Next Page 
మధుపం పేజి 1


                                       మధుపం
                                                                                 డి. కామేశ్వరి.

                               
    
    "వదినా, మీ ఫ్రెండ్ అఖిల ఎలా వుంటుంది చూడ్డానికి. నీవు చెప్తుంటావు మంచి తెలివైంది, ఏక్టివ్ గా , స్మార్ట్ గా వుంటుందంతావు. అందంగా కూడా వుంటుందా?" నిత్య అడిగింది వదినగారిని. మహిమ కళ్ళెత్తి ఆడపడుచు వంక కాస్త అనుమానంగా, మరికాస్త ఆశ్చర్యంగా చూస్తూ "ఎందుకు, ఎందుకలా అడిగావూ?"
    "ఊరికే , చెప్పు వదినా, నేనెప్పుడూ చూడలేదుగా ఆవిడని. ఆవిడ భర్త మా బాస్ గదా కుతూహలంగా అడిగా అంతే...."
    'అఖిలకేం , అందం అంటే, అద్భుత సౌందర్యవతి అనను - కాని నవ్వు మొహం, కళ్ళైన మొహం, మంచి వత్తు జుత్తు ..... అన్నింటికంటే ఎక్స్ ప్రేసివ్ కళ్ళు - మొహం చూడగానే తెలివైనదని, మంచి ఆకర్షణ వుందన్నది అందరికి తడ్తుంది. నలభై ఏళ్ళు వచ్చినా యింకా చక్కని ఫిగర్ మెయిన్ టైన్ చేస్తూ స్మార్ట్ గా వుంటుంది. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లైవ్లీగా వుండేది . మంచి స్నేహితురాలు ..... అందరితో కలుపుగోలుగా వుండి సెంటర్ పాయింట్ లా వుండేది ...."
    "మరి అంత చక్కని , మంచి భార్య వుండగా .... యిదెం రోగం ....." చటుక్కున ఆగిపోయింది నిత్య, మహిమ చురుగ్గా చూసి..... "ఏమిటి ,. ఏమంటున్నావు ....' అంది.
    నిత్య చూపు తప్పించి, "అబ్బే ఏం లేదు .... వూరికే ....' అంది.
    "ఊరికే ఏం అడగలేదని నాకు తెలుసు చెప్పు ..... ఏమిటి విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు. ఫరవాలేదు."
    "వదినా, మా ఆఫీసులో మేధ అని రెండు మూడు నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది. ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ..."
    'అయితే" అనుమానంగా అడిగింది మహిమ. నిత్య కాస్త ఆగి .... 'వదినా కార్తీక్ గారు మేధ.... ఇద్దరూ చాలా క్లోజ్ గా వుంటున్నారు....'
    "ఛ....ఛ.... అదేంటి కార్తీక్ అలాంటివాడెం కాదు. అఖిల అతను యిద్దరూ చాలా హాపీ కపుల్..... అయినా అతడేమన్నా చిన్న కుర్రాడేంటి. నలబై దాటినవాడు. ఇద్దరు కాలేజీ గోయింగ్ పిల్లలు..... అలాంటిదేం ఉండదు. పర్సనల్ అసిస్టెంట్ కనుక యిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది గదా!"
    "వదినా, ఏమిటి అవన్నీ నాకు తెలియవంటావా, నేనేంటి అందరూ చెప్పుకుంటున్నారు. అందరికన్నా ఆఖరికి నాకు తెల్సింది. ఇదివరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ సెక్రటరీగా ఉండేది. ఎంత హుందాగా వుండేది. ఏమిటో ఈ మేధని చూస్తేనే అదోరకంగా అన్పిస్తుంది.'
    "మీకందరికీ యిలాంటి అనుమానం రావడానికి ప్రత్యేక కారణం వుందా. ఎవరన్నా ప్రత్యక్షంగా ఏదన్నా చూశారా. వూరికే ఊహాగానాలు...."
