రామా! నువ్వు రాజకుమారుడవు. నీ వంశం చాల గొప్పది. అలాంటివాడిని నేనింకొకనితోని యుద్ధం చేస్తుండగా ఎందుక్కొట్టావు? దానివల్ల నీకేం ఒరిగింది? జనులు నీ సుగుణాలన్నీ గురించి అనేక రకాలుగా కీర్తిస్తారు. నీ పేరు చెప్పి తార నన్ను నిరోధించింది. నీ వంశం మంచిదని నమ్మి, నీ గుణాలు మంచివనీ సుగ్రీవుడి మీదికి యుద్ధానికి వచ్చాను. నువ్వు దుర్భుద్దివనీ, అధర్మ పరుడవనీ గడ్డి కప్పిన నూతివనీ ఎరుగను. నీకు నేను ఎట్టి అపకారమూ చేయలేదు. మరి ఏ దోషమూలేని నన్నెందుకు చంపావు? యుద్ధానిక్కారణాలు భూమి, బంగారమూ, వెండి. వీటిల్లో దేనికోసం ఇలా అధర్మానికి పాల్పడ్డావు? అయిదుగోళ్ల జంతువుల్లో బ్రాహ్మణ క్షత్రియులకు ఏదుపందీ, అడివిపందీ, ఉడుమూ, కుందేలు, తాబేలూ మాత్రమే భక్షించతగినవి. మరి నన్నెందుకు చంపావు? రాఘవా! నా ఎదుట నిలిచి నువ్వు యుద్ధంచేసి ఉంటే తెలిసివచ్చేది. ఈ పాటికి యమలోకం చూసి ఉందువు. నువ్వు నన్ను చెట్టు చాటున నక్కి కొట్టడం మత్తెక్కిన వాణ్ని పాముకరిచి చంపడంలా ఉంది. నీకంతగా సీత కావాలంటే నాతో చెప్పకపోయావా? నువ్వలా కోరిఉంటే ఒక్క రోజులో రావణుని చంపి సీతను తెచ్చి ఉందునే. ఇంకో విషయం. నేను చచ్చిం తరువాత సుగ్రీవుడు రాజు కావడం ధర్మమే. కాని నువ్వు అధర్మంగా చంపడం మాత్రం నీచం. పుట్టిన వాడు చావడం నిశ్చయం. అయితే నువ్వు చేసిందాన్ని గురించి బాగా ఆలోచించుకో.
అందుకు రాముడిలా సమాధానం చెప్పాడు :-
"వాలీ! నీకు లోకాచారాలూ ధర్మమూ తెలియవు. అందుకు నువ్వు నన్నిలా గర్హిస్తున్నావు. నేను నిన్ను అకారణంగానూ అధర్మంగానూ చంపలేదు. ఎందుకంటావా విను.
ఒకటి. మేము ఇక్ష్వాకు వంశీయులం. ఈ భూమండలం యావత్తూ మాది. ఈ భూగోళం పై నివసించే సకల జంతువుల్నూ, పక్షులనూ, మనుష్యుల్నూ నిగ్రహించడానికి అనుగ్రహించడానికి మాకు సర్వాధికారం ఉంది. ఇప్పుడీ భూమండలాన్న భరతుడు పాలిస్తున్నాడు. అధర్మం చేసిన వారిని అతని పక్షాన శిక్షించడం మా ధర్మం. నువ్వు ధర్మాన్ని తలక్రిందులు చేశావు. సనాతనం అయిన ధర్మం విడిచి నీవు తమ్ముని భార్యతో క్రీడిస్తున్నావు. తన కూతురుతోనూ, చెల్లెలితోనూ, తమ్ముని భార్యతోనూ క్రీడించే వాడికి విధించాల్సిన శిక్ష మరణదండనే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి నిన్ను చంపడంలో నేను అధర్మం ఏమి చేయలేదు.
