నీరజ అప్పుడే యింకేవరి దగ్గిరకో వెళ్ళిపోయి మాట్లాడుతుంది. సుదర్శన్, జార్జి ఏదో చర్చిస్తున్నారు నీరజతో. సుదర్శన్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నవ్వుతూ వాళ్ళతో! తనతో యిలా మనసారా నవ్వుతూ మాట్లాడి ఎన్నాళ్ళయింది. అసలు తామిద్దరూ మాట్లాడుకుని ఎన్ని రోజులయింది. యీ పార్టీ కి భార్య రాకపోతే సంజాయిషీ లు యివ్వాలన్ని భయంతోనేమో తీసుకువచ్చాడు సుదర్శన్. సొసైటీ మర్యాదలకి భంగం కాదూ తను రాకపోతే! యీ పార్టీలు, డిన్నర్లు, క్లబ్బులు.... యీ సొసైటీ లైఫ్ కి నటన చాలా అవసరం.
అసలు ఆరోజు జాన్ వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన దగ్గిర నుంచేగా తమ మధ్య కలతలు, కలహాలు ఎక్కువయ్యాయి.
అప్పటివరకు యింట్లో భోజనం చేస్తున్నంత సేపు సణగడం , చిరాకు పడడం మినహా ఉత్తప్పుడు బాగానే వుండేవాడు సుదర్శన్.
ఆరోజు పార్టీకి యిలాగే టేబిలు మీద అమర్చిన నాన్ వెజిటేరియన్ డిషెస్ వంక చూసే సుదర్శన్ చూపులు ఎదురుగా ఏ మేకనో పెట్టితే బోను లోని సింహం చూసే అకలి చూపులు గుర్తుకొచ్చాయి. ఆరోజు తన ప్రక్కన ఉండి వుండకపోతే యిచ్చిన మాట మరచి హాయిగా ఆ మాంసాహారం తిని వుండేవాడనిపించింది. ఆచూపు యింక ఎన్నిరోజులో మాటకి కట్టుబడ వుండడనిపించింది. ఆరోజు యింటికి వచ్చాక తనతో మాట్లాడకుండా కోపంగా పడుకున్నాడు.
ఆమర్నాటి నుంచే అసలు కధ ప్రారంభమయింది. ఆరోజు నించి రోజూ రాత్రి యింట్లో భోజనం మానేశాడు. ఎవరో ఫ్రెండ్ పిలిచాడని, డిన్నరని, పార్టీ అని ఏదో వంక చెప్పసాగాడు. ఓ పదిహేను రోజులు నమ్మింది. కాని ఇన్నాళ్ళూ లేని ఫ్రెండ్స్ , పార్టీలు, రోజూ యిచ్చే తనకి తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారు? హోటలు లో తింటున్నాడని స్పష్టం అయింది. ఒక నెల చూసి యింక వూరుకోలేక అడిగింది.
...." అవును హోటలు కెళ్ళే తింటున్నాను.....ఎన్నాళ్ళు తిండి తినకుండా చచ్చిపోమ్మంటావు ' అనవసర కోపంతో గట్టిగా అరిచాడు . తనకీ వళ్ళు మండింది.
"యీ మాత్రం దానికి ఆనాడు పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకుచేశారు. తిండే అక్కరలేదన్నారు ....' చెప్పండి.
సుదర్శన్ మొహం ఎర్రబడింది.
'అవును అన్నాను. వాగ్దానం చేశాను. కనుకే, నీకోసం ఎనిమిది నెలల నించి పస్తులున్నాను. యింక నావల్ల గాదు.... తిండి తినకుండా చచ్చిపోవడమే నీ కానందం అయితే చెప్పు .... ఎంతసేపూ నాలోనే లోట్లు ఎంచడం ఎందుకు.....త్యాగాలు నేనే చెయ్యాలా! ఆమాత్రం కట్టుకున్న వాడి కోసం నీవు త్యాగం చేయకూడదా? నేనేం నిన్ను తినమనలేదే. నాకు అభ్యంతరం చెప్పోద్దాన్నాను...అంతే గదా." అన్నాడు.
