Home » suryadevara rammohan rao » Erra Samudram


                                  ఎర్ర సముద్రం
                                                                    -సూర్యదేవర రామ్ మోహన్ రావు.


                                   

    రాజధాని నగరంలో కొద్ది క్షణాల క్రితమే మసక చీకటి ప్రవేశించింది.
    అప్పుడు సమయం ఆరు ఏడు గంటల మధ్య.....
    ఆ సమయంలో ఆకాశంలోంచి రాజధానిని చూస్తే పల్చటి బురఖా వేసుకొని నిలబడ్డ ఎంచక్కటి పదహారేళ్ళ ముస్లిం అమ్మాయిలా వుంది.
    నగరానికి పక్కగా వున్న బంజారా కొండల్లోంచి సూర్యుడు చివరిసారిగా బిర్లామందిరాన్ని, చార్మినార్ని చూసేసి చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు.
     పల్చటి వెలుగు, సన్నని చీకట్లో బంజారా కొండల ప్రాంతంలో భవనాలు అప్పుడే తయారైన ముచ్చటైన ముత్యాల్లా అందంగా వున్నాయి.
    ఆ భవనాల్లో ఓ అద్దాల భవనం ఆ సమయంలో మరింత అందంగా కనిపిస్తోంది.
    అదో ఐదు అంతస్థుల భవనం.
    రోడ్డు పక్కన హుందాగా నిల్చున్న ఆ భవనం-దీపాల భవనంలా పాలవనంలా మెరుస్తోంది.
    అంత పెద్ద భవనంలోనూ, ప్రస్తుతం పై అంతస్తులో మూడో గదిలో మాత్రమే మనుషులున్నారు. ఆ మూడో గదిని  తీసి దుబాయ్ లో అమ్మేస్తే ముచ్చటపడి మూడు కోట్ల రూపాయలకు కొనుక్కుంటారు. అంత విలాస వంతంగా వుందా గది!
    ఆ గది, ఆ సమయంలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులున్నారు.
    అందులో ఒక వ్యక్తికి పాతికేళ్ళుంటాయి. చామనఛాయలో, సన్నగా, మరీ పొడవూ, పొట్టి కాకుండా మధ్యస్థంగా, ఉంగరాల జుత్తుతో పెద్ద పెద్ద  కళ్ళతో ఆరోగ్యంగా వున్నాడు. అతని వంటిమీద యాభై రూపాయలు మాత్రమే విలువచేసే బట్టలున్నాయి. కాళ్ళకు సగం అరిగి పోయిన హవాయి చెప్పులున్నాయి.
    అతనా గదికి రావటానికి రెండున్నర సంవత్సరాల వయస్సుగల అతని దారుణమైన అనుభవాలు, రెండు నెలల  అంతర్మధనం, రెండు గంటల క్రితం వచ్చిన తెగింపు కారణమయ్యాయి.
    ప్రస్తుతం అతను చేతులు కట్టుకొని వధ్యశిలపై నిల్చున్నట్లు నిల్చున్నాడు.
    అతని కెదురుగా ఓ యాభై ఏళ్ళ వ్యక్తి దర్జాగా, అతి మెత్తని కుషన్ చెయిర్లో కూర్చుని వున్నాడు. సుఖాల్లోపుట్టి, సుఖాల్లో పెరుగుతూ, ఆ సుఖాల్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలో సుఖాసీనుడై వున్నాడు.
    చేతిలో పైపు అప్పుడప్పుడు అటూ, ఇటూ తమాషాగా కదులుతోంది. అతని తోడేలు కళ్ళు చెలగాటంగా కదుల్తున్నాయి- ఎదుటివ్యక్తిని అంచనా  వేస్తున్నాయి.
    అతను భాగ్యరాజ్.
    సాదా సీదా దుస్తుల్లో వున్న ఆ యువకుడి పేరు రవిచంద్ర.
    "చూడు రవీ.....నేను పెట్టిన షరతులన్నింటికి ఒప్పుకున్నావు. అందుకు నాకు చాలా ఆశ్చర్యంగా మాత్రం లేదు. అలా  అని అసలు లేకపోలేదు. ఎందుకంటే ఇండియాలో మనిషి ప్రాణంవిలువ ఇంత తక్కువని, చాలా తేలిగ్గా లెక్క కట్టొచ్చని తెల్సినా మరీ  ఇంతగానా అని.... ఆశ్చర్యంగా వుంది. ఇది నేనెందుకు తెల్సుకోలేకపోయాను......! మా నాన్నగారైనా ఎందుకు చెప్పలేదు.....! కారణం ఒక్కటే కనిపిస్తోంది. ఈ గదుల్లోంచి బయటకు రానందువల్ల, అలా వచ్చే అవసరం  రానందువల్లే ననుకుంటాను.
    పూర్ ఇండియన్ లైవ్స్ ......భోపాల్ లో కొన్నివేళమంది మిడతల్లా కాలిపోయినప్పుడు ప్రభుత్వంచూపిన, ఇప్పటికీ చూపిస్తున్న ఉదాసీనతను' నిర్లక్ష్యాన్ని బట్టి అయినా అంచనా వేయలేకపోయాను.
    మన విషయంలోకి వద్దాం.
    ఎవరైనా ఎలాగోలా బ్రతకాలనుకుంటారు. కాని నువ్వు  చావాలనుకుంటున్నావు. ఆత్మార్పణ కావించుకుంటానంటున్నావు, అదే సాధారణమైన మనిషి అయితే నా ఆశ్చర్యానికి అర్థం ఉండకపోవచ్చు.
    కాని భవిష్యత్ లో గొప్ప మేధావి  కాగల తెలివితేటలున్న వాడివి బాగా చదువుకున్న వాడివి- వయస్సులో వున్నవాడివి- ఆరోగ్యవంతుడివి- అందుకే నాకు కాస్తపాటి యిది!
    Life is not problem
    to be solved
    Life is a mystery
    to be lived.
    ఇది తెలియని భారతదేశ ప్రజల మూర్ఖత్వంపట్ల జాలి నాకు....." అన్నాడు బట్టతలని నిమురుకుంటూ భాగ్యరాజ్.
    ఎంతో నిర్లిప్తంగా వుండాలనుకున్న రవిచంద్ర ఆ మాటలకు నోరు విప్పాడు.
    "ఇక, ఇప్పుడు ఈ స్థితిలో నేను మాట్లాడటం మూర్ఖత్వమే. అయితే ఇలా నేను మాట్లాడటమే మూర్ఖత్వం. మాట్లాడ బోతున్నది మాత్రం కాదు.


Related Novels


Rakthachandanam

Erra Samudram

Daaling

Anitara Sadhyudu

More