రెండు. నువ్వు నీ తమ్ముని భార్యనూ, రాజ్యాన్ని కాజేశావు. సుగ్రీవుడు నాతో సఖ్యం చేశాడు. నిన్ను చంపి అతనికి ధర్మం ప్రకారం భార్యనూ, రాజ్యమూ ఇస్తానని మాట ఇచ్చాను. "రామో ద్విర్నాభి భాషతే" రాముడికి రెండు నాల్కలు లేవు. కాబట్టి నా మాట నిలబెట్టుకోవడానికి నిన్ను వధించాను. పోతే.
"రాజభి ర్దృతదణ్డాస్తు కృత్యా పాపాని మానవాః
నిర్మలా స్వర్గ మాయన్తి సన్త స్తుకృతినో యథా"
అన్నాడు మనువు. రాజులచే శిక్షించబడినవాడు సమస్త పాపాలు హరించిపోగా స్వర్గానికి వెళ్తాడు. కనుక నిన్ను చంపి నేను నీకు మేలు చేశాను కాని కీడు చేయలేదు.
మూడు. నేను నిన్ను చాటున దాక్కొని కొట్టానని నిందించావు. మనుష్యులు అనేక జాతుల మృగాల్ను చంపుతారు. అలాంటప్పుడు వారు ఉచ్చులు పన్నీ, వలలు పన్నీ, చాటున దాగీ చంపుతారు. జంతువులు పారిపోతున్న విడువరు. అందులో దోషం ఏమీలేదు.
రాముడి ధర్మోపన్యాసం విని వాలి సంతృప్తి చెందాడు. అతనికి రాముడేమీ అధర్మంగా ప్రవర్తించలేదని విశ్వాసం కలిగింది. పైగా రామబాణం అతనికి స్వర్గాన్నిస్తుందని సంతోషమూ కలిగింది. అప్పుడు వాలి రామునితో ఇలా అన్నాడు.
"ప్రభూ! ధర్మం తెలియక నిన్ను ఏమేమో అన్నాను మన్నించు. చనిపోతున్న నాకు ఏ విచారమూ లేదు. కాని ఒక్క కోర్కె. అంగదుడు పసివాడు. నాకు ఏకైక పుత్రుడు. వాణ్ని నువ్వు కాపాడాలి. సుగ్రీవుణ్ణి అంగదుణ్ణీ ఒకేవిధంగా చూసుకో. నీకు భరతుడూ, లక్ష్మణుడూ ఎంతో సుగ్రీవుడు, అంగదుడూ అలాగే అనుకో"
అందుకు రాముడు అంగదుడు తండ్రి వద్ద ఎలాంటి వాత్సల్యం పొందుతున్నాడో అలాంటి వాత్సల్యాన్నే తన దగ్గరా, సుగ్రీవుని దగ్గరా అనుభవిస్తాడని మాట ఇచ్చాడు.
భర్త చావు తెలిసి తార వచ్చి భర్తమీద పడి గోడుగోడున ఏడ్చింది. అంగదుడు మట్లోపడి పొర్లి పొర్లి ఏడ్చాడు. గోరువంకలా ఏడుస్తున్న తారనూ, ఖిన్నుడై విలపిస్తున్న అంగదుణ్ణీ చూసి సుగ్రీవుని గుండె కరిగిపోయింది. అతడూ దుఃఖించాడు. విజయానందం చల్లారిపోయింది. రాహుగ్రస్తుడైన చంద్రుడులా అయిపోయాడతను. వాలి తమ్ముణ్ని దగ్గరికి తీసుకున్నాడు. తాను చేసినదంతా మరచిపొమ్మని ఇంద్రుడు తనకిచ్చిన కాంచనమాల తమ్మునికిచ్చాడు. బాష్పాకుల నేత్రుడైన సుగ్రీవుడు దీనుడై అది తీసుకున్నాడు.
