"అమ్మా! నేను నీ కొడుకు చిన్నినమ్మా"
"ఏడ్చావ్! ప్రతాడూ ఇదో డైలాగ్ నేర్చాడు. ఫోండి ముందు బయటకు"
సరిగ్గా అప్పుడే హీరోగాయం నుంచి తేరుకుని లేచి కూర్చున్నాడు.
హఠాత్తుగా అతనికి గతం గుర్తుకొచ్చేసింది.
"సావిత్రీ" అని లౌడ్ స్పీకర్ లా అరిచాడు.
"సావిత్రెవరు? ఇక్కడెవరూ లేరు ఆ పేరుగలవాళ్ళు" అంది సావిత్రి.
"ఆ... మీరు సావిత్రికాదా?"
"కాదు"
"మరి మీ పేరేమిటి?"
"ఏమో తెలీదు! గతం అంతా మర్చిపోయాను"
చిన్ని ఠక్కున ఇద్దరిమధ్యకూ వచ్చి నిలబడ్డాడు.
"నాన్నా! అమ్మ గతం మర్చిపోయింది. మీరేం గాబరాపడకండి! ఇంకోసారి ఇలాంటి షాక్ తగిలినప్పుడు మళ్ళీ గతం గుర్తుకొచ్చేస్తుంది. అంతవరకూ మనమే జాగ్రత్తగా చూసుకుందాం" అన్నాడు.
కట్ చేస్తే....
హీరో, సావిత్రీ, చిన్నీ కారులో ఇంటికి చేరుకునేసరికి కాళి ఆదరంగా లోపలకు ఆహ్వానించింది. జరిగిందంతా కాళికి చెప్పి సావిత్రి కూడా ఇకనుంచి తన భార్య కెపాసిటీలోనే ఆ ఇంట్లో ఉంటుందని చెప్పాడు. ఆ మాట వినేసరికి కాళి స్పృహ తప్పి కింద పడింది. తలకు వెంటనే పెద్దగాయం అయింది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ థియేటర్ బయట నిలబడ్డ హీరో దగ్గరకొచ్చారు.
"సారీ మిష్టర్! ఆమె ప్రమాదం నుంచి బయటపడింది గానీ జ్ఞాపకశక్తిని పూర్తిగా పోగొట్టుకుని గతాన్ని మర్చిపోయింది.
వాళ్ళు మాట్లాడుతూండగానే రాజ్యలక్ష్మి శాలువా కప్పుకుని వచ్చిందక్కడికి.
"వీరు మా హాస్పిటల్ కట్టించిన రాజ్యలక్ష్మిగారు!" అంటూ హీరోకి పరిచయం చేశాడు డాక్టర్!
"ఇతను ప్రపంచంలోనే ప్రసిద్ధిపొందిన సోషయాలజీ ప్రొఫెసర్ అమ్మగారూ"
"ఆ... మీరా" అంది రాజ్యలక్ష్మి ఏడుస్తూ. "మీరు జెకొస్లోవేకియా వెళ్ళారో, లేక బెల్జియం వెళ్ళారో తెలీక తల్లడిల్లిపోతున్నానండీ! ఈలోగా మీ స్మారక చిహ్నంగా ఈ ఆస్పత్రి కట్టించాను"
హీరో జరిగిందంతా ఆమెకు చెప్పాడు.
"అయితే కాళికి నేను రక్తం ఇస్తాను డాక్టర్! నా రక్తం ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంది రాజ్యలక్ష్మి.
"అవసరం లేదమ్మా! ఆమెకు రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు"
"అయినాసరే! తీసుకోండి. ఈ ఆస్పత్రి సంస్థాపకురాలిగా నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే నా రక్తం కాళికి ఎక్కించండి."
కట్ చేస్తే....
రక్తం ఎక్కించేశారు.
మరుక్షణం కాళి బతికింది. కానీ రాజ్యలక్ష్మి చచ్చిపోయింది.
అది చూసి హీరో మళ్ళీ గతం మర్చిపోయాడు.
కాళి వెంటనే డాక్టర్ కాళ్ళమీద పడింది.
"డాక్టర్! ఆయనకు ఆపరేషన్ చేసి గతం తిరిగి తెప్పించండి. ప్రపంచంలో గతం ఆపరేషన్ మీరొక్కరే చేయగలరు" అంది ప్రాధేయపడుతూ.
డాక్టర్ అయోమయంగా కాళివంక చూశాడు.
"ఎవరికి?" అన్నాడు.
"వారికే డాక్టర్! ఎవరి జ్ఞాపకార్థం ఈ హాస్పిటల్ నిర్మించబడిందో వారే ఇప్పుడు గతాన్ని మర్చిపోయారు డాక్టర్! వెంటనే ఆపరేషన్ చేయండి"
డాక్టర్ పిచ్చాడిలా నవ్వాడు.
"నేను ఆపరేషన్ చేయడమేమిటి నీ మొఖం. నేనేం డాక్టర్నా!" అన్నాడు.
"అదేమిటి? మీరు ప్రపంచంలోని ఏకైక గతాలను ఆపరేషన్ చేసే సర్జన్ కాదూ?"
"కాదు"
"అయితే మరి మీరెవరు?"
"నాకు తెలీదు" అనేసి తనూ వెళ్ళి హాస్పిటల్లో ఖాళీగా ఉన్న ఓ బెడ్ మీద పడుకున్నాడు.
"రాజ్యలక్ష్మి గారు చనిపోవడం చూసి ఆ షాక్ కి పాపం ఆయన గతం మర్చిపోయారు" అంది నర్స్ కాళితో.
"రాజ్యలక్ష్మి చనిపోతే ఈయనకెందుకు షాక్?" ఆశ్చర్యంగా అడిగింది కాళీ.
"గతంలో ఈ డాక్టర్ రాజ్యలక్ష్మిగారిని ప్రేమించారు. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలో రాజ్యలక్ష్మి గారికి కారు ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగలటం వలన గతాన్ని మర్చిపోయి హీరోగారిని పెళ్ళి చేసేసుకున్నారు"
ఇవీ దూరదర్శన్ లేక ఆకాశవాణి డైలాగులు. *


