"సరేలే వెళదాం పద. అవతల చాలా ఇళ్ళల్లో పాల ప్యాకెట్లు ఇవ్వాలి"
"ఒరేయ్ ఈ తాళం పెద్దది. కొత్తదిరోయ్"
"అయితే ఏమంటావ్? అమ్మగారు కొత్తది కొనకూడదా?"
"అయితే అయి ఉండవచ్చు. నే కాదనటం లేదుకదా?"
"ఒరేయ్! ఒరేయ్! తలుపుకి చాలా సన్నని పగులు వుందిరోయ్- ఇంట్లో దీపం కూడా వెలుగుతున్నట్లుంది. కొద్ది కాంతి లేదూ?"
"ఉంది. అయితే ఏమంటావ్? అమ్మగారు లైటు తీయటం మర్చిపోయి వుంటారు. వెధవ గోల. అన్నీ నీకే కావాలి"
"అయితే అయి ఉండవచ్చు. నే కాదనటం లేదు కదా! చెప్పటమూ తప్పే? సరే పద"
ఇద్దరు మగవాళ్ళ మాటలు దూరమయ్యాయి.
"బాప్ రే!" అనుకుంటూ అంతవరకు స్థాణువులా నేల కతుక్కుపోయి నుంచున్న నందితాదేవి అక్కడనుంచి కదిలింది.
"వచ్చింది పాలవాళ్ళన్నమాట. ఇరువురిలో ఒకడు సిసింద్రీ ఇంకా నయం. అనుమానంతో పదిమందినీ పిలుచుకు రాలేదు. పాలు వచ్చాయంటే తెల్లవారు జాము కూడా దాటివుంటుంది. పగలు తను బైటికెట్లా వెడుతుంది! ఈ పగలంతా లోపల ఎలా వుంటుంది? ఇంక ఎందరు జాస్మిన్ కోసం వస్తారో? లైటు తీసేస్తే తనకి ఇబ్బంది. లైటువుంటే మరో ప్రమాదం. జాస్మిన్ శవంనుంచి వాసన బైలుదేరవచ్చు. బైటగాలి లోపలికి రాక లోపలిగాలి బైటికిపోక- భగవాన్."
నందితాదేవి ఓ పక్క గాభరాపడుతూ పెరటివేపు వంటింటి కిటికీ కొద్దిగా తెరిచి బైటికి చూసింది. కొద్దిపాటి వెలుగు నలుపక్కలా ఆక్రమించుకుని తెల్లవారి పోతున్నది. నిట్టూర్పు భారంగా వదిలి కిటికీ మళ్ళీ మూసేసింది.
జాస్మిన్ వున్న ముందు గదిలోలైటు ఆర్పేసి తలుపు దగ్గరగా వేసింది. బెడ్ రూమ్ లోకి వెళ్ళాలన్నా వంటింట్లోకి వెళ్ళాలన్నా ముందు గదిలోంచే దారి. వంటింట్లోవున్నా, బెడ్ రూమ్ లోవున్నా జాస్మిన్ వున్నవైపు తలుపు వేసుకోవాలి అనుకుంది. ఏదువాసనలాంటి వాసన జాస్మిన్ శవంమీంచి. ఇంక ఈ వాసన ఎక్కువయిపోయి భరించరానంత దుర్గంధం ఏర్పడుతుంది. తను భరించి బతకగలదా? ఆలోచనలు మనసుని పురుగులా తొలిచివేస్తుంటే తన పని తాను కానిస్తున్నది నందితాదేవి.
అన్వేషణ ఫలించింది.
స్టోర్ రూములో ఓ మూలగా వున్నది చిన్న కిరసనాయిలు డబ్బా.
నందితాదేవికి పోతున్న ప్రాణం లేచినట్లయింది.
మెరుస్తున్న కళ్ళతో అటుకేసి నడిచింది.
అప్పటికి తెల్లగా తెల్లవారిపోయింది.
11
ఇతను ఏమి నేరంచేసి జైలుకెళ్లాడు? ఎన్నిసార్లు అడిగినా చెప్పడేం? దొంగతనంలాంటి చిన్న నేరం అయితే చెప్పేవాడే. స్మగ్లింగ్, విదేశీయులకి భారతదేశపు గుట్టుమట్టు చెప్పే దొంగ గూఢచారి కిడ్నాపింగ్ లేక హత్య బాబోయ్ హత్య, అంటే హంతకుడు. నందితాదేవి గదిలో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నది.
పృధ్వీరాజ్ అడ్రస్ తీసుకుని రాజ్ బైటికి వెళ్ళాడు. చదువుకోడానికి కొన్ని మాగ్జయిన్స్, ఓ సినిమా పత్రిక టీపాయ్మీద పడివున్నాయి. వాటి ముఖం చూడలేదు వందనాదేవి.
హోటలు గదిలోంచి బైటికెళుతూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ మరీ హెచ్చరించి వెళ్ళాడు రాజ్.
"గదిలోంచి బైటికి రావద్దు. కొత్తవాళ్ళు కావాలని పలకరిస్తే ముక్తసరిగా జవాబుచెప్పి తలనొప్పి అనే నెపంతో గదిలోకి వచ్చెయ్. బొంబాయి మహానగరం గురించి నీకు తెలియదు. ఎవరిగోల వాళ్ళది. అడుగడుగునా ఆగంతకులు ఎదురవుతుంటారు. నే రావటం ఆలశ్యం అయితే మరీ తోచకపోతే కాసేపు ఈ కారిడార్ లో తిరుగు అక్కడే నుంచుని వీధిలోకి చూడు. అంతేగాని హోటల్ కింద ఆవరణలోకి కూడా రాకు. పుస్తకాలను మించిన కాలక్షేపం మరేదీలేదు. పుస్తకం మంచి మిత్రుడితో సమానం. మంచి మాగ్జయిన్స్ తెచ్చాను. అవి చదువుకో నందితాదేవీ! ఈ జాగ్రత్తలన్నీ నీ క్షేమంకోరి చెపుతున్నాను. నిను చేర్చవలసిన చోటుకి చేర్చిందాకా నా భుజం మీద లక్షటన్నుల బరువు మోస్తున్నట్లే" అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.


