Next Page 
శ్రీ మహాభారతము పేజి 1

 

                       మహాభారతము

                                                                            డా||దాశరధి రంగాచార్య

 

                                 

 

                                          అదిపర్వము

    శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్నవదనం ధ్యాయేత్సర్య విఘ్నోపశాంతయే

    నారాయణం నమస్కృత్య నరంచైవ సరోత్తమమ్
    దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

    పరాశరుడు వశిష్టుని మనమడు - శక్తి మునికి కుమారుడు. పరాశుడు త్రిలోక పూజ్యుడు. మదమాత్సర్యములు లేనివాడు. మహా తపస్సంపన్నుడు . తేజోవంతుడు. గుణ సంపన్నుడు.
    పరాశుడు తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అట్లు అతడు యమునా నదికి వచ్చినాడు. అతడు నది దాటవలసి ఉన్నది. అక్కడ మత్స్యగంధి కనిపించింది. ఆమె దాశరాజు కూతురు. ఆమె నావ నడిపించుచుండెను. జనులను నావ దాటించు చుండును.
    పరాశుడు మత్స్యగంధిని చూచినాడు. నావ ఎక్కినాడు. నావ కదిలినది. నది మధ్యకు వచ్చినది. పరాశరునకు మత్స్యగంధి మీద మనసయినది. అతని మనసులోని మాట ఆ చిన్నదానికి తెలిపినాడు. చిన్నది సిగ్గుపడలేదు. తాను కన్యను - తన కన్యత్వము చెడును అన్నది. పరాశరునకు మనసయినది. ఆమె కన్యాత్వము వికలముకాకుండునట్లు వరమిచ్చినాడు. అంత ఆ చిన్నది మరొక నెపము చెప్పినది. తాను చేప కడుపున పుట్టినందున తన ఒంటి నిండా చేప వాసన కలదు అన్నది. పరాశరునకు మనసయినది. అతడు ఆమెను యోజనగందిని చేసినాడు. ఆమె తనువు పరిమళము ఒక యోజనము వరకు వ్యాపించునట్లు వరమిచ్చినాడు. ఆమె ఆనాటి నుండి యోజన'గంది అయినది. ఆమె అసలు పేరు సత్యవతి. ఆమె పరాశరుని చూచినది. అప్పటికి మిట్ట మధ్యాహ్నమయినది. వెలుగు వెదజల్లుచున్నది. సత్యవతి వెలుగులో తనకు సిగ్గు అగుచున్నది అన్నది. పరాశరునకు మనసయినది. అతడు మంచుతెర కల్పించినాడు. చీకటి సృష్టించినాడు. ఇరువురు కృష్ణ ద్వీపమునకు చేరినారు. పరాశరుడు సత్యవతితో రమించినాడు.
    సత్యవతికి సద్యోగర్బమయినది. ఆమె ఆ ద్వీపమున వ్యాసుని కన్నది. ఈ వ్యాసుడు కృష్ణ ద్వీపమున జన్మించినాడు. అందువలన అతని పేరు కృష్ణ ద్చ్యేపాయన వ్యాసుడు అయినది. వ్యాసుడు పరమ తేజస్వీ , జ్ఞాని లోక కళ్యాణకారుడు.
    పరాశరుడు సత్యవతిని చూచినాడు. అనందించినాడు. వ్యాసుని చూచినాడు. మురిసినాడు. ఉభయులను ఆశీర్వదించినాడు. తనతోవ తాను వెళ్ళినాడు.
    "కృష్ణ ద్వైపాయనుండు కృష్ణాజిన పరిధాన కపిల జటామండల దండ కమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుంబనిగల యప్పుడ నన్నుందలంచునది యాక్షణంబవత్తునని సకలలోక పాపను డఖిలలోక హితార్ధంబుగా దపోవనంబునకుంజని యందు మహా ఘోరతపంబు చేసే " సత్యవతి నందన వ్యాసుడు అరణ్యమున ప్రవేశించినాడు. లోక కళ్యాణమునకై తపమాచరించినాడు. అతడు వేదములను వ్యాసమొనరించినాడు. వేదవ్యాసుడు అయినాడు. ఆనాటికి వేదములు ఈ రూపమున లేకుండెను. సకలము వేదమనుచుండిరి. ఏది వేదమగునో ఏది కాదో తెలుసుకొనుట దుస్తరముగా ఉండెను. వ్యాసమహర్షి వేదములన్నింటిని సేకరించినాడు. వానిని నాలుగు భాగములుగా విభజించినాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అనువానిని నిర్మించినాడు. వేదములను క్రోడీకరించినాడు. మానవాళికి గొప్ప ఉపకారము చేసినాడు. వేద ప్రమాణములను గ్రహించుటకు ఒక మార్గము ఏర్పరచినాడు. ఒక మహాత్కార్యమును, బృహత్కార్యమును సాధించినాడు.
    వేదవ్యాసుడు మహత్కార్యము సాధించినాడు. కాని ఆయనకు సంతృప్తి కలుగలేదు. వేదము కొందరికే ఉపకరించును. అందరికి ఉపకరించు దాని కొఱకు అన్వేషించినాడు. భారత సంహిత కల్పనకు పూనుకున్నాడు. భారతమును గురించి ఆలోచించినాడు. దానికి రూపకల్పన చేసినాడు.
    
    ఇదం హి వేదైః సమితం పవిత్ర మపిచోత్తమమ్
    శ్రవ్యాణాముత్తమం చైదమ్ పురాణమృషి సంస్తుతమ్
    
    ఇది వేదములతో సమానమయినది. పవిత్రమైనది. అత్యుత్తమమయినది . శ్రవ్యములలో ఉత్తమము, పురాణమును అయినది. దీనిని ఋషులు సంస్తుతించినారు.
    వేదవ్యాసుడు భారత కావ్యమును కల్పించినాడు. అప్పుడు అతనికి మరింత వ్యధ మొదలయినది. కావ్య కల్పన జరిగినది. దీనికి అక్షర నిర్మాణము కావలెను. అదెట్లు అని విచారమున పరితపించినాడు. అప్పుడు అతనికి బ్రహ్మ ప్రత్యక్షమయినాడు. వ్యాసుడు తన కార్యమును గురించి వినాయకునికి విన్నవించినాడు. గణపతి భారత సంహితను అక్షర బద్ధము చేయుటకు అంగీకరించినాడు. అందుకు ఒక నియమము ఏర్పరచినాడు. వ్యాసుడు నిరంతరము చెప్పు  చుండవలెను. క్షణమయినను జాప్యము రాకూడదు. అట్లు వచ్చిన వ్రాత నిలిపివేతును అన్నాడు గణపతి. వ్యాసుడు ఆలోచించినాడు. అతడు ఒక షరతు విధించినాడు. గణపతి వ్రాయునపుడు అర్ధము చేసుకొని వ్రాయవలెను. అర్ధము కాకున్న అగవలెను. అందుకు గణపతి అంగీకరించినాడు.
    భారత రచనా యజ్ఞము ఆరంభమయినది. మహర్షి వ్యాసుడు చెప్పుచున్నాడు. వినాయక భగవానుడు వ్రాయుచున్నాడు. వ్యాసునకు సమయము కావలసినపుడు ఒక క్లిష్టమయిన శ్లోకము చెప్పినాడు. గణపతి అర్ధము చేసుకొనుటకు కొంత సమయము పట్టినది. ఆవిధముగా సర్వజనోపయోగమయిన మహాభారత సంహిత మానవాళికి అందించబడింది.
    వ్యాస భగవానుడు మహాభారతమును అరువది లక్షల శోక్లములలో రచించినాడు. అందు ముప్పది లక్షలు స్వర్గలోకమందు, పదిహేను లక్షలు పితృలోకమందు, పద్నాలుగు లక్షలు గంధర్వలోకమందు , ఒక లక్ష మానవ లోకమందు ప్రతిష్టించబడినది. వానిలో ఎనిమిది వేల ఎనిమిదివందల శ్లోకములు , అతిక్లిష్టములయినవి మధ్య మధ్య వ్రాయించినారు వ్యాస మహర్షి, వానిని గురించి వ్యాసుడు

        "అహం వేద్మీ శుకోవేత్తి సంజయో వేత్తివానవా"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS