ఆరోజు ఆదివారం.
ప్రొద్దున్నే తెలతెలవారుతుండగానే నేను తల్పశాయి ఇంటికి వెళ్లాను. ఎప్పుడూ లేనిది - నేను వాళ్లింటికి వెళ్ళడంతో, అందులోనూ.... అంత ప్రొద్దున్నే వెళ్ళడంతో అతను ఆశ్చర్యపోయాడు.
ఆమాటా - ఈ మాటా అయి అతను ఇచ్చిన కాఫీ త్రాగాక నా మనస్సులోని విషయం బయటపెట్టాను.
అంతా విని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ "అయితే .. నువ్వు కూడా భక్తబృందంలో చేరదలచావన్నమాట! అదిసరే ...ఇంతకీ ఆ పిచ్చివాడెవరో తెలుసా?" అని అడిగాడు తల్పశాయి.
"తెలియదు. ఊళ్ళో పిచ్చిగా తిరగడం మాత్రం తెలుసు" అన్నాను.
అంతవరకూ నవ్వుతూ మాట్లాడుతున్న తల్పశాయి ముఖం గంభీరంగా మారింది. అతని ముఖంలో విచారం ద్యోతకమైంది. "మనం ఎదురుగుండా వున్న గుళ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం... రా!" అంటూ లేచాడు.
మౌనంగా అతన్ని అనుసరించాను నేను.
ఇద్దరం వెళ్లి గుళ్ళో మంటపం మీద కూర్చున్నాం. అక్కడ చాలా ప్రశాంతంగా వుంది. వచ్చే భక్తులు కూడా చాలా తక్కువగా వున్నారు.
ఒక్క నిమిషం మౌనంగా కూర్చున్నాడు తల్పశాయి. శూన్యంలోకి చూస్తూ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి - "ఆ పిచ్చివాడు నా స్వంత అన్నగారు!" అన్నాడు నెమ్మదిగా.
నా నెత్తిమీద మబ్బులేని పిడుగు పడినట్లయింది.
"ఏమిటీ - అతను మీ అన్నగారా? నాకు ఇంతవరకు తెలీదే?!" అన్నాను ఆశ్చర్యంగా.
"నీకేకాదు - చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక పిచ్చివాడ్ని తన అన్నగారని ఎవరు మాత్రం చెప్పుకుంటారు?" అన్నాడు తల్పశాయి.
నేనేమీ మాట్లాడలేదు.
తల్పశాయి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు -
"అతను నా స్వంత అన్నగారు. కాలేజీలో చదువుకుంటుండగా అతనికి పిచ్చి ఎక్కింది. ఎందుకెక్కిందో తెలీదు. ఎన్నో వైద్యాలు చేయించాం. కాని, తగ్గలేదు. తర్వాత వున్నట్లుండి ఒకరోజున ఎక్కడికో వెళ్లిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. పేపర్లలో కూడా ఫోటో వేయించాం. కాని, కనిపించలేదు. కొన్ని నెలలు చూసి ఇంక అతను కనిపిస్తాడనే ఆశ కూడా వదులుకున్నాం. తర్వాత నాకు పెళ్లి అవడం, ఉద్యోగం రావడం, మా అమ్మానాన్నా పోవడం - ఇవన్నీ కొన్ని ఏళ్ళలో జరిగిన సంఘటనలు.
నాకు ఈ ఊరు బదిలీ అయ్యాక అనుకోకుండా ఒకరోజున మా అన్న ఈ ఊళ్ళో కనిపించాడు. నేను పలకరించినా అతను నన్ను గుర్తుపట్టలేదు. అన్న మీద అభిమానం వదులుకోలేక అతన్ని ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాను. కాని, అందుకు మా ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. నిజమే.... సంసారంలో వున్న చిక్కులతోనే సతమతమయ్యేటప్పుడు ఈ పిచ్చివాడిని కూడా ఎవరు నెత్తిన పెట్టుకుంటారు? అయినా..... అతను నాకు అన్న కాని, ఆమెకి కాదు కదా!
