Home » suryadevara rammohan rao » Vyuham


    శక్తి ఏం మాట్లాడలేదు.

 

    "నేనిచ్చే ఫీజుని మీరు కాదనకూడదు" పక్కనున్న బ్రీఫ్ కేసుని టేబుల్ మీద పెట్టి తెరిచి, అందులోంచి ఒక ఫైలుని తీసి శక్తి ముందు పెట్టాడు బాణశంకర్. చెక్ గానీ, డబ్బునిగానీ తీసిస్తాడనుకొన్న శక్తి అ ఫైలువేపు ఆశ్చర్యంగా చూస్తూ అందుకున్నాడు.

 

    "ఏంటిది?"

 

    "తీసి చూడండి."

 

    ఫైలు తెరిచాడు శక్తి.

 

    అదో బిల్డింగ్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్. ఏం అర్థం కాలేదు శక్తికి.

 

    "మిస్టర్ శక్తీ! నా లైఫ్ యాంబిషన్ ఎప్పటికయినా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ని కట్టించాలని. సజ్జన్ రావ్ సర్కిల్లో స్థలం తీసుకున్నాను. కర్నాటక టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, బ్యాంక్ ఆఫ్ మైసూర్ రెండూ లోను ఇస్తున్నాయి, మీరు అంగీకారం తెలిపితే శంకుస్థాపన కార్యక్రమం చేపడదామని నా కోరిక..." నెమ్మదిగా చెప్పాడు బాణశంకర్.

 

    బాణశంకర్ తన అంగీకారం ఎందుకు కోరుతున్నాడో అర్థం కాలేదు శక్తికి.

 

    "ప్రొసీడ్ యువర్ సెల్ప్. మధ్యలో నా అంగీకారం ఎందుకు" శక్తి మాటకు నవ్వాడు బాణశంకర్.

 

    "నా కన్ స్ట్రక్షన్స్ శక్తి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి నా సంస్థకు మీరే ఛైర్మన్ కాబట్టి..."

 

    నమ్మలేకపోతున్నాడు శక్తి... కళ్ళ ముందు జరుగుతున్న కలలా వుంది.

 

    "నేను ఆ రోజు మీ దగ్గరకు నిరాశతో వచ్చాను. మాట్లాడలేని స్థితిలో ఉన్నాసరే మీరు నాకోసం కొన్ని నిమిషాలు కేటాయించారు. అందుకు కృతజ్ఞతగానే కాదు... ఓకే క్రియేటివ్ జీనియస్ కి గురుభావంతోనే ఈ ఆఫరిస్తున్నాను. నా ఆనందాన్ని మీరు కాదనరనే నమ్మకం నాకుంది."

 

    ఒక కృతజ్ఞత విలువ ఇంత పెద్ద మొత్తంలో ఉంటుందని జీవితంలో మొట్టమొదటిసారి తెల్సుకున్న శక్తి కళ్ళు చెమ్మగిల్లాయి.

 

    ఎందుకో అకస్మాత్తుగా శక్తికి తన తల్లి లక్ష్మీదేవి, తన బిజినెస్ లో పార్టనర్ గా చేరమని అడిగిన సూర్యం జ్ఞాపకానికొచ్చారు.

 

    "నేను రెండ్రోజుల్లో ఫోన్ చేస్తాను. మనం డిటైల్డ్ గా మాట్లాడుకోవాలి."

 

    లేచి నిలబడ్డాడు బాణశంకర్. బాణశంకర్ వెనక మెయిన్ గేటు వరకు వచ్చాడు శక్తి.

 

    బాణశంకర్ నమస్కారం చేసి కారెక్కాడు. వెళ్ళిపోతున్న కారువేపు విస్మయంగా చూస్తూ వుండిపోయాడు శక్తి.

 

                                       *    *    *    *

 

    వి.వి.ఎన్. ఎస్టేట్స్ ఛైర్మన్ ఛాంబర్ లో వెంకటనారాయణకి ఎదురుగా కూర్మనాధం కూర్చుని వున్నాడు.

 

    ఆ గదిలో పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ జరిగిందంతా చెప్పాడు కూర్మనాధం.

 

    అది వింటూనే వెంకటనారాయణ దిగ్భ్రాంతిగా చూసాడు కూర్మనాధం వైపు.

 

    "అలా అన్నాడా?" అడిగాడు వెంకటనారాయణ.

 

    "అవును సార్! అతన్ని మీ దగ్గరికి తేలేకే రిజైన్ చేసాను" అన్నాడు కూర్మనాధం తప్పుచేసినవాడిలా.

 

    "నీ రాజీనామా మన సమస్యకి పరిష్కారమా? కాదే. అందుకే నిన్ను తిరిగి పిలిపించింది" అన్నాడు వెంకటనారాయణ.

 

    కూర్మనాధం కృతజ్ఞతగా వెంకటనారాయణ వేపు చూసాడు.

 

    "మనం శక్తిని తిరిగి మన సంస్థకి రప్పించి తీరాలి" పట్టుదలగా అన్నాడు వెంకటనారాయణ.

 

    "అదంత తేలికయిన విషయం కాదేమో సార్" నసుగుతూ అన్నాడు కూర్మనాధం.

 

    "అది తేలికయిన విషయం కావాలంటే మనమేం చేయాలి?"

 

    కూర్మనాధం సమాధానం చెప్పలేకపోయాడు.

 

    "శక్తిలోని అహాన్ని రెచ్చగొట్టాలి. ఒక ఛాలెంజ్ కి అతడ్ని ఒప్పించాలి. పరిష్కారమేలేని సమస్యని అతనికివ్వాలి. అది అతను సాల్వ్ చేయలేకపోతే మనం కంపెనీలో తిరిగి చేరిపోవాలి అనే కండీషన్ పెట్టాలి. అందుకాతడ్ని ఒప్పించాలి" సాలోచనగా అన్నాడు వెంకటనారాయణ.

 

    కూర్మనాధం... వెంకటనారాయణ తెలివితేటలకు విస్మయపడ్డాడు.

 

    "అందుకైనా సరే... మీరతని దగ్గరకు వెళ్ళి తీరాలి కదా సార్. మీలాంటి గొప్పవాళ్ళు అలాంటి చిన్న కన్సల్ టెంట్ దగ్గరికి వెళ్లటం నాకెందుకో కష్టంగా అనిపిస్తోంది సార్."

 

    "నేను ఎవరి దగ్గరకైనా ఒకసారి వెళ్తే వాళ్ళని నా దగ్గరకు కొన్ని వందల సార్లు రప్పించుకోటానికే" ధీమాగా అన్నాడు వెంకటనారాయణ.

 

    ఇంతకీ శక్తి నిజంగా మీకు మేనల్లుడేనా అని అడగాలని కూడా ధైర్యం చాలక అడగలేకపోయాడు కూర్మనాధం.

 

    "ఇంతకీ పరిష్కారం లేని సమస్య ఏముంది సార్?" అడిగాడు కూర్మనాధం.

 

    "మన టూత్ పేస్ట్ సేల్స్ ని మరింతగా ఎలా పెంచాలనేది పరిష్కారం లేని సమస్యే. ఆల్ రడీ ఇప్పటికే 80 శాతం మార్కెట్ ని కైవశం చేసుకున్న మన టూత్ పేస్ట్ సేల్స్ ని ఇంకా పెంచటం అనేది అసాధ్యం. ఆ అసాధ్యాన్నే సమస్యగా చిత్రీకరించి అతని ముందుంచూదాం. అప్పుడు చూద్దాం ఏం చేస్తాడో" అన్నాడు వెంకటనారాయణ ఎక్కడో ఆలోచిస్తూ.

 

    అది వింటూనే బిత్తరపోయి చూసాడు కూర్మనాధం. "ఇన్ని తెలివితేటలుండబట్టే ఈయన ఈ స్థితికి ఎదగగలిగారు" అనుకున్నాడు మనసులోనే కూర్మనాధం.

 

    "శక్తి ఓడిపోవటం- తిరిగి వచ్చి మన కంపెనీలో చేరటం అనివార్యం సార్" అన్నాడు కూర్మనాధం తేరుకుంటూ.

 

    "ఈ ఛాలెంజ్ కి నేనతడ్ని ఒప్పించగలిగినప్పుడు గదా అతనొచ్చి మన కంపెనీలో చేరేది చూద్దాం... ఏమవుతుందో" అంటూ ఫోనందుకుని తన ఇంటికి ఫోన్ చేశాడు వెంకటనారాయణ.

 

    కూర్మనాధం లేచి ఛాంబర్ లోంచి బయటికి వచ్చేసాడు.

 

                                         *    *    *    *


Related Novels


Rakthachandanam

Erra Samudram

Daaling

Anitara Sadhyudu

More