బలరామయ్యకు అల్లోపతీమీద విశ్వాసం తగ్గింది. ఆయుర్వేద వైద్యులు ప్రతిజ్ఞలు చేశారు. బాలరామయ్య ఆయుర్వేద వైద్యశాలకు చేరారు. అక్కడ మందులు మింగారు _ మర్దనలు జరిగాయి _ గుణం కనిపించలేదు.
యునానీ హకీములు తాము నయం చేస్తామన్నారు. అక్కడికి చేరారు. అదీ అంతంత మాత్రంగానే ఉంది. ఆ తరవాత హోమియోపతి వారు మీసాలు మెలేశారు. అక్కడికీ చేరాడు. అక్కడా అంతే.
బాలరామయ్య బాధ చెప్పరాకుండా ఉంది. భరించలేనంతగా ఉంది. ఈ బాధకన్నా చావే మేలనుకున్నాడు. మనసు గిలగిల తన్నుకుంది. చావు సైతం దూరం నుంచే చిరునవ్వు నవ్వుతూంది. ఘోషపడుతున్నాడు. గాలిలో దీపంలా రెపరెపలాడుతున్నాడు. అప్పుడతను భగవంతుని ఆశ్రయించాడు. ఆశ్రయించాడే కాని మంత్రి పదవి వదులుకోలేదు.
అలాంటి సమయంలో వచ్చారు శేషయ్యా, రామయ్యా, యాదగిరి బలరామయ్య దగ్గరికి. ముగ్గురూ సరస్వతి మహత్మ్యాన్ని వర్ణించారు. కుష్టురోగులు సైతం బాగవుతున్నారన్నారు. ఆశ్రమానికి చేరవలసిందన్నారు.
బలరామయ్యగారు ఆలోచించారు. మనసు అటు లాగలేదు. మాట రావడం లేదు. ఏమనాలో అర్థం కాలేదు. తుదకు కష్టంగా అన్నారు:-
"పెండ్లాం కాళ్ళు ఎట్ల పట్టుకుందునయా!" అని.
"అమ్మ _ అమ్మ తప్పు _ తప్పు అట్లనకండి" అని బలరామయ్య చెంపలు వాయించాడు శేషయ్య.
"దొరవారూ! ఇప్పుడామె పెండ్లం కాదు. అమ్మ. జగదాంబ. మహాతల్లి. సాక్షాత్తు ఆదిశక్తి. ఆమె దర్శనం చేసుకోండి. అంతేచాలు. రోగం చేతితో తీసేసినట్లు పోతుంది. నా మాట నమ్మండి" అన్నాడు.
రామయ్య వంత పాడాడు.
యాదగిరి బలపరిచాడు.
బలరామయ్య అన్నింటికీ సిద్ధంగా ఉన్నాడు. సరే నన్నాడు.
బలరామయ్యను ఆశ్రమానికి చేర్చారు పెద్దలు.
శుక్రవారంనాడు సరస్వతిని దర్శించుకున్నాడు బలరామయ్య. ఆమెను చూచి ఆశ్చర్యపడ్డాడతను. ఈ సరస్వతి ఆ సరస్వతి కాదు. అన్నం లేనట్లు లేదామె. అమృతం సేవించినట్లుంది. నిగనిగలాడుతూంది. వయసు పెరుగుతున్నట్లు కాదు. తరుగుతున్నట్లుంది. మళ్ళీ వయసు వస్తున్నట్లుంది. చెక్కిళ్ళు మెరుస్తున్నాయి. కనులలో ప్రసన్నత ఉంది. వదనంలో తేజస్సు ఉంది. అతడి ఓడిపోయాడు.
"అమ్మా!" అన్నాడు. అతడు అనగలిగింది అంతే. తరవాత మాట పెకల్లేదు. లేవని చేతితో దోసిల్లొగ్గినట్లు చూచాడు.
సరస్వతి అతనిని ఆపాదమస్తకం చూసింది. అలా చూస్తూ ఉండిపోయింది. అరచేత్తో తల రాచింది అంతే.
"అమ్మా! నాకు ఆరోగ్యం ప్రసాదించు" అన్నాడు. మాటలు స్పష్టంగా వచ్చాయి. అదే అలా రావడం మొదటిసారి.
జనం చిత్తరువులా చూచారు.
బలరామయ్య ఆశ్చర్యంలో మునిగి తేలారు!
బలరామయ్య ఆశ్రమంలోనే ఉండిపోయాడు. అతనికి రోగం అంతగా తగ్గలేదు.
మంత్రిగారు ఆశ్రమంలో చేరడం మహా వార్త అయి వ్యాపించింది.
మంత్రులు ఆశ్రమానికి రావడం సాగించారు.
