Home » suryadevara rammohan rao » Vyuham
అంటే, బాణశంకర్ బిజినెస్ హిట్ అయిందన్న మాట. ఫ్యామిలీ మేళకు, బాణశంకర్ సింహస్వప్నం అయ్యుంటాడు.
బాణశంకర్ జ్ఞాపకం రావడంతో మనసు ఆనందంతో నిండిపోయింది.
ఆఫీస్ ఫైల్స్ హడావుడిలో-
కాసేపయ్యాక ఆ విషయాన్ని మరచిపోయాడు.
రెండుగంటల తర్వాత-
డోర్ తెరచుకొని లోనికొచ్చేస్