మానవునికి శాంతి ప్రసాదించడానికి ఏర్పడిన రాజ్యం, ప్రభుత్వం అధికారానికీ, పెత్తనానికీ మారుపేర్లయినాయి. మానవుని అణచిపెట్టడానికి అతని శాంతిని భంగపరచడానికి ఏర్పడిన హడయంత్రాలైనాయి. రజింపచేయడానికి ఏర్పరచుకున్న రాజు, తన పెత్తనంకోసం యుద్ధాలు తెచ్చి ప్రజలను మారణహోమం చేశాడు. రాజు తన అధికారానికీ, ధర్మానికీ ప్రజలను పావులుగా చేశాడు. వారిని తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు.
రాజ్యాల్లోనూ, రాజకీయ విధానాల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. ఇవ్వాళ మనం ప్రజాస్వామ్యం చూస్తున్నాం. ఇందులో ప్రజలకు ఎంతస్వామ్యం ఉందో మనం ఎరుగుదుం.
ప్రభువులకూ, ప్రభుత్వాలకు బలం ఆయుధం. ఆయుధం పుట్టడం స్వీయ రక్షణకు పుట్టింది. అది ప్రభువుల చేతికిపోయి వారి బలదర్పాలకు నిదర్శనం అయింది. ఆయుధంతో చేయవలసిన పని "ఆర్తానభిరక్షణమ్" ఆర్తులను రక్షించడం అంటుంది సీత. ఆయుధం ప్రభుత్వం చేతబడి ఆర్తులను భక్షించడానికి ఉపయోగపడుతున్నది.
ఈనాడు అగ్రరాజ్యాలు ఒకరిని మించి ఒకరు మారణాయుధాలు తయారుచేస్తున్నారు. మారణాయుధాలను బట్టే అవి మహారాజ్యాలవుతున్నాయి. ఆటం, హైడ్రోజను బాంబుల కాలంపోయి న్యూట్రానులకాలం వచ్చింది. న్యూట్రాను మానవులను మాత్రం నశింపచేస్తుంది. ఆస్తులను, సంపదను నాశనం కానివ్వదు. మనిషి ప్రాణంకంటె సంపదకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వరకు దిగజారాయి రాజకీయాలు.
మారణాయుదాల ఉత్పత్తి Balance of Power కోసమేనని బుకాయిస్తున్నాయి అగ్రరాజ్యాలు. అగ్రరాజ్యాలవద్ద ఈనాడు మానవాళిని సాంతం నుసిచేయ గలిగినన్ని ఆయుధాలున్నాయి. మారణాయుధాలు ప్రదర్శనకు మాత్రమే వాడకానికికాదు అనడం కల్లబొల్లి కబుర్లు. "ఆయుధం అగ్గిలాంటిది. అది అంటుకుంటే కాలకమానదు" అంటుంది సీత. అది అక్షరాల నిజం. కాబట్టి అగ్రరాజ్యాల వద్ద మారణాయుధాలు వున్నంతకాలం మానవాళికి భద్రతలేదు. శాంతిలేదు. సుఖంలేదు.
ఆయుధాన్ని గురించిన సీత సందేశం నాడెంత వాస్తవమో, మానవాళికి నేడూ అంత వాస్తవం అవసరం.
మారణాయుధం భస్మాసుర హస్తం లాంటిది.
మారణాయుధాలు నశించి మానవత వికసించే కాలం వస్తుందా?
మారణాయుధాల 'భయం' నుంచి మనిషికి విముక్తి కలుగుతుందా?
అగస్త్యదిశ:
రాముడు ఆశ్రమాలు దర్శించాడు. అలా పదేళ్లు గడిచాయి. మళ్లీ సుతీక్షుని ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యుని ఆశ్రమానికి దారి చూపించవలసిందని మునిని కోరాడు. రాముని కోరిక విన్నాడు. సుతీక్షుడు సంతోషించాడు. అగస్త్యాశ్రమానికి దారి చూపాడు.
"ఇక్కడినుంచి దక్షిణ దిక్కుగా వెళ్లు. నాలుగు అడుగులు నడిస్తే సుదర్శనుని ఆశ్రమం వస్తుంది. సుదర్శనుడు అగస్త్యుని తమ్ముడు. ఆ ఆశ్రమం తెలుసుకోవడం తేలిక. అక్కడ రకరకాల పూలచెట్లుంటాయి. పండ్ల చెట్లుంటాయి. అందమైన పక్షులు కూతలు పెడ్తుంటాయి. అక్కడ నిర్మలమైన జలాశయాలు ఉంటాయి. అక్కడ ఒకరాత్రి ఉండండి. తెల్లవారి లేచి బయలుదేరితే అగస్త్యాశ్రమం అక్కడికి ఆమడదూరంలో ఉంటుంది."
సీతా, రామలక్ష్మణులు సుతీక్షుని వద్ద శెలవు తీసుకున్నారు. అరణ్యంలో నడక సాగించారు. అడవి అందంగా ఉంది. పచ్చని చెట్లున్నాయి. చిక్కని నీడ ఉంది. మబ్బుకొండల్లాంటి పర్వతాలున్నాయి. అక్కడక్కడా కొలనులున్నాయి. అలా నడుస్తున్నప్పుడు రాముడు అగస్త్యనికి సంబంధించిన కథ చెప్పాడు :-
వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు బ్రాహ్మణులను చంపి తినడం వారి పని. ఇల్వలుడు బ్రాహ్మణరూపం ధరిస్తాడు. దారేపోయే బ్రాహ్మణ్ణి భోజనానికి పిలుస్తాడు. బ్రాహ్మడు వస్తాడు. పాతాపి మేకరూపం ధరిస్తాడు. ఇల్వలుడు మేకను చంపుతాడు. వండుతాడు. బాపడికి భోజనం పెడ్తాడు. భోజనం చేస్తాడు బాపడు. అప్పుడు ఇల్వలుడు "వాతాపీ! బయటికి రా" అని పిలుస్తాడు. వాతాపి బాపని పొట్ట చీల్చుకుని బయటికి వస్తాడు. ఇలా చంపుతున్నారు వారు బ్రాహ్మల్ను.
ఒకసారి అగస్త్యుడు వారికి అతిథిగా వచ్చాడు. మామూలు ప్రకారం అతనికి భోజనం పెట్టారు. అగస్త్యుడు భోజనం చేశాడు. ఇల్వలుడు "వాతాపీ! బయటికిరా!" అని పిలిచాడు. అందుకు అగస్త్యుడు "ఇంకెక్కడి వాతాపీ! అతడు జీర్ణం అయిపోయాడు. యమపురికి వెళ్లిపోయాడు" అన్నాడు. ఇల్వలుడు కోపంతో మండిపోతాడు. అగస్త్యుడు మీదికి ఉరికాడు. అగస్త్యుని కంటిమంటకు బూడిద అయిపోయాడు.
అగస్త్యుని పేరువింటే రాక్షసుల గుండె పగులుతుంది. అగస్త్యుడు దక్షిణదిశను నిష్కంటకం చేశాడు. అక్కడ మునులకు రాక్షసబాధలేదు. అందువల్లనే దానికి "అగస్త్యదిశ" అని పేరు వచ్చింది.
ఒకప్పుడు వింధ్యపర్వతం హద్దులేకుండా పెరిగింది. అగస్త్యుడు దాని గర్వం అణచాడు.
అలా మాట్లాడుకుంటూ వాళ్లు సుదర్శనుని ఆశ్రమం చేరుకున్నారు. సుదర్శనుని ఆతిథ్యం స్వీకరించారు. తెల్లవారి లేచారు. అగస్త్యాశ్రమానికి పయనమయినారు. అగస్త్యాశ్రమం చేరుకున్నారు.
అగస్త్యుడు రాముని రాకను గూర్చి తెలుసుకున్నాడు. ఎదురేగి వారికి స్వాగతం పలికారు. ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. ఆతిథ్యం ఇచ్చాడు. రామునికథ సాంతం విన్నాడు సీత రామునితో అడవులకు వచ్చినందుకు సంతోషించాడు. అగస్త్యుడు రామునికి ఒక ధనుస్సు ఇచ్చాడు. అది బంగారపది. రత్నఖచితం అయింది. పరశురాముడు దాన్ని మహేంద్రునికి ఇచ్చాడు. మహేంద్రుడు అగస్త్యునికి ఇచ్చాడు. అగస్త్యుడు రామునికి ఇచ్చాడు. అగస్త్యుడు రామునికి అక్షయతూణీరాలను కూడా ఇచ్చాడు. పంచవటి మంచి ప్రదేశం. అక్కడ ఉండవలసిందని చెప్పాడు. పంచవటి అక్కడికి రెండు యోజనాలు. అగస్త్యుడు పంచవటికి మార్గం చూపించాడు.
రాక్షసులకు సంబంధించిన వృత్తాంతం - బాలకాండలో తప్ప ఇంతవరకు ఎక్కడా రాలేదు. వారి ప్రవృత్తి ఏమిటి? వాళ్లేం చేస్తారు. ఇవేవీ తెలియవు. చిత్రకూటం నుంచి వెళ్లిపోయే మునులు మాత్రం రాక్షసబాధ ఎక్కువమంది అంటారు. అది ఎలాంటి బాధ? రాక్షసులు భీకరరూపాల్తో మునులను భయపెడ్తారట. ఆశ్రమాల్లో అపరిశుద్ధ పదార్థాలు పడేస్తారట. హోమాగ్నులను చల్లారుస్తారట.
వీరికి నాయకుడు ఖరుడట! ఖరుడు రాముణ్ణి చూచి ఓర్వలేక పోతున్నాట్ట. రాముని వెంటపడి బాధించడానికి పూనుకున్నాట్ట. అందువల్ల వారు చిత్రకూటం వదుల్తారట.
తరువాత జరిగిన సంఘటనలేవీ ఈ ఉదాహరణను ధృవపరచేట్లు లేవు.
చిత్రకూటం నుంచి రాముడు అత్రి ఆశ్రమానికి వెళ్లాడు. అత్రిగాని, అనసూయగాని రాక్షసులను గురించిన మాటే ఎత్తరు. భార్య భర్తను వదలరాదనే వాదాన్ని వినిపిస్తుంది. మరొక విషయం - సీత తన పెళ్లి కథను వివరంగా చెపుతుంది. అంటే బాలకాండలోని కథలేకున్నా మనకు సీతా కళ్యాణ కథ అర్థం అవుతుంది.
అక్కణ్ణుంచి బయల్దేరిన రాముడు విరాధుణ్ణి వధిస్తాడు. విరాధుణ్ణి వధించింది రాక్షసుడిని మాత్రమే కాదు. సీతను విడిపించడానికి.


