Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


                                  ముప్పది తొమ్మిదవ సూక్తము

        ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - బృహతి.


    1. మరుత్తులారా ! మీరు సర్వమును కదలించువారు. మీ బలము అపారము. మీరు అంతరిక్షము నుండి ఎపుడు ఊడిపడుదురో ? ఏ యజమాని స్తవము విందురో ? ఏ యజమాని క్రతువున ఉందురో ? ఎవరికి ఎరుక ?

    2. మరుత్తులారా ! శత్రుసంహారమునకు మీ ఆయుధములు స్థిరములు కావలెను. శత్రువులను ప్రతిబంధించుటకు మీరు దృఢచిత్తులు కావలెను. మీ బలములు కీర్తనీయములు కావలెను. మా యందు కపటము చూపిన వారి బలమును మీరు హరించవలెను.

    3. మరుత్తులారా ! మీరు సకలమును వహించగలరు. చెట్లను కూల్చగలరు. కొండలను విసరగలరు. అట్లయినను చెట్లమధ్య నుండి, కొండల సందులనుండి సాగుదురు.

    4. మరుత్తులారా ! మీరు శత్రు హింసకులు. ఏ లోకమునను మీకు శత్రువులు ఉండరు. మీరు రుద్ర పుత్రులు. మీ ఐకమత్యము బలపడవలెను. మీ బలము విస్తరించవలెను. శత్రువులను అణచవలెను.

    5. వృక్షసంతతిని ఊపివేయుచు, పర్వతములను కదిలించుచు మరుత్తులారా ! మదించిన మనిషివలె మీరు సర్వత్ర సంచరించుడు. సర్వయావిశ

    6. మరుత్తుల రథమునకు రెండు ఆడ దుప్పులు, మధ్యన ఎర్రని మగదుప్పి అమర్చబడినది. అంతరిక్షమున సాగు మరుత్తుల రథము ధ్వనులు భూమి మీద వినిపించుచున్నవి. అది విని నరులు వడకుచున్నారు. ఇతరులను వడకించుచున్నారు. భీభయన్తమానుషాః

    7. రుద్ర పుత్రులారా ! మా సంతానమును రక్షించవలసినదిగా వేడుకొనుచున్నాము. మీరు పూర్వము కణ్వుని రక్షించినారు. అట్లే యజమానిని రక్షించుడు.

    8. మరుత్తులారా ! మీచేతనో, మరే మర్త్యులచేతనో ప్రేరేపించబడిన శత్రువు మా మీదకు వచ్చుచున్నాడు. అట్టి శత్రువునకు అన్నము, బలము, రక్షణ లేకుండ చేయుడు.

    9. మరుత్తులారా ! మీరు పరిపూర్ణముగా యజింపతగినవారు. మెరుపులు వానకు ఎదురుగావచ్చును. అట్లే మమ్ము రక్షించుటకు మీరు ఎదురుగా రండు. యజమానిని పోషించుడు.

    10. మరుత్తులారా ! మీరు చక్కని దాతలు. సమస్త బలవంతులు. సర్వమును కదిలించు శక్తిగలవారు. ఋషులను ద్వేషించువారిమీద, వారిని వధించు ఆయుధములు ప్రయోగించుడు.

                                     నలుబదవ సూక్తము

        ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు, దేవత - బ్రహ్మణస్పతి, ఛందస్సు - బృహతి.


    1. బ్రహ్మణస్పతీ ! మేము దేవతలను ఆరాధించువారము. నిన్ను ఆహ్వానించుచున్నాము. లెమ్ము, ఉత్తిష్ఠ. దాతలగు మరుత్తులారా ! మా దరికి రండు. ఇంద్రా ! నీవు బ్రహ్మణస్పతితో సోమపానము చేయుము.

    2. బ్రహ్మణస్పతీ ! శత్రువువద్ద ఉన్న ధనము తనకు వచ్చుటకుగాను నరులు నిన్నే స్తుతించుచున్నారు. మరుత్తులారా ! మిమ్ము అర్థించువారికి మంచి అశ్వసంపద, పరాక్రమ సంపద ప్రసాదించుడు.

    3. బ్రహ్మణస్పతీ ! మా వద్దకు రావలెను. సత్యవతి అగు వాగ్దేవి మాలో ప్రవేశింపవలెను. యజ్ఞము నదులకు హితకరమయినది. సమృద్ధమగు పంక్తి భోజనము గలది. దేవతలు మమ్ము యజ్ఞములకు గొనిపోవలెను.

    4. ఋత్విజునకు ఇవ్వవలసిన ధనము పూర్తిగా ఇచ్చు యజమానికి అక్షయమగు అన్నము కలుగును. శత్రువులను హింసించునది. ఇతరులకు లొంగనిది అగు మనువు కూతురు ఇళను యజమాని కొఱకు యజించుచున్నాము.

    5. ఇంద్ర, వరుణ, మిత్ర, అర్యమ దేవతలు నివాసము ఉన్న సామవేద మంత్రమును హోతవాక్కున, బ్రహ్మణస్పతి ఉచ్ఛరించవలెను.

    6. బ్రహ్మణస్పత్యాది దేవతలారా ! సుఖము కలిగించునది, నిర్దుష్టమగునది అగు ఆ మంత్రమును యజ్ఞములందు పఠింతుము. ఆ మంత్రము దేవతలందరికి చేరగలదు. విశ్వేద్వామానో అశ్నవత్

    7. దేవతలను యజించుచున్న నరుని బ్రహ్మణస్పతి మాత్రమే పొందగలడు. దర్భలను కూర్చుకున్న యజమానిని బ్రహ్మణస్పతి మాత్రమే పొందగలడు. హవ్యములు ఇచ్చువాడు యజన స్థాపనముకు బయలుదేరినాడు. పుత్ర, పౌత్రాదులు, బహుధనముగల గృహమున ప్రవేశించినాడు.

    8. బ్రహ్మణస్పతి తన బలమును పెంచుకొనుము. వరుణాది రాజుల సాయముగొని శత్రువును వధించును. భయమందు సహితము ధీరుడు అగును. వజ్రాద్యాయుధములు గల బ్రహ్మణస్పతిని యుద్దములందు ఎదిరించువారులేరు. అతనిని నిలుపగలవారుగాని, ఉల్లంఘించగలవారుగాని లేరు.

   
    నలువది ఒకటవ సూక్తము, ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు, దేవత 1-3,
        7-9 వరుణ, అర్యమ, మిత్రులు, 4-6 ద్వాదశాదిత్యులు, ఛందస్సు-గాయత్రి.


    1. వరుణ, మిత్ర, అర్యములు అధిక జ్ఞానవంతులు. వారి రక్షణపొందినవారు శత్రువును సులభముగా ఓడింతురు.

    2. వరుణాదులు ఏ యజమానిని తమ బాహువులుగా భావింతురో, ఎవనికి సంపదలు ఇత్తురో, ఎవనిని శత్రువులనుండి కాపాడుదురో ఆ యజమాని అన్యభయములేక వర్ధిల్లును.

    3. వరుణాదులు కరుణించిన యజమాని యొక్క చొరరాని శత్రు స్థానములను నాశనము చేయుదురు. ఆ యజమాని శత్రువులను, పాపములను హరింతురు.

    4. ఆదిత్యులారా ! మీ మార్గము సుగమము నిష్కంటకము అయినది. మీరు యజ్ఞమునకు విచ్చేయుడు. ఇచ్చట అయోగ్యమగు హవిస్సులేదు. వాత్రావఖాదో అస్తినః

    5. ఆదిత్యులారా ! మీరు అధినాయకులు. మీరు నేతృత్వము వహించిన యజ్ఞము మీకు అనుభవ యజ్ఞము కాగలదు.

    6. ఆదిత్యులారా ! మీరు నేతృత్వము వహించి పూర్తిచేయించిన యజ్ఞపు యజమాని ఎవరితోను బాధింపబడడు. సర్వసంపదలను, తనకు సాటివచ్చు సంతానమును పొందును.

    7. ఋత్విజులను మిత్రులారా ! మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు మహితాత్ములు. అంతటి వారికి తగిన స్తోత్రము సాధించగలమా ?

    8. మిత్రాది దేవతలారా ! దేవతలను ఉపాసించు యజమాని తనను హింసించు వారిని గురించిగాని, దుర్భాషలాడు వారి గురించిగానినోరు విప్పడు. అతడు తన సంపదలతో మిమ్ము సేవించుచునే ఉండును.

    (ఇది ఫలమును అభిలషించని యజ్ఞము)

    9. దుష్ట వాక్యము కోరరాదు. దుష్టునకు భయపడవలెను. జూదరి పాచిక తనచేత ఉన్నంతవరకే పొంగును. పందెము పడెనా తేలిపోవును. దుష్టుని విషయమున భయము సహితము అంతమాత్రమే !

        నలుబది రెండవ సూక్తము - ఋషి - ఘోరనామ ఋషిపుత్రుడు కణ్వుడు,
                      దేవత - పూష, ఛందస్సు - గాయత్రి.


    1. పూషా ! నీవు జలద మేఘ పుత్రుడవు. మమ్ము గమ్యమునకు నడిపింపుము. మా పాపములను పారదోలుము. మాకు మార్గదర్శకుడవు అగుము. మా ముందు నడుపుము.

    2. పూషా ! మా శత్రువు మమ్ము హింసించుచున్నాడు. మా ధనమును అపహరించుచున్నాడు. మమ్ముమించిన శక్తిగలవాడయినాడు. అతడు మా మార్గములను నిరోధించుచున్నాడు. మా శత్రువును మాదారి నుండి తొలగింపుము.

    3. మా శత్రువు మా మార్గమున అడ్డుతగులు దొంగ ! కుతంత్రము పన్నువాడు. పూషా ! మా శత్రువును మా మార్గము నుండి దూరముగా తొలగింపుము.

    4. పూషా ! వాడు ఎవడో చెప్ప వీలుపడదు. తెలిసినట్లు తెలియనట్లు దొంగిలించును. అరిష్టములు కోరుచుండును. అట్టివానిని నీ కాలికింద తొక్కి పెట్టుము.

    5. పూషా ! నీవు జ్ఞానివి. శత్రు సంహారకుడవు. మా పితరులను నడిపించువాడవు. అంతటను నీ రక్షణ కోరుచున్నాము.

    6. పూషా ! నీవు సకల భాగ్యవంతుడవు. మా ప్రార్థన మన్నింపుము. ధనములను దానముగా ప్రసాదించుము. ధనాని సుషణాకృధి

    7. మమ్ము బాధించు శత్రువులను దూరముగ తొలగించుము. మమ్ము సన్మార్గమున నడుపుము. మాకు రక్షణ కలుగచేయుము.

    8. పూషా ! మమ్ము సస్యశ్యామల ప్రదేశమునకు తీసికొనిపొమ్ము. దారిలో చింతల లేకుండ చేయుము. మాకు రక్షణ కలుగచేయుము.

    9. పూషా ! మమ్ము అనుగ్రహింపుము. మా ఇంటినిండుగ సంపదలు ఉండునట్లు చేయుము. మాకు కడుపునిండ అన్నము పెట్టుము. మాకు రక్షణ కలుగచేయుము.

    10. పూషుని నిందింపము. వేద సూక్తముల సుతింతుము. అతడు దర్శనీయుడు. అతనిని సంపదలు ప్రసాదించవలసినదిగా అర్ధింతుము.

        నలుబది మూడవ సూక్తము, ఋషి - ఘోరనామఋషి పుత్రుడు కణ్వుడు.

                దేవత 1-2,4-6 రుద్రుడు, 3 మిత్రుడు, 7-9 సోముడు
                      ఛందస్సు - 9 అనుష్టుప్ - మిగిలినవి గాయత్రి.

