శరభంగునికోసం అగ్నికుండ సిద్ధం చేశారు. అతడు హోమం చేశాడు. అగ్గిలో దూకాడు. శరభంగుని దేహం క్షణంలో బూడిద అయింది. శరభంగుడు తొలియవ్వనం తొణికిసలాడే నవయువకుడై బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు.
రాముడు శరభంగుని ఆశ్రమంలోనే ఉన్నాడు. దూరం దూరం నుంచి మునులు వచ్చారు - రాముని చూడ్డానికి, వారంతా రామునితో "మేమంతా, ఆకూ, అలం తినేవాళ్లం. ఒకరికి కీడుచేసి ఎరుగం. అయినా రాక్షసులు అనేక బాధలు పెడ్తున్నారు. ఈ అడవి సాంతం మునుల కళేబరాలతో నిండి ఉంది. నీవు రాక్షసులను వధించాలి. మమ్ము రక్షించాలి" అని ప్రార్థించారు.
"మీరు నన్ను ఆజ్ఞాపించాలి - ప్రార్థించడం కాదు. నేను అడవులకు వచ్చింది నాపని మీదే అయినా మునులను రక్షించడం అనే పని కల్పించారు. శిరసావహిస్తాను. రాక్షసులు మునులకు శత్రువులు. వారిని యుద్దంలో జయిస్తాను. మీరు మా అన్నదమ్ముల పరాక్రమం చూస్తారు. ఇదే మీకు అభయం ఇస్తున్నాను" అన్నాడు రాముడు.
రాముడు అక్కణ్ణుంచి బయలుదేరాడు. సుతీక్షుని ఆశ్రమం చేరుకున్నాడు. సుతీక్షుడు రాముని ఆదరించాడు. రాముడు తాము ఉండటానికి ప్రదేశం చూపించాల్సిందని మహర్షిని కోరాడు. తన ఆశ్రమంలోనే ఉండి పొమ్మన్నారు మహర్షి. అయితే ఇక్కడ క్రూర మృగాల బెడద ఎక్కువ అన్నాడు. అందుకు రాముడు "మహర్షీ! మృగాలు ఎన్నివచ్చినా సంహరిస్తాను. కాని అందువల్ల మీకు బాధ కలుగుతుంది. అంతేకాక ఇతక ఆశ్రమాలు కూడా దర్శించాల్సి ఉంది. ఇక్కడ చిరకాలం ఉండను" అన్నాడు.
ఆ రాత్రి వారు అక్కడ గడిపారు. తెల్లవారి వారుకమలములు నిండిన కొలనులో స్నానం చేశారు. మహర్షి వద్ద శెలవు తీసుకున్నారు. మరొకసారి తన ఆశ్రమానికి రావలసిందని మహర్షి కోరాడు. రాముడు అందుకు అంగీకరించాడు.
సీత రామునికి బాణము, ఖడ్గము అందించింది. లక్ష్మణుడు ఆయుధాలు అందుకున్నాడు. బయల్దేరారు వారు. అడవులలో నడక సాగించారు.
స్త్రీ హృదయం సహజంగా కోమలమైంది. అతివ హృదయం పావురం లాంటిది. అది శాంతికి సంకేతం స్త్రీ ఒక ప్రాణికి జన్మనిస్తుంది. బిడ్డనుచూసి మురిసిపోతుంది. నారీ హృదయం అశాంతిని, హింసను యుద్ధాన్ని కోరుకోదు. అతివ అందాన్ని దోసిళ్లతో తాగగలదు. తాగించగలదు. కాని పిసరంత రక్తం చూసి సహించలేదు. సీత సహజంగా సుకుమారి. ఆమె హృదయం కుసుమకోమలం అయింది. రాముడు మునులకు అభయం ఇచ్చాడు. రాక్షసులతో యుద్ధం చేస్తానన్నాడు. అదివిని ఆమె హృదయం కదిలిపోయింది. ఆమె గడగడ లాడింది. రక్తపాతం ఆపుచేయాలనుకుంది. రామునికి చెప్పాలనుకుంది. కాని సమయం దొరకలేదు. ఇప్పుడు సమయం బావుంది. ముగ్గురూ అడవిలోంచి నడిచిపోతున్నారు. మౌనంగా ఉన్నారు. పరిసరాలు పచ్చగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నాయి. మెల్లగా సాగించింది.
"నీకో మాట చెప్పాలనుకున్నాను. నీవు హింసకు పూనుకున్నావు. ఋషులకు అభయం ఇచ్చావు. అది విన్ననాటినుంచీ నాగుండె దడగడలాడుచున్నది. దండకారణ్యంలోకి పోవడం నాకు యిష్టంలేదు. రాక్షసులు కనిపిస్తే నీవు వారిని చంపుతావు. వారితో నీకేం వైరం? వైరం లేకుండా ప్రాణహింస చేయడం తప్పుకాదా? మునులను రక్షించు. తప్పులేదు. కాని అకారణంగా రాక్షసులను చంపవద్దు. అది నాకు ఇష్టంలేదు. నీకూ ధర్మం కాదు.
