యస్య నిఃశ్వసితం వేదాః యోవేదేభ్యోఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
రెండవ కాండము
మొదటి ప్రపాఠకము
మొదటి అనువాకము
1. సంపదకోరువాడు వాయువును దేవతగా వరించవలెను. యాగార్థము తెల్లని పశువును ఏర్పరచవలెను. అతడు ఆ పశువును దర్భ, జువ్వికొమ్మలచే తాకవలెను. వాయువు అతివేగవంతుడు. తన భాగమును అందుకొనగలవాడు. కావున యజమాని వాయువునే సేవించవలెను. అందువలన యజమానికి ఐశ్వర్యము లభించును. అతడు ఐశ్వర్యవంతుడు అగుచున్నాడు.
2. అభిజ్ఞులు వాయువు త్వరగా ఇచ్చువాడని చెప్పుదురు. గుణదోషజ్ఞులు వాయువు యజమానిని దహించ సమర్థుడు అని చెప్పుచున్నారు.
అట్లగుట వలన తెల్లని పశువును - నియుత్తులు అను అశ్వములు గల వాయువునకు - ఆలంబనము చేయవలెను. నియుత్తులే కదా వాయువున వహించునవి! కావున వాయువును యజించిన యజమానికి ఐశ్వర్యము లభించుచున్నది. అతనిని వాయువు దహించుటలేదు.
3. గ్రామాధికారము కోరువాడు నియత్వంతుడైన వాయువునకు శ్వేత పశువును ఆలంభనము చేయవలెను. వాయువే - ముకుదాడు వేసిన పశువును వలె - ప్రజలను అదుపు నందు ఉంచుచున్నాడు.
అట్లగుట వలన యజమాని వాయుదేవతను - తన భాగధేయమున - యజింపవలెను. అప్పుడు వాయువు ముకుతాడు వేసిన పశువు వలె - ప్రజలను యజమానికి వప్పగించును. అతడు గ్రామాధికారి అగుచున్నాడు.
4. నియుత్వంతుడైన వాయువును యజించిన వానికి ప్రజలు వశవర్తులు అగుదురు. వారు ఎన్నటికిని అతని వశము తప్పరు.
5. సంతానము కోరువాడు నియుత్వంతుడగు వాయువునే యజించవలసి ఉన్నది.
నాసారంధ్రము నుండి వెడలునది ప్రాణము. వాయువు సహితము అట్టిదియే అగును. ముఖమునకు దిగువన ఉదరాంతమున చరించునది అపానము. నియుత్తునకు కూడ అట్టి అర్థము కలదు.
ఒకడు సంతానము కలిగించుటకు సమర్థుడు అయ్యు సంతానము కలిగించలేక పోవుచున్నాడు. అట్లగుట వలన అతనికి కలుగవలసిన సంతానమునకు ప్రాణాపానములు తొలగి పోవుచున్నవి కదా!
అట్టితరి అతడు నియుత్వంతుడగు వాయుదేవతను స్వకీయ భాగధేయమున యజించవలెను. అప్పుడు వాయువే అతని సంతానమునకు ప్రాణాపానములను కలిగించుచున్నాడు. అందువలన సంతానము లేని వాడు సంతానవంతుడు అగుచున్నాడు.
6. దీర్ఘ రోగియైన వాడు నియుత్వంతుడైన వాయువునే యజించవలెను. వాయువు ప్రాణము నియుత్తు అపానము అగుచున్నది కదా!
దీర్ఘరోగికి ప్రాణాపానములు సరిగా పనిచేయకున్నవి. అతడు నియుత్వంతుడగు వాయువును - స్వకీయ భాగధేయమున - యజించవలెను. వాయువే అతని ప్రాణాపానములు సరిగా పనిచేయించును. అట్లు యజించిన వానికి ఇసుమంత ప్రాణమున్నను తప్పక జీవించుచున్నాడు.
7. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను, పశువులను సృష్టించదలచినాడు. అట్లు తలచినవాడు తన ఉదరము నుండి వపను ఖండించి తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందునుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తనరూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్ధుడు అయినాడు. ప్రజలను, పశువులను సృజించినాడు.
8. ప్రజలను, పశువులను కోరునట్టివాడు ఆ ప్రజాపతికి కొమ్ములులేని మేకను బలి చేయవలెను. అతడు ప్రజాపతిని స్వకీయ భాగధేయమున యజించవలెను. అప్పుడు ఆ ప్రజాపతియే అతనికి ప్రజలను, పశువులను కలిగించుచున్నాడు.
