నల్లని మెడగలది అగ్ని దేవతాకము. అట్లగుట వలన అది యజమాని బుద్ధిమాంద్యమును పోగొట్టును. మెడతప్ప తక్కిన దేహము తెల్లని దగుట వలన యజమానికి తేజస్సు కలుగును. సోమ దేవతాకము పింగళవర్ణమగుట వలన యజమాని యందు బ్రహ్మవర్చస్సు చేరుచున్నది.
16. పౌరోహిత్యము నందు స్పర్థకలవాడు ఆగ్నేయమగు కృష్ణగ్రీవమును, సౌమ్యమగు పింగళవర్ణములను రెండింటిని తదుపరి కృష్ణగ్రీవమును, ఆలంభనము చేయవలెను.
బ్రాహ్మణుడు అగ్ని సంబంధి. క్షత్రియుడు సోమసంబంధి. సోమదేవతాకమునకు ఇరువైపుల అగ్ని దేవతాకములు ఉండుట వలన బ్రాహ్మణ తేజస్సుచే రాజ్యమును వశపరచుకొనును. అప్పుడు ఒకే మాటతో ప్రత్యర్థిని జయించును. అతనిని రాజు, అమాత్యులు పురోహితునిగా చేసికొందురు.
మూడవ అనువాకము
1. దేవదానవులు ఈ లోకము విషయమున వివాదపడినారు. అప్పుడు విష్ణువునకు వామనము - పొట్టి పశువు - కనిపించింది. అతడు దానిని తనదిగా చేసుకున్నాడు. అది విష్ణుదేవతాకమయినది. విస్ష్ణువు దానిని ఆలంభనము చేసినాడు. అందువలన అతడు ఈ లోకములను జయించినాడు.
2. గృహక్షేత్రాది విషయములందు వివాదములు కలవాడు పొట్టి పశువును వధించవలెను. విష్ణు ప్రియమగు హవిస్సును దానము చేయవలెను. అప్పుడు అతడు విష్ణువు వలె లోకములను జయించును.
3. ఈ లోకములు ఎత్తుపల్లములు కలవి. ఎత్తుపల్లములు సమృద్ధికి కారణము అగుచున్నవి.
4. యుద్ధము కలుగును. అప్పుడు నొసట నామము, ముఖము వైపు తిరిగిన కొమ్ములు గల పశువును ఇంద్రుని కొరకు బలి ఇవ్వవలెను. అవయవ పటుత్వము, ఆగ్రహము, ధైర్యము వలననే కదా జయము లభించునది!
జయము కోరువాడు స్వభాగధేయమున ఇంద్రుని యజించవలెను. ఇంద్రుడే అతనికి అవయవ పటుత్వమును, ఆగ్రహమును ధైర్యమును కలిగించును. అతడు యుద్ధమున జయించును.
5. గ్రామము కోరువాడు మరుత్తులతో కూడిన ఇంద్రునకు తెల్లని తొడగల పశువును వధించవలెను. మరుత్వంతుడగు ఇంద్రుని స్వభాగధేయమున యజించవలెను. ఇంద్రుడే అతనికి సోదరులను మిత్రులను ఇచ్చును. అందువలన అతడు నిశ్చయముగ గ్రామాధిపతి అగును.
6. ఆబోతు ఇంద్రసంబంధి, తెల్లని తొడగలది, మారుత సంబంధి, రెండును సమృద్ధి కలిగించునని అగుచున్నవి.
7. పశువు తొడల వెనుక భాగము తెల్లగా ఉండవలెను. అందువలన యజమానిని ప్రజలు అనుసరింతురు.
8. అన్నము కోరువాడు పింగళవర్ణ పశువును - సోమ దేవతాకమును వధించవలెను. అన్నము సోమదేవతాకము కదా! స్వభాగధేయమున సోముని సేవించవలెను. అప్పుడు సోముడే అతనికి అన్నము ఇచ్చును. అతడు అన్నము తినువాడు అగును.
9. పశువు పింగళవర్ణపుది కావలయును. అది అన్నరూపమగును. యజమానికి సమృద్ధి కలుగును.
10. ఒకడు సమర్థుడు అగును. కాని రాజ్యము లభించదు. అప్పుడు అతడు సోమదేవతాకమగు పశువును బలి ఇవ్వవలెను. రాజ్యము సోమదేవతాకము కదా!
అతడు స్వభాగధేయమున సోముని భజించవలెను. సోముడే అతనికి రాజ్యము ప్రసాదించును. అతడు రాజ్యము కలవాడు అగును.
పింగళపశువు సోముని రూపమగును. అది అతనికి సమృద్ధి కలిగించును.
11. ఒకడు సంపద కోల్పోవును. మరల ప్రతిష్ఠ సాధించతలచును. అట్టివాడు ఇంద్రదేవతాకమగు నొసట నామము, ముఖము వైపునకు తిరిగిన కొమ్ములు గల పశువును ఆలంభనము చేయవలెను. అందువలన నరకమునకు పోవు పాపము చేసిన వాడైనను ప్రతిష్ఠనొందుచున్నాడు.
12. ఎవడు పాపములచే బాధించబడువాడు - తనకు హాని తలపెట్టు శత్రువు కలవాడు అగునో అతడు శత్రుంజయుడగు ఇంద్రుని స్వభాగధేయమున యజించవలెను. ఆ ఇంద్రుడే, అతని పాపములను, హానితలపెట్టు శత్రువును దూరము చేసినవాడు అగును.
13. రాజ్యమునకు సమర్థుడయ్యు రాజ్యము లభించని వాడు వజ్రియగు ఇంద్రుని కొరకు నొసట నామము, ముఖము వైపు తిరిగిన కొమ్ముల పశువును వధించవలెను. అతడు స్వభాగధేయమున వజ్రియగు ఇంద్రుని యజించవలెను. అట్లయిన ఇంద్రుడే అతనికి వజ్రాయుధమును ప్రదానము చేయును. ఆ వజ్రము శత్రువులను వధించును. అతనికి రాజ్యము లభించును.
లలాటమున నామము, ముఖమువైపు తిరిగిన కొమ్ములు గల పశువు వజ్రరూపమగును. వంగిన కొమ్ములు పదునుకలవి. అందువలన వానిని వజ్రరూపముగ చెప్పబడినది.
నాలుగవ అనువాకము
1. అతడు ఆదిత్యుడు. అతని వెలుగు సన్నగిల్లినది. దేవతలు అందుకు పరిహారము చేయదలచినారు. పది వృషభముల గుంపును వధించినారు. అందువలన ఆదిత్యునకు కాంతి కలిగినది.
2. బ్రహ్మవర్చస్సు కోరువాడు ఆదిత్యునకు పది వృషభముల గుంపును బలి ఇవ్వవలెను. ఆదిత్యుని స్వభాగధేయమున పూజించవలెను. అప్పుడు ఆదిత్యుడు అతనికి బ్రహ్మవర్చస్సు ప్రసాదించును. అతడు బ్రహ్మవర్చస్సు కలవాడు అగును.
3. వసంతకాలపు ఉదయమున నొసట నామము గల మూడు పశువులను వధించవలెను. గ్రీష్మ కాలపు మధ్యాహ్నమున తెల్లని వెనుక భాగము గల మూడు పశువులను వధించవలెను. శరత్కాలపు అపరాహ్ణమున తెల్లని తోకలు గల మూడు పశువులను వధించవలెను.
4. సూర్యునకు మూడు తేజస్సులు కలవు. ఆ తేజస్సులన్నియు యజమాని యందు చేరును.
5. మూడు మూడు పశువుల వధ వలన యజమానికి తేజస్సు కలిగినది కదా! అది అతనికి తరువాత కాలమందున కూడ కలుగును.
6. సంవత్సరమున - ఋతువులననుసరించి - పశువులను వధించవలెను.
సంవత్సరోవై బ్రహ్మ వర్చసస్య ప్రదాతా సంవత్సర ఏవాస్మై బ్రహ్మ వర్చసం ప్రయచ్చతి బ్రహ్మ వర్చస్యేవభవతి.
అర్థమునకు 2 - 1 - 2 - 9 చూడండి.
7. సంవత్సరము తరువాత ప్రజాపతి దేవతాకమైన పింగళ వర్ణ పశువును వధించవలెను. ప్రజాపతి స్సర్వాదేవతా. కావున దేవతలందరు యజమాని యందు ప్రవేశింతురు.
8. చర్మము చెడుచున్నదని - కుష్ఠు కావచ్చును - అని భయపడువాడు సోమ, పూష దేవతాకమగు నల్లని పశువును బలి ఇవ్వవలెను. దేవతలందు సోముడు, నరస్వరూపుడు. పూష పశు స్వరూపుడు. సోముడు తన ప్రభావమునను, పూషయొక్క పశు ప్రభావమునను అతని చర్మమును బాగు చేయును. దుశ్చర్మా నభవతి. చెడు చర్మపు వాడు కాకుండును.
9. దేవతలకు, యమునకు ఈ లోకము విషయమున వివాదము ఏర్పడినది. యముడు దేవతల బలమును విడదీసినాడు. అందువలననే అతనికి యమత్వము. దేవతలు యముడే అధిపతి అనుకున్నారు.
ఆ దేవతలు ప్రజాపతి వద్దకు వెళ్లినారు. ప్రజాపతి తన నుండి వృషభమును, వంధ్య పశువును రెండింటిని ఏర్పరచినాడు. దేవతలు విష్ణు, వరుణ దేవతాకమగు వంధ్య పశువును ఇంద్ర దేవతాకమగు వృషభమును రెండింటిని వధించినారు. ఆ విధముగా యముని వరుణ పాశమున కట్టించి యజ్ఞరూపుడగు విష్ణువుచే వెడలగొట్టించినారు.
ఇంద్రుని వలననే యముని బలమును నశింపచేసినారు.
10. శత్రువులు గలవాడును, వివాదములు గలవాడును విష్ణు వరుణ దేవతాకమగు వంధ్య పశువును - ఇంద్ర దేవతాకమగు వృషభమును బలి ఇవ్వవలెను. వరుణుడు తన పాశముల చేత శత్రువును కట్టివేయును. యజ్ఞ స్వరూపుడగు విష్ణువు శత్రువును వెళ్లగొట్టును. ఇంద్రుడు శత్రు బలమును నశింపచేయును. యజమాని విజయవంతుడు అగును. శత్రువు పరాభూతుడు అగును.
11. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. హతుడైన వృత్రుడు పదునారు శరీరముల వాడయినాడు. ఇంద్రుని పదునారు పాశముల వంటి తన దేహముతో బంధించినాడు.
హతుడైన వృత్రుని తల నుండి గోవులు పుట్టినవి. ఆ విధముగా అవతరించిన గోవులు విశిష్ఠ దేహములు కలవి అయినవి. ఆ గోవుల వెనుక ఒక ఎద్దు పైకి లేచినది. ఇంద్రుడు ఆ వృషభమును తన ఆత్మగా భావించి పూజించినాడు. ఈ వృషభమును బలి ఇచ్చినాడు. ఇందువలన పాప పాశ బంధముల నుండి విముక్తుడు అగుదును అని భావించినాడు.
ఆ విధముగా భావించిన ఇంద్రుడు అగ్ని దేవతాకమగు నల్లని మెడ పశువును వృషభమును వధించినాడు. ఇంద్రుడు స్వభాగ ధేయమున చేసిన పూజలకు అగ్ని సంతోషించినాడు. వృత్రుని పదహారు దేహములను, వృత్రుని కూడ కాల్చివేసినాడు.
తన సంబంధ యాగము చేసిన ఇంద్రుడు మరల తన బల వీర్య సామర్థ్యములను పొందినాడు.
12. పాపముల పాలైన వాడు అగ్ని దేవతాకమగు కృష్ణ గ్రీవమును ఇంద్ర దేవతాకమగు వృషభమును వధించవలెను. స్వభాగ ధేయమున అగ్నిని పూజించవలెను. అందుకు సంత్రుప్తుడైన అగ్ని అతని పాపములను దహించును. ఇంద్రయాగము చేసిన అతడు బలవీర్యములు కలవాడగును. పాపముల నుండి విముక్తుడు అగును.
13. రాజ్యము కోల్పోయిన వాడు ద్యావాపృథ్వీ దేవతాకమగు ధేనువును వధించవలెను. ఏదో కారణముల వలన ఈ లోకము నందును, స్వర్గమునందును ప్రతిష్ఠ కోల్పోయినవాడు "జ్యోగపరుద్ధః" చిరకాలము రాజ్యము కోల్పోయినవాడు అనబడును. అతడు స్వభాగ ధేయమున ద్యావాపృథ్వులను పూజించవలెను. ఆ ద్యావాపృథ్వులే అతనికి సుప్రతిష్ఠ కలిగించును. అతడు ప్రతిష్ఠ పొందినవాడు అగుచున్నాడు.
14. ఒక గోవు గర్భము దాల్చును. ప్రసవ కాలము వచ్చినాను ప్రసవించదు. తరువాత ప్రసవించును. అట్టి గోవును 'పర్యారిణి' అందురు.
చిరకాలము రాజ్యము కోల్పోయిన వాని రాజ్యము 'పర్యారి' అగును.
ఈనిన తరువాత గోవునకు వలె యజమానికి రాజ్యము కలిగినంత సమృద్ధి కలుగును.
15. చిరకాలము రాజ్యము కోల్పోయినవాడు వాయు దేవతాకమగు దూడను వధించవలెను. వాయువు ద్యావాపృథ్వులకు దూడయగును కదా!
దేశము విముఖము, ప్రజలు విముఖులు అయినట్టివాడు "జ్యోగపరుద్ధుడు" అనబడును. అతడు వాయువును స్వభాగధేయమున పూజించవలెను. అప్పుడు వాయువే దేశమును, ప్రజలను అతనికి సుముఖులను చేయును. అతనికి దేశము, ప్రజలు మణిముక్తాది ధనములను సమర్పింతురు. అతడు ఇతర ప్రజను సహితము పాలించు ప్రతిష్ఠ కలవాడగును.
అయిదవ అనువాకము
1. 'బలుడు' అనువాడు రాక్షసుడు. అతడు పెక్కు గోవులను దొంగిలించినాడు. ఒక గుహయందు దాచినాడు.
ఇంద్రునకు ఆ విషయము తెలిసినది. అతడు వానిని విడిపించదలచినాడు. అతడు బిలమునకు అడ్డము పెట్టిన రాతిని తొలగించినాడు. బిలమునందలి శ్రేష్ఠపశువు వెనుక భాగము పట్టుకొని పైకి లేపినాడు. బయటికి తెచ్చినాడు. ఆ వచ్చినది యూధపతి. అందువలన పశువులన్నియు బయటకు వచ్చినవి.
ఆ యూధపతి పశువు మొదలే గొప్పది. ఇంద్రుడు లేవనెత్తుట వలన అది మరింత ఉన్నతము అయినది.
2. పశువులను కోరువాడు ఇంద్ర దేవతాకమగు ఉన్నత పశువును బలి ఇవ్వవలెను. అతడు స్వభాగ ధేయముచే ఇంద్రుని సేవించవలెను. సః అస్మై పశూన్ ప్రయచ్చతి. అయమ్ పశూమాన్ భవిత్యేవ.
3. ఉన్నత పశువు ఆలంభన యోగ్యము అగును. పశువు ఉన్నతమగుట వలన అది వేల పశువులసంపదరూపలక్ష్మి అగుచున్నది. అందువలన యజమానికి పశుసంపదరూపలక్ష్మి లభించుచున్నది.
4. యజమానికి పశు సంపద రూపలక్ష్మి లభించినదికదా! తదనంతరము అతడు విష్ణు దేవతాకమగు పొట్టి ఆవును ఆలంభనము చేయవలెను. ఆ పొట్టి పశువు వేల గోవుల మీదిది అగును కదా! అందువలన అది పశువులకు, పశు సంతానమునకు గడ్డి, నీరు సమృద్ధిగా గల ప్రదేశమును కలిగించును.


