Home » Sri n t rama rao » Sri N T Rama Rao Prasangalu

 

ప్రజల సేవలో పన్నెండు నెలలు

    అపూర్వమైన అనురాగంతో, దూరాన్ని గమనించకుండా, శ్రమను లెక్కచేయకుండా ఈనాడు తెలుగునాడు నాలుగు చెరగులనుండి విచ్చేసి, నా జీవితంలో అనురాగపు దివ్వెలు వెలిగించిన నా ఆడబడుచులకు__
    మిన్ను విరిగిందా? ఉవ్వెత్తుగా కడలి తరంగం ఆకాశాని కెగసిందా? ఆవేశం జ్వాలాతోరణంగా దిక్కుల జ్వలించిందా? అన్నట్లుగా ఆనాడు, ఈనాడు, ఏనాడూ వెన్నుకాపుండి, భావి అభ్యుదయ పథానికి దివ్వెపడుతూ 'అన్నా' అని కలవరించి, పలవరించి నాలో ఆవేశం రగిలిస్తున్న నా తమ్ముళ్లకు__
    లేత గులాబీల్లా, తెల్లని మల్లెపువ్వుల్లా తెలియని అమాయకపు నవ్వులతో పువ్వుల వర్షం నాపై కురిపిస్తూ, కళకళలాడుతూ, మురిపాలు పలుకుతున్న చిట్టి చిరంజీవులకు__
    అనుభవం పండిన పెద్దలకు__ 
    నా ఆదర్శాలకు ఆశీఃపరమైన అమృతం చిలికిస్తూ, సదా నా విజయాన్ని ఆకాంక్షిస్తూ, క్రొత్తదనం ఈనాట చిగురిస్తుందని, నవ్యత సమాజానికి నాంది పలుకుతుందని ఎన్నో విధాలుగా, మరెనెన్నో రకాలుగా ఊహించుకొంటూ, నా గమనాన్ని గమనిస్తూ, నా ప్రగతి పథాన్ని నిత్యం జ్యోతిర్మయం చేస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న నా వారందరకూ 
    స్వాగతం ! మీకు సుస్వాగతం !
    అనుభవాలు ఎన్నెన్నో ఈ జీవితంలో. కాని, మనసంటి మిగిలేవి కొన్నే వుంటాయి, అందులో. వాటి గురుతే మధురం. వాటి భావనే సుమధురం. అదే ఈ జనవరి 9 వ తేదీ విశిష్టత, ప్రత్యేకత. గడచిన జీవితానికి వెలుగు ప్రసాదించి ఈ క్రొత్త మలుపు చూపిన రోజిది. మానవశక్తి అప్రతిహతమైనదని నిరూపించిన రోజిది. మమత వెలకట్టలేనిదని నిర్వహించిన రోజిది. ఇదే నా జీవితానికి పండువైన రోజు. నిస్పృహ నిరాశలను దూరంచేస్తూ, నా మానవసేవా పరమార్థాన్ని నాకు ప్రబోధించిన రోజిది. ఈనాడు ఏ గడ్డమీద నిలబడి బాధ్యతతో మనసు విప్పి నా సంవత్సర అనుభవం మీకు నివేదికగా అందజేయాలని నిర్ణయించుకొన్నానో, అదే ఈ గడ్డమీద ఆనాడు మీ సమక్షంలో నా జాతికి, తెలుగు జాతికి నా జీవితాన్ని అంకితం చేసి ప్రమాణం చేసిన రోజిది.
    మీరిచ్చిన బాధ్యతను, కట్టబెట్టిన అర్హతను, విశ్వాసంతో వుంచిన గౌరవాన్ని నిలబెడతానని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించి, తెలుగు సంస్కృతీ వికాసాన్ని ప్రభావితం చేస్తానని ప్రమాణబద్ధంగా పదవీ స్వీకారం చేసిన రోజిది.
    అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవేనని, అది ప్రతివ్యక్తికి అందించటమే పరమార్థమని, దృఢ దీక్షతో జాతికి అంకితమైన రోజిది.
    యుగాలు, శతాబ్దాలు, దశాబ్దాలు, ఏళ్లు, నాళ్లు ఎన్ని గడచినా మానవ సమాజం మనుగడ హెచ్చుతగ్గుల తూకంలో, అసమానత్వంలో, అంటరానితనంలో, కులమత విద్వేషాలలో నలిగిపోతున్న పాత సామాజిక ఇతిహాసానికి మంగళం పాడాలని మనోనిశ్చయం చేసికొన్న రోజిది.
    బడుగువర్గాలకు వారసత్వంగా, పీడిత ప్రజలకు తలరాతగా, విధి వ్రాతగా, కర్మ సిద్దాంతంతో సరిపెట్టుకుంటున్న ఆ కుళ్లిపోయిన పాత విధానాలకు, ప్రవచనాలకు అంతు చెప్పాలనుకొన్న రోజిది.
    ఆత్మార్పణతో సాధించిన స్వరాజ్యం జాతికి మేలుకొలుపు పలుకుతుందని, బలిదానంతో, పెద్దల త్యాగంతో, యువకుల రక్తార్పణతో ఎదలో వుంచుకొన్న, పెంచుకొన్న ఆశలను పండించకపోగా, భవిష్యత్తునే శూన్యం చేస్తూ, కాష్ట్రీయ వికాసాన్ని కించపరుస్తూ, స్వరాజ్యానికి నిర్వచనం స్వార్థమనే నేతలు జాతిని పిండి పీడిస్తున్న నిరంకుశ విధానానికి గుండె నిబ్బరంతో ఎదురు నిలవాలని... 