    "మా కొలీగ్ అనంత్ ఆదివారం ఓ రెస్టారెంట్ కి ఫ్యామిలి తో వెడితే వీళ్లిద్దరూ డిన్నర్ తీసుకుంటున్నారుట. ఇతన్ని చూసి కార్తీక్ కాస్త తడబడ్డాడుట. ఇంకోసారి లలిత అన్న రిసెప్షనిస్టు యిద్దరూ కారులో వెళ్తుంటే చూసిందిట. ఎవరి దాకానో ఎందుకు నేను చూసా ప్రత్యక్షంగా ....' ఆగిపోయింది నిత్య.
    "ఏం చూశావు?" కళ్ళు చిట్లించి చూసింది. నిత్య తలదించుకుంది. "వదినా ఓ రోజు నా ప్రాజెక్టు తాలూకు సి.డి. కార్తీక్ గారి టేబుల్ మీద వుందని మా ప్రోగ్రాం ఎనాలసిస్ట్ చెపితే తెచ్చుకోడానికి వెళ్ళాను. కార్తీక్ గారు ఇంకా రాలేదనుకుని తలుపు తట్టకుండానే తలుపు తోశాను. కార్తీక్ గారు కుర్చీలో కూర్చుంటే ఈవిడ గారు కుర్చీ వెనుక నుంచీ అయన భుజాల మీద చేతులాన్చి తలలు దగ్గర చేసికొని తన్మయత్వంతో మాట్లాడుకుంటున్నారు. నేను, నాతో పాటు వాళ్ళూ షాకయ్యారు. నేను వెనక్కి పారిపోయి వచ్చేశాను గాభారాపడి...."
    మహిమ తెల్లపోయింది . నిజం ...... నిజంగా.....కార్తీక్....." నమ్మలేనట్టు అడిగింది.
    "అవును వదినా, పబ్లిక్ గా ఆఫీసు టైం లో ఎంత నిర్బయంగా ఇద్దరూ ..... లక్కీగా నేను అఖిల గారి స్నేహితురాలి ఆడపడుచునని కార్తీక్ గార్కి తెలియదులే.... ఆరోజు నా మొహం ఆయనకేలా చూపాలో అర్ధం కాలేదు.... కార్తీక్ గారు బయటికి వచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు చూపు విసిరి వెళ్ళిపోయారు."
    వింటున్న మహిమ మొహం నల్లబడింది. 'ఛీ ..... శుభ్రమైన పెళ్ళాం, టీనేజ్ పిల్లల్ని పెట్టుకుని యీ కుర్ర వేషాలేమిటి. పెద్ద పొజిషన్ లో వుండి ఇంత చీప్ గా ఛా...."
    'అది సరే .... యింత జరుగుతున్నా మీ అఖిలగారేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్టు వుంది."
    'దానికేం తెలుస్తుంది . ఆఫీసులో జరిగే భాగోతం ...."
    "సెల్ ఫోన్ లో ఎస్సేమ్మేస్ లు చూసి ఉండకపోవచ్చు......' నిత్య నెమ్మదిగా అంది. మహిమ ఆశ్చర్యంగా చూసింది. "ఎస్సెమ్మెస్ లా.... ఎవరు పంపారు . నీకెలా తెలుసు?"
    "నేనే పంపానోదినా.... నాకెందుకో పాపం అఖిలగారినిలా మోసం చేయడం బాధనిపించింది. ఆవిడకి సంగతి తెలియాలి కనీసం. తరువాత అవిడిష్టం ఏం చేసినా అనిపించి వరుసగా మూడు రోజులు పంపించాను. ఆవిడవి చూసి వుంటే కుతూహలం కోసమన్నా నానేంబరుకు ఫోను చేసి ఎవరు పంపారన్నది తెల్సుకునేదిగా...."
    "దానికి తెలియజేయడం సరి అయినపనా, పాపం అనవసరంగా దాని మనసు బాధపడ్తుంది ..... నీవు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు. పాపం అఖిలకిదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది..... నీవు ఎస్సెమ్మెస్ లు పంపకుండా వుండాల్సిందేమో...."
    "అదేమీటోదినా, ఓ భార్యగా భర్త ప్రవర్తన తేల్చుకోవలసిన అవసరం లేదా!" మహిమ అయోమయంగా, నిస్సహాయంగా చూసి ...."ఆలోచించాలి, దాంతో చెప్పాలో వద్దో ఆలోచిస్తాను..."

