ఎదురు ప్రశ్నలకు కొయ్యబారిపోయారు ముగ్గురుమిత్రులూ. వారు తేరుకునే లోపలే - "వేరే వాయి ఇడ్లీలు ఇస్తారు తినండి. అది వద్దంటే మాట్లాడకుండా వెళ్ళిపోండి. తిన్నదానికి డబ్బియ్యనక్కరలేదు" అన్నాడు ప్రొప్రయిటర్ నిశ్చలంగా.
"తిన్నదానికి డబ్బేమిటి? అసలు మేము తింటే కదా!"అన్నాడు గణపతి.
"అయితే ఇంక సమస్యేం వుంది?త మీ సొమ్ము మీ దగ్గర, మా సరుకు మా దగ్గర!" అన్నాడు ప్రొప్రయిటర్ అతి తేలిగ్గా.
"అలా అంటే ఊరుకుంటా మనుకుంటున్నారా? ఇప్పుడే వెళ్లి ఫుడ్ ఇన్ స్పెక్టర్ కి రిపోర్టు చేస్తాం!" అన్నాడు రాజారావు.
"ఈరోజు పండగ సెలవు. ఆఫీసు వుండదు. ఫుడ్ ఇన్ స్పెక్టర్ గారు స్పెషల్ రూంలో టిఫిన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడే వెళ్ళి రిపోర్టు చేయవచ్చు" అన్నాడు ప్రొప్రయిటర్.
"పోదాం రండిరా...... ఇటువంటి చోటికి రావడం మనదే బుద్ది తక్కువ!" అన్నాడు సుబ్బారాయుడు.
"పొండి - పొండి..... ఇలా అనేవాళ్ళే మళ్లీ మళ్ళీ వస్తుంటారు" అన్నాడు వెనకున్న ఇద్దరిలో ఒకడు.
చేసేది లేక వాళ్లవైపూ, ప్రొప్రయిటర్ వైపూ కొరకొరా చూస్తూ ముగ్గురూ బయటకి వెళ్ళిపోయారు.
"మరో హోటల్ కి వెళ్దాం రండిరా!" అన్నాడు రాజారావు.
"అన్ని హోటల్సూ ఇంతే! ఇంక హోటల్లో తినాలని లేదు" అన్నాడు గణపతి.
"కడుపులో కరకరలాడుతోంది. అయినా హోటల్ కి పోయి తినాలన్న మూడ్ లేదు. రూంకి పోయి ఏమైనా వండుకుందాం!"అన్నాడు సుబ్బారాయుడు.
ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎదురుగా పెద్దబేకరీ కనిపించింది. అందులో కేక్స్ చాలా స్పెషల్ గా వుంటాయి. బిస్కట్లలో కూడా ప్రత్యేక రకాలు వుంటాయి. అక్కడ ఆ ముగ్గురూ చాలాసార్లే తిన్నారు.
"ఈరోజు హోటల్స్ లో ఎలాగూ తినలేం. ఈ బేకరీకి పోయి కాసిని బిస్కట్లు, కేకులూ తిని తాగుదాం రండి!" అన్నాడు రాజారావు.
ముగ్గురూ బేకరీలోకి వెళ్ళి గుండ్రని బల్ల చుట్టూ కూర్చున్నారు. బిస్కట్లు, కేకులూ తెమ్మని వెయిటర్ కి ఆర్డరిచ్చాడు రాజారావు.
వెయిటర్ ఒక పెద్ద ప్లేట్లో బిస్కట్లూ, మరొకదానిలో కేకులూ తెచ్చి వాళ్ళ మధ్య పెట్టాడు. ఎవరికి కావలసినవి వాళ్ళు తిన్నాక తిననివి తిరిగి తీసుకుపోయి, తిన్నవాటికి డబ్బు తీస్కుంటాడీ వెయిటర్. ఇది ఇరానీ హోటళ్లలోనూ, కాకా హోటళ్ళలోనూ పద్దతి.
మిత్రులు ముగ్గురూ రౌండ్ బిస్కట్లు లాగించారు. ఆ తర్వాత కేక్స్ మీద పడ్డారు.
"ఆహా... ఎంత తాజాగా వున్నాయ్! ఏమి రుచిగా వున్నాయ్!" అంటూ లొట్టలు వేశాడు గణపతి. "ఎలాగైనా ముస్లిముల బేకరీల రుచే వేరు!" అన్నారు రాజారావు.
"అవునవును.....!" అంటున్న సుబ్బారాయుడి నోటిలో టపాకాయ పేలినట్లు టక్కున చప్పుడయ్యింది. "అబ్బా....." అంటూ బుగ్గ పట్టుకుని నోట్లోనుంచి దేనినో బయటకు తీశాడు.
అది ఒక పన్ను...!
"ఇదేమిటీ.... మెత్తని కేక తింటే టక్కున పన్ను వూడింది?" అన్నాడు గణపతి ఆశ్చర్యంగా.
"పన్ను విరిగినా నెత్తురు రావడం లేదేమిటి?" అన్నాడు రాజారావు ఆశ్చర్యంగా.