    సామాన్య మానవునికి ప్రాథమిక అవసరాలయిన తిండి, గుడ్డ, నీడ అందివ్వాలని...కుల మత వర్గాలకు అతీతమైన, సమ సమాజానికి సరైన నిర్వచనం చెప్పాలని...
    పాత మూసలో విశ్వజనీనత లేకుండా చేసిన శాసనాలు సామాజిక అభివృద్ధిని సాధించలేకపోయాయని చెప్పాలని...
    ఒకే కడుపున ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినా, సమాన హక్కులు లేక, పాతవై, రోతపుట్టే అనాగరిక సంప్రదాయాలలో, అవమానాలపాలై నలిగిపోతున్న ఆడబడుచులకు స్వతంత్ర జీవనం కల్పించాలని, న్యాయసమ్మతమైన, ధర్మ సమ్మతమైన జన్మహక్కు వారికి కలిగించాలని...
    గోడు వినేవారు లేక, న్యాయమందించే నాథుడు కానరాక, గుడ్లనీరు గుడ్లనే కుక్కుకుంటూ బ్రతుకు భారంగా మోస్తున్న బడుగువర్గాలకు విముక్తిపథం చూపాలని...
    రక్తాన్ని చెమటగా వారవోస్తూ, హలాలుబట్టి, బీడు భూములను పగలగొట్టి దేశానికి యింత కూడు పెడుతున్న అన్నదాత రైతన్న ఊసురోమని అనకుండా క్షేమంగా ఉండాలని...
    శ్రమజీవులు, కష్టజీవులు, బడుగుజీవులు, క్షుధితులు, బాధితులు, వ్యధితులు, తమతమ యిక్కట్లను మరచి ఒక్కటై క్రాంతిపథంలో దేశ సౌభాగ్యానికి కృషిచేసే విధానం కల్పించాలని...
    ఆరుకోట్ల తెలుగు ప్రజానీకానికి, అన్ని అవకాశాలు సమంగా పంచి పెట్టాలని...
    ముక్కుపచ్చలారని నిరుపేదల నిర్భాగ్యపు సంతానం అంధకారంలో, అజ్ఞానంలో, మురికివాడల్లో, మురుగు గుంటల్లో స్వార్థ సమాజానికి బలై వెలై, నేరస్తులై, వ్యాధిగ్రస్తులై శూన్యంలో కలసిపోకుండా, మన భవిష్యత్ పౌరులుగా క్రాంతిపథంలో కేరింతలతో పరవళ్లు తొక్కు పరిగెత్తేలా మలచాలని...
    ఎన్నో, ఎన్నెన్నో, మరెన్నో ఊహించుకున్నాను ఆనాడు. ఈనాడు, చేసిన వెన్నైనా చేయవలసిన వెన్నెన్నో...
    అనుభవం లేదంటారు కొందరు. ఆవేశం ఎక్కువంటారు మరికొందరు. ఎవరేమన్నా, ఏమనుకున్నా భావన అదే, బాధ్యత అదే. గమ్యం అదే.
    సమర్థతను సమర్థించుకోను. చేసినవి చేశానని నేననను. సాక్షులు మీరు. మీకు సమాధానం చెప్పవలసింది నేను.

అందుకే వినమ్రతతో ప్రభుత్వపరంగా నిర్వహించిన సామాజిక కార్యక్రమాలను, తీరుతెన్నులను తెలుగుదేశ ప్రభుత్వ పాలన ప్రథమ వార్షిక సుముహూర్త సందర్భంలో ప్రభుత్వ వార్షిక నివేదికను మీముందుంచుతున్నాను_ సహృదయంతో స్వీకరించవలసిందిగా నా ఆరుకోట్ల అన్నదమ్ములనూ, ఆడబడుచులనూ కోరుతున్నాను.
    నా పోకడలో, నడకలో వచ్చిన తొలి మలుపే ఒక అవగాహన యిచ్చింది. 'అన్నదాత' లన్న పేరుండి, అపూర్వ వ్యావసాయిక కృషి ఉండి, నిక్షేపమైన నీటి వనరులుండి, ధాన్యపు గాదులు నింపే సుక్షేత్రమనిపించుకొన్న మన మాగాణములోనే చేయి నోటికందే ప్రాప్తిలేక నిత్యార్తులై, అన్నార్తులై, క్షుథార్తులై, బాధితులై, వేధితులైన పేద ప్రజానీకం ఆకర్షించింది నా తొలి చూపును.
    కాలే కడుపులతో, మండే డొక్కలతో బిడ్డలగోడు వినలేక కంటి నీరు కంటనే క్రుక్కుకున్న నిరుపేద ఆడపడుచుల దీన దయనీయమైన దుస్థితి, మళ్లించింది నా మనసును అటువైపు.
    రెక్కాడినా డొక్కాడని కరువు జీవితంలో కడరుచు లెరుగక, చేసిన కష్టం కడుపు నింపక కటకట పడుతున్న బడుగు వర్గాల బాధారవం మేలు కొలిపింది నన్ను.
    నోరు పెగలక, గోడు వినే నాథుడు లేక, తరతరాల దాస్యంలో తల దాచుకొనడానికి నీడలేని అనాథుల, నిర్భాగ్యుల, నిరుపేదల, హతాశుల, గతాశుల దురవస్థ కలచివేసింది నా మనస్సును.
    ఆదినుండీ మీ ఆదరాన్ని అందుకున్న అదృష్టశాలిగా, నమ్మకాన్ని పంచుకొన్న నీ మనిషిగా ఆలోచించుకున్నాను_ ఏమివ్వగలిగాను నా వారికి, నా జాతికని. ఎలా ఆదుకున్నాను ఇక్కట్లలో మునిగిన నా వారినని, ఏ పరమార్థం దర్శించుకున్నాను, నా ఈ జీవితానికని.
