Next Page 
తపస్వి పేజి 1


                              తపస్వి
    
                                                     ---సి. ఆనందారామం

 

                          


    
    చిమ్మ చీకటిగా ఉన్న గదిలో లైట్ వేసింది సౌందర్య. సోఫాలో కూర్చుని ఉన్న శశాంక గారిని చూసింది.
    "మీరిక్కడే ఉన్నారా నాన్నగారూ! చీకటిగా ఉంటే..."
    "సౌందర్యా..."
    విసుగ్గా అడ్డు తగిలాడు. చిరాకంతా ఆ కంఠంలో ధ్వనించింది. సౌందర్యను చూసే ఆ చూపులలో ఎక్కడలేని అశాంతీ, ఆరాటమూ ప్రతిఫలిస్తున్నాయి.
    తండ్రి దగ్గరగా వచ్చి ఆయన చేతులు తన చేతుల్లోకి తీసుకుంది సౌందర్య.
    "ఏమిటి నాన్నగారూ?"
    ఆ మాటలలో...అడిగిన ఆ కంఠంలో ...ఆ ముఖంలో ఎంత అమాయకత్వం!... ఎంత నైర్మల్యం!
    "నువ్వు ఇప్పుడే వస్తున్నావా అమ్మా!"
    "అవును నాన్నగారూ! డిప్యూటీ కలెక్టరుగారు సినిమా అయ్యాక హోటల్ లో భోజనం చేద్దామన్నారు. అందుకని ఆలస్యమయింది..."
    కొన్నిక్షణాలు మాట్లాడక కూతురి ముఖంలోకి చూశాడు శశాంక. సౌందర్య కళ్ళు అమాయకంగా చూస్తున్నాయి. పెదవులు నవ్వుతున్నాయి పెంకిగా...నిర్లక్ష్యంగా... పొగరుగా.
    "అమ్మా! నువ్విలా తిరుగుతుంటే మర్యాదగా ఉంటుందా?"
    "మర్యాదా? అంటే? నేనెక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గౌరవంగానే చూస్తారు. ఏ ఫంక్షన్ కైనా నన్ను ప్రత్యేకించి ఆహ్వానిస్తారు. నేను రానంటే ఇంటికొచ్చి బ్రతిమాలి మరీ తీసుకెళతారు. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు తను చెయ్యగలిగింది ఏదైనా నా కోసం చేస్తానన్నారు. ఇదంతా మర్యాద కాదా నాన్నగారూ!"
    "కానీ..కానీ...సౌందర్యా! నువ్వు తెలివైనదానివి. ఇలా పాడయిపోతే..."
    "పాడవటం అంటే?...అందర్నీ నా చుట్టూ తిప్పుకుంటున్నాను- ఇందులో "పాడు" ఏముంది? నేను ఎవరి ముందైనా తల వంచగలనని మీరు ఊహించగలరా?"
    "నాకు తెలుసమ్మా! నీకు శీలం విలువ తెలుసు....కాని"
    "నాన్సెన్స్! శీలం కాదు నాన్నగారూ! వీళ్ళందరికీ చెడగొట్టటానికి మంచి వాళ్ళే కావాలి. ఒక్కసారి చెడిపోయానంతే ఇంక నన్ను చెడగొట్టాలని ఎవరికీ ఉత్సాహం ఉండదు. అందుకే.....నేను చెడిపోవడానికి వీల్లేదు!"
    "కానీ..సౌందర్యా! ఇలా చెడ్డపేరు తెచ్చుకుంటే..."
    "చెడ్డ పేరా? భలేవారు నాన్నగారూ! నన్ను గురించి అందరూ ఎలా చెప్పుకుంటున్నారో మీకు తెలిస్తే..."
    "తెలీదు. చెప్పు!"
    "ఆ సౌందర్య ఒక దెయ్యం! భూతం! అనుకుంటున్నారు."
    "ఇదా మంచి పేరు?"
    "కాదా? జనులలో మనమంటే భయభక్తులుండటం మంచిది కాదా? ఆ భూతాన్ని వదలలేము, పట్టుకోలేము! అని వాళ్ళు పైకి కనబడకుండా గిజగిజ లాడుతుంటే..."
    సౌందర్య పకపక నవ్వసాగింది.
    శశాంకగారి గుండెల్లో ఏదో బరువు పేరుకోసాగింది.
    "ఇలా అయితే నేను నీకు పెళ్ళి ఎలా చెయ్యగలనమ్మా?"
    "ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారు నాన్నగారూ! మార్కులు రానివాళ్ళకు సీట్ ఇప్పించగలరు! డిగ్రీలు లేనివాళ్ళకు ఉద్యోగాలు చూపించగలరు! అన్ని విధాలా సమర్దులయిన వాళ్ళను అణగద్రొక్కగలరు. నాకు పెళ్ళి చెయ్యలేరా?"
    "సౌందర్యా! ప్లీజ్! అలా మాట్లాడకు. నువ్వు నలుగురిలా ఎందుకుండవూ?"
    ఒక్కక్షణం సౌందర్య కళ్ళు భరింపరాని కోపంతో, కసితో, అసహ్యంతో భగ్గుమన్నాయి.
    ఆ జ్వాల శశాంక గారి హృదయాన్ని తాకింది. తపింపచేసింది.
    ఆ చూపుల నుంచి తన చూపులు తప్పించుకోవాలనిపించింది. ఏదో నిస్సహాయత ఆవరించింది.
    అలాగే తండ్రిని చూస్తూ "నలుగురిలా ఎందుకుండాలి నాన్నగారూ!" అంది.
    "నువ్వు పెళ్ళి చేసుకో సౌందర్యా! నీకు పెళ్ళి చెయ్యనియ్యి."
    "ప్రార్ధనలాగే ఉంది శశాంక కంఠం...
    సౌందర్య బుద్ధిగా తండ్రి ప్రక్కన కూర్చుంది.
    "అలాగే నాన్నగారూ! తప్పకుండా చేసుకుంటాను, కానీ ఎందుకు పెళ్ళి చేసుకోవాలో చెప్పండి!"
    "ఎందుకేమిటి? నలుగురూ..." అంటూ ఆగిపోయారు.
    సౌందర్య నవ్వింది ప్రసన్నంగా.....తండ్రి తనను అర్ధం చేసుకుంటూ మాటాడినప్పుడు ఆ నవ్వు అలాగే ఉంటుంది.
    "ఇంత మంది పెళ్ళి చేసుకుని సృష్టిని అభివృద్ధి చేస్తున్నారుగా నాన్నగారూ! నేనొక్కదాన్ని ఇలా ఉండిపోతే సృష్టి ఆగిపోతుందా?"
    "నీకసలు పెళ్ళంటే ఇష్టం లేదా? నువ్వసలు...." మాట్లాడలేకపోయారు.
    సౌందర్య నవ్వింది.
    "ఎందుకిష్టంలేదు నాన్నగారూ! చాలా ఇష్టం! మీరు చెప్పే ఆ నలుగురికంటే నలభై రెట్లు ఎక్కువ ఇష్టం!"
    "మరి..." ఆగి అకస్మాత్తుగా ఏదో స్ఫురించినట్లుగా అడిగాడు.
    "పోనీ, ఎవరినైనా ప్రేమిస్తున్నావా?"
    "అవును నాన్నగారూ!"
    శశాంకలో కుతూహలమూ, ఉత్సాహమూ పెరిగాయి.
    "నిజంగానా! చెప్పు తల్లీ! అతడెవరైనా వెంటనే నిన్నిచ్చి పెళ్ళి చేస్తాను. చెప్పు! ఎవరతను?"
    "ఏమో! నాకు తెలీదు!"
    "తెలీదా?...ఎక్కడ చూశావు?"
    "కలలో.."
    "సౌందర్యా!-"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS