దూరదర్శన్ లేక ఆకాశవాణి డైలాగులు
ఆకాశవాణి డైలాగులు అంటే అందరికీ తెలుసుకదా! అంతా మతిమరుపు మయం అన్నమాట! ఫలానా వారి కోరికపై ఫలానా చిత్రంలోని పాటను వినిపిస్తున్నాం అంటారు. తీరా పాట వినిపించాక "సారీ- ఇది అందులోది కాదు. ఫలానాది ఈ పొరపాటుకు చింతిస్తున్నాం" అంటారు. ఇక టి.వి.లో కూడా అంతే! రేపు సాయంత్రం ఫలానా కార్యక్రమం టెలికాస్ట్ చేయబోతున్నాం అంటారు. తీరా చూస్తే ఇంకో రకం కార్యక్రమం కనబడుతుంది. ఈ తరహా మతిమరపుని మన సినిమాలు చాలాకాలంగా వాడుతూనే ఉన్నాయ్.
నేషనల్ హైవే నెంబర్ త్రీలో హీరో నడుస్తోంటే కోటీశ్వరుడు లక్ష్మీపతి చెడిపోయిన కారు పక్కనే నిలబడి ఉన్నాడు.
"బాబూ! కొంచెం కారు వైజాగ్ వరకూ తోస్తావా? నేను తెల్లారేసరికల్లా వైజాగ్ చేరుకోపోతే వ్యాపారంలో రెండువందల మూడు కోట్లు నష్టం వస్తుంది" అన్నాడతను హీరో చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ.
హీరో మాట్లాడకుండా బాయ్ నెట్ ఎత్తి పావు క్షణంలో రిపేర్ చేసి కారు స్టార్టు చేసేశాడు.
"ఎంత గొప్ప సహాయం చేశావు నాయినా! పద. మా ఫ్యాక్టరీలో నువ్వే మేనేజరువి ఇక" అన్నాడు లక్ష్మీపతి.
హీరో రాజా రవిసింహ కారు ఎక్కాడు.
కట్ చేస్తే....
లక్ష్మీపతి ఇల్లు, కూతురు రాజ్యలక్ష్మికి లక్ష్మీపతి హీరోని పరిచయం చేస్తూ....
"అమ్మాయ్! ఇతనెవరో పాపం అనాథ! బాగా చదువుకున్నాడిలా ఉన్నాడు. ఎందుకంటే 'ఎన్ సైక్లోపీడియా' పదానికి తప్పుల్లేకుండా స్పెల్లింగ్ చెప్పాడు. అదీగాక సమయానికి నా కారు కూడా రిపేరు చేసి సహాయం చేశాడు. అందుకే మన ఫ్యాక్టరీలో మేనేజరుగా వేశాను. మన అవుట్ హౌస్ లోనే ఇతని బస" అనేసి వెళ్ళిపోయాడు కార్లో.
రాజ్యలక్ష్మి ఆనందంగా హీరో చేయి పట్టుకుంది.
ఇద్దరూ బృందావన్ గార్డెన్స్ లో పాట ప్రారంభించారు... పాట అయిపోయింది.
"మనం పెళ్ళి కూడా చేసుకుందామా?" అడిగింది రాజ్యలక్ష్మి.
"ఎందుకు? పులుపు తినాలనిపిస్తోందా?"
"ఊ..."
"అయితే సరే"
కట్ చేస్తే
పెళ్ళి సీన్! రాజ్యలక్ష్మి మెడలో హీరో తాళి కడతాడు.
కట్ చేస్తే-
సావిత్రి అయిదేళ్ళ పిల్లాడిని ఎత్తుకుని అన్నం తినిపిస్తోంది.
"మమ్మీ!"
"ఏమిట్రా బుజ్జీ?"
"మా క్లాస్ లో పిల్లలందరికీ తండ్రులున్నారు కదమ్మా! మరి నాకు లేరేం?"
"మీ నాన్న బందర్లో ఉన్నార్రా. త్వరలో వచ్చేస్తారు."
"పో మమ్మీ. గత రెండేళ్ళనుంచీ ఇదేమాట చెప్తున్నావుగానీ నాన్న రాలేదు"
"అది నా ప్రారబ్దంరా చిన్నీ. ఇంకా ఆ భగవంతుడికి దయ కలగలేదు."
"అందుకే ఇలా అడ్డమైనాళ్ళనూ నమ్మి పిల్లల్ని కనగూడదు మమ్మీ. ఇప్పుడు చూడు? మా సెయింట్ మేరీ స్కూల్లో అందరూ 'నీ తండ్రెవరు? మీ అమ్మ కుంతి' అని చిత్రవధ చేసేస్తున్నారు నన్ను"
సావిత్రి ఆనందంగా వాడిని గుండెలకు హత్తుకుంది.
"పిచ్చికన్నా! ఎంత ముద్దుగా మాటలు చెప్తున్నావురా. మీ నాన్న జమీందారు అవటం వల్ల సంప్రదాయాల ప్రకారం పెళ్ళి ఏర్పాట్లు చేయడానికి ఇంతకాలం పట్టి ఉంటుంది. రేపో, మాపో తప్పక వస్తారు. పెళ్ళి చేసుకుంటారు."
కట్ చేస్తే....
హీరో పోర్టికోలోకి వస్తాడు. రాజ్యలక్ష్మి పాపాయితో వెనుకే వస్తుంది.
"ఏమండీ. మీరు జెకొస్లోవేకియా వెళ్తూంటే నీకేదో భయంగా ఉందండీ."
"పిచ్చిదానా భయమెందుకు? జెకొస్లొవేకియా ఎంత దూరముందని."
"ఇందాక దేవుడికి దణ్ణం పెట్టుకుంటూంటే ఆ పటం కిందపడి పగిలిపోయిందండీ. అందులో నాకేదో అపశకునం కనిపిస్తోంది. మీరు ఈసారి జెకొస్లొవేకియా కాకుండా ఏ స్వీడనో, బెల్జియమో వెళ్ళకూడదూ?"
"సరే రాజ్యలక్ష్మీ. బెల్జియమే వెళ్తాను. వస్తా"
కట్ చేస్తే....
హీరో వెళ్తోన్న ప్లేన్ పైలట్ ఎనౌన్స్ మెంట్-
"మన ప్లేన్ గంటకు ఎనిమిదొందల కిలోమీటర్ల వేగంతో, పదహారువేల అడుగుల ఎత్తులో హాయిగా, సుఖంగా వెళ్తోంది"
రెండు క్షణాల తర్వాత-
"మన ప్లేన్ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో కిందకు పడిపోతోంది. ఇంధనంలో కిర్సనాయిలు కల్తీ చేయడం వల్ల ఇలా జరుగుతోంది. ఈ విషయం సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టుకి తెలియజేశాము. ప్రభుత్వం ఈ కల్తీ గురించి నిర్ధారించడానికి ఓ కమిటీని వేసిందని ఇప్పుడే అందిన వార్త. పునర్దర్శనం వచ్చే జన్మలో"
కట్ చేస్తే-
మధ్యప్రదేశ్ అడవిలో కూలిపోయిన ప్లేన్! పాసింజెర్లందరూ మసి అయిపోయారు. హీరో ఒక్కడే తలకూ, చేతికీ, బాండేజ్ తో లేచి నడుస్తూంటే కోయవాళ్ళు పట్టుకెళ్ళి తమ కోయదొర ముందు నుంచోబెట్టారు.
"గంభా! గగంభా" అన్నాడు కోయనాయకుడు.
హీరోకి ఆ భాష అర్థం కాలేదు.
"నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు?" ఈసారి తెలుగులో అడిగాడు కోయనాయకుడు.
"తెలీదు. పాత విషయాలన్నీ మర్చిపోయాను" అన్నాడు హీరో.
కట్ చేస్తే-
హీరో కోయదొర కూతురు కాళితో డాన్స్ చేస్తున్నాడు. పాటలోనే ఇద్దరికీ పెళ్ళయిపోతుంది.
కట్ చేస్తే-
హీరో కోయగూడెంలో కొత్తగా పెట్టిన వయోజనవిద్యా కేంద్రంలో ఎమ్.ఏ. చదివి సిటీలోని కాలేజీలో లెక్చరర్ గా జాయినవుతాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అతని మొదటి భార్య కొడుకు మీద ఎందుకో గాఢమైన ప్రేమ ఏర్పడుతుంది.
"ఇవాళ మా ఇంటికి రండి సార్!" అంటాడు చిన్నిగాడు.
ఇద్దరూ ఇంటికెళ్తారు. సావిత్రి అతనిని చూసి మూర్ఛపోయి, వెంటనే లేచి-
"ఏమండీ! ఇన్నాళ్ళకు నన్ను కరుణించారా. పోనీండి. ఇప్పటికయినా వచ్చారు. అదేచాలు. ఇదిగో- చిన్నిగాడు మనబ్బాయేనండీ."
హీరో చిన్నిగాడి చేయిపట్టుకుని బయటకు తీసుకెళ్ళి చాటుగా.
"చూడవోయ్. మీ మదర్ కి హఠాత్తుగా జ్ఞాపకశక్తి పోయింది. అందుకనే నన్ను తన భర్త అనుకుంటోంది. నిజానికి మాది కోయగూడెం. నేను కోయవాడిని. మీ అమ్మనింతవరకూ చూడనయినా లేదు" అన్నాడు.
ఆ మాటలు సావిత్రి గోడ పక్కనుంచి విని ఆవేశం పట్టలేక చేతిలోని ప్రెజర్ కుక్కర్ మూతతో హీరో నెత్తిన బలంగా కొట్టింది. హీరో 'అబ్బా' అంటూ తల పట్టుకుని కింద పడిపోయాడు. తలకి రక్తం. ఆ రక్తం చూసేసరికి సావిత్రి గతం మర్చిపోయింది. తనెవరో కూడా గుర్తులేదిప్పుడు.
"అమ్మా. ఎంతపని చేశావమ్మా" అన్నాడు చిన్ని.
"అమ్మా....! అమ్మెవరోయ్? నువ్వెవరివసలు? ఈ కిందపడ్డ పెద్దమనిషెవరు? మీరంతా ఇంటికెందుకొచ్చారు? గెటౌట్" అంటూ అరచింది.