    ఆలోచించినపుడు ఆ వేడి భావాలతో నిర్ణయించుకున్నాను నావారు మీరని, మీకు నేనని, మీ ఋణం ఇసుమంతైనా తీర్చుకోవాలని, షష్టిపూర్తి నిండిందిగానీ పండలేదు నా జీవితమని, ఇక మీ సేవే కర్తవ్యమని.
    ఆవిర్భవించింది తెలుగుదేశం 1982 మార్చి 29న. దూసుకుపోయింది తెలుగువారి ఎదలో__ వడిగా, సుడిగా, ప్రభంజనంలా.
    లిఖించింది క్రొత్త చరిత్ర, మాసిన రాజకీయ పుటలపై.
    ఈ విజయం చెప్పింది__ఈనాటి సమాజానికి కావలసిన మానవతా సిద్దాంతం. అందుకే భావించాను ముందుగా, పేదల సంక్షేమమే ప్రభుత్వ పరమార్థంగా.
    కాలే కడుపులకు, మండే డొక్కలకు అన్నం అందించాలనుకున్నాను అందుబాటైన ధరకే. ఆ ఆలోచనా ఫలితమే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం. దీనికి దాదాపు 108 కోట్లు సాలీనా సబ్సిడీ పరంగా ఖర్చవుతున్నా__ప్రభుత్వం నిర్ణయించుకున్నది పట్టుదలగా ఈ పథకం అమలుపరచవలసిందేనని.
    కేవలం పైసలు లెక్కపెట్టే చిల్లరకొట్టు కాకూడదు ప్రభుత్వం. పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొన్న పవిత్రమైన వ్యవస్థ కావాలది. ఈనాడు కోటి పైచిలుకు పేదల కుటుంబాలకు లభిస్తున్నదీ కార్యక్రమ ఫలితం.
    తిండి, బట్ట తరువాత కావలసింది నీడ. అది నోచుకోని నిరాధారుల కుటుంబాలకే శాశ్వత గృహనిర్మాణ పథకం, ఇండ్ల స్థలాల పంపకం.
    నిర్ణయించుకొన్నాము జిల్లాకు పదివేల చొప్పున 2,20,000 కుటుంబాలకు నివాసం కల్పించాలని ఈ సాలుస. కట్టలేకపోయాం అనుకున్న మొత్తం అడ్డు తగిలిన అవాంతరాలవల్ల, ఎదురయిన ప్రకృతి వైపరీత్యాలవల్ల. 1,40,000 పైగా గృహాల నిర్మాణం రూ. 88 కోట్ల ఖర్చుతో చేపట్టబడింది. అయినా అనుకున్నవన్నీ పూర్తిచేయలేకపోయామన్న ఆవేదన మనసులో వుంది.
    ఈనాడు కూడా కొన్ని ప్రాంతాలలో త్రాగే నీరులేక ఆడబడుచులు మైళ్ల తరబడి మండుటెండలో కుండలు భుజాన పెట్టుకొని వెళ్లడం అనాగరికం, శోచనీయం. ఇందుకే గ్రామాలలో ప్రతి నూరుమంది జనాభాకు కనీసం ఒక త్రాగు నీటి వనరు కల్పించాలన్న తాపత్రయం. ఈ సందర్భంలో ఒక వాస్తవం మీ ముందుంచుతున్నాను. 1975 నుండి మార్చి 83 వరకు ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 74,303 గొట్టపు బావులు త్రవ్వగా, ఏప్రియల్ 83 నుండి నవంబరు వరకు ఎనిమిది నెలల స్వల్ప కాలంలో 20,140 గొట్టపుబావులు వేయటం జరిగింది.
    కూలి డబ్బులకోసం, కడుపుమంట చల్లార్చుకోవటం కోసం బిడ్డలను చాకిరీకి పంపించే దురదృష్ట విధానం దూరం చేయటానికే మధ్యాహ్న భోజన పథకం. అంతో ఇంతో అక్షర జ్ఞానంతోపాటు ఒక్క పూటైనా పౌష్టికాహారం వారికి లభింపజేయడమే దీని పరమార్థం. సమాదరణతో కొందరు సహకరించకపోవటంవల్లనే అనుకొన్నంత ఫలితం అందుకోలేకపోయినా, తృప్తిపడుతున్నారు ఈనాడు అందుకోగలిగిన లక్షలాది చిరంజీవులు.
    అర్థాంగి, సమభాగిని అని ఎన్నో పొగడ్తలు చెపుతున్నాం. కాని తరాలు గడచినా, యుగాలు మారినా తత్వం మారలేదు మగవారికి. స్వార్థం చావలేదు సమాజానికి. వరకట్నంలాంటి సాంఘిక దురాచారాలకు బలియై, సామాజిక అసమానతలకు, అవమానాలకు గురి అవుతున్న ఆడబడుచులకు స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన సమజీవనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఆశయం. మహిళాభ్యుదయమే మానవ సమాజ నాగరికతకు సంకేతం. అందుకే ఒకతల్లి కడుపున ఒకే రక్తం పంచుకొని పుట్టినవారు__ ఆడైనా మగైనా వారికి పిత్రార్జితంలో సమాన హక్కులు కలిగించాలన్నదే ప్రభుత్వ తీర్మానం.  
    ఈ భావనతోనే ఆడవారికి అనువైన అన్నిరకాల ఉద్యోగాలలో 30 శాతం వారికి ప్రత్యేకించడం.