వాలి అప్పుడు అంగదుణ్ని చూసి "నాయనా! ఇక నువ్వు సుగ్రీవుడి ఆజ్ఞకు లోబడి ఉండు. నిన్ను నేను లాలించినట్టే సుగ్రీవుడునూ లాలిస్తూ ఉంటాడు. సుగ్రీవుని శత్రువుల్ను నీకు శత్రువులుగానూ, అతని మిత్రుల్ను నీకు మిత్రులుగాను చూసుకో. సుగ్రీవుని శ్రేయస్సే సాధిస్తూ వుండు" అని మిక్కిలి ప్రేమతో చెబుతూండగానే అతని కళ్లు తిరిగాయి. భయంకరమైన కోరలు బయటపడేట్లు నోరు తెరచుకొని ప్రాణాలు విడిచేశాడు.
అక్కడ వుండిన వానరజనం యావత్తూ గొల్లుమన్నారు. కిష్కింధ శూన్యంఅయిపోయింది. ఉద్యానవనాలన్నీ పాడుబడ్డాయి. పర్వతాలు వెలవెలబోయాయి. తార దుఃఖం కట్టలు తెంచుకొని కన్నీరు రూపంలో ప్రవహించింది. అంగదుడు నెత్తీ నోరూ కొట్టుకున్నాడు. దాంతో సుగ్రీవుడు ఖిన్నుడై పోయి ఏడవసాగాడు. "నేను నా అన్న చావు కోరింది నిజమే. కాని హతుడైన వానర ప్రభువును చస్తే నా గుండె చెరువైపోతూంది. నేను అన్నను చంపింది. మహా పాతకం చేశాను. నేను బ్రతకలేను. అగ్గిలోకి ఉరుకుతాన"ని విలపించాడు. సుగ్రీవుడి దుఃఖం చూసి రాముడూ కంటతడిపెట్టాడు.
"నా భర్తను నువ్వే బాణంతో కూల్చావో దాంతోనే నన్నూ కూల్చెయ్యి. నేను లేకపోతే నాభర్త సుఖంగా ఉండలేడు" అని రాముడితో అంటూ ఏడ్చింది తార.
రాముడూ, హనుమంతుడూ దుఃఖంలో ఉన్నప్పటికీ తారనూ, అంగదుణ్నీ సుగ్రీవుణ్నీ ఓదార్చి ఉత్తరక్రియలకు ఏర్పాట్లు చేశారు. పట్నంలోంచి పల్లకీ వచ్చింది. మహావీరులైన వానరులు దాన్ని పట్టుకొచ్చారు. వాలి కళేబరాన్ని అందులో ఉంచారు. రత్నాలూ, బంగారమూ, వెండి, ముత్యాలు వెదజల్లుతూ ఆ వాహనం స్మశానం చేర్చబడింది. సుగ్రీవుడూ అంగదుడూ వాలిని చితిమీద ఉంచారు. అంగదుడు అగ్నిసంస్కారం చేసి అప్రదక్షిణంగా తిరిగాడు. తరువాత నదికి వెళ్లి తర్పణులు వదిలాడు.
చితి చిటపడామండి వాలి కాయమును భస్మం చేసింది.
రాముడు చెట్టుచాటునుంచి బాణం వేశాడు. వాలిని చంపాడు. సుగ్రీవుని యుద్దానికి వెళ్లమన్నాడు. ఇద్దరికి పోరుపెట్టాడు. ఇదెంత న్యాయం? ఎంతవరకు ధర్మం? వాలి రాముని అడిగిన ప్రశ్నలను ఒకసారి చూస్తే అవి ధర్మబద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. రాముడు వాటికి ఇచ్చిన జవాబుల్లో ధర్మం కనిపించదు. చేసిన పనిని సమర్థించుకోవడానికి ఏదో చెప్పినట్లుంది. రాముని సమాధానాల్లో పస కనిపించదు. అతని సమాధానాల్లో ఒక్కొక్క దానిని గురించి ఆలోచించాం.


