బైట పడుకోటం అలవాటు లేదేమో అందులో చలిగాలి రివ్వున వీస్తుందేమో. దానికి తగినట్టు భవదీయుడి సంసారంలో దుప్పట్లు నిండుకున్నాయేమో ఆ రాత్రంతా యమయాతన అనుభవించేడు. అయినా జగన్నాథం కథతో యివన్నీ మరిచిపోయేను.
ఎప్పుడు నిద్రపట్టిందో గమ్మత్తుగా పట్టేసింది. ఉదయం సీత వొచ్చి జగన్నాధాన్ని లేపుతూండగా మేలుకున్నాను. వాడికంటే ముందు నేను నిద్రలేవటం చూసి ఆ పిల్ల గుమ్మం చాటుకి వెళ్ళిపోయింది.
ఆ మర్యాదా, ఆ మన్ననా నన్ను ముగ్ధున్ని చేసిన మాట నిజం.
జగన్నాధాన్ని లేపాను. వాడు వొళ్ళు విరుచుకుంటూ, గట్టిగా ఆవులించి, అష్టవంకరలు తిరుగుతూ కళ్ళు విప్పాడు.
"అప్పుడే తెల్లారిందిట్రా ... సీతా..." అని గావు కేక పెట్టాడు.
"ఆ అమ్మాయి ఎప్పుడో లేచిందోయ్" అన్నాను.
కాలకృత్యాలు ముగించుకున్న పిదప కాఫీగట్రా పుచ్చుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళేముందు కృతజ్ఞతా సూచకంగా సీత తన రెండు చేతులూ జోడించి నాకు నమస్కరించింది.
'ఎంత చక్కటి పిల్లకి మరెంత చక్కటి సంస్కారమూ" అని ఎంతో మురిసిపోయాను. భగవంతుడ్ని ధ్యానించి రెండు చేతులూ జోడించి
"భగవంతుడా! నువ్వన్నమాట నిజమని గట్టిగా నమ్మేవాళ్ళల్లో నేనొకడ్ని. నీమీద పూర్తి విశ్వాసముంచాను. ఈ ఒక్క మేలు చేయి చాలు. అదీ నా గురించి కానే కాదు. ఆ జగన్నాధం, సీత. ఇద్దర్ని చల్లగా చూడు. వాళ్ళని అనురాగ దంపతులుగా చేసే బాధ్యత నీది. అది నీ తలకు మించిన కార్యమేమీ కాదు. కాదూ?..."
* * *
బందరు పట్టణాన్ని వొదిలిపెట్టలేని నేను (సెలవల్లో) తప్పనిసరిగా భావించి మా వూరు వెళ్ళేరు. మా ఊరు ఏమీ మారలేదు. దెయ్యాలబావి, భూతాల రావిచెట్టూ, గంగానమ్మ గుడీ, ఆచారిగారి బడీ, ఆ ప్రక్కనే చింతచెట్టూ, చితచెట్టు ముందు మా ఇల్లూ అన్నీ సవ్యంగా క్షేమంగా వున్నాయి.
చిన్నప్పటి స్నేహితులూ, కాస్త పెద్దయిన తర్వాత కలిసిన పెద్దలూ అందరూ నవ్వుతూ పలుకరించేరు. చావుకి సిద్దపడిన మరికొందరు తాతయ్యలు "బాగా మారిపోయావోయ్ చిన్నా?" అన్నారు.
రాజారావుగారు నన్ను చూడగానే ఆయన మొహం నిండా నువ్వు పులుముకోవడం పెద్ద అలవాటు. నువ్వు పులుముకున్న తర్వాత "యెలా వున్నావోయ్! కులాసేయేనా? చదువెలా వుందీ? (అదీ కులాసాయేనా!) ఆఁ (అయ్!)" అని నిండుగా పలుకరించడం ఆయనొక్కడీకే చేతనవును. వెర్రి మొహం పెట్టి "ఇహీ" అనడం నాకూ చాతొచ్చు.
ఆ సాయంత్రం ఆయనే చాలా విషయాలు ముచ్చటించారు. ఆ తర్వాత బందర్లో ఆడుతున్న సినిమాలు మొదలుకొని, వొచ్చే ఎన్నికల్లో ఎవరెవరు నుంచుంటున్నదీ చెప్పమన్నారు. ప్రస్తుతం కూర్చున్న వాళ్ళల్లో ఎవరు నించుంటారో నాకేం తెలుసు.
కానీ నా అవస్థ గమనించో, లేక తన ప్రయోజకత్వాన్ని నా ముందు ప్రదర్శించాలనో, ఆయనే చెప్పేశారు పేరు పేరునా, ఎవరెవరు ఏ పార్టీ తరఫున నిలబడబోతున్నారో.
అనుకుంటున్నారు గానీ ఈ రోజుల్లో పల్లెటూళ్ళు వెనుకటి పల్లెటూళ్ళు కాదు మాస్టారూ! తెలివి మీరిపోయాయి. బస్తీజనానికి వీళ్ళేం తీసిపోరు. వాళ్ళు గుడీ అంటే వీళ్ళు గుళ్ళో లింగమూ అంటారు.
వెనకటికి హైస్కూల్లో "నేటి మన గ్రామాలు" అనే విషయం పైన చిన్న చర్య జరిగింది. దాంట్లో విశ్వంభర శర్మ అనిచెప్పి నా ఫ్రండొకడు (వాడినందరూ అగ్గిపిడుగనేగారు) "మన గ్రామాలేం తక్కువకాదు, పాలిటిక్సు అక్కడే పుట్టి అక్కడే పెరుగుతాయి. రాజ్య పరిపాలనా దక్షత -మరేమో - జానపదులకే బాగా తెలుసు. ఆ తర్వాత" ఇలా గబగబా చెప్పేస్తూంటే యింత పరిశీలనా శక్తి అప్పట్లో లేక పోవడం వలన "వీడి బొందలే.. నోటికొచ్చినట్టల్లా వాగేస్తున్నాడు" అని వాడ్ని అపార్ధం చేసుకున్నాను. ఎంత తప్పు జరిగిపోయిందీ?
రాజారావుగారు కుటుంబ విషయాలు తీసుకొచ్చి, చాలా చెప్పి ఆయన ఉపన్యాసానికి కొసమెరుపు అన్నట్టు వాళ్ళమ్మడిచేత కాస్త కాఫీ యిప్పించి ఆ పిల్ల కాఫీ ఎలా చేస్తుందో చెప్పి వెళ్ళి రమ్మని సెలవిచ్చారు.
ఇంటికొచ్చిం తర్వాత నాన్న అడిగేరు -"రాజారావు గారింటికెళ్ళావా" అని. నాకిలాంటి ఎత్తులంటే మహచెడ్డ చిరాకు.
నేను మావూరు వెళ్ళి రెండ్రోజుల వరకూ యీ పరామర్శలూ, పలుకరింపుల్తోటే జరిగిపోయాయి. జగన్నాథంతో పట్టుకుని పదినిమిషాలైనా మాటాడేందుకు అవకాశం చిక్కనేలేదు.
మూడోరోజు -
బాగా చీకటి పడిన తర్వాత జగన్నాధాన్ని వెంటేసుకుని కాలువ గట్టువైపు వెళ్ళాను. జగన్నాధంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. వాడు మునుపటిలా ఉత్సాహంగా లేడు. వాడి మొహంలో దిగులూ, వాడి మాటలో తొట్రుపాటూను. కారణం వాడే చెప్పేడు.
మా జగన్నాధం కథలోకి విలనుడు వొచ్చేడు. వాడిపేరు వసంతరావు. ఉద్యోగం. ముసలయ్య వాళ్ళ ఊళ్ళో ఉన్న డేరా హాల్లో బుకింగ్ క్లార్కు అభిరుచి. అందాన్ని ఆస్వాదించడం (ఈ ముక్క తప్పనిసరిగా రాయాల్సిందే 'మరి') ఆశయం వీలైనంత త్వరలో మహా పట్టణంలో మకాం పెట్టి తెలివితేటలుపయోగించి సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోడం.
ఈ వసంతరావు ముసలయ్యతో మంచి స్నేహం సంపాయించుకున్నాట్ట. తనుపయోగించే 'సీమమందు' ముసలయ్యకి రుచి చూపించి "కంట్రీసరుకు" ని తిట్టిపోసి, "మరేటనుకున్నావ్" అని తన ప్రయోజకత్వం నిరూపించుకున్నాడట.
ముసలయ్య వసంతరావుని మెచ్చుకున్నాడు. ఇంతటి మేధావీ, నవనాగరికుడూ తన సొంత మనిషైతే ఎంత బావుండునని ఆశపడిపోతూన్నాట్ట.
జగన్నాథం కాలువగట్టున కూర్చుని, వెన్నెల్లో మెరుస్తూన్న నీళ్ళల్లోకి చూస్తూ.
"ముసలయ్య అఖండుడు. ఎత్తులు వేయడంలో అతన్ని మించిన వాళ్ళు లేరు. వొట్టి కక్కుర్తి రకం. నాలుగు సీసాలు చేతిలో పెడితే చెయ్యమన్న పనిని ఆలోచించకుండా చేసేస్తాడు. సీతకి వాళ్ళ నాన్నంటే భయం. ముసలయ్య గీసిన గీత దాటదు" అన్నాడు.
"అది సరేగాని, మీ ప్రేమ విషయం మా నాన్నకిప్పటికైనా తెలుసా?" అని అడిగేను.


