ఓ సాయంత్రం రామకృష్ణ అతన్తోబాటు కాటేజికి వచ్చాడు. ఎదురుగా వున్న ఇంట్లో శైలజ వుండటం చూసి ఫణిని అభినందించాడు.
"కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్! అప్సరసలాంటి ఆడదాన్ని ఇంటికెదురుగా కట్టేసుకున్నావు. అనుక్షణం నీకు నేత్రపర్వమేననుకో. అబ్బ! ఆ కళ్ళు, ఆ చెంపలు, ఆ మెడ, ఆ......."
ఫణి చేతిలో గ్లాసు క్రిందపడి బద్దలయింది. వాస్తవానికి కసిగా నేలకేసి కొట్టాడు.
"ఏం బ్రదర్!"
"చెయ్యిజారి క్రింద పడింది."
"ఏం బ్రదర్! ఎప్పుడయినా నీవంక చూస్తూ ఉంటుందా?"
"నేను ఆ అమ్మాయి గురించి పట్టించుకోను."
"ఎందుకని? ఆమె నీకు నచ్చలేదా? లేక పరాయి ఆడవాళ్ళ జోలికి పోవటం నీకిష్టంలేదా?"
"రెండూనూ."
ఎదురుగా వున్న ఇంట్లో శైలజ అటూఇటూ మెసలటం కనిపిస్తోంది.
"ఆమె అలా కదుల్తోంటే నా గుండెల్లో ఏం జరుగుతున్నదో తెలుసా?"
ఈసారి అల్మరాలోవున్న ప్లేటు క్రిందపడి బద్దలయింది.
"వాట్ బ్రదర్?"
"అంచున వున్నట్లుంది, క్రింద పడింది."
"పోతే పోయిందిలే వెధవ ప్లేటు. ఎదురుగుండా బాదంహల్వా పెట్టుకుని ప్లేటుగురించి ఆలోచించటం అవివేకం. బ్రదర్! చూడు, చూడు. చేతిలో చీరె పట్టుకున్నది, డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుందేమో...."
స్టెయిన్ లెస్ స్టీల్ కంచం క్రిందపడి 'ధన్'మని చప్పుడుచేసింది.
రామకృష్ణ ఆ విషయం గమనించకుండా "అయ్యో, తలుపులు మూతపడ్డాయి బ్రదర్!" అన్నాడు విచారంగా.
* * *
ఒక ఆదివారం సాయంత్రం రామకృష్ణ వచ్చి బలవంతం చేస్తే ప్లానిటోరియం చూడటానికి వెళ్ళాడు.
విజయవాడలో ఇంత అపురూపమైన నక్షత్రశాల ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా దాని విలువ ఎవరూ గ్రహించటంలేదు. మొత్తం దేశంలోనే నాలుగయిదుకంటే ఎక్కువలేవు. దక్షిణ భారతంలో వున్నది ఇది ఒక్కటే.
సాయంత్రం ఆరున్నరకు ప్రదర్శన మొదలయింది. బాగా చీకటి. కళ్ళు కనబడటం లేదు. ఆ చీకట్లోనే ఆలస్యంగా వచ్చిన ఎవరో ఇద్దరు ఫణి ప్రక్కనున్న కుర్చీల్లో కూర్చున్నారు.
తర్వాత సాయంసంధ్య సాగినట్లు పలుచని కాంతి వ్యాపించింది. అచ్చం సాయంత్రంలాగే వున్నది.
ఫణి ప్రక్కకిచూసి ఉలిక్కిపడ్డాడు. శైలజ! ప్రక్కనే కమలామణి కావచ్చు.
శైలజ కూడా అతన్ని గమనించింది.
తర్వాత వాతావరణమంతా చీకటి ఆవరించింది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి.