    మహిళల స్థితిని మెరుగుపరచడానికి అనువైన ఆదర్శ విద్యా విధానానికే తిరుపతిలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం. ఉపాధి కోసం పట్టణాలలో పనిచేస్తున్న ఆడపడుచుల సౌకర్యార్థం జిల్లాకు కనీసం ఒక మహిళా వసతి గృహం ఏర్పాటు.
    కాలం దొర్లుతున్నా కనీస సౌకర్యాలకు నోచుకోని ఆడబిడ్డలకు గ్రామానికో ఆధునిక మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు, హేయమైన వృత్తినుండి__ వారి జీవన సరళికి భంగంకాని రీతిలో పాకీ పనివారికి విముక్తి కలిగించటానికే 'విముక్తి' పథకం.

నవ్యతకు నాంది పలుకుతోంది యువత. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉత్తుంగ తరంగంలా ఆకాశాన్నంటుతోంది తమ్ముళ్ల ఆవేశం. ముందుకు సాగుతున్న యువశక్తికి స్వాగతం పలుకుతున్నది ప్రభుత్వం. భవిష్యత్ నిర్ణేతలు వారు. భావి భాగ్యవిధాతలు వారు. నవసమాజ నిర్మాతలు వారు. చైతన్య సారథులు వారు. ఈ భావనతోనే నిరుద్యోగ నైరాశ్యాన్ని నిర్మూలించి, క్రమశిక్షణా పూరితమైన రాష్ట్ర, గ్రామాభ్యుదయ నిర్మాణ శక్తిగా యువతను మలచి, అభ్యుదయ కార్యక్రమాలలో విలీనం చేయడమే 'యువశక్తి' పథక ప్రయోజనం. ఎంపిక చేయబడ్డాయి 7 జిల్లాలు__ జిల్లాకు 200 గ్రామాలతో, క్రమంగా విస్తరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా.
    రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొంటూ మోడువారిన బీడుభూములను హలాలతో పగలదున్ని పసిడిపంటలు పండించే అన్నదాత రైతన్నకు సహేతుకమైన సంతృప్తిని కలిగించడం బాధ్యతగా భావిస్తోంది ప్రభుత్వం. అందుకే ధాన్యానికి క్వింటాలుకు కేంద్రం నిర్ణయించిన ధర రూ. 136 కాగా రైతు సోదరులకు పది రూపాయలు హెచ్చుగా గిట్టేట్లు రూ. 146 గా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. పంచదార చెరకుకు రాష్ట్ర సలహా ధర కేంద్రం నిర్ణయించిన ధరకన్నా టన్నుకు రూ. 50 అదనంగా లభించేటట్లు, రూ. 185 గా నిర్ణయించబడింది. దీని ననుసరించి, చక్కెర ఫ్యాక్టరీల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేసిన సహాయం రూ. 12 కోట్లు. వేరుశెనగకు సలహా ధర క్వింటాలుకు రూ.425 గా నిర్ణయించింది. పొగాకు అమ్మకం కాని రైతులకు వడ్డీలేని ఋణ సహాయంగా ఇచ్చినది రూ. 2 కోట్లు. 
    పొగాకు ఉత్పత్తిదారులు సాగించిన ఆందోళనలో, వారి సమస్యలు పరిశీలించి, పరిష్కరించే అవకాశంలేని స్వల్ప వ్యవధిలో టంగుటూరులో కాల్పులు జరగటం దురదృష్టకరం. ఈ సంఘటనపట్ల మరొకసారి విచారాన్ని వెలిబుచ్చుతూ, మరణించిన రైతుబిడ్డల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి సంతాపాలను మరల వ్యక్తం చేస్తున్నాను.
    పాడి పంటలతో పౌర జన సంక్షేమాన్ని, పుష్టికరమైన ఆహార పంపిణీ విధానాన్ని దృష్టిలో పెట్టుకొంటూ, పాల ఉత్పత్తిదారులకు అందజేయగలిగినంత మేరకు గిట్టుబాటు ధర లభింపజేయటం పాలక వ్యవస్థ ఆదర్శం. అందుకే పాల సేకరణ ధర పెంచి ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది. కుటుంబ బాధ్యత వహిస్తూ, పశుగణ పోషణ చూచుకొంటూ, ఆత్మీయతతో అనుక్షణం పాడిపంటల అభివృద్ధికే అంకితమవుతున్న మా ఆడబడుచులకు సాధ్యమైనంత వుత్సాహం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
    సంస్కృతీ సంస్కారాలను, చైతన్య వికాసాలను పలికేది పలుకు. భాషను గౌరవించుకోలేని జాతికి గౌరవం లేదు. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా తెలుగువారి రాష్ట్రంగా అవతరించిన తెలుగునాడులో తెలుగుభాష అన్ని స్థాయిలలో అధికారభాష చేయబడింది.
    అర్హతకు గుర్తింపు లభించాలని, విద్య బజారులోపెట్టి వేలంపాడే సంత సరుకు కాకూడదని, అందరికీ అది అందుబాటులో వుండాలని, సమానావకాశాలు అందరికీ కలిగించబడాలన్న పవిత్ర భావంతో, వ్యాపారాత్మకంగా మారిన విద్యా విధానానికి స్వస్తి చెప్పడానికే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయటం జరిగింది.
    ఏ చెట్టు నీడనో, చెరువు గట్టునో విద్యాబోధన సాగకూడదన్న సత్సంకల్పంతో పల్లెపల్లెన ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఈ పథకం క్రింద సుమారు లక్ష పాఠశాలల భవనాలు అంచెలవారీగా నిర్మించబడుతున్నాయి.
    ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి వివిధ స్థాయిలలో 16,700 మందికి పైగా నియామకం జరుగుతున్నది.
    సమాజంలో విద్యా సముపార్జనాసక్తిని పెంపొందించడం కోసం ఎవరయినా వారివారి ఉద్యోగాలు, వృత్తులు నెరవేర్చుకుంటూ, తమ అభిరుచికి అనుగుణంగా ఉన్నత విద్యార్హతలు పొందడానికి దోహదం చేసే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రూపురేఖలు దిద్దడం జరిగింది.
    తెలుగుభాషా సంస్కృతీ విజ్ఞాన వికాసాలకు నిలయం__స్థాపించనున్న తెలుగు విశ్వవిద్యాలయం.
    బానిస బోధనా విధానాన్ని ఆవలకుబెట్టి వృత్తిపరమైన సాంకేతిక విద్యా బోధనతో విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే అర్రులు చాచకుండా, స్వతంత్రంగా స్వయం ఉపాధిని ఏర్పరచుకొనే అవకాశం వారికి కల్పించడానికే విద్యాబోధనా విధానంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెడుతున్నది ప్రభుత్వం.
    ఆటవికులుగా, అమాయకులుగా అజ్ఞానాంధకారంలో మ్రగ్గుతున్న హరిజన, గిరిజన, వెనుకబడిన వర్గాల బాల బాలికల జీవితంలో వెలుగు ప్రసాదించడానికి జిల్లాకు రెండు చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలల ప్రారంభం.
    అభివృద్ధి కోరుతున్న సమాజానికి అవసరమైన విద్యా సదుపాయాలను కలుగజేయడానికి ఎన్నో కళాశాలలు ఈనాడు ప్రారంభించబడ్డాయి.
    నీరు నేలను తాకగానే మట్టి మాణిక్యం అవుతుంది. పసిడిపంటలతో అన్నపూర్ణమ్మ నిండుగా నవ్వుతుంది. సుభిక్షంతో దేశమాత నిండుతనం సంతరించుకుంటుంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, పినాకినీ, మానేరు, మంజీరా మొదలైన నదీజలాలతో పునీతం కావడం తెలుగుగడ్డ విశేషం. ఉన్న వనరులన్నీ అనుభవానికి తెచ్చుకోవడం, పూర్తిగా వినియోగించుకోవడం మన కర్తవ్యం. అందుకే అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులను పూర్తిచేయడం, క్రొత్తవానిని నిర్మించుకోవడం ప్రభుత్వం విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది.
    కోటి రతనాలవీణ మన తెలంగాణాను సస్యశ్యామలమైన మాగాణంగా సంపూర్ణ స్వరూపం కలిగించడానికి కాకతీయ కాలువ రెండవ దశ నిర్మాణం ప్రారంభం. శ్రీశైలం ఎడమకలువ నిర్మాణానికి రెగ్యులేటరుతో ప్రారంభించి త్వరలోనే పూర్తిచేసే ప్రయత్నం.
    అదేవిధంగా, రాయలేలిన సీమ రతనాలసీమగాని రాళ్లసీమగాదని నిరూపించడం ప్రభుత్వ ఆశయం. ఈ ఆశయం కోసమే శ్రీశైలం కుడి కాలువ నిర్మాణం పూర్తిచేయడం. ఎన్నేళ్లుగానో ఆలోచనలోనే వుండి ఆకృతిని సంతరించుకోలేని__మద్రాసుకు మంచినీటిని అందించే పథకాన్ని తెలుగు గంగగా స్వరూపం నిర్ణయించడం. ఆ పరమార్థంతోపాటు తరతరాలుగా రాయలసీమలో బీటలువారిన భూములను, ఊసర క్షేత్రాలను నీటిసాగు క్రిందికి తెచ్చి నందనోద్యానవనం చేయాలన్న సంకల్పంతోనే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలలో లక్షలాది ఎకరాలకు తెలుగు గంగను పరుగులెత్తించటం. 


    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నిరంతరం నీటికై తపిస్తున్న, నిర్లక్ష్యం చేయబడిన అనంతపురం, చిత్తూరు ఇల్లాల ఎగువ భూములకు నీరు అందించే ప్రయత్నం చేయబడుతున్నది. పులిచింతల రిజర్వాయరు నిర్మాణ అవసరాన్ని గుర్తించి నిపుణులతో దానికి సంబంధించిన పథకాలను తయారుచేయించి సెంట్రల్ వాటర్ కమిషన్ వారి ఆమోదానికై ఇదివరకే పంపడం జరిగింది.
    ఉత్తరాంధ్ర ఉపాధికి జీవనాడి అయిన వంశధార ప్రాజెక్టుకు సంపూర్ణ సమగ్ర స్వరూపం కల్పించడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుంది.
    పాలమూరు సీమకు సంపత్ర్పదాయినులైన జూరాల, భీమా ప్రాజెక్టులను, మిగిలిన ప్రాంతాలలో అసంపూర్తిగా గాని, ఆలోచనలోగాని వున్న మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను, ఇతర నీటి వనరులను చేపట్టి మోడువారిన రైతుల ఆశలను చిగురింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
    వెలుగు కావాలి__చీకటి కోణాలను ఛేదించటానికి. ఆ వెలుగు ప్రసరించాలి దశదిశలా. నిండాలి__ఇంటింటా, వాడవాడల, సీమసీమల అధికంగా ఆహార పదార్థాలను పండించి, దేశానికి తిండి కరువు తీర్చాలన్న భావనతో వ్యవసాయ అవసరాలకు విద్యుచ్చక్తిని సాలుకు ఒక హార్సుపవర్ 50 రూపాయల స్లాబు రేటుకు సరఫరా చేస్తున్నది.