    1. రుద్రుడు జ్ఞానవంతుడు. వృద్ధిచెందినవాడు. వరమును ఇచ్చువాడు. ఆ రుద్రుని మేము సుందరములగు స్తోత్రముల ఎప్పుడు నుతించగలమో !

    2. భూమి రుద్ర సంబంధమగు ఔషధములు కలిగి ఉండవలెను. మా సేవకులకు, పశువులకు, సంతానములకు రుద్రియమగు ఔషధములు లభించవలెను.

    3. మిత్రుడు, వరుణుడు, రుద్రుడు, అనుగ్రహించు సకల దేవతలు మమ్ము కరుణించవలెను.

    4. రుద్రుడు స్తుతులకు ప్రభువు. యజ్ఞములకు ప్రభువు. అతనివద్ద జలరూప ఔషధములు, "జలాహ భేషజమ్" ఉన్నవి. బృహస్పతి పుత్రుడు, 'శంయు'నకు లభించిన సుఖములు మాకు ప్రసాదించమని రుద్రుని ప్రార్థించుచున్నాము.

    5. రుద్రుడు సూర్యునివలే ప్రకాశించువాడు. బంగారమువలె ప్రియమయినవాడు. "శ్రేష్ఠోదేవావాం" దేవతలలో శ్రేష్ఠుడు.

    6. మా గుఱ్ఱములకు, మగ, ఆడ మేకలకు, నర నారీజనులకు, గోవులకు రుద్రుడు సులభ సుఖములు కలుగ చేయవలెను.

    7. సోమదేవా ! వందమందికి సరిపడు సంపద ఇమ్ము. బలము కలిగించు ఆహారము ప్రసాదించుము.

    8. సోమా ! యజ్ఞములను చెరచువారును, శత్రువులును మమ్ము బాధించకుండ చేయుము. మాకు కలిగిన అన్నమును, బలమును కాపాడుము.

    9. సోమా ! నీవు అమరుడవు. ఉత్తమ స్థానమందు ఉన్నవాడవు. అట్టి నిన్ను నీ ప్రజను సర్వ సన్నద్ధమగు యజ్ఞ గృహమున ప్రధానుని చేసినాము. నిన్ను సర్వాభరణ శోభితుని చేయుచున్నాము.

                      (ప్రథమ మండలమున ఎనిమిదవ అనువాకము సమాప్తము)

    ఆలోచనామృతము :

    రుద్రదేవుడు ఈ సూత్రమున తొలిసారి దర్శనము ఇచ్చినాడు.

    ఈ సూక్తపు తొలి మంత్రమున రుద్రస్తవములు రావలసి ఉన్నవి అని వచించినాడు.

    రుద్రుని రుద్రియమగు ఔషధములకును, ఉదక ఔషధములకును దేవతగా స్తుతించినాడు.

                  తొమ్మిదవ అనువాకము - నలుబది నాలుగవ సూక్తము

            ఋషి - కణ్వపుత్రుడు ప్రస్కణ్వుడు, దేవత - అగ్ని, ఛందస్సు - బృహతి.

    1. అగ్నీ ! నీవు అమరుడవు. సకల భూతములను తెలిసినవాడవు. గృహములను, ఇతర సంపదలను యజమానికి ప్రసాదించుము. ఉషః కాలముననే దేవతలను తీసికొనిరమ్ము.

    2. అగ్నీ ! నీవు సేవార్హుడవు. దేవదూతవు. హవ్యవాహనుడవు. యజ్ఞమునకు రథము వంటివాడవు. అశ్వినులను, ఉషస్సును కూడుకొని రావలసినది. మాకు బలమును ఇచ్చు ఆహారమును ప్రసాదింపుము.

    3. అగ్ని దూత, నివాసకారణుడు, బహుజనప్రియుడు, ధూమధ్వజుడు, ప్రశస్తకాంతివంతుడు. ఉషస్సుతో ఏతెంచి యజ్ఞమును సేవించువాడు. అట్టి అగ్నిని ఉపాసించుచున్నాను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra