ఎవరు పిచ్చివాళ్ళు?
మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.
పెద్ద బజారు దగ్గర చాలామంది గుమిగూడి వున్నారు. ప్రమాదం ఏమైనా జరిగిందా.... అనుకుంటూ నేనూ ఆ జనంలో జొరబడ్డాను.
అక్కడ ఒక ఇంటి పెద్ద అరుగు మీద ఒక నడివయస్కుడు పడుకుని మూలుగుతున్నాడు. ఒకాయన అతని చొక్కా పైకెత్తి పొట్టకి నూనె రాస్తుంటే, మరొకాయన కాళ్లు పిసుకుతున్నాడు.
ఆ పడుకుని వున్న వ్యక్తి ఎవరా... అని తేరపార చూస్తే - అతను ఎవరో కాదు - ఒళ్ళంతా కుళ్ళు గుడ్డలు వేసుకుని జడలు కట్టుకున్న జుట్టుతో ఊరంబట తిరుగుతూ వుండే పిచ్చివాడు.
ఆ పిచ్చివాడిని నేను ఆ ఊళ్ళో ఎన్నో ఏళ్ళబట్టి చూస్తూనే వున్నాను. ఎప్పుడూ ఏదో గొణుక్కుంటూ తనలో తాను నవ్వుకుంటూ... .ఇతరులు ఉడికిస్తున్నా, రాళ్లు వేసి కవ్విస్తున్నా లెక్కచేయక తన దారిన తాను పోతుంటాడు. మంచివాళ్లని పిచ్చివాళ్లని చేసి చూసి ఆనందించే జనం - ఈ పిచ్చివాడికి సేవలు చేస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేసింది.
"ఏం జరిగింది?" అని అన్నాను జనంలో ఒకరిని వుద్దేశించి.
"స్వాములవారికి పొట్ట నెప్పి వచ్చింది" అన్నాడు ఆయన.
నా చెవులను నేనే నమ్మలేకపోయాను.
"స్వాములవారు ఎవరండీ? ఇతను పిచ్చివాడు కదా?"అన్నాను ఆశ్చర్యంతో.
"అపరాధం - అపరాధం! ఆయన పిచ్చివాడులా కనిపిస్తాడు కాని, మహాజ్ఞాని!" అన్నాడు ఆయన లెంపలు వేసుకుంటూ.
'ఇంకా నయం... నా లెంపలు వేశాడు కాదు!' అనుకున్నాను మనస్సులోనే.
"ఆయన పిచ్చివాడు అనుకునేవాళ్లు పిచ్చివాళ్లు నాయనా! లోకం జ్ఞానులని పిచ్చివాళ్లని అనుకుంటుంది. రామకృష్ణ పరమహంస కథ వినలేదూ?" అన్నాడు ప్రక్కనున్న ఇంకొక ముసలాయన చిదానందంగా నవ్వుతూ జ్ఞానరహస్యాన్ని తెల్పుతూ.
ఇంతలో... జనాన్ని చీల్చుకుంటూ 'తల్పశాయి' అక్కడికి వచ్చాడు.
చేతిలో ఓ అల్యూమినియం క్యారియరూ, ఇంకో చేతిలో మరచెంబు పుచ్చుకుని తిన్నగా ఆ పిచ్చివాని దగ్గరకు వెళ్లాడు.
'ఇతను ఎందుకు వచ్చాడా....' అని ఆశ్చర్యపోసాగాను. నేను ఆశ్చర్యాన్నుంచి కోలుకోకముందే తల్పశాయి ఆ పిచ్చివాడిని లేపి, కుర్చోబెట్టి మరచెంబులోని నీళ్లతో చేతులు కడిగి క్యారియర్ ను ఊడదీసి ఆ పిచ్చివానికి అన్నం కలిపి పెట్టడం మొదలెట్టాడు.
నేను మరింత ఆశ్చర్యంతో జనంలో ఇంకా ముందుకుపోయి చూడసాగాను.
తల్పశాయి తన్ను చూశాడుగాని, చూటనట్టుగా తల తిప్పుకున్నాడు.
తల్పశాయికి దేవుళ్లూ, దెయ్యాలూ, స్వాములూ, బాబాలూ..... ఇటువంటివంటే నమ్మకంలేదు. అటువంటిది - తల్పశాయి తనంతట తాను వచ్చి పిచ్చివాడిని బుజ్జగించి అన్నంపెట్టి సేవలు చేస్తున్నాడంటే నా ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి.
మరి కొంచెంసేపు ఆ వింత చూసి ఆ తర్వాత నా దారి పట్టాను.
నడుస్తున్నానే కాని, నా మస్తిష్కం నిండా ఒకటే ఆలోచన-' ఉన్నట్లుండి ఆ పిచ్చివాడు స్వామీజీ ఎట్లా అయ్యాడు? ఆయనలో వున్న మహత్యాన్ని మొదట గుర్తించిందెవరు?'
....ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయిగాని, సమాధానం దొరకలేదు.
* * * * *
కొద్దిరోజులు గడిచాయి.
పిచ్చిబాబాగారి ప్రచారం అభివృద్ది చెందింది. అతని నివాసాన్ని ఆ దగ్గర్లోనే ఉన్న పాడుబడ్డ గంగానమ్మ గుడిలోకి మార్చారు. ఏ సమయంలో చూసినా అక్కడ భక్తులు వుంటూనే ఉండసాగారు. పళ్లు ఇచ్చేవారు కొందరు; పటిక బెల్లం పెట్టేవాళ్లు మరికొందరు; ఫలహారాలు, నైవేద్యం పెట్టేవాళ్లు ఇంకొందరు! వీటికితోడు - యథాశక్తి డబ్బుని అతని పాదాల దగ్గర దక్షిణంగా వుంచేవారు మరికొందరు. ఈ విధంగా రంగరంగ వైభవంగా వుండసాగింది ఆ గంగానమ్మ గుడి!
నాకు తరచూ ఆ పిచ్చివాని దగ్గర తల్పశాయే కనిపిస్తుండేవాడు. అతను లేకపోతే అతని భార్యో, పిల్లలో వుండేవారు. తల్పశాయే కాకుండా అతని కుటుంబం యావత్తూ పిచ్చిబాబా భక్తబృందంలో చేరిపోవడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
కొన్నిసార్లు ఈ పిచ్చిబాబా చేసే మహత్యాలేమిటో చూడాలని పనిగట్టుకొని ఎక్కువసేపు శ్రద్ద గా గమనించాను. అయితే.... అతను నేనుండగా ఏ విధమైన మహత్యాన్నీ చేసి చూపించలేదు. భక్తులు వచ్చి తోచిన కానుకలు తెచ్చి ఏవేవో ప్రశ్నలు అడుగుతుండేవారు. వాటికి అతను ప్రత్యేకించి ఏ సమాధానమూ చెప్పేవాడు కాదు. తనలో తానే ఏదో గొణుక్కుంటూండేవాడు. మధ్యమధ్య తలని అడ్డంగానో, నిలువుగానో ఆడించేవాడు. లేదా చేతులని అటోఇటో ఆడించేవాడు.
బాబా తల నిలువుగా తిప్పితే - తమ కార్యం ఫలిస్తుందనీ, అడ్డంగా తిప్పితే - ఫలించదనీ... ఈ విధంగా అతని భంగిమలకు భక్తులు వారంతటవారే అర్దాలు చెప్పుకుని వెళ్లేవారు. లేకుంటే ఏ తల్పశాయో, ఇంకెవరైనా పెద్ద మనిషో అర్దం విశదీకరించి చెప్పేవారు.
'పిచ్చివాని చేతిరాయి' అంటే ఇదే కాబోలు - అని అనిపించింది నాకు.
ఇంతకీ... పిచ్చిబాబాకీ, తల్పశాయికీ గల సంబంధ - బాంధవ్యాలేమిటో నాకు అర్దంకాలేదు. తల్పశాయినే అడుగుదామనిపించేది. కాని, అతను సాధారణంగా ఒంటరిగా కనిపించేవాడు కాదు. ఎప్పుడైనా అరుదుగా ఒంటరిగా కనిపిస్తే, అడిగితే బాగుండదేమోనని మొహమాటపడి అడిగేవాడిని కాదు.
* * * * *
మరికొన్ని నెలలు గడిచిపోయాయి.
సర్వసాధారణంగా కాలం అనుకూలంగా వుండే నాకు - అనుకోని కొన్నిచిక్కులు కలిగాయి. ఊరినుంచి బదిలీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. శ్రీమతికి చికాకు పెట్టే వ్యాధి కలిగింది. ఇటువంటి చిక్కులతో మనస్సంతా అల్లకల్లోలం కాసాగింది.
నదిలో కొట్టుకుపోతున్న వాడికి చిన్న గడ్డిపరక కనిపించినా పట్టుకుంటాడు. అట్లాగే చిక్కుల చీకాకు ఎక్కువయ్యేసరికి - పోనీ... ఈ పిచ్చిబాబాని ప్రశ్న అడిగితే బాగుంటుందేమో ననిపించింది. నాకు స్వతహాగా బాబాల మీద నమ్మకం లేదు. కాని, 'తల్పశాయిలాంటి వాడే భక్తుడుగా మారినప్పుడు - నేను కేవలం ప్రశ్న అడగడంలో తప్పేముంది?' అనిపించింది. నా కళ్లముందు ఎంతోమంది ప్రశ్నలు అడిగి వెళ్తుండడం చూశాను. అయితే.... అందరిలాగా కాకుండా తల్పశాయి ద్వారా వెళ్లి అతను ఏకాంతంలో వుండగా సంప్రదిస్తే బాగుంటుందనుకున్నాను.


