హైదరాబాద్ సిటీబస్ డైలాగులు
హైదరాబాద్ సిటీబస్ డైలాగులంటే- అర్థంలేనివీ, అపార్థాలు చేసుకునేవీ అన్నమాట! ఇవి హైదరాబాద్ సిటీసర్వీస్ లాగానే చాలా గందరగోళంగా ఉంటాయి. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. అందులో త్యాగాలూ, పశ్చాత్తాపాలూ, నిట్టూర్పులూ బోలెడు ఇమిడిపోయేందుకు అవకాశాలుంటాయి! హైద్రాబాద్ సిటీ సర్వీస్ అంతేకదా! చాలా బస్సులకు నంబర్లుండవు! ఉన్నవాటిల్లో కొన్నిటికి ముందో నంబరుంటే వెనకో నంబరుంటాయ్! ముందు నంబరు చూసుకున్నవాళ్ళు బస్సెక్కితే అది వెనక నంబరు రూట్ లో వెళ్తుంది. అలాగే వైస్ వర్సా! అప్పుడు కండక్టర్ మినిమమ్ ఛార్జ్ టికెట్ కొట్టి మధ్యలో అటూ ఇటూ కాకుండా వదిలేస్తాడు. ఒకో కండక్టర్ త్యాగం చేసి టికెట్ కొట్టకుండా అప్పటికప్పుడే బస్సాపి బయటకు తోసేస్తాడు. ఇలా ఉంటాయన్నమాట!
హీరో ప్లేన్ దిగి సరాసరి ఇంట్లోకొచ్చేస్తాడు.
"రాధికా...రాధికా!"
"ఆ! రాజూ...నారాజూ! వచ్చేశావా రాజూ"
"వచ్చేశాను రాధికా! నీకోసం వచ్చేశాను"
"ఈ మూడు సంవత్సరాలూ మూడు యుగాలుగా గడిచింది రాజూ! నీకోసం ఎదురుచూడని క్షణం లేదు. నిమిషం లేదు! రోజులేదు!"
"నేనూ అంతే రాధికా! రాధికా..."
"ఊ!"
"ఇలా దగ్గరకు రా రాధికా. దూరంగా నిలబడ్డావేం?"
"....."
"మాట్లాడవేం రాధికా? సిగ్గా?"
"....."
"సరే అంత సిగ్గయితే నేనే నీ దగ్గరకొస్తాలే!"
"వద్దు రాజా. నన్నిలా దూరంగానే ఉండనీ."
"దూరంగానా? ఎందుకు రాధికా? మనం కాబోయే భార్యాభర్తలమేగా. ఎందుకు దూరంగా ఉండాలి?"
"నన్ను నువ్వు స్పృశించకూడదు రాజూ."
"ఎందుకని రాధికా. అంటురోగం ఏదయినా వచ్చిందా?"
"కాదు రాజూ! నేనిప్పుడు నీకు పరాయి దానిని!"
"ఆ-! పరాయిదానివా? అంటే?"
"అంటే 'స్వరాయి'కి ఆపోజిట్ 'పరాయి' రాజూ. అంటే ఇప్పుడు నీ స్వంతరాయిని కాదు- ఇతరులకు చెందిన 'రాయిని' అని అర్థం"
"నాకేమీ అర్థం కావటం లేదు రాధికా. అంతా గందరగోళంగా వుంది"
"ఇందులో గందరగోళం ఏముందిరాజూ. నేనిప్పుడు వెంకట్రావు భార్యను.
"ఆ! వెంకట్రావ్ భార్యవా! ఎంత ద్రోహం చేశావు రాధికా. నన్ను ప్రేమించినట్లే నటించి, నన్ను అమెరికాలో డాక్టరీ చదువుకోమని పంపి, నేను తిరిగి వచ్చేవరకూ నాకోసం వేచియుంటానని గ్యారంటీ ఇచ్చి- ఇప్పుడు నేను వచ్చేసరికి వెంకట్రావుని పెళ్ళి చేసుకుంటావా? నువ్వు పరాయివి కాదు కసాయివి రాధికా. నువ్వు రాయివి"
"ఆ విషయం ముందే చెప్పాను రాజూ నేను ప'రాయి'నని!"
"హు. నువ్వు మోసగత్తెవి. నీ మొఖం చూడడమే పాపం. నేను వెళ్తున్నాను. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండను." అని హీరో వెళ్ళిపోతూంటే వెనుకనించి 'బాబుగారూ' అన్న కేక వినబడుతుంది. రాజు వెనక్కు తిరిగి చూశాడు.
"బాబుగారూ. ఆగండి"
"నువ్వెవరు?"
"నేను ఈ ఇంటి పులుసు తాగుతున్న వంటమనిషిని బాబూ!"
"హు. అదాసంగతి. పులుసు వండవద్దని నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ పదేళ్ళ నుంచీ వదలకుండా రోజూ పులుసే చేయడానికి కారణం- అది నీకిష్టమనా?"
"అవును బాబూ. క్షమించండి. పులుసు విషయంలో నాకా బలహీనత ఉంది"
"ఇంతకూ ఇప్పుడు పులుసులో పుడకలాగా మా మధ్యలో వచ్చి నన్నెందుకు ఆగమంటున్నావ్?"
"అమ్మగారు వెంకట్రావ్ గారిని పెళ్ళి చేసుకోడానికి కారణం ఆరిమీద ఇష్టంతో కాదు బాబూ."
"ఆ- కాదా?"