9. మీసములు పురుషలక్షణము. కొమ్ములు లేకుండుట అశ్వరూపమగును. క్రింది వరుసలో మాత్రము దంతములుండుట గోరూపము అగును. గొరిసెలుండునది గొర్రెలరూపమగును. మేకలకు గొర్రెల రూపము సహజాతి లక్షణము. ఈ అయిదు - పురుషుడు, అశ్వము, గోవు, గొర్రె, మేక - గ్రామ పశువులు. యజమాని ఆ రూపముగల పశువులను యాగము కొరకు సము పార్జించవలెను.
10. పశువులను కోరువాడు సోమపూష యుగళ దేవతాకమునకు ఒకేసారి పుట్టిన మూడింటిలో ఒక దానిని బలి ఇవ్వవలెను.
మేకకు రెండు చన్నులు ఉండును. చన్ను కుడుచుటకు రెండు పిల్లలు పుట్టును. తల్లి మేక యందలి బలమున మూడవ పిల్ల పుట్టుచున్నది.
యజమాని సోమ పూషదేవతలకు - స్వకీయభాగధేయమున మూడవ మేక పిల్లను బలిఇచ్చి యజించవలెను. వారు ఆ యజమానికి పశువులను కలిగింతురు.
సోముడు రేతస్సు నిలుపువాడు, పూష పశువులను పుట్టించువాడు అగుచున్నాడు. కావున సోముడు యజమాని కొరకు రేతస్సు నిలుపును. పూష పశువులను కలిగించును.
11. యూపము ఔదుంబరము - మేడి సంబంధము కావలెను. ఖాదిరము - తినతగిన పండ్లచెట్టు కారాదు. ఫలబాహుళ్యమున ఉదుంబరము రసరూపమగును. అట్లే పశువులు క్షీర రసస్వరూపలు అగును. కావున యజమానికి రసరూపమగు ఉదుంబరమే - రసరూపములగు పశువులను ఇచ్చుచున్నది.
ఆలోచనామృతము
1. ఆలోచనము మాత్రమే ప్రాణులందు మానవుని విలక్షణత - విశిష్టత - మహత్తత. అతడు తాను గెలిచినాను అనుకున్నది. ఓటములకు ఒప్పకున్నది - సాధించినది - సాధించనున్నది - సాధించలేనిది వీటి అన్నింటికి యోని - మూలము - ఆలోచనమే.
ఆలోచనమే అర్థము అగుచున్నది. అనర్థము అగుచున్నది. న్యాయమగుచున్నది - అన్యాయమగుచున్నది. సత్యమగుచున్నది - అసత్యమగుచున్నది. క్రమమగుచున్నది - అక్రమము అగుచున్నది. జగత్తులకు కళ్యాణకరమగుచున్నది - వినాశకరమగుచున్నది. అన్నింటికి మూలము ఆలోచనమే కదా!
ఆలోచనమే శాస్త్రము. ఆలోచనమే విజ్ఞానము. ఆలోచనమే సైన్సు. ఆలోచనమే దృష్టి. ఆలోచనమే ఆలోచనము.
ఆలోచనము శాస్త్రము. వేదము ఆలోచన మాత్రము కాదు. 'శాస్త్రయోనిత్వాత్' వేదము శాస్త్రములకు తల్లి వంటిది. తల్లి ఎందరినైన పిల్లలను ఈయగలదు. ఎందరు పిల్లలయినను ఒక తల్లిని ఇవ్వజాలరు!
2. మానవుడు వాస్తవములపై జీవించుట లేదు. అతడు వాస్తవముల మాత్రము మీద జీవించుటలేదు. హిందువుల పంచాంగము ప్రకారము సృష్టి ప్రారంభమై 195 కోట్ల సంవత్సరాలు దాటిపోయినది. ఇంత సుదీర్ఘ కాలమున శాస్త్రము, సైన్సు, వల్లకాడు కోట్లు కనుగొన్నానని మానవుడు విర్రవీగుచున్నాడు.
కాని నాటినుండి నేటివరకు మనిషికి 'జీవితము' అనుపదము అర్థము కాలేదు. అర్థము చేసుకొనుటకు ఎంతో కాలము పరుగులు సాగినవి. నేడు అవి ఆగినవి!


