2. పిశితాశన పిశాచములారా! సంహార కారకరుద్రుడు మీ మెడలు తెగ నరకును గాక. యాతనలు కలిగించు యాతుధానులారా! ఆ రుద్రుడే మీ ప్రక్కటెకముకలను విరుచునుగాక శక్తిమంతమగు ఓషధి మిమ్ము యమపురికి పంపునుగాక.
3. మిత్రావరుణులారా! మాకు అభయము కలిగించండి. మీ తేజస్సుచే రాక్షసులను వెనుకకు పంపించండి. అట్లు పంపిన రాక్షసులకు యజమాని గాని, నిలుచు స్థలముగాని దొరకకుండును గాక. వారిలో వారు కొట్టుకొని చత్తురు గాక.
--౦౦౦--
1. జనులారా! ఇంద్రుని జ్యోతి రమణీయము. శత్రు హింస కారకము. అట్టి తేజోవంత మహాజ్యోతిని మీరు అర్చించండి.
2. ఇంద్రుని బలము గెలువరానిది. అది ఇతరులను అణచి వేయగలది. ఇది వరకు అతని బలమును ఎదిరించిన వాడు లేడు. ఇప్పుడు కూడలేడు.
3. ఇంద్రుడు దేవ మనవులకు అధిపతి. అతడు మాకు బంగారు వన్నెగల బహు ధనమును అందించును గాక.
రెండవ సూక్తము - 17
వినియోగము:-
1) అయిదు రుక్కుల తొలి సూక్తముచే రాక్షసాది పీడానివృత్తికి సమిధ సహితముగ పదమూడు ద్రవ్యములను ఆహుతి ఇచ్చునది.
2) ఈ సూక్తపు మలి తృచ - తరువాతి సూక్తపు తొలి తృచ సర్వప్రకార చికిత్సలందు నీరు, పసుపు, నేయి మున్నగు వానిని అభిమంత్రించి త్రావించునది. అగ్ని చయనమున బ్రహ్మ దీనితోనే పురీషాచ్చన్న అగ్ని గుండమును అభిమంత్రించునది.
1. లోకములకు ప్రభువగు అగ్నిని చక్కని స్తుతులచే నుతించండి. అతడు మమ్ము శత్రువులనుండి రక్షించును గాత - "సనః పర్షదతి ద్విషః"
2. అగ్ని తన తీక్ష్ణ తేజమున రాక్షసులను సంహరించుచున్నాడు. "సనః పర్షదతి ద్విషః"
3. అగ్ని దూర దేశపు ఎడారి ఇసుక యందు ప్రకాశించుచున్నాడు - "సనః పర్షదతి ద్విషః"
4. అగ్ని సకల భువనములను వీక్షించుచున్నాడు. అతడు సూర్య రూపమున ప్రకాశింప చేయుచున్నాడు.' "సనః పర్షదతి ద్విషః"
5. భూలోకము మీద అంతరిక్షమున తెల్లని అగ్ని, సూర్యుడు ఉద్భవించినారు. "సనః పర్షదతి ద్విషః"
--౦౦౦--
1. వైశ్వానరాగ్ని మమ్ము రక్షించుటకు బహుదూర ప్రదేశము నుండి యైనను వచ్చునుగాక. మా స్తుతులు అతనిని చేరునుగాక.
2. వైశ్వానరాగ్ని మా వద్దకు వచ్చుచుండునుగాక. వచ్చి మా స్తుతులకు ప్రసన్నుడై యజ్ఞమున చేరునుగాక.
3. వైశ్వానరాగ్ని అంగిరసుల స్తోమ, ఉక్దములను శక్తి వంతము చేసినాడు. అతడు అంగిరులకు కీర్తిని, అన్నమును కలిగించినాడు.
మూడవ సూక్తము - 18
వినియోగము:-
1) తొలి తృచ వినియోగము పూర్వ సూక్తమున చెప్పబడినది.
2) రెండవ తృచ అభిచార దోష నివారణార్ధము అభిమంత్రిత శ్వేత మృత్తికను కుక్కకు వేయునది. సంపాతిత అభిమంత్రిత పాలాశమణిని ఇచ్చునది. 'ఇంగడ హోమం సమిదా ధానం వా కుర్యాత్'
3) రెండవ తృచలోని మూడవ మంత్రముచే అభిచార కర్మమున పిడుగుపడిన చెట్టు యొక్క పదకొండు సమిధలను పెట్టునది.
1. వైశ్వానరాగ్ని యజ్ఞాత్మకుడు. అమృతుడు. జ్యోతిషస్పతి. దీప్యమానుడు. అతనిని మేము నిరంతరము ఉపాసించుచున్నాము.
2. వైశ్వానరాగ్ని సమస్త జనులకు ఫలములు ఇవ్వగలవాడు. దేవతలకు యజ్ఞ హవిస్సులు అందించువాడు. సూర్యాత్మయై కాలపు అవయవ రూపములగు వసంతాది ఋతువులను ఏర్పరచుచున్నాడు.
3. వైశ్వానరాగ్ని వరిష్ఠ ధామములందు ఒక్కడే సామ్రాట్టు అయి విరాజిల్లుచున్నాడు. అతడే భూత భవిష్య ద్వర్తమాన కర్మలకు కారకుడు అగుచున్నాడు.
--౦౦౦--
1. ఇంద్రుడు సహస్రాక్షుడు శాపకర్త అతడు రథమునెక్కి మా వద్దకు వచ్చునుగాక. అతడు మమ్ము శపించు వారిని గొర్రెల మందలోనికి దూరిన తోడేలువలె సంహరించును గాక.
