"ఆ....ఆ....." అన్నాడు సూర్యారావు అప్పుడే బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు బావా."
"పాపం మంగ విషయమే." అన్నాడు సూర్యారావు.
"తలుచుకుంటే నాకు బాధగా ఉంది బావా! ఎవడికి పుట్టిందో మాయరోగం."
"ఆ మధ్య అప్పయ్య పీకదాకా తాగి పక్కింటిరాములు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తాగిన మైకంలో రాములు పెళ్ళాన్ని కూడా నానాకూతలు కూశాడట, అప్పుడు రాములు "ఎప్పుడో నీరోగం కుదురుస్తాను అప్పిగా అన్నాడట కదా!" సూర్యారావు అన్నాడు.
"అయితే ఏమిటి?"
"ఏముంది రాములే మంగని చంపాడేమో?"
"ఛా... ఛా... మరీ వింతగా మాట్లాడుతున్నావు బావా! రాములికి ముక్కుమీద కోపం వుంది కానీ చంపేటంత కక్ష మనిషి కాడు. వెళ్ళి చూద్దామా?"
అయిష్టంగానే "ఊ...." అన్నాడు సూర్యారావు.
"మీకు వంట్లో బాగుండలేదు కదా" గుర్తు చేసింది మాణిక్యాంబ.
"చాలావరకు తగ్గిందిలే" అన్నాడు సూర్యారావు పడక్కుర్చీలోంచి లేస్తూ.
"ఏమిటి బావా నలత."
"మాడుపోటు, అరికాళ్ళు మంటలు."
"అన్నీ వేడి పదార్దాలు తిని వుంటావు అవునా బావా?"
"తిన్న దిమటుకు నేనే. వండింది మటుకు మీ అక్క. ఆవపెట్టి పనసపొట్టుకూర, గుత్తొంకాయ కూర, గోంగూర పులుసు, వెల్లుల్లి ఖారం పచ్చడి. అన్నీ అగ్నిహోత్రావధానులుగారి బిడ్డలే." చొక్కా వేసుకుంటూ సూర్యారావు చెప్పాడు.
"చెయ్యమన్నది మీరు, పేరునాది." అంది మాణిక్యాంబ.
పుల్లారావు నవ్వాడు.
ఇరువురూ బయలుదేరుతుండగా మాణిక్యాంబ అడిగింది.
"మంగని ఎలా చంపారు? ఏ ఆయుధంతో చంపారు!" పుల్లారావు ఏం చెపుతాడోనని సూర్యారావు చూచాడు.
"తెలియదు. వెళ్ళిచూస్తేగాని - " చెప్పాడు పుల్లారావు.
ఎలా చంపారన్నది ఆనోటా, ఆనోటా పుల్లారావు విన్నాడు. కానీ తెలియదనేశాడు. కారణం మంగని ఎవరో మాణిక్యాంబతో మంగని చెరిచారు అని చెప్పలేక మాట మార్చాడు పుల్లారావు.
సూర్యారావు, పుల్లారావు కొండదగ్గరికి వచ్చేసరికి తీర్థ ప్రజల్లా కొండ దగ్గర జనం.
ఇద్దరూ కొండ ఎక్కారు.
మంగ శవం గుహలోనే వుంది. అందరూ శవానికి కాస్త దూరంగానే వున్నారు. ఏడుస్తున్న మంగతల్లీ తండ్రి, చెల్లెళ్ళనీ వాళ్ళ వాళ్ళు దూరంగా వుంచుతున్నారు బలవంతంగా.
మంగ శవాన్ని ఎవరూ ముట్టుకోలేదు. కదిలించే ప్రయత్నం కొద్దిగా కూడా చేయలేదు. దానికి తగిన కారణం వుంది. ఆ మధ్య ఉరుముకొండలో హత్యలు జరిగాయి. మొదట అవి హత్యలు అనుకోలేదు, అందువల్ల పోలీసులు రాలేదు. తర్వాత హత్యలకి పోలీసులు రంగప్రవేశం చేశారు.
"ఇదివరకు పరిశోధనకి వచ్చినవాళ్లు ప్రమాదంతో మరణించారని మీరే నిర్ణయించి దహనం చేశారు. అది నేరం. మొదటి తప్పుగా వూరుకుంటున్నాము. ఇహపై ఏదన్నా జరిగితే శవాన్ని ఎవరూ ముట్టుకోవద్దు. కదిలించటం, సరిచేయడం ఏదీ చేయకూడదు. మాకు కబురుచేస్తే వెంటనే మేము వచ్చి చూస్తాము. చిన్న పిచ్చిపనిచేసినా నేరంలో మీరూ యిరుక్కుంటారు." అని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. అందువలన ఎవరూ మంగ శవాన్ని ముట్టుకోలేదు.
సూర్యారావు, పుల్లారావు మంగశవాన్ని దగ్గరగా నుంచుని చూశారు.
మంగరెండు కళ్ళూ తెరుచుకుని వున్నాయి. నోరు కొద్దిగా తెరుచుకుని వుంది. నాలుకని పదునయిన ఆయుధముతో చీరేసినట్లు వుంది. మంగశవం పక్కనే రాయివుంది. ఆ రాతితో చేతులమీదా, కాళ్లమీదా బలంగా మోదినట్లు తెలుస్తున్నది. బహుశా రేప్ చేస్తుంటే అవరోదించకుండా వుంటుందని చేతులు కాళ్ళు పనిచేయకుండా రాయితో కొట్టినట్లు వుంది. శరీరంమీద బట్టలు వున్నాయి. అయితే అవి తొలగి వున్నాయి. నాలుక చీలికయినా, కాళ్ళు చేతులూ పనిచేయనంతగా దెబ్బలు తగిలినా. శరీరం మలినం అయినా బహుశా మంగ బతికేవుండి ఉంటుంది. మంగవేసుకున్న ఓణిని మంగ మెడచుట్టూ బిగించి చివరికి హంతకుడు హత్యచేసి వుంటాడు.
మంగ శవాన్ని చూస్తూంటే ఎవరూ చెప్పకుండానే ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థమవుతున్నది.
ఇంతవరకూ ఉరుముకొండలో జరిగిన హత్యలన్నీ మొగాళ్లవే, మొదటిసారిగా ఓ ఆడకూతురి హత్య జరిగింది. నిండా పదకొండు ఏళ్ళు లేవు ముక్కు పచ్చలారని బాలిక అనొచ్చు.
మరణం ముందు మంగ ప్రత్యక్ష నరకం ఎంత అనుభవించిందో శవాన్ని చూస్తుంటే తెలుస్తున్నది.
అక్కడ ఆడవాళ్ళకన్నా మొగవాళ్ళు ఎక్కువమంది వున్నారు.
ఆ ఊరి ఆడపిల్ల అందరికీ తెలుసిన అమ్మాయి. మంగ శవాన్ని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆడవాళ్ళే కాదు కొందరు మగవాళ్ళు కూడా.
పుల్లారావు కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు.
మంగ శవానికి కాస్తయివతలగా చిన్న వస్తువుని సూర్యారావు చూశాడు. చూస్తూనే గతుక్కుమన్నాడు. లోలోపల కంగారు, భయము. అందరి ఎదుటా దానిని తీయటానికి లేదు. వంగి చేతిలోకి తీసుకుంటే అది చూసిన ప్రతివాళ్ళకీ అనుమానం వస్తుంది.
నిజమే!
అలా అని అక్కడ వదిలేస్తే పీక్కి చుట్టుకుంటుంది. దాన్ని తక్షణం మాయం చెయ్యాలి.
ఎలా?
సూర్యారావు ఆలోచించాడు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే భుజాన వున్న కండువా సరిచేసుకొని రెండడుగులు ముందుకు వేశాడు. వేసి ఆగాడు.
మంగశవాన్ని దగ్గర నుంచి మరింత పరీక్షగా చూస్తున్నట్లుగా చూస్తూ కాస్త వంగాడు.
భుజాన వున్న కండువా జారి పొరపాటున పడ్డట్టు కిందపడింది.
కండువా కింద పడినందుకు విసుక్కున్నట్లుగా ముఖం పెట్టి కండువాని చేతిలోకి తీసుకున్నాడు.
ఆ కండువాతో తానే కిందపడ్డ బుల్లి వస్తువుని చాకచక్యంగా చేతిలోకి తీసుకున్నాడు సూర్యారావు. ఇంక దానిని దాయాలి. కండువాతో కళ్ళు వత్తుకున్నట్లు నటిస్తూ ఆ వస్తువుని చల్లగా జేబులోకి జారవిడిచాడు. ఆ తర్వాత ఇవతలికి వచ్చాడు.