వ్యాఖ్యాత చెబుతున్నాడు:
"రాత్రివేళ మీరు డాబామీద పడుకుని ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించేవి, లెక్కించగలిగేవి - అయిదువేల నక్షత్రాలు. కానీ నిజానికి యివి పదివేల కోట్లవరకూ ఉంటాయి. ఇదంతా కలిసి సోలార్ ఫ్యామిలీ - గెలాక్సీ అంటారు.
ఈ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు పదివేల కోట్లవరకూ ఉంటాయి. ఇవన్నీ కలిసి యూనివర్స్ అవుతుంది."
ఎన్నో విచిత్రమైన విషయాలు చెబుతున్నాడు.
నక్షత్రాలన్నీ మండే గోళాలు.
అన్నిటికన్నా దగ్గరగా వున్న నక్షత్రం సూర్యుడు.
భూమి సూర్యుడి చుట్టూ గంటకి అరవైమైళ్ళవేగంతో తిరుగుతూ వుంటుంది.
ఉత్తరాన కాంతివంతంగా వెలిగే ఆ నక్షత్రం ధృవతార. ఆ నక్షత్రం ఎప్పుడు దిక్కుమారదు. ఉత్తరానే ఉంటుంది.
ధృవుడిచుట్టూ సప్తఋషి మండలం పరిభ్రమిస్తూ ఉంటుంది. క్రతుహు, వుల్హ, పౌలస్త్య, అత్రి, అంగీరస, వశిష్ట, మరీచ వీటిని సప్త ఋషులంటారు.
వీటిలో వశిష్టుడి దగ్గర మిణుకు మిణుకుమనే నక్షత్రం - అరుంధతి.
వాఖ్యాత జోక్ చేశాడు. "పెళ్ళయిననాటి రాత్రి నూతన దంపతులు ఈ అరుంధతీ నక్షత్రాన్ని చూడాలట. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే దృష్టిదోషం వున్న వారికి ఈ మిణుకు మిణుకుమనే నక్షత్రం కనిపించదు. అందుకని వధూవరులకి దృష్టి సరిగ్గా వున్నదో లేదో తెలుసుకోవటానికి ఇది ఓ పరీక్ష అట.
మీలో ఎవరయినా పెళ్ళయినవారు వుంటే పెళ్ళప్పుడు సరిగ్గా చూడకపోయి వుంటే, ఇప్పుడు చూడండి, అరుంధతీ నక్షత్రం.
ఫణి తన్మయంగా చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయాడు.
"తనూ, శైలూ నక్షత్రం మండలంలో విహరిస్తున్నారు."
తను మనిషి. నక్షత్రంలో శైలు అరుంధతీ నక్షత్రంలో కూర్చున్నది.
అరుంధతి - వశిష్టుడ్ని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని అన్నివేల నక్షత్రాల మధ్య ప్రయాణంచేస్తుంటే అందులో ఆసీనురాలై వున్న శైలుకూడా ఒక నక్షత్రంలా మెరిసిపోతూ తనని వెంబడిస్తూన్నది.
అలా ఎంతదూరం! ఎన్ని యుగాలు!
కానీ కాలం తెలియటంలేదు.
యుగాలు పుడుతున్నాయి, పోతున్నాయి.
తామిద్దరూ అంతం అనేది లేకుండా అలా కదుల్తూనే వున్నారు. అంత్యంత సమీపంలో వుంటుంది. కానీ పూర్తిగా కలసిపోదు.
"శైలూ, శైలూ, శైలూ!"
రామకృష్ణ భుజంతట్టి లేపుతూంటే మెలకువ వచ్చింది. "ఏమిటి బ్రదర్! అంత దీర్ఘాలోచనలో వుండిపోయావు? లే, పైకి గాంధీహిల్ కి కూడా వెళ్లివద్దాం."
ఫణి తెలివి తెచ్చుకుని చూశాడు. శైలజ ప్రక్కనలేదు. తలుపు వైపు చూశాడు. ఆమె కమలామణితో బయటకు వెళ్ళిపోతుంది.
ఫణి లేచి నిలబడ్డాడు.
ఇద్దరూ బయటకు వచ్చారు.


