ప్రకాశం చెంపచెళ్ళుమంది.
ప్రకాశాన్ని చెంపదెబ్బకొట్టి రామయ్య మెరుపులా ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు.
కుర్రాళ్ళు కేకలు పెడ్తూ అతన్ని వెంబడించారు.
పోలీసులు చకచకా వచ్చి కుర్రాళ్ళను అడ్డగించారు.
వారిచుట్టూ వలయం తీర్చినుంచున్నారు.
"ప్రజాశత్రువులు నశించాలె"
"దొంగనాటకాలు నశించాలె"
"ఆశ్రమం గుట్టు బయటపెట్టాలె"
"విప్లవం వర్థిల్లాలె. ఇన్ఖిలాబ్ జిందాబాద్"
నినాదాలు ఆశ్రమంలో ప్రతిధ్వనించాయి. అక్కడి శాంతి అశాంతిగా మారింది. శివరావు, రామయ్య, శేషయ్య గుసగుసలాడుకున్నారు _ అంటే సంప్రదించుకున్నారు. రామయ్య తాను వెళ్ళలేనన్నాడు _ అతడు ప్రకాశాన్ని ముఖాముఖి చూడలేకపోతున్నాడు. అతని మనసులో ఏవో సుడిగాలులు పెనవేసుకుంటున్నాయి. తన కొడుకే తనకు శత్రువు అవుతున్నాడు. అదీ అతని మధన _ వ్యధ _ బాధ. శేషయ్య ముందడుగు వేయనన్నాడు _ అతనికి భయం! శివరావుకు తప్పలేదు. గీత గుంపులో లేదు. అదీ శివరావు ధైర్యం. అందుకే కదిలాడతను.
పిల్లల ముందు పిరికివాళ్ళైనారు పెద్దలు!
అయినా ధైర్యంగా వచ్చాడు శివరావు. మొన్నటివరకూ పోలీసు అధికారి.
పోలీసులు అతనికి సలాం కొట్టారు.
అతను కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు.
"ఏం కావాలి నాయనా మీకు?" శాంతంగా అడిగాడు శివరావు.
"మా ప్రకాశాన్ని కొట్టాడు రామయ్య. క్షమాపణ చెప్పుకోవాలి" ఒక కుర్రాడు కేక పెట్టాడు.
"అంతేనా నాయనా కావలసింది" ప్రకాశాన్ని అడిగాడు శివరావు. ప్రకాశం తనను ఎదిరించలేడని తలుసతనికి.
ప్రకాశం చెంప పొంగి ఉంది.
శివరావును చూచాడు ప్రకాశం.
తలవంచుకున్నాడు. అన్నాడు:-
"అంకుల్! మేరు కొట్టడం మేం పడటం మనిషి పుట్టిన్నాటి నుంచీ ఉంది."
శివరావు గుండెల్లో ఎక్కడో సూది గుచ్చుకుంది.
ప్రకాశం చెప్తున్నాడు. అతని ధ్వనిలో ఉద్రేకం లేదు. మాటలు పోటుల్లా ఉన్నాయి.
"రామయ్య మస్తాన్ మామను చంపించిండు. మా అమ్మను జేలుకు పంపిండు. మల్లయ్య మామ పొలం గుంజుకున్నడు. ఒక హత్య చేయించిండు. హుసేన్ మామను జేలుకు పంపిండు. బూబమ్మ చావుకు కారకుడయిండు. ఇప్పుడు ఆశ్రమంతో చేరింది. నన్ను కొట్టిండు. నన్ను కొట్టిండు ఫరవాలేదు. సరస్వతమ్మ పేర ప్రజల్ను మోసం చేస్తున్నడు. అన్నం లేకుండ ఎవరూ ఉండలేరు. ఇందులో ఏదో నాటకం ఉన్నది. మేం కాపలా ఉంటం."
ప్రకాశం మాటలు విద్యుత్తులా పనిచేశాయి శివరావుమీద. శివరావుకు తన పూర్వ చరిత్ర గుర్తుకు వచ్చింది. అశాంతి చెలరేగింది. గుండెలో ఒక దుమారం లేచింది. ప్రకాశం చెప్పింది వాస్తవం. ప్రకాశం ఎప్పుడూ వాస్తవమే చెపుతాడు. అదే శివరావుకు అతనిమీద గౌరవం. ఇంతకూ శివరావు జవాబు చెప్పలేకపోయాడు. అయినా అన్నాడు:-
"కాపలా ఉంటామంటారు. దేవి మహాత్మ్యాన్ని శంకిస్తామంటారు. ఉండండి. కాపలా ఉండండి. మీకే విశ్వాసం కలుగుతుంది"
ఆ తరువాత అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు శివరావు. ఆలోచిస్తే ఆశ్రమం కంటే ప్రకాశమే వాస్తవం అనిపించింది అతని అంతరాత్మకు. ప్రకాశం మహ్నోతుడుగా కనిపించాడతనికి. విశ్వరూపంలా కనిపించాడు. సత్యస్వరూపంలా కనిపించాడు. తుదకు కృష్ణపరమాత్మలా కనిపించాడు.
ఆశ్రమాన్ని తలచుకున్నాడు _ కాదు _ చూచాడు. అది ప్రకాశం ముందు బొమ్మరిల్లులా కనిపించింది. అవాస్తవంగా కనిపించింది. అసత్యంగా కనిపించింది. హ్రస్వరూపంలా కనిపించింది. చీకటిలా కనిపించింది.
ఏది వాస్తవం?
ఏది అవాస్తవం?
ఏది సత్యం?
ఏది అసత్యం?
ఆలోచనలు అతని మనసును మధనపెట్టాయి. మెదడును చీల్చాయి. ఉక్కిరిబిక్కిరి అయినాడు. తుదకు నిర్ణయానికి వచ్చాడు.
తాను ముదివగ్గు. ఎదిరించే వయసు కాదు తనది. జీవితంలో ఓడిపోయాడు. ఓటమి తన సొత్తు. తనకు ధైర్యం లేదు. అధైర్యాన్నీ, ఓటమినీ తనకు గుర్తురాకుండా కాపాడుతూంది ఆశ్రమం. ఆశ్రమం తప్ప అన్యం దిక్కులేదు తనకు. అదే దిక్కు. ఆశ్రమాన్ని తాను వదలడు.
"వదలను" అనే నిర్ణయానికి వచ్చి లేచాడు. సరస్వతి గది ముందుకు వెళ్ళి మొక్కాడు. కొంత శాంతి లభించింది.
"హరేరామ హరేకృష్ణ" భజనలో మునిగిపోయాడు _ అంతే _ మళ్ళీ ప్రకాశం తలపుకు రాలేదు.
"హరేరామ _ హరేకృష్ణ"
ఆ రాత్రి భజన సమాజం వారు సరస్వతి గదిముందే బైఠాయించారు _ తెల్లవార్లూ భజన సాగించారు.
తెల్లవార్లూ మేలికతో ఉండి కాపలా కాస్తున్నారు ప్రకాశం బృందం.
పోలీసులు జట్లు జట్లుగా రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారు _ కుర్రాళ్ళు గోలచేయకుండా వారిని నియమించింది ప్రభుత్వం.
ఆ రాత్రి గడిచింది.
తెల్లవారి దానికి బాగా ప్రచారం వచ్చింది. ప్రకాశాన్ని తెగడుతూ రాశాయి కొన్ని పత్రికలు. పొగడుతూ రాశాయి కొన్ని. అందరూ అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు.