యింకేముంటుంది. అక్కడికి అంది "నేనే త్యాగాలు చేయలేను కాబట్టే ముందుగానే మాట తీసుకున్నాను."
"ఎన్నిసార్లు చెపుతావు. అవును వాగ్దానం చేశాను.... క్షమించు వాగ్దానం నిల్పుకోలేని వాడిని ఏదయినా మనవచ్చు గాని.... తిండి మాని త్యాగాలు ఎవరు చేస్తారు ." విసురుగా వెళ్ళిపోయాడు.
ఆ భాగోతం అలా మూడు నెలలు సాగింది. ఇల్లు, పెళ్ళాం అన్నీ వుండగా హోటల్లో భోజనం చేసి వస్తుంటే సహించింది....కాని, ఆరోజు నించి మాట తప్పాడనో, ఆ ఆహారం తిని వస్తున్నాడన్న భావమో కాని సుదర్శన్ పట్ల కాస్త విముఖత కలిగింది. సుదర్శన్ కూడా మాట తప్పినందుకు కాబోలు కాస్త మొహం చాటేసుకుని తిరిగేవాడు. పూర్వంలా యిద్దరూ ఫ్రీగా మాట్లడుకో లేకపోయేవారు. అంతేకాక సుదర్శన్ దగ్గిరికి తీసుకోగానే సుదర్శన్ మాంసం తింటున్నాడన్న తెలివి అదోరకం జుగుప్స కలిగించేది అతని స్పర్శ. తనకి తెలియకుండానే మొహం త్రిప్పుకునేది. మొత్తం మీద ఆ సంఘటన తమ దాంపత్య జీవితానందాన్ని చాలా వరకు హరించింది.
అంతటితో ఆగలేదు. "ఎన్నాళ్ళు రోజూ వెళ్లి హోటల్లో తినగలను" అంటూ ఇంట్లోనే ఓ వంటవాడిని వేరే వండడానికి తీసుకువచ్చాడు. అప్పారావు - నల్లటి గోళ్ళు, గంపంత జుట్టు - వాడిని చూస్తేనే అసహ్యం తనకి. వాడు వచ్చినదగ్గిర నుంచి సుదర్శన్ భోజన సమస్య తీరింది. కాని ఆ యింట్లో భోజనం చేయడం తనకో సమస్యగా వుంది. ఇంట్లో కోళ్ళు కోయడం, చాపలు కడగడం , అవి వుడుకుతుంటే ఆ వాసనా, ఆ మసాలాలు రుబ్బడం అదంతా భరించడం తనకి తప్పలేదు. ఎంత చెప్పినా వాడికి వేరే గిన్నెలు ఇచ్చినా ఆ అప్పారావు అన్నీ కలిపేస్తాడు. మూతలు, గరిటలు అన్నీ కలిపేస్తాడు. వంటింటి పైపు దగ్గర ఆ మాంసం అవీ కడిగి గలీజు చేస్తాడు. పనిమనిషి అన్ని గిన్నెలూ కలిపేస్తుంది ఎంత చెప్పినా, ఏం చెయ్యడం! ఎంత చూడకూడదకున్నా అదంతా తన కంటబడక మానడం లేదు.
హు....యిలాంటి గొడవలు వస్తాయనే అందరూ అంతగా ఆనాడు తనని హెచ్చరించారు ఆ మాటలని నిర్లక్ష్యం చేసింది ఆనాడు. కాని ఎంత అనుభవపూర్వకంగా చెప్పారు.
ఈ గొడవల వల్ల తమ దాంపత్య జీవితమే దెబ్బతింటుందని కలలో కూడా అనుకోలేదు....సుదర్శన్! యెంత ప్రేమగా అనురాగంతో చూసే వాడు. అలాంటివాడు యిలా మారిపోతాడని....
నిజానికి తప్పు తన ఒక్కడీదీ కాదు! యిందులో తన పాలూ వుంది. సుదర్శన్ తనని తినమనలేదు! వండమన లేదు! అతని ఏర్పాటులు అతను చేసుకున్నాడు. కాని....యీ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేక పోవడం తన బలహీనత. ఇంటా వంటా లేని వారెందరో తింటున్నారు యీ రోజుల్లో మత్స్య మాంసాలు! అలాంటిది తనెందుకు యింత సీరియస్ గ తీసుకోడం ఈ విషయం....
తను మాత్రం ఏం చేస్తుంది. ఎంత సరిపెట్టుకుందామన్న ఆ ఊహ తలపుకి వచ్చేసరికి సుదర్శన్ స్పర్శే భరించలేకపోతుంది. తన మొహం మీద ఏహ్యత స్పష్టంగా కనిపించడం చూసి చూసి సుదర్శన్ ఓరోజు కోపంగా అడిగాడు కూడాను ---" ఎందుకంతలా చీదరించుకుంటున్నావు యీ మధ్య ......ఎందుకిలా మారిపోయావు ...."
"మారింది నేనే కాదు" కోపంగా అంది తను. "నేను మారానా, ఏం మారాను, నా ప్రేమానురాగాలలో ఏం మార్పు కనిపించింది చెప్పు " నిలపేశాడు. మాటలకి తడుముకుంది.
"ప్రేమలో కాదు.... మనిషిలో.... మాటల్లో.... చేతల్లో" కసిగా అంది సుదర్శన్ తెల్లబోయాడు. 'దాని గురించా .... మాంసం తింటున్నాడని మనిషినే అసహ్యించుకుంటున్నావా... అదేనా కారణం...." తను జవాబీయలేదు. సుదర్శన్ ఒక క్షణం ఆలోచిస్తూ తన మొహం చూసి , తనని వదిలేశాడు. "మనం చాలా పొరపాటు చేశాం..... చాలా తొందర పడ్డాం..... తప్పటడుగు వేశాం" అని అటు తిరిగి పడుకుండిపోయాడు. ఆ రోజు నించి యీ రెండు నెలల నించి తనతో చాలా ముభావంగా మాట్లాడుతున్నాడు. తన దగ్గిరకే రావడం లేదు. తను పలకరించినా జవాబీయడం లేదు ఇద్దరూ లోకానికి మాత్రమే భార్యాభర్తలు.....
ఎన్నాళ్ళిలా! ఎవరో ఒకరు సర్దుకోకపోతే కాపురం ఎలా.... నలుగురినీ కాదని పెళ్లి చేసుకుని.... నలుగురూ తన మొహాన్నే శాస్తి జరిగిందని చెప్పుకునేటట్లు ప్రవర్తిస్తే ఎలా? తన వాళ్ళందరూ వింటే ఏమంటాడు? ముందే చెప్పాం అంటూ చెప్పి హేళన చేస్తారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఇంట్లో సుదర్శన్ వరస చూస్తుంటే తప్పంతా తనదేనన్నట్లు , తనని శిక్షించడానికికన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేస్తే గాని దారికి రాదన్నట్లు నిర్లక్ష్యంగా భార్య ఉనికినే మరచి తిరుగుతున్నాడు. ఏం చెయ్యడం, తను మారాలి! సుదర్శన్ తనకోసం మారదని స్పష్టమైంది. కాపురం కావలిస్తే తనే అన్నీ చచ్చినట్టు భరించాలి! లేకపోతే ఏం చెయ్యాలి! అన్నదే తన ప్రస్తుత సమస్య....
డిన్నరు పూర్తయింది. అందరూ చేతులు కరుక్కుంటూన్నారు. యాంత్రికంగా చేతులు కడుక్కుంది సుమిత్ర. అందరూ మళ్ళీ డ్రాయింగు రూములో చేరారు.
ప్ర్హూట్ సలాడ్ సర్వ్ చేస్తున్నారు. మౌనంగా అందుకుంది సుమిత్ర. ఈరోజంతా ఎమితోలా వుంది సుమిత్రకి. ఎవరితో మాట్లాడబుద్ది వేయడం లేదు. మనసంతా ఏదో ఆవేదన నిండింది. భవిష్యత్ చింత ఆనందాన్ని హరించి నిర్లిప్తత కనిపించింది ఆమెలో.