వారు దేవి దర్శనం చేసుకోసాగారు.
ముఖ్యమంత్రి కూడా దేవికి భక్తుడైపోయాడని చెప్పుకున్నారు జనం. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నది దేవియేననీ, ముఖ్యమంత్రి నిమిత్తమాత్రుడనీ వదంతులు వ్యాపించాయి.
శివరావు ఉద్యోగం నుండి విరమించాడు. దేవి భక్తులు అయిపోయాడు. ఎక్కువభాగం ఆశ్రమంలోనే ఉంటున్నాడు. గీత విషయం అట్టె పట్టించుకోవడం లేదు. అతనికి ఐహికచింత అడుగంటుతూంది. పారలౌకికచింత పట్టుకుంటూంది. ఆశ్రమంలో హరినామ సంకీర్తన సంఘం స్థాపించాడు. "రాత్రింబవళ్ళు భజనలోనే గడుపుతున్నాడు. గతం తలచుకుంటే అతనికి ఒళ్ళు జలదరిస్తూంది. చేసిన ఘోరాలు రక్కసుల రూపంలో వెన్నంటుతున్నట్లు అనిపిస్తూంది. భజనలో అతనికి అవి కనిపించటంలేదు. అందుకే భజనను ఆశ్రయించాడతను. రామునీ, కృష్ణునీ ఆశ్రయించాడు.
'హరే రామ, హరే కృష్ణ'లో మునిగిపోతున్నాడు.
బలరామయ్య కూడా భజనలో పాల్గొంటున్నాడు.
శివరావు ఆ బృందానికి నాయకుడైనాడు!
రామయ్య ముఖ్యమంత్రికి సన్నిహితుడైనాడు.
కొన్ని పత్రికలు ఆశ్రమ వైభవాన్ని చూచి సహించలేకపోయాయి. ఆశ్రమం అవినీతికి ఆలవాలం అయిందన్నాయి. ప్రజలకు మత్తుమందు పెట్టడానికి ప్రభుత్వం ఆశ్రమాన్ని వాడుకుంటూందన్నాయి. ప్రభుత్వం తాం తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆశ్రమాన్ని ఆశ్రయించిందన్నాయి. ఒక పత్రిక అసలుకే ఎసరు పెట్టింది. సరస్వతి దగ్గర మహాత్మ్యం లేనేలేదన్నది. చాటుగా ఆమెకు అన్నపానీయాలు అందించబడుతున్నాయని శంకించింది. ఇదంతా బూటకం అంది. ఆ బండారం బయటపెట్టాలంది. దాంతో చిచ్చురేగింది యువకుల్లో. అసలు వ్యవహారం తేల్చుకోవాలనుకున్నాడు ప్రకాశం. కొందరు కుర్రాళ్ళు అతనికి బాసటగా నిలిచారు. ప్రకాశం బృందం ఆశ్రమానికి చేరింది. కాపలా కాస్తామంది. రామయ్య అడ్డు తగిలాడు. వీల్లేదన్నాడు. అయితే అంతా బూటకమే _ నాటకమే అన్నాడు ప్రకాశం. రామయ్య మంత్రి కావడానికి ఆడుతున్న నాటకంలో ఇదొక రంగం అన్నాడు.
రామయ్య తల తిరిగిపోయింది.
రామయ్య బొమ్మలా నుంచున్నాడు.
తన కొడుకే తననిలా అంటున్నాడు. తన కొడుకు కాబట్టే తన రహస్యాలు తెలుసుకుంటున్నట్లున్నాడు అనుకున్నాడు.
ప్రకాశం ఉద్రేకంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు.
రామయ్య ప్రతిరూపంలా ఉన్నాడు ప్రకాశం.
తననే తన ముందు చూస్తున్నాడు రామయ్య.
ప్రకాశం ఉద్రేకంలో ఉన్నాడు. అది గమనించేంత ఓపిక లేదతనికి.
"దోపిడీకి మరొక రూపం. దొంగ నాటకాలకు పరాకాష్ట. మీరు చేయించే హత్యలు, దోపిళ్ళు, మానభంగాలు బయటపడుతున్నాయి. ప్రజలు తెలుసుకుంటున్నారు. మేలుకుంటున్నారు. ప్రజాశత్రువులను కనిపెడ్తున్నారు. విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చతురులు, తెలివిగలవాళ్ళు, అది కనిపెట్టారు. ఈ నాటకాలకు దిగారు. ప్రజల్ను మధ్యపెట్టచూస్తున్నారు. మనిషి తిండీ, నీళ్ళు లేక ఉండలేడు సరస్వతితో వేషాలు వేయిస్తున్నారు."


