ఎంతదూరం నడిచారో తెలీదు.
"ఎక్కడకు వెళుతున్నాం మనం?" మధ్యలో అడిగింది ఆమె.
"వాటర్ ఫాల్స్ దగ్గరికి."
"ఎందుకు?"
జవాబు చెప్పలేదు అతను.
దూరంగా జలపాతపు సవ్వడి. వింత మృదంగాల విషాద శబ్దంలా ఒకవేపు కెమ్టీ ఫాల్స్. రెండో వేపు పచ్చని పెను వృక్షాలు... ఓ చెట్టు కింద పచ్చికలో కూర్చున్నారిద్దరూ.
"నాకు స్నేహం కావాలి. ఇస్తావా?" వెన్నెలలో జలపాతపు ధారలు పాలధారల్లా కన్పిస్తున్నాయి.
"అదేం నీరా దోసిలితో యివ్వడానికి" నవ్వుతూ అంది ఆమె.
"హృదయం దోసిలితో యిచ్చేదే స్నేహం."
"నీకు కవిత్వం వచ్చా?" ఆశ్చర్యపోతూ అడిగిందామె.
"నాకేం తెలీదు... మొట్టమొదటిసారి ఇలాంటి మాటలన్నీ నా నోటంట వస్తున్నాయి నిజం."
"ఇప్పడు మనల్ని ఎవరైనా చూస్తే స్నేహితులనుకోరు... ప్రేమికులనుకుంటారు కదా" ఆ మాటకు ఎలా రియాక్ట్ అవుతాడో తెల్సుకోవాలనే అడిగింది ఆమె.
"అవును ప్రేమ... లవ్... ఆ పదాలే హృదయం ఆకారంలా వున్నట్టుంటాయి. హృదయంలోంచి నేరుగా ఆ పదాలు పుట్టాయేమో కదూ?"
మంచు వెన్నెలలో మసగ్గా కనిపిస్తున్న అతనివేపు చూస్తూ అతని మాటల్ని వింటోంది ఆమె.
"నేనెవరో, ఏమిటో తెలియకుండా నాతో స్నేహం చేయాలనుకోవడము నువ్వు నిజంగా ఇన్నోసెంట్ సిద్ధార్ధ" ఆమె అంది.
"యూ ఆర్ రాంగ్... బిజినెస్ లా లైఫ్ కాలిక్యులేషన్ కాదు. ముఖ్యంగా స్నేహం, లవ్ ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ప్రేమించడమే ప్రేమ. కళ్ళంట కన్నీళ్ళు తెలిసే వస్తాయా... గుడ్డి కళ్ళక్కూడా కన్నీళ్ళొస్తాయి. మనసు గుడ్డికన్నులాంటిది నిశా."
ఆ మాటలంటున్న అతనివేపు ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయిందామె. తను వూహించిన సిద్ధార్ధ వేరు, తనకు దేశ్ ముఖ్ వీడియోలో చూపించిన సిద్ధార్ధ వేరు. ఈ సిద్ధార్ధ వేరు.
"నిశాంతా... నామీద నీ అభిప్రాయం చెప్పు" అడిగాడతను.
"అభిప్రాయం అంటే?"
"ఒపీనియన్."
"నువ్వు అండగాడివి, తెలివయినవాడివి, గుడ్ ఎట్ హార్ట్... ఇంకా..."
"ఇంకా... నా కళ్ళు పెద్దవి, నేను తెల్లగా వుంటాను. ఇలాంటివి కాదు నేనడిగింది... డూ యూ లవ్ మీ ఆర్ నాట్" డైరెక్టుగా అడిగాడు అతను.
"మనసు కంప్యూటర్ కాదు... ఇప్పుడే చెప్పొద్దులే. ఆలోచించుకుని చెప్పు" చనువుగా ఆమె వడిలో తల పెట్టుకున్నాడు అతను.
అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. అకస్మాత్తుగా దేశ్ ముఖ్ జ్ఞాపకం వచ్చాడు. అతను జ్ఞాపకం రాగానే చలిగాలి రివ్వున వంటికి తగిలినట్టయింది ఆమెకు.