"అసలు నీకు ఆయుధం ఎందుకు? అరణ్యవాసానికి ఆయుధంతోనేంపని? ఇది అరణ్యం. ఇక్కడ తపస్సు చేయాలి. మునివృత్తిని అవలంబించాలి. తిరిగి అయోధ్యకు వెళ్లేదాకా నీవు ఆయుధం పట్టనక్కరలేదు. అసలు రాజ్యమే అక్కరలేదంటావా? సంతోషం. అడవుల్లో ఇలాగే ఉండిపోదాం.
మనిషి దగ్గర ఆయుధం ఉండడం మంచిదికాదు. మనిషికీ ఆయుధానికీ నిప్పుకూ కర్రలకూ ఉన్నలాంటి సంబంధం. ఆయుధం వేరుగా ఉంటే నిప్పులా మండి ఆరిపోతుంది. అది మనిషి చేతికివస్తే కట్టెలు పడ్డ అగ్గిలా భగభగా మండుతుంది.
ఆయుధం పట్టుకుంటాను. నేను హింసచేయను. అంటావేమో అది జరగని పని. ఆయుధం అగ్గిలాంటిది. దాన్ని అంటుకున్నాక కాలక మానదు. ఇంతకు సంబందించిన ఒక కథ చెబుతాను విను.
పూర్వం ఒక ఋషిఉండేవాడు. అతడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సు భంగం చేయాలనుకున్నాడు ఇంద్రుడు. బంటు వేషంలో వచ్చాడు. ఒక కత్తిని ఋషికి ఇచ్చాడు. దానిఉంచమని చెప్పాడు. వెళ్లిపోయాడు.
ఋషికి కత్తి దొరికింది. అతడు హింసకు పూనుకున్నాడు. తపస్సు మరచాడు. వేటాడ్డం ప్రారంభించాడు. ఎన్నో ప్రాణులను వధించాడు. రక్తం చూడకుంటె బ్రతకలేకపోయాడు. తుదకు నరకానికి వెళ్లిపోయాడు.
విన్నావా! నీవు ధనుర్భాణాలు విసర్జించడం మంచిది. ఆయుధం ఆర్తులను రక్షించడానికి. నిరపరాధులను శిక్షించుటకు కాదు. కాబట్టి నీవు మునివృత్తి అవలంబించడం మంచిది. ఇదినాకు తోచింది. నీకు చెప్పాను."
రాముడు సీతమాట వినలేదు :-
"సీతా! క్షత్రియుడు ఆర్త రక్షణకు ఆయుధం ధరించాలి. ఇక్కడి మునులు ఆర్తులు. వారు నన్ను శరణుకోరారు. నేను అభయం ఇచ్చాను. ప్రాణం పోయినా నేను మాటతప్పను. ఆ విషయం నీకు తెలుసు. నామీద ఉన్న సౌహార్ధంతో నీవు అలా మాట్లాడావు. అందుకు నాకు సంతోషంగా ఉంది."
అలా ముచ్చట్లు పెట్టుకుంటూ నడకసాగించారు. అనేక ఆశ్రమాలు తిరిగారు. ఒక ఆశ్రమంలో పదమూడు నెలలున్నారు. ఇంకొక ఆశ్రమంలో సంవత్సరం ఉన్నారు. మరో ఆశ్రమంలో నాలుగు నెలలున్నారు. అలా ఆశ్రమాలు దర్శిస్తూ పదిసంవత్సరాలు గడిపారు.
శరభంగుని ఆశ్రమానికి చాలామంది మునులు వచ్చారు. రాక్షస బాధను గురించి రామునికి మొరపెట్టుకున్నారు. అడవులనిండా మునుల మొండాలు పడిఉన్నాయన్నారు.
రాముడు సుతీక్షుని ఆశ్రమానికి వచ్చాడు. సుతీక్షుడు రాక్షసులను గురించి ముచ్చటించనైనా ముచ్చటించడు. అతడు క్రూరమృగాలను గురించి చెప్పుతాడు.
రాముడు పదేళ్లు అనేక ఆశ్రమాలు తిరిగాడు. ఎక్కడ రాక్షసులు తటస్థపడ్డట్టు కనిపించరు. ఎవరినీ చంపినట్లూ కనిపించదు.
ఖరుని బాధపడలేక చిత్రకూటం వదిలి పోతున్నామంటారు అక్కడి ఋషులు. ఏడీ ఖరుడు? ఎవరినీ బాధించరే?
ఇదంతా అసంగతంగా ఉంది. అర్థంలేనట్లుగా ఉంది. రాక్షసులనేది ఒక అభూత కల్పనలా కనిపిస్తుంది. రాముడేదో మునిజనసేవ చేశాడని చెప్పడానికి కల్పించిన కట్టుకథలా ఉంది. అయినా సీతమాట్లాడిన మాటలు అందంగా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి.
మనిషికి కావలసింది శాంతి, మనశ్శాంతి. శాంతికోసం మానవుని ఆరాటం ఇంతింతని చెప్పలేం. దానికోసం అతడు తన స్వాతంత్ర్యాన్ని వదులుకున్నాడు. కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. దేశాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు.