"కాదు బాబూ. ఆ మధ్య అమ్మగారికి జ్వరం వచ్చినపుడు డాక్టర్లు పరీక్షించి ఆమెకు గీన్సర్ అనే జబ్బు ఉందని చెప్పారు"
"ఆ! గీన్సరా?"
"అవునండీ. అది కొత్త జబ్బు. ఈ మధ్యన కనుక్కున్నారు మన సైంటిస్టులు. అది కాన్సర్ కంటే ఎక్కువ పవర్ ఫుల్. గీన్సర్ వున్న వ్యక్తులు తాము చనిపోవడమేకాకుండా వారి భర్తలకు గానీ, భార్యలకు గానీ ఆ జబ్బు అంటుకుని వారూ చనిపోతారు"
"ఆ."
"అవును బాబూ. మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే తనతోపాటు మీరూ చనిపోతారని ఆమె వెంకట్రావ్ ని చేసుకున్నారు బాబూ."
"ఆ- రాధికా! నాకోసం ఎంత త్యాగం చేశావ్ రాధికా. కానీ నేనూ నీకోసం నీకంటే ఎక్కువ త్యాగం చేశాను."
"ఆ. నాకంటే ఎక్కువ త్యాగం చేశారా? ఏమిటండీ అది?"
"నువ్వు పెళ్ళిచేసుకున్న వెంకట్రావ్ ఎవరనుకున్నావ్? నేనే."
"ఆ. మీరే వెంకట్రావా?"
"అవును రాధికా. నీకు గీన్సర్ జబ్బు వుందన్న విషయం మన తోటమాలి నాకు రహస్యంగా ఉత్తరం రాశాడు. నువ్వు ఇలాంటి త్యాగం ఏదో చేస్తావని అనుమానం వచ్చి వెంటనే నేనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వెంకట్రావ్ పేరుతో నిన్ను పెళ్ళి చేసుకున్నాను. ఆ తరువాత బిజినెస్ వంకతో మళ్ళీ అమెరికా వెళ్ళి డాక్టరీ పూర్తిచేసి వచ్చాను రాధికా."
"ఆ. నిజంగానా. అయ్యో. ఇప్పుడెలాగండీ. మిమ్మల్ని పాడు గీన్సర్ నుంచి ఎలా రక్షించడం? దయచేసి నన్నొదిలి వెళ్ళిపొండి. గీన్సర్ లేని ఇంకో అమ్మాయిని చేసుకుని సుఖంగా జీవితం గడపండి."
"పిచ్చిదానా. సినిమా కథల్లో హీరోయిన్స్ అందరికీ కాన్సరో, గీన్సరో, టి.బి.యో, గీ.బి.యో, బ్రెయిన్ ట్యూమరో, గ్యీమరో ఏదొక జబ్బు ఉండి తీరుతుంది."
"అయ్యో ఇప్పుడెలాగండీ."
"ఏం ఫరవాలేదు రాధికా. నీకో శుభవార్త చెప్తానిప్పుడు"
"ఆ. శుభవార్తా? ఏమిటండీ అది?"
"నేను మొన్నే గీన్సర్ కి మందు కనుక్కున్నాను."
"ఆ. నిజంగానా?"
"అవును. నీకోసం పద్దెనిమిదేళ్ళుగా రీసెర్చి చేస్తున్నాను రాధికా. ఈ విషయం ఎవరికీ తెలీదు. మొన్నటివరకూ నాక్కూడా తెలీదు. అసలు నేను డాక్టరీ చదివిందెందుకో తెలుసా?"
"కేవలం నాకిచ్చిన మాటకోసమనుకుంటున్నాను."
"కాదు రాధికా. నేను డాక్టరీ చదివింది నీ గీన్సర్ కి ఆపరేషన్ నేనే చేయాలని. ఇవాళ్టికి నా కోరిక నెరవేరుతుంది రాధికా. పద. ఆపరేషన్ చేస్తాను-"
"ఇప్పుడా?"
"అవును రాధికా. ఇప్పుడు చేసేస్తాను"
"కానీ ఆపరేషన్ టేబిల్ లేదుగా?"
"ఫరవాలేదు రాధికా. డైనింగ్ టేబుల్ చాలు"
"నాకిదంతా కలలాగుంది రాజూ-పదండి"
"అబ్బా" అంటూ నొప్పితో గిలగిలలాడిపోసాగాడు రాజు.
"అరె. ఏమయింది రాజూ"
"నొప్పి- అబ్బా"
"అయ్యో. కిందపడిపోయారా? ఏయ్ వంటమనిషీ! త్వరగా డాక్టర్ ని పిల్చుకురా."
"అవసరంలేదు రాధికా. నేను కనుక్కున్న మందు ఫెయిలయిపోయింది. అందుకే ఎన్ని మోతాదులు తిన్నా ఉపయోగం లేకపోయింది. గీన్సర్ మందు నన్ను బలితీసుకుంటోంది. సారీ రాధికా. నిన్ను బతికించుకోలేకపోతున్నాను."
"అయ్యో-ఎందుకనండీ?"
"ఎందుకంటే నేనే ముందు పోతున్నాను కాబట్టి"
"అయ్యో-రాజూ- నా రాజూ"
"ఏడవకండమ్మా! ఆయన డబుల్ త్యాగపురుషుడు-"
ఇంతలో ఫోన్ మోగింది. రాధిక ఫోన్లో మాట్లాడి నీరసంగా తిరిగివచ్చింది.
"ఆయన త్యాగం వృధా అయింది వంటమనిషీ."
"ఆ- వృధానా?"
"అవునోయ్. ఇప్పుడు డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు- నాకు గీన్సర్ లేదట"*
.jpg)