    విద్యుత్ సరఫరాలో ఓల్టేజిలోని హెచ్చుతగ్గులతో సతమతమవుతున్న రైతుల యిబ్బందులను, ట్రాన్స్ ఫార్మర్లు మొదలైనవాటి విడిభాగాల కొరతను ప్రభుత్వం గురించి, నీటి నివారణ మార్గాలను అన్వేషించి, అమలుచేస్తుంది.
    అపారంగా భూగర్భ జల సంపద వుండికూడ సరైన విధంగా అభివృద్ధి చెందని ఆదిలాబాదు, అనంతపురం, విజయనగరం మొదలైన వెనుకబడిన ప్రాంతాలలో ఆ జలనిక్షేపాన్ని వెలికితీసి, ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేసే అభివృద్ధి పథకాలకు అవసరమైన విద్యుచ్చక్తిని సరఫరా చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత యిస్తున్నది.
    నిరుద్యోగ నిర్మూలనకు పరిష్కార మార్గం ప్రధానంగా పారిశ్రామికీకరణం. ఇంతవరకు కాగితాలమీదే వుండి, స్వరూపం సంతరించుకొని గోదావరి ఎరువుల కర్మాగారం, మంగళగిరి టైర్ల ఫ్యాక్టరీ మొదలైన భారీ పరిశ్రమల నిర్మాణానికి కృషి సాగుతున్నది. ఇక నాగార్జున ఎరువుల ఫ్యాక్టరీ సత్వర నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం సహకార రంగంలో 5 చక్కెర ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.
    ఇంతవరకు అడుగున పడివున్న పరుచూరు స్పిన్నింగ్ మిల్లు నిర్మాణ కార్యక్రమం వెంటనే చేపట్టబడింది. ఇంకా తవుడు నూనె కర్మాగారాలు మొదలయిన పరిశ్రమలు రూపం దిద్దుకొంటున్నాయి. లఘు, గృహ, కుటీరపరిశ్రమలు వేలాదిగా ప్రారంభించబడ్డాయి.
    గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, నిరుద్యోగులుగావున్న విద్యావంతులకు ఉపాధికల్పనకై చేపట్టబడిన జాతీయపథకం 'గ్రామోదయం'.
    తరతరాలుగా తమ వృత్తుల కంకితమయి, సామాజిక ప్రగతికై తమవంతు కృషిని సాగిస్తున్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదర్లకు, రజక, నాయీ బ్రాహ్మణులకు, చర్మకార, చేనేత, మత్స్యపారిశ్రామికులకు, గొర్రెల పెంపకందారులకు, గీత పనివారలకు, ఇంకా ఇతర శ్రామికవృత్తి కళాకారులకు అందరికి స్వయం ఉపాధికల్పనా పథకాల ద్వారా సహాయం అందిస్తూ వారి సంక్షేమానికై పాటుబడటం జరుగుతున్నది. ఈ కృషిని మరింత పటిష్టంగా అమలుచేయడానికి ప్రభుత్వం నూతన ప్రక్రియల నన్వేషిస్తున్నది.
    ప్రతి జిల్లాలో అనుబంధ పారిశ్రామిక సముదాయాలను ఏర్పరచి విస్తృత పారిశ్రామికాభివృద్ధికి, నిరుద్యోగ నివారణకు ప్రభుత్వం చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం 'దీప'.
    పరిశ్రమల స్థాపనకు ఎంతో అవసరం విద్యుచ్చక్తి, నీరు, నేల, పారిశ్రామిక శాంతి. అవి పుష్కలంగా లభిస్తున్న మన రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు తీసుకోబడ్డాయి. వారికి అందచేసే ఆర్థిక సహాయం, యితర సదుపాయాలు వారికి ఒకేచోట సక్రమంగా, సత్వరంగా లభించేట్లు ఏర్పాటు జరిగింది.
    దేశ విదేశాలలో వున్న తెలుగువారిలో ప్రజ్ఞావంతులు, విజ్ఞానధనులు, సంపన్నులు__ అందరూ దేశభక్తి పూరితులై రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి ముందుకు రావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. వారికి వలయు సర్వ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నది.
    తరతరాల తలరాతగా, పేదరికంలో క్రుంగుతూ, బ్రతుకే భారంగా మోస్తూ ఈనాటికి సమాజంలో అట్టడుగున మ్రగ్గుతున్న బలహీన, బడుగువర్గాలవారి సంక్షేమమే ప్రభుత్వలక్ష్యం. ఇందుకొరకే హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారు, ఆర్థికంగా వెనుకబడినవారు__ వీరందరి సంక్షేమానికి గత ఏడాది బడ్జెటులో కేటాయించిన మొత్తం కన్న ఈ ఏడాది రెట్టింపు మొత్తం కేటాయించడం జరిగింది. ఇందువలన లక్షలాది బడుగు వర్గాలవారి కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనం సమకూరుతుంది. 
    మన రాష్ట్రంలో గుర్తింపబడిన వెనుకబడిన తరగతుల వారందరకూ మండల్ కమిషన్ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది, అమలు పరుస్తుంది. ఇది వారికి వరప్రసాదం వంటిది.
