చెప్పింది.
"రూం మాటలు విన్నావా అమ్మాయి?"
"వినలేదు. అసలు మీరెవరు! మీ వుద్దేశ్యం ఏమిటి?"
"అమ్మాయి! సాటి ఆడదానిగా నా కష్టం వింటావనుకున్నానుగాని ఇలా దబయిస్తావనుకోలేదు. ఎదుటి గదిలో వుంది ఎవరో తెలుసా? మావారి స్నేహితుడు కన్నాలాల్ -చాలా చెడ్డవాడు. ఏ చెడ్డవాడయినా మా సంసారం జోలికి వస్తాడనుకోలేదు. యాత్రలు చేస్తూ ఇక్కడ దిగామని మావారు చెప్పారు.