                                  *    *    *    *
    సెల్ ఫోన్ లో పేరుకుపోయిన ఎస్సెమ్మెస్ లు ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ పోతుంటే ఓ ఎస్సెమ్మెస్.... తెలుగు అక్షరాలని ఇంగ్లీషులో రాసిన ఆ మెసేజ్ చూసి టక్కున ఆగిపోయింది అఖిల..... "ఆఫీసులో, సెక్రటరీ మేధతో మీ వారి ప్రేమాయణం గురించి మీకు తెలుసా, కళ్ళు తెరచి చూడండి. శ్రేయోభిలాషి...." తారిఖు చూసింది. ఎప్పుడో నాల్గు రోజుల క్రితం యిచ్చింది. ప్రం నంబరు చూసింది. తెల్సిన నెంబరులా అన్పించలేదు. ఒక్క క్షణం .... ఆగి .... డిలీట్ చేయకుండా సేవ్ చేసి యింకా ముందుకి వేడ్తుంటే మరో రెండు మెసేజ్ లు కన్పించాయి. మొన్న నిన్న తారీఖులతో .... అదే నంబరు.అదే మెసేజ్..... ఆఖరుదానిలో మరో వాక్యం.... "ఇదేదో జోక్ కాదు నిజం" అని వుంది. మిగతావన్నీ డిలీట్ చేసి ఆ మూడు సేవ్ చేసింది అఖిల. పిచ్చి పిచ్చి మెసేజ్ లు రోజుకు ఎన్నో వస్తాయి. ప్రకటనలు, జోక్ లు, సెల్ ఫోన్ ఆఫర్లు అవన్నీ చదివే తీరిక వుండదు. ఆఫీసు కారులో వెనుక సీటులో , కూర్చుని ఒక్కసారి డిలీట్ చేసి పడేస్తుంది. అలా ఆఫీస్ కెళ్ళే నలబై నిమిషాల ప్రయాణంలో ఇమేయిల్స్, సెల్ ఫోన్ మిస్ డ్ కాల్స్, మేసేజ్ లు చదువుతూ వుంటుంది. ఇంట్లో టిఫిన్ తినే టైము కూడా లేక రెండు శాండ్ విచ్ లు టిఫిన్ బాక్స్ లో తెచ్చుకుని కారులోనే ఓ అరటి పండు తిని బ్రేక్ ఫాస్ట్ అయిందని పిస్తుంది అఖిల. ఉదయం ఐదున్నరకి లేచి కాఫీలు, టిఫిన్లు, నల్గురికి లంచ్ బాక్స్ లు , టిఫిన్ బాక్సులు కట్టి, స్నానం చేసి ఆదరాబాదరా ముస్తాబై గృహిణి అవతారం చాలించి కార్పొరేట్ ఉద్యోగినిగా కారెక్కి ఆ నలభై నిమిషాల్లో పేపరు కూడా చదవడం ముగించి, తలెత్తకుండా ఐదు వరకూ పని పని, ఏ ఆరుకో బయలుదేరితే ఓ గంట గంటన్నర ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం మధ్య నలిగిపోయే వేలాది మంది గృహిణుల్లో అఖిల ఒకరు. ఇలాంటి ఎస్సెమ్మెస్ లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ అమెది.
    ఆ మెసేజ్ ఎంత వద్దనుకున్నా ఆమెలో ఇంతో అంతో కలవరం రేపింది.
    అందులో ఎంత నిజం అన్నది ఆలోచించే టైము ఓపిక లేవు ఆమెకి. మనసులో ఓ మూల ఆ వార్త స్థానం సంపాదించుకుంది ఆమెకు తెలియకుండానే.

                                *    *    *    *
    "హల్లో .... నా నెంబరుకు మెసేజ్ వచ్చింది మీ నెంబరు నుంచి. దయచేసి మీరెవరో , అలాంటి మేనేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా....!"
    ఒక్క క్షణం అటునించి నిశ్శబ్దం...... "హల్లో ప్లీజ్ , మీరెవరు , నాతో గేమ్స్ ఆడుతున్నారా.....' అఖిల కాస్త గట్టిగా అడిగింది.... "ధైర్యముంటే చెప్పండి మీరెవరో.... అందులో నిజానిజాలెంతో చెప్పండి."
    "మేడమ్ ....మీతో గేమ్స్ ఆడవల్సిన అవసరం నాకేం లేదు. మీ శ్రేయోభిలాషిగా మీకీ విషయం తెలియాలని చెప్పాను. నమ్మీదీ మానేదీ మీ ఇష్టం...."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS