Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 1


                                దాశరథి రంగాచార్య రచనలు - 9

                                                         రణభేరి - రణరంగం

                                          
    
                                                              శ్రీ అజంతా

    న్యూస్ రీల్

    హంతకుని అరచేతులు ఎరుపు
    వంచకుని మాటల తెరల వెనుక పడగ విప్పిన విష సర్పాలు ఎరుపు
    అరమోడ్పు కన్నులలో విద్రోహి వెన్నెల కిరణాలు ఎరుపు
    చైనా అధినేత మావో కనుబొమ్మల కొమ్మలపై ఘృతేళికలు మరీ మరీ ఎరుపు
    ఎర్రదనం రాజకీయం విద్రోహానికి గుర్తు
    ఎర్రజెండా మిత్రభేదానికి గుర్తు.
    చైనా చరిత్ర అనే చీకటి నికర్షణంలో ఎటుచూసినా నెత్తురు మడుగులే
    నెత్తురు మడుగులోనే ఉద్భవించినది కమ్యూనిజం అనే కమలం
    భాష్యకారుడు ఎవరైతేనేం
    మనిషి కన్నీళ్ళను చషకాలలో నింపుకొని త్రాగడంలో
                అంతా ఉన్మదిష్ణువులే.
    ఫాసిజం కోరలు తీసిన పులి
    మావో కమ్యూనిజం దాన్ని ఉపాసిస్తున్న నెచ్చెలి
    స్నేహాన్ని ఉచ్చరిస్తూనే
    కంఠాన్ని ఉత్తరించడం పెకింగ్ పండితుల ప్రత్యేక శైలి.
    
    చైనా నిఘంటువులో శాంతి అనే మాటకు అర్థవివరణం లేదు
    యుద్ధపర్వంలో అపశ్రుతి
    లేదా మారణహోమానికి ముందు రాక్షసుడు ఒళ్లు విరుచుకుంటున్న విశ్రాంతి.

    మార్క్సుస్టు మేఘాలు మిథ్యాకుసుమాలు వినా మరి దేన్నీ వర్షించవు
    దివాస్వప్నాలవల్ల కడుపు నిండుతుందా, మండుతుందా?
    తుపాకులు ఆకలి తీర్చలేవుకదా!
    ఆర్ధిక స్వర్గారోహణం నుంచి హఠాత్తుగా నేల కూలడంతో    
    ఆసియా ఖండాన్ని ఒలుచుకుని తినడానికి ఉద్యమించారు చైనావాళ్ళు
    క్షుధార్తి చల్లార్చుకొనడానికి.

    ఇండియా అక్షయపాత్ర
    దాన్ని ఆశ్రయించుకున్న, వాళ్ళంతా నిద్రాళువులు
    నిద్రాళువుల సంహారానికై జరిగిన కుట్ర ఏవిధంగా బ్రద్ధలైనదీ అంతా విన్నదేకదా!

    సామ్యవాద విభావరిక్రింద క్షామదేవత నాట్యం చేయడం విడ్డూరమైన విషయమే
    చైనా సమిష్టి క్షేత్రాలలో పక్షులు సైతం భిక్షాటన సాగిస్తున్నట్టు ఇటీవల వార్తలు వింటున్నాం
    దేహీ అనడంలో తప్పులేదు
    కాని, మానవమాత్రులకు ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇంకనేం?
    కనుకనే స్టాలిన్ ఫార్ములా ప్రకారం
    ఇష్టకార్య సాధనకు ఇతరుల ఆకాశాలను మ్రుచ్చలించినా
    స్నేహవృక్షాలను వెన్నుపోటు పొడిచినా
    తలపెట్టిన కార్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చుకొనడం ప్రధానలక్ష్యం.

    చైనాలో ఒక ప్రజాకవి ఇటీవల మావో కనుబొమ్మలపై మహాకావ్యం వ్రాశాడట!
    మావో గొప్పవాడే!
    మనిషి ఉచ్చ్వాస నిశ్వాసాలపై పన్ను విధించడం అన్నా
    సీతాకోకచిలుకలను సిల్కు దారాలతో ఉరి తీయడం అన్నా
    అతనికి చాలా ఇష్టం.

    ప్రధాని చౌ ఎన్ -లై అంతర్జాతీయరంగంలో ఆటబొమ్మ
    అరమోడ్పు కన్నుల వెనుక అహస్సు రగులుతున్నా
    అందంగా అరవిందంలా నవ్వడం అతని రాజకీయ చ్చందస్సు;

    చైనా ఇకనుంచైనా తన చెయిదాన్ని మార్చుకుంటుందని అనుకోవచ్చునా?
    ఖచ్చితంగా చెప్పడం కష్టమే
    ప్రతీకార జ్వాలలతో మెరుస్తున్న నా హృదయాన్ని ఏనాడో యుద్ధరంగానికి    
           బట్వాడా చేశాను.

                                                             *  *  *  *


Next Page 

  • WRITERS
    PUBLICATIONS