అక్కడికీ అభిమానం చంపుకోలేక అప్పుడప్పుడు అన్నం తీసుకెళ్లి అతను కూర్చుంటుండే అరుగు మీద పెట్టి తినిపించేవాడిని. ఇది చూసిన జనం ఆ పిచ్చివాడిలో ఏదో మహత్యం వుందనీ, అందుకే నేను సేవలు చేస్తున్నాననీ భావించి ఆనోటా - ఈనోటా చెప్పుకోసాగారు.
దాంతో ఈ పిచ్చివాడికి లేని మహాత్యం వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది - ఈ ప్రజల అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆసరా చేసుకుని లాభం పొందవచ్చని! వెంటనే నేను కూడా అతని మహత్యం గురించి బాగా ప్రచారం చేశాను. దీనిమూలంగా పళ్లూ, ఫలహారాలూ, డబ్బూ రావడం మొదలెట్టాయి. పిచ్చివాడికి కొంత పెట్టినా మిగిలినది దేవుడి పేరుతో పూజారికి దక్కినట్లు మాకు రాసాగింది.
ఆ తర్వాతి సంగతి నీకు తెలిసిందే!కాని, ఆప్తమిత్రుడివి - నీవు కూడా ఈ మూర్ఖత్వంలో పడడం ఇష్టంలేక, నిజం చెప్పేస్తున్నా. వాడి చేతలకు ప్రజలే అర్దం చెప్పుకుంటున్నారు కాని, నిజానికి మా అన్న దగ్గర ఏ మహాత్యమూ లేదు. మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా రోగాలు కొన్ని తగ్గుతాయి. మందు పనిచేస్తే 'వైద్యుని ప్రజ్ఞ' అనుకుంటున్నాం. పనిచేయకపోతే 'మన ఖర్మ' అనుకుంటున్నాం. అలాగే కార్యం ఫలించినవాళ్లు మా అన్న మహాత్యం అనుకుంటే - ఫలించనివాళ్లు మిన్నకుండా ఊరుకుంటున్నారు. ప్రజలు గొర్రెలమంద కాబట్టి గుడ్డిగా నమ్మేస్తున్నారు' అన్నాడు తల్పశాయి.
అంతావిని నేను కొయ్యబారిపోయాను. సామాన్య ప్రజలు మూర్ఖులు, అమాయకులు అని తెలిసిన నేను కూడా మూర్ఖత్వంలో పడిపోయినందుకు సిగ్గుపడ్డాను.
"అయితే ...ఇలా ఎన్నాళ్లు జరుగుతుంది?" అన్నాను.
"జరిగినన్నాళ్లు జరుగుతుంది. వచ్చిన మహాత్యం వచ్చినట్లే పోతుంది కొన్నాళ్లకి. ఆ తర్వాత మా అన్న మళ్లీ పిచ్చివాడుగానే వుండిపోతాడు" అన్నాడు తల్పశాయి భారంగా నిట్టూరుస్తూ.
నన్ను చూసి నేనే జాలిపడుతూ, ఏడవలేక నవ్వుకుంటూ తల్పశాయి దగ్గర శలవు తీసుకుని ఇంటిముఖం పట్టాను.
అయితే.... 'నిజమైన పిచ్చివాళ్లు ఎవరు?' అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటే ఏమీ చెప్పలేకపోతున్నాను.
- ఆనంద జ్యోతి... 1 మార్చి'80
మరి... , నా సంగతి?
డాక్టర్: ఏమిటి ... మీ కంప్లియంట్?
పేషెంట్: నా భవిష్యత్తు గురించి చాలా దిగులుగా వుందండీ!
డాక్టర్: పర్వాలేదు. మీకు సంవత్సరంపాటు మంచి ట్రీట్ మెంట్ ఇస్తాను. నెలకి వెయ్యి రూపాయలే చార్జి.... చేస్తాను
పేషెంట్: దాంతో మీ భవిష్యత్ బాగుపడ్తుంది. మరి..., నా సంగతి?


