ఆ తరువాత ఆఫీస్ రూమ్ లోకి అడుగుపెట్టింది నిశాంత.
నిశాంత అడ్రస్ తో వచ్చిన ఒక పార్సిల్ టేబుల్ మీదుంది. తీసుకుని ఓపెన్ చేసింది.
ఆడియో కేసెట్!
ఆ కేసెట్ ని చూడగానే ఎవరి దగ్గర్నించి వచ్చిందో అర్ధమయిపోయింది.
దేశ్ ముఖ్...
టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేసింది.
"హలో నిశాంతా! హౌ ఆర్యూ? వారం రోజులుగా నా దగ్గర్నించి మెసేజ్ రాలేదని కంగారుపడుతున్నావ్ కదూ? ఎందుకు పంపలేదో కాసేపు ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఇద్దరూ... వెన్నెల్లో కెమ్టీఫాల్స్ దగ్గర చాలాసేపు కబుర్లాడుకున్నారు కదూ! సిద్ధార్ధను చూడగానే నిజంగానే ప్రేమించేశావనుకున్నాను. ఈ వారం రోజులూ నువ్వు నా మెసేజ్ కోసం ఎదురుచూశావంటే, అతన్ని కలవలేదంటే... నువ్వతన్ని ప్రేమించడం లేదని, నటించావని రూఢి చేసుకున్నాక, నేనీ మెసేజ్ పంపుతున్నాను.
సో... మిస్ నిశాంతా! దాగుడుమూతల టైం అయిపోయింది.
ఫస్ట్ ఫేజ్...
సిద్ధార్ధను డ్రింక్ కి బానిసగా చెయ్యి, ముహూర్తం... రేపు రాత్రి ఎనిమిది గంటలు.
అందుకోసం డెహ్రాడూన్ మౌర్య గెస్ట్ హౌస్ నీ పేరున బుక్ చేయడం జరిగింది.
ఎనిమిది నుంచి పదిగంటలవరకు మాత్రమే అతని దగ్గర నువ్వుంటావ్. ఆ తరువాత అతనేమవుతాడో నీకనవసరం గుర్తుంచుకో."
సిద్ధార్ధతో తను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది నిశాంతకు.
రాత్రి పదిగంటలకు కెమ్టీఫాల్స్ దగ్గర ఎదురుచూస్తాడేమో!
రేపట్నించి తను సిద్ధార్ధను పతనానికి చేరువ చేసే యజ్ఞాన్ని ప్రారంభించబోతోంది.
మరి ఈ సమయంలో ఎలా వెళ్ళడం...? ఎలా నవ్వుతూ మాట్లాడటం?
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అంటే ఎలా చెప్పడం?
అతని మెత్తని హృదయాన్ని తలచుకుని ఎటూ తేల్చుకోలేక బాధపడింది నిశాంత.
* * * *
డెహ్రాడూన్...
మౌర్య గెస్ట్ హౌస్...
రాత్రి ఎనిమిది గంటలైంది.
విశాలమైన గెస్ట్ హౌస్! వరండాలో రోడ్డువేపు చూస్తూ పచార్లు చేస్తోంది నిశాంత.
సిద్ధార్ధ వస్తాడా? రాగలడా?
అదే సమయంలో లోనికి నడిచొస్తున్న సిద్ధార్ధను చూసి ఆశ్చర్యపోయింది నిశాంత.
"నువ్వు రావనుకున్నాను. వచ్చినా... కారులో వస్తావనుకున్నను" అతని దగ్గరగా వెళుతూ అంది నిశాంత.
"మీ రెస్టారెంటుకి వెళ్ళాను. కౌంటర్లోని వ్యక్తి ఓ కవరిచ్చాడు. టాక్సీలో వచ్చాను. అవునూ... ఏమిటిదంతా? ఎనీథింగ్ స్పెషల్..." నవ్వుతూ అడిగాడతను.
ఏం చెప్పాలో అర్ధం కాలేదు నిశాంతకు.
"ఇవాళ న పుట్టినరోజు! సడన్ గా సర్ ప్రైజ్ చేద్దామని" టక్కున అబద్ధం ఆడేసిందామె.
"అమ్మాయిగారికి ఎన్నో పుట్టినరోజో...?" రూమ్ లోకి అడుగు పెడుతూ అన్నాడతను.
"ఫస్ట్ బర్త్ డే..."
"అంటే?"
"నీలాంటి కావలసిన ఫ్రెండ్ తో కలిసి జరుపుకోవడం..." నిజంగానే నిశాంతగా మారిన లక్ష్మి జీవితంలో యిదే ఫస్ట్ బర్త్ డే!
తన ఫస్ట్ బర్త్ డేను ఇంకొకర్ని ట్రాప్ చెయ్యడానికి వుపయోగిస్తున్నందుకు మనసులో బాధగానే వుంది నిశాంతకు.
"నీ పుట్టినరోజని ముందుగా తెలిస్తే నీకోసం నేనేమైనా తెచ్చేవాడిని కానీ..." అటూ యిటూ చూసి తన మెడలో వున్న గోల్డ్ చెయిన్ ని తీసి ఆమె మెడలో వేశాడు సిద్ధార్ధ.
ఒక్కక్షణం నివ్వెరపోయింది నిశాంత. నిశ్చేష్టురాలై సిద్ధార్ధ కళ్ళలోకి చూస్తూండి పోయింది.
"నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి, నీ పుట్టినరోజు కానుకగా యిచ్చిన గోల్డ్ చెయిన్. నిన్ను అమితంగా ప్రే..." ఆగిపోయాడతను.
"ఏం? సగంలో ఆగిపోయావే?"
అలా అంటున్న నిశాంత కోలకళ్ళవైపు కొంటెగా చూస్తూ, దగ్గరగా వచ్చి నిలబడ్డాడతను.
మౌనప్రతిమలా నిల్చుంది నిశాంత.
"నీకిప్పుడు చెప్పలేని కోపం వచ్చిందనుకో! ఏం చేస్తావ్?" అడిగాడతను నవ్వుతూ.
"కోపం ఎందుకొస్తుంది?"
"వస్తే ఏం చేస్తావ్?"
"నేనేం చెయ్యను."
"ఆర్యూ ష్యూర్? ఆ మాట మీదే వుండాలి. ఓ.కె... నీకు కోపం రాదు..."
ఊహించని వేగంగా ముందుకు కదిలి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఊహించని చర్యకి నివ్వెరపోయింది నిశాంత!
సరిగ్గా-
అరవై సెకండ్లు...
నిశాంత జీవితంలో అంతులేని మధురిమకు మొట్టమొదటిసారి ఆకృతి కల్పించిన అరవై సెకండ్లు...
సిద్ధార్ధ ఒంటరి జీవితంలో ఆకు మీద పడిన మంచు బిందువులా అంతులేని అనుభూతిని రగిల్చిన అరవై సెకండ్లు...
సిగ్గుపడుతూ విడివడింది నిశాంత.
"ఇందుకోసమా నిన్నిక్కడికి పిల్చింది" కోపంగా అంది నిశాంత.
"ఇదిగో అమ్మాయ్! నీకు కోపం రాదని ముందే అన్నావా, లేదా?" అతడి మాటకు జవాబివ్వలేకపోయింది నిశాంత.
తొలిముద్దు స్పర్శనుంచి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది ఆమెకు. వెంటనే తన కర్తవ్యం గుర్తుకొచ్చింది.
దేశ్ ముఖ్ మెసేజ్ గుర్తుకొచ్చింది. కప్ బోర్డులో వున్న విస్కీ బాటిల్స్ గుర్తుకొచ్చాయి.
అంచెలంచెలుగా అతడిని నాశనం చెయ్యాలి? చెయ్యగలదా తను? అమాయకంగా కన్పించే ఆ ముఖంలోకి చూస్తూ ఆలోచిస్తోంది ఆమె.
అతడిని ప్రేమిస్తోందా తను?


