పట్నంలో ఒక కల్లోలం లేచింది.
వాస్తవం ఏమిటి? అమ్మకు ఆహారం అందుతుందా?
అందును గురించి చర్చలు జరిగాయి. కొన్ని చోట్ల చర్చలు తీవ్రరూపం దాల్చి కొట్టుకోవడం కూడా జరిగింది. కొన్నిచోట్ల ఉభయపక్షాల వారు పందాలు కూడా వేసుకున్నారు.
అందరి నాలుకలమీదా ఆశ్రమమే నిలచింది.
ఆశ్రమానికి జనం రావడం ఎక్కువైంది.
మంత్రుల నుంచి మామూలు మనుషుల వరకూ ఫలితాన్ని గురించి ఆతురతగా ఎదురుచూడసాగారు.
రోజులు గడుస్తున్నాయి.
ప్రకాశం బృందం కాపలా నిర్విరామంగా సాగుతూంది.
భజన అంతరాయం లేకుండా జరుగుతూనే ఉంది.
ప్రార్థనలు, పూజలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎదురుచూసిన రోజు రానే వచ్చింది!
శుక్రవారం రానే వచ్చింది.
ఆరు రోజులూ సరస్వతికి ఆహారం అందలేదని ధృవపరచుకున్నాడు ప్రకాశం. అయినా అక్కడే ఉన్నాడు. ఆమెలో వచ్చిన మార్పును చూడాలనుకున్నాడు. ఉన్నాడు అక్కడే.
గది తలుపు తెరిచింది సరస్వతి.
అడుగు బయటకు పెట్టింది.
ఆమె బయటికి వచ్చింది.
వేల జనం బయట నిలిచి ఉన్నారు _ ఆమె మీద వారికి భక్తి ఇనుమడించింది.
"జై అమ్మకూ" అన్నారు.
జయధ్వానాలు నినదించాయి!
ప్రకాశం సరస్వతిని చూచాడు.
ఆమె నిగనిగలాడుతూంది.
ఇసుమంత వసివాడలేదు.
ప్రకాశం ముఖం వాడిపోయింది _ వాలిపోయింది _
అతడు ఆమె ఎదుట నుంచొని నమస్కరించాడు.
సరస్వతి ప్రకాశాన్ని చూచింది _ చిరునవ్వు నవ్వింది _ అతని తల నిమిరింది.
"ఆంటీ! తెల్లవార్లూ మీకేమయినా గొడవ వినిపించిందా?" వినయంగా అడిగాడు ప్రకాశం.
"లేదే"
"వీళ్ళంతా తెల్లవార్లూ భజన చేస్తూ కూర్చున్నారు తెలియదా?"
"తెలియదే"
ఆశ్చర్యపడ్డాడు ప్రకాశం. మళ్ళీ అడిగాడు:-
"మీ దగ్గర మహత్మ్యం ఉందా?"
"లేదే. ఎవరన్నారు?"
చకితుడైనాడు ప్రకాశం.
"వీళ్ళందరూ అంటున్నారు" అని జనాన్ని చూపాడు.
"వాళ్ళకు కనిపిస్తుందేమో! నాకు తెలీదు."
ఆ తరువాత సరస్వతి మాట్లాడలేదు.
ఆమె సాగిపోయింది సమాధివైపు.
జనం ఆమె వెంట వెళ్ళిపోయారు.
ప్రకాశం అక్కడే నుంచుండిపోయాడు.
పత్రికలవాళ్ళు అతనిని చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నింటికీ అతని సమాధానం ఒక్కటే ఆమెకు మహాత్మ్యం లేదని.
"అయితే ఏముంది అమ్మ దగ్గర?" ఒకతను ప్రశ్నించాడు.
"ఏదో శక్తి వుంది" ప్రకాశం జవాబు.
పత్రికలవాళ్ళకు కావలసిన జవాబు లభించింది.
శక్తికి "పరా" అనేది జోడించి నాస్తికులు కూడా అమ్మను పరాశక్తిగా అంగీకరించారని ప్రకటిస్తూ, ప్రకాశం చరిత్ర యుక్తంగా పటాలు ప్రకటించాయి పత్రికలు. తాను అలా అనలేదని పత్రికలకు ప్రకాశం రాసిన ఉత్తరాలు ప్రకటించనే లేదు.
ప్రకాశం శ్రద్ధగా అధ్యయనం చేసి ఒక వ్యాసం రాశాడు. భాష అతనిది అట్టే బాగులేకున్నా అతను రాసిందాని సారాంశం ఇది:-
'అభ్యాసం వల్ల అన్నిటినీ సాధించవచ్చు. ఆహారం మానుకోవడం, పక్కవాణ్ణి గురించి పట్టించుకోకపోవడం కూడా ఒక అభ్యాసమే. ఆ అభ్యాసం వల్ల ఊపిరి పీల్చుకోకుండా ఉన్నవారుకూడా ఉండవచ్చు' అని రాస్తూ వేమన పద్యాన్ని ఉటంకించాడు.
"అనగనగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగవేము తీయనగును
సాధనమున పనులు సమకూరుధరలోన
విశ్వదాభిరామ వినురవేమ"
ప్రకాశం వ్యాసాన్ని ప్రచురించిన పత్రికలే ఒకటి _ రెండు. వాటిని ఎవరూ చదువలేదు. కాని ఊపిరి పీల్చుకోవడాన్ని గురించి అతడు రాసింది చదవని వాళ్ళకు కూడా తెలిసింది.
"అమ్మ ఊపిరి గూడా పీల్చడంలేదు" అనే వదంతికి బహుళ ప్రచారం వచ్చింది.
"ఇది యోగ విద్యకు ఒక విజయం" యోగవిద్యావేత్తలు ప్రకటించారు.
"ఆయుర్వేదం ఎన్నడో చెప్పింది. ఆంగ్లేయ నాగరికతకు లొంగి మనం మన వైద్యాన్ని వదులుకున్నాం" ఆయుర్వేద భిషగ్వరులు భారతీయ మహాసంఘం ఘోషించింది.
"వేదకాలపు విజ్ఞానం మృత్యువును సైతం జయించింది" వేదపండితులు ఘంటవాయించి చెప్పారు.
"గాలి ఆడకుండా బతకడానికి వీల్లేదు. గుండె ఆడకుంటే బతకడం అసంభవం" అల్లోపతీ వైద్యులు ఛాలెంజ్ చేశారు.
వాదోపవాదాలు _ చర్చలు _ సమావేశాలు _ ఘర్షణలు _ సెమినార్లు _ పోట్లాటలు జరిగాయి. అప్పుడు అందరికీ ఒక సంశయం వచ్చింది.
"అసలు అమ్మ గాలి పీల్చుకుంటుందా?" అని.