"బావుంది" మెల్లగా అన్నాడతను.
"ఏమిటి?"
"వెన్నెల్నీ, జలపాతాన్నీ నీ వడిలో తల పెట్టుకుని చూడడం."
గబుక్కున చేతి వాచీ వేపు చూసింది ఆమె.
"నాలుగున్నరైంది ఇక వెళ్దామా."
ఆ మాటతో గబుక్కున లేచి కూర్చున్నాడతను.
నిశాంత లేచి శాలువా సర్దుకుంది.
"నీతో చాలా మాట్లాడాలనుకున్నాను. ఏమీ మాట్లాడలేకపోయాను" ఇద్దరూ పచ్చిక మీద నుంచి రోడ్డు మీదకొచ్చారు.
దారంటా కబుర్లు! తరతరాల మూగతనం తరువాత మాటలు వచ్చిన వాడిలా మాట్లాడేశాడు సిద్ధార్ధ.
ఇద్దరూ హోటల్ దగ్గరకొచ్చారు.
"గుడ్ నైట్" అలవాటుగా చెప్పింది నిశాంత.
"కాదు మేడమ్! గుడ్ మార్నింగ్" అని వెనుదిరిగాడు సిద్ధార్ధ.
ఆ అనుభూతికి ఒక రూపం లేదు. అలా మసక చీకట్లో వెళ్ళిపోతున్న అతనివైపు మౌనంగా చూస్తూ వుండిపోయింది నిశాంత.
మరి నిద్రపట్టలేదు.
సిద్ధార్ధ నిజంగా తనను అభిమానిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా?
లేదా తనలాగే అతను కూడా నటిస్తున్నాడా?
మహంత... అతని తెలివితేటల గురించి దేశ్ ముఖ్ చెప్పిన విషయాలు జ్ఞాపకానికొచ్చాయి.
తెల్లారేవరకూ ఆలోచిస్తూనే వుంది నిశాంత.
* * * *
వారం రోజులు గడిచాయి.
దేశ్ ముఖ్ నుంచి మెసేజ్ రాలేదు.
సిద్ధార్ధ కనిపించలేదు.
ఏం జరిగిందో అర్ధంకాలేదు నిశాంతకు.
ఆరోజు రాకపోతే మర్నాడు కెమ్టీ ఫాల్స్ కు వెళ్ళాలని నిర్ణయించుకుందామె.
రెస్టారెంట్ కి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండుగంటలైంది.
లోనికి వెళ్ళగానే తన ఫోటో వైపే తదేకంగా చూస్తున్న సిద్ధార్ధను చూసి ఆశ్చర్యపోయింది.
"ఇన్నాళ్ళూ ఎటెళ్ళిపోయావ్?" అడిగాడు సిద్ధార్ధ.
"నేనా?"
"అవును. రెండుసార్లు నీ హోటల్ కి వచ్చాను. హోటల్ ని వెకేట్ చేసి వూరెళ్ళిపోయావని చెప్పారు."
"ఊరా... పాడా... రింట్ టేస్ లో కెళ్లాను."
"నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా?"
కోపంగా అడుగుతున్న అతడిని చూస్తూ ఏం అనాలో తోచక నవ్వేసింది.
"ఏం నవ్వుతున్నావ్?"
"నువ్వెవరివో తెలీదు. నీ ఎడ్రస్ తెలీదు. కనీసం... నీ ఫోన్ నెంబర్ కూడా తెలీదు. ఎలా?" అనడిగి, సిద్ధార్ధ చెప్పే జవాబు కోసం నిరీక్షిస్తోంది నిశాంత.
"నా గురించి నీకు వివరాలు చెప్పాలి. అంతేనా?"
"అవును."
"అయితే రాత్రి సరిగ్గా పదిగంటలకి కెమ్టీ ఫాల్స్ దగ్గరకురా చెబుతాను."
"నిజంగా?"
"నిజంగా నిజమే చెప్తాను" అని బైటికెళ్ళిపోయాడు సిద్ధార్ధ.