2. శాపమా! మమ్ము విడువుము. బాధించకుము శత్రువులను దహించుము. మమ్ము శపించువారిని - పిడుగు చెట్టును వలె - నాశము చేయుము
3. ఒకడు మేము శపించకున్నను మమ్ము శపించు శత్రువు ఒకడు మా కఠిన భాషణమునకు శపించు శత్రువు. ఈ ఉభయులను కుక్కకు వేసిన పిష్ఠమువలె మృత్యువునకు వేయుము.
నాలుగవ సూక్తము - 19
వినియోగము:-
తేజస్సు కోరువాడు ఇందలి మంత్రములచే సూత్రమందు చెప్పబడిన సింహ వ్యాఘ్రాది ఏడింటిలో ఒకదాని నాభిలోమ మణిని లక్క మరియు బంగారములచే చుట్టి సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది. అట్లే పలాశము మొదలగు పదిశాంత వృక్షశకలముల మణిని ఈ సూక్తముచే సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
ఉత్సర్జన కర్మమున వీనిచే ఘ్రుతాహుతులిచ్చి రసములందు సంపాతములు తెచ్చునది.
1. సింహము, వ్యాఘ్రము, సర్పము, అగ్ని, బ్రాహ్మణ, సూర్యులందు గల త్విష - "ఇంద్రునకు జన్మనిచ్చిన దేవి త్విష మాకు మేము అభిలషించిన వర్చస్సు ప్రసాదించును గాత".
(త్విషః - దీప్తి.)
2. గజము, ఖడ్గమృగము, సువర్ణము, గోవు, మానవులందున్న త్విషయు "ఇంద్రం యాదేవీ సుభగా జజాన సానఐతు వర్చసా సంవిదానా"
3. రథమున, అక్షమున, వృషభమున, అశ్వమున, వాయువున, పర్జన్యునియందు, వరుణుని శోషక బలము "ఇంద్రం యాదేవీ సుభగా బజాన సానఐతు వర్చసా సంవిదానా"
4. రాజన్యులందు, దుందుభి ధ్వనియందు, అశ్వపు వేగమున, పురుషుని ధ్వనియందుగల త్విషయు "ఇంద్రం యాదేవీ సుభగా బజాన సానఐతు వర్చసా సంవిదానా"
--౦౦౦--
1. ఇంద్రునకు మేము అర్పించు హవిస్సు శక్తి యుక్తము, కాంతిమంతము, విజయ వంతము చలనముగలది, యశస్సునిచ్చునది. అది వర్ధిల్లునుగాక. ఇంద్ర దేవా! మా హవిస్సులు స్వీకరించుము. మాకు సర్వశ్రేష్ఠ దృష్టిని, శక్తిని ప్రసాదించుము.
2. ఇంద్రుడు యశస్వి యశోదాత. అతడు మా ముందు ఉన్నాడు. అతనికి నమస్కరించి అర్చించుచున్నాము. ఇంద్రదేవా! స్వయం ప్రేరణచే మాకు రాజ్యము నిమ్ము. నీ దానము వలన మేము యశోవంతులము అగుదుముగాక.
3. ఇంద్రుడు కీర్తికోరుచున్నాడు. అగ్ని కీర్తికోరుచున్నాడు. సోమము కీర్తి కామియై పుట్టినది. నేను సమస్త లోకములందలి సమస్త ప్రాణుల యశస్సును మించిన యశసముడను అగుచున్నాను.
ఐదవ సూక్తము -20
వినియోగము :-
1. తొలి తృచచే గ్రామాదులందు అభయాభిలాషి ఒక దిశన సప్తర్షులను పూజించునది. ఉపస్థానము చేయునది. సేనభాయ నివారణకు కూడ అట్లే చేయునది. ఉపాకర్మమున వీనిచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
2. రెండవ తృచచే గోదానమందు మహావ్రీహీమయ స్థాలీ పాకము మీద శాంతి జలము చల్లి అభిమంత్రించి ఆయుష్కామియగు బాలునకు తినిపించునది.
1. అభయం ద్యావాపృథివీ ఇహాస్తు నోభయం సోమః సవితా నః కృణోతు |
అభయం నోస్తూర్వ2న్తరిక్షం సప్తఋషీణాంచ హవిషాభయం నో అస్తు ||
2. సవితా దేవత మా గ్రామపు నలుదిశల అన్న సమృద్ది కలిగించునుగాక. అపరిమిత శుభములు కలిగించునుగాక. అజాత శత్రువగు ఇంద్రుడు మాకు అభయ ప్రదాత యగునుగాక. రాజన్యుల కోపము అన్యత్ర చేరునుగాక.
3. ఇంద్రదేవా! మా కొరకు నాలుగు దిశలను శత్రు శూన్యములను చేయుము.
--౦౦౦--
1. మనసే చేతసే దియా ఆకూతయ ఉత చిత్తయే |
మత్సై శ్రుతాయ చక్షసే విధేమ హవిషా వయమ్ ||
ఈ అవయవములకు హవిస్సులు అర్పించుచున్నాము.
2. అపానాయ వ్యానాయ ప్రాణాయ భూరిధాయసే |
సరస్వత్యా ఉరూవ్యచే విధేమ హవిషా వయమ్ ||
3. మా దేహమున ప్రాణ రూపమున, అవయవముల రూపమున ఉన్న దేవర్షులు మమ్ము విడువకుందురు గాక. మరణమెరుగని దేవతలు మర్త్యులమగు మమ్ము అనుగ్రహింతురుగాక. మేము జీవించుటకు దీర్ఘాయువు కలిగింతురుగాక.