"ఏమిటీ.... నోట్లో ఇంకా ఏదో గట్టిగా వుంది?! మరో పన్ను విరిగిందా ఏమిటి?" అంటూ నోట్లోంచి కేక్ ను బయటకు తీశాడు సుబ్బారాయుడు.
దాని మధ్య చిన్న తల కనిపిస్తోంది. పరీక్షగా చూస్తే... అది ఎలుక పిల్ల తల!
"అరే... క్యాడ్ బరీ చాక్లెట్ లా ఇది ర్యాట్ బరీ కేక్ అన్నమాట!"అన్నాడు రాజారావు నవ్వుతూ.
"ఇందాక నువ్వు పౌష్టిక ఆహారం తినలేదూ?!" అని అంటించాడు సుబ్బారాయుడు.
ఆ ఎలుక పిల్ల తల వున్న కేక్ ను తీసుకుని బేకరీ మాలిక్ మీదకి యుద్దానికి బయలుదేరారు మిత్రత్రయం.
"క్యాహై యే.... కేక్ మే చువా ఆగయా?" అంటూ విరుచుకుపడ్డాడు రాజారావు.
"దానిని కొరికేసరికి మావాడి పన్ను విరిగింది. ఇదుగో... చూడండి!"అన్నాడు గణపతి మొదట వచ్చిన పన్నును చూపుతూ.
మాలిక్ దానిని చూస్తూ - "భలేవారే సాబ్.... ఇది చువా కీ దాంత్! ఎలుక పన్ను చూపించి మీ దోస్త్ పన్ను అంటారేమిటి?" అన్నాడు - తెలుగూ, ఉర్దూ కలగలుపుతూ, వస్తున్న నవ్వు ఆపుకుంటూ.
"నా పన్నుకాదా?" అంటూ నోట్లో వేలుపెట్టి చూసుకున్నాడు సుబ్బారాయుడు. తన పన్ను క్షేమంగా వుండటం చూసి, "అమ్మయ్యా...." అనుకున్నాడు.
"పన్ను విరగకపోతే మాత్రం? కేకులో ఎలుక రావడమా?" అంటూ గద్దించాడు.
"అది ఎలుక పిల్ల! శక్కర్ తినడానికి చూసి వుంటుంది - చచ్చూరుకుంది!" అన్నాడు.
ఆ తర్వాత నచ్చచెప్పడాలూ, క్షమాపణలూ వగైరా!
అయితే ఉర్దూలో మర్యాద వాచకాలు ఎక్కువ కనుక లోపల ఉడికిపోతున్నా పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని బయటపడ్డారు.
"ఒరేయ్ .. ఈరోజు మనకి బాగాలేదు. మనం పండగనాడు బయట తినడం దేవుడికి ఇష్టంలేనట్లుంది. ఇంటికిపోయి వండుకుందాం. పదండి!" అన్నాడు రాజారావు.
"అంతే చేద్దాం!" అన్నాడు సుబ్బారాయుడు. ముగ్గురూ వెళ్తుంటే వినాయక పందిరిలో గంటలు ఘనంగా గణగణ మ్రోగుతున్నాయి.
"ఒరేయ్ ... దేవుడికి దణ్ణం పెట్టుకుని పోదాం రా!"అన్నాడు గణపతి.
"తప్పుతుందా? అది నీ పందిరేనాయె!" అన్నాడు రాజారావు.
ముగ్గురూ పందిరిలోకి వెళ్ళి భక్తుల వరుసలో నిలబడ్డారు.
వినాయకుడి పూజ అయింది. హారతి ఇచ్చాక భక్తులకి ఆవిరి మీద ఉడకబెట్టిన పప్పూ, ఉండ్రాళ్లూ నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచారు. మిత్రులు ముగ్గురూ ప్రసాదం తీసుకుని భక్తితో కళ్లకద్దుకున్నారు.
బయటకతు వచ్చాక చేతిలో వున్న పెసరపప్పును చూస్తూ - "వీళ్లు ఉత్సవం ఘనంగా చేస్తున్నారు. ఎంతైనా మార్వాడీలు..ఉండ్రాళ్లలో కూడా ఏలకుల గింజలు వేస్తున్నారు" అంటూ భక్తితో కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు గణపతి.
కొంచెం నమిలాడో, లేదో - "థూ...... ధూ.....!" అంటూ ఉమ్మివేశాడు. నోటిలో మిగిలినదానిని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూడసాగాడు. మిగిలిన ఇద్దరు కూడా మెడలు వంచి చూశారు.
"ఒరేయ్ - ఇవి ఏలకుల గింజలు కావురా... .ఎలుక గొద్దెలు!" అన్నాడు రాజారావు.
షాక్ కొట్టినట్లు చేతిలో ఉండ్రాన్ని క్రింద పడేశాడు గణపతి.
ఆ తర్వాత మగ్గురూ మౌనంగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లారు.
కథ మళ్ళీ ఇల్లు చేరింది.
-ఆంధ్రభూమి మాస పత్రిక.... ఫిబ్రవరి'97