    ఆరోగ్యకరమైన సామాజికాభివృద్ధికి, మచ్చలేని పరిపాలనకు గుర్తు అవినీతి నిర్మూలనం. అధికారం అంటే అహంకారమని, పదవంటే ప్రజలను దోచుకోవడమని నిర్వచనంగా నిరూపించబడుతున్న రోజులలో స్వచ్చమైన పరిపాలనకు, అవినీతికీ, అక్రమాలకూ దూరమైన పరిశుద్ధ సమాజానికి నివాళులిస్తుంది ప్రభుత్వం. ఇది ఎన్నేళ్లుగానో పాకుడు బట్టి పూడుకుపోయిన కుళ్లు. పవిత్ర గంగా జలమంతా ఒకేసారితెచ్చి కడిగినా ఒక్క ఏడాదిలో శుద్ధికాదని అనుభవంలో తేలింది. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అవరోధాలు, అడుగడుగునా అడ్డుపుల్లలు__అయినా ఆశ వుంది, మున్ముందు ఆదర్శవంతమైన పవిత్రభావాలకు, మచ్చలేని మనుగడకు అందరూ సహకరిస్తారని. ఈ ఆశయాలకు అనుగుణంగానే అవినీతి నిరోధకశాఖను పటిష్టం చేయడం, ధర్మ మహామాత్రను సృష్టించడం, ఆదర్శవంత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తను సమాయత్తపరచడం.


    పొదుపు దుబారాకు అదుపు. మంత్రిమండలి కేవలం ప్రజాధనానికి ధర్మకర్తృత్వ వ్యవస్థ మాత్రమే. ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి పైసాలో ఎందఱో శ్రమజీవుల స్వేదబిందువులు, కష్టజీవుల కన్నీళ్లు కలిసి వున్నాయన్న సత్యం మరచిపోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖజానా ఘనీభవించిన ప్రజల సొత్తు. 
    ఈ ధనం ప్రజా సంక్షేమానికి, అన్నార్తుల, క్షుధార్తుల, బాధార్తుల వ్యధలు తీర్చడానికి వినియోగింపబడాలి. ఆనాడుగాని కాదు సార్థకమైన వ్యయకర్తనం. అప్పుడు కాని లేదు ప్రభుత్వ వ్యయానికి అర్థం. 
    అధికార భోగాలకు, పదవీ లాలసతకు ఒక్క పైసా వినియోగించినా అది క్షమించరాని ప్రజాద్రోహం.
    ఈ సందర్భంలో ఒక విషయం మీ దృష్టికి తేవలసివుంది. గత ప్రభుత్వంలో మంత్రి మండలికైన ఖర్చు దాదాపు కోటీ యాభై లక్షల రూపాయలు కాగా మన ప్రభుత్వంలో మంత్రులకైన ఖర్చు రూ. 29 లక్షలు మాత్రం. గత ప్రభుత్వం మంత్రుల టెలిఫోన్ లక్రింద 1982-83 లో రూ.62 లక్షల పైచిలుకు ఖర్చుచేయగా జనవరి 10 నుండి డిసెంబరు ఆఖరువరకు అయింది దాదాపు రూ.11 లక్షలు. అలాగే గతంలో మంత్రుల ప్రయాణభత్యాల క్రింద ఏప్రియల్ 1981 నుండి మార్చి 82 వరకు రూ. 23.35 లక్షలు, ఏప్రియల్ 82 నుండి డిసెంబరు 82 వరకు రూ. 15.46 లక్షలు కాగా జనవరి 83 నుండి డిసెంబరు ఆఖరు వరకు 4.17 లక్షలు మాత్రం అయింది. ఇక గతంలో మంత్రుల జీతాల క్రింద 1981-82లో రూ. 24.84లక్షలు కాగా జనవరి 83 నుండి డిసెంబరు ఆఖరువరకు మన మంత్రుల జీతాలకై అయింది రూ.3.77 లక్షలు మాత్రం. మచ్చుకు కొన్ని మాత్రమే యివి. ఇంతకంటే ఏమి కావాలి నిదర్శనం-మన ప్రభుత్వ నిజాయితీకి, నిరాడంబరతకు?
    ఇదీ స్థూలంగా ప్రభుత్వం నడిచిన ప్రగతిపథం.
    ఈ వార్షిక శుభ పర్వదినాన నామీద నమ్మకంతో, నన్నింత అంతస్థులో వుంచి భవిష్యత్తు పురోగమనానికి వెలుగుబాట వేస్తున్న, నాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నవారిని మన ఆచార సంప్రదాయాల ప్రకారం రిక్తంగా పంపటం నా భ్రాతృధర్మం కాదు. అందుకే రెండవ సంవత్సరంలో అడుగిడుతున్న ప్రభుత్వం అందిస్తున్నది కొన్ని చిరుకానుకలను __ ప్రేమను పెనవేసుకొన్న ఆత్మార్పణ భావంతో కోరుతున్నాను అందరినీ అందుకోమని__ 
    * అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను అందరికీ అందుబాటులో వుంచాలనీ, ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనీ ప్రభుత్వ పరమైన సిద్దాంతం. కేవలం ప్రభుత్వంమీద ఆధారపడకుండా, ప్రతి విషయాన్నీ చేయిజాచి అడక్కుండా ప్రజలే వారి ప్రగతికి నిర్ణేతలుగా నిర్దేశించి ప్రజాస్వామ్య విధానానికి నూతనత్వం కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే ఈ వార్షిక సదస్సులో అశేష ప్రజానీకం ముందు ప్రకటిస్తున్నాను__    మాండలిక రాజ్యాంగ పరిపాలనా విధానం.
    35,000 నుండి 55,000 జనాభా పరిధిలో వున్న గ్రామాలన్నీ ఒక మండలంగా ఏర్పాటు చేయబడుతున్నాయి. రెవెన్యూ, సహకారం, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, పశుపోషణ, మార్కెటింగ్, క్రీడా, సంస్కృతీ విభాగం,విద్య, వైద్యం, పోలీసు కార్యాలయం మొదలైన సామాజికాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకే పట్టున కూడబెట్టడమే ఈ మాండలిక విధాన పరమార్థం. కొద్ది పరిధిలో అతి పటిష్టమైన పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు అందుబాటులో వుంచడం, ప్రజలే పాలకులుగా అధికారం వారికే అప్పగించడం ఈ వ్యవస్థ ఆదర్శం. అందుకే ఏర్పాటు చేయబడుతున్నాయి సుమారు 1200 రెవిన్యూ మండలాలు.
    దీనికి ప్రారంభ చర్యగా మొదటి దశలో చేశాము గ్రామాధికార వ్యవస్థ రద్దు. నిరంకుశ బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థకు, దిక్కుబోయిన నవాబుల దివాణాలకు అవశేషాలుగా మిగిలిపోయిన ఈ వ్యవస్థకు స్థానం లేదు__ వినూత్న ప్రజా పరిపాలనా విధానంలో.
    * దేవుడిచ్చిన భూమికి శిస్తేమిటి రైతన్నా! నీ ఆశలను తెలియజేస్తూ ప్రకటిస్తున్నాను నేను ఈ సభాముఖంగా__ వలస రాజ్యాధికార వారసత్వంగా మిగిలివున్న భూమిశిస్తు విధానం రద్దు చేస్తూ.
    * పీడిత, దళిత, వెనుకబడిన వర్గాలవారికి అందిస్తున్నాను శుభవార్త.
    ప్రకటిస్తున్నాను ఈ సదస్సులో మీ సమక్షంలో__ మండల్ కమీషన్ సిఫారసులను పూర్తిగా ఆమోదించామని, అమలుపరుస్తామని.
    * ప్రకటిస్తున్నాను రాష్ట్రంలోని ముస్లిం, క్రైస్తవ మతాల అల్పసంఖ్యాక వర్గాలవారికి, వారి సంక్షేమానికై రాష్ట్రప్రభుత్వం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెలకొల్పనున్నదని.
    * పలు భాషలు మాట్లాడే అల్ప సంఖ్యాకుల వర్గాలవారు అక్కడెక్కడ తగు సంఖ్యలో ఉంటారో అక్కడక్కడ వారి పిల్లలకు పాలనా బోధనకు అవసరమైన సదుపాయాలను, సౌకర్యాలను సమకూరుస్తుంది అని ప్రకటిస్తున్నాను.
    * అహర్నిశలూ దేశ సౌభాగ్యానికీ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి చెమటోడుస్తూ వివిధ పెద్దతరహా పారిశ్రామిక సంస్థలలో శ్రమిస్తూ వున్న కార్మిక సోదరులకు ఆయా సంస్థల యాజమాన్యాల ద్వారా వసతి కల్పనకు నిర్ణయించింది ప్రభుత్వం. మధ్య, చిన్నతరహా పరిశ్రమలలో వున్న శ్రామికులకు ప్రభుత్వమే గృహనిర్మాణానికి సహాయమందిస్తామని తెలియజేస్తున్నాను.

    
    * దిక్కులేక, మొక్కులేక, మొరాలకించే నాథుడు లేక విధిరాతనబడి నికృష్ట జీవితాన్ని గడుపుతున్న విధవ ఆడపడుచులకు సాలుసరి రూ. 1800 మించి ఆదాయం లేనివారికి నెలకు రూ.50 పింఛన్ ప్రకటిస్తున్నాను ఈ సదస్సులో.
    * 'నాన్నా అన్నం తిన్నావా, బడికి పోతున్నావా' అని ఆత్మీయంగా పలుకరించి మంచి చెడులు గమనిస్తూ తన కౌగిలిలో ఓదార్చే అమృతవల్లి తల్లిని, ఆదరించే తండ్రిని దురదృష్టవశాత్తు పోగొట్టుకొని గాలిలో ఎగిరే చిగురాకులా గతితప్పిన జీవితాన్ని విధిరాతకు వదిలిపెట్టిన అనాధ బాల బాలికల సంక్షేమానికి శరణాలయాలను ఇకమీదట తానుగా నిర్మించి నిర్వహించాలన్నది ఈనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.
    * మైళ్ల తరబడి విద్యా సముపార్జనకు వెళుతున్న పన్నెండు సంవత్సరాల లోపున్న చిట్టి దేవుళ్లకు, చిన్ని తమ్ముళ్లకు, చిన్నారి చెల్లెళ్లకు పాఠశాలలకు పోయి రావటానికి రాష్ట్రమంతటా ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నామని ప్రకటిస్తున్నాను.
    * ప్రతి జిల్లాలో ఒక క్రీడా సాంస్కృతిక సమగ్ర వికాస కేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించుకొంది. క్రమశిక్షణా బద్దంగా యువశక్తిని సమీకరించి, అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లిస్తూ సాంస్కృతిక వికాసంతో అత్యున్నత స్థాయి క్రీడాకారులుగా, కళాకారులుగా మలచాలని ప్రభుత్వోద్దేశం. అదేవిధంగా బాల బాలికలను దేశభక్తి పూరితులైన మంచి నడవడిగల ఆదర్శ పౌరులుగా, ఉన్నత విద్యా విశేషాలతో తెలుగుబిడ్డలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం. ఈ కార్యకలాపాలకు కార్యాలయంగా తెలుగు సంస్కృతికి నిలయంగా నిర్మించబడుతుంది ప్రతి జిల్లాలో ఒక విజ్ఞాన మందిరం.
    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra