"ఇప్పటికే లేటయినట్టుంది... మీ వార్డెన్..."
"వార్డెనా? వాడెవడు? నా ప్యాలెస్ కి నేనే వార్డెన్ ని... ఒంటరి వార్డెన్... మిస్... నిశాంత... నేను నీ దగ్గర వుండకూడదా?" అలా అడుగుతున్న కళ్ళల్లోకి సూటిగా చూసిందామె.
"నా దగ్గరా౧ ఎందుకు?"
"ఎందుకు... ఎందుకంటే నాకు మనసారా ఏడవాలని వుంది... చీకట్లో వంటరిగా కాదు, నడిరోడ్డు మీద... జనం మధ్య... నీ దగ్గర..." అతనికి నెమ్మదిగా స్పృహ తప్పిపోతోంది.
కారులోంచి పరుగెత్తుకొచ్చాడు రఘువీర్.
"ఏం జరిగింది మేడమ్?" గాభరాగా అడిగాడతను.
"రఘువీర్! నీకేం జరగలేదు... పద" రఘువీర్ కి చెయ్యందించి, గబగబా ముందుకు నడిచి కారెక్కాడతను.
వెళ్ళిపోతున్న కారువేపు, కారులోని సిద్ధార్ధవేపు అయోమయంగా చూస్తూ వుండిపోయింది.
"నాకు మనసారా ఏడ్వాలని వుంది ఒంటరిగా, చీకట్లో కాదు... నడిరోడ్లో, జనం మధ్య, నీ దగ్గర."
"అయామ్ సారీ సిద్ధార్ధా... అయామ్... సారీ ఫర్ యువర్ లోన్లీ నెస్... ఐ పిటీ యూ... బట్..."
వెంటనే దేశ్ ముఖ్ జ్ఞాపకానికొచ్చాడు.
"బట్... ఐ కేమ్ ఫర్, డిస్ట్రాయ్ యూ" నిర్లిప్తంగా నవ్వుకుందామె.
* * * *
రాత్రి రెండు గంటలు దాటింది.
చాలాసేపటివరకూ ఆలోచిస్తూ పడుకున్న నిశాంత గాఢనిద్రలో వుంది.
టెలిఫోన్ మోగింది. ఆ టెలీఫోన్ అయిదు నిమిషాలసేపు అలా మోగుతూనే వుంది.
గబుక్కున మెలుకువొచ్చింది నిశాంతకు.
టెలిఫోన్ చప్పుడు ఆగిపోయింది.
మరో అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది.
వెంటనే రిసీవర్ అందుకుంది నిశాంత.
"హలో..."
"మేడమ్... మీకోసం ఎవరో వచ్చారు."
"ఎవరు?"
"మీరు కావాలని అడిగారు... మీతో అర్జంటుగా మాట్లాడాలిట."
గబుక్కున బెడ్ మీంచి లేచి నైట్ డ్రెస్ మీద శాలువా కప్పుకుని సూట్లోంచి కిందకొచ్చి కౌంటర్ వేపు నడిచింది ఆమె.
"ఎవరో మీకోసం గేటు బయట వెయిట్ చేస్తున్నారు."
దట్టంగా కురుస్తున్న మంచు.
ఎవరై వుంటారు. దేశ్ ముఖ్౧ నేనేం చేస్తున్నానో తెల్సుకోడానికి వచ్చుంటాడా?
సిద్ధార్ధతో దగ్గరగా తనని చూసిన మహంత మనిషా?
"నిశాంతా... గుర్తుంచుకో... ఎప్పుడు ఏ ప్రమాదం... ఎలా వస్తుందో తెలీదు... అప్రమత్తంగా వుండడం మరిచిపోకు" ఆయన మాటలు గుర్తుకొచ్చాయి.
గబుక్కున వెనకొచ్చి సూట్లోకెళ్ళి పిస్టల్ తీసుకుని పోర్టికోలో కొచ్చి గేటువైపు నడిచింది.
గేట్ మేన్ గేటు తెరిచాడు. రోడ్డుమీద కొచ్చింది ఆమె.
రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.
చిక్కని చలి... రోడ్డుకు రెండో వైపున చెట్టుకింద మనిషి ఆకారం.
ఆ చెట్టువేపు నడిచింది ఆమె.
ఆ వ్యక్తి స్పష్టంగా కనిపించడం లేదు.
"ఎవరు?"
చీకట్లోంచి ఆ వ్యక్తి బయటికొచ్చాడు.
సిద్ధార్ధ...?!
సాదా కుర్తా, పైజామాలో మంచులో పూర్తిగా తడిసిపోయున్నాడు.
"మీరా... ఇక్కడకెలా వచ్చారు? నేనిక్కడున్నానని ఎలా తెలిసింది?"
ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేదు.
"నిద్రపట్టలేదు... వచ్చాను."
అక్కడికి యంగ్ ప్యాలెస్ మూడు మైళ్ళ దూరంలో వుంది. ఆ విషయం తెలుసామెకు.
"ఎలా వచ్చారు?"
"నడిచి."
మంచు మల్లెమొగ్గల్లా పడుతోంది.
"డిస్ట్రబ్ చేశానా మిమ్మల్ని?" మెల్లగా అడిగాడతను.
"లేదు"
"నాతో మీరు ఎక్కడికైనా రాగలరా?"
అతని గురించి పూర్తిగా తెలియడంవల్ల ఆ గొంతులోని ఆర్ద్రతకు చలించి పోయింది ఆమె.
"ఎక్కడికి?"
"ఎక్కడికో చెప్పలేను. నాతో రావాలి" చిన్నపిల్లాడిలా అన్నాడు అతను.
"వ్యాన్ తీసుకొస్తాను."
"వద్దు నిశాంతా" గబుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
"వద్దు... కార్లు, వ్యాన్లూ ఏమీ వద్దు... ఈ మంచులో, ఈ వెన్నెలలో నడుద్దాం. నీతోపాటు ఈ నిశ్శబ్దపు రోడ్లమీద భూమిలోకి క్రుంగిపోతున్నట్టుగా కన్పించే హిమాలయాల్ని చూస్తూ" గుసగుసలాడాడు అతను.
ఇది కలా, నిజమా... నిజంగా సిద్ధార్ధ రావడం నిజమేనా? ఎలా రాగలిగాడు? ఆలోచిస్తూనే ముందుకడుగేసింది ఆమె.
వెన్నెలలో వాళ్ళిద్దరు...
ఆమెకు కూడా ఈ అనుభవం వింతగా వుంది.
"నిశాంతా... ఇంత అర్ధరాత్రి నీ దగ్గరకు నేనెందుకొచ్చానో తెలుసా?" ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను.
"ఎందుకు?"
"నాకు స్నేహం కావాలి."
"మీకు స్నేహితులు లేరా?"
కోపంగా చూశాడు అతను.
"నేను నువ్వు అంటుంటే, నువ్వు మీరు అంటావేం?" అని అనేసి-
"లేరు. నాకు స్నేహితులు లేరు. నా జీవితంలో తారసపడ్డ మొదటి వ్యక్తివి నువ్వు... ఎవరో తెలియకపోయినా, చూడగానే ఇష్టపడ్డ మొదటి వ్యక్తివి నువ్వు. నేనభిమానిస్తున్న మొదటి వ్యక్తివి నువ్వు... నాకు నీ స్నేహం కావాలి ఇస్తావా?" జాలిగా అడిగాడతను.
ఇద్దరి మధ్యా మౌనం. ఆ మౌనపు చల్లగాలిలోంచి రాలుతున్న మంచు బిందువుల్లా ఇద్దరి మధ్యా మాటలు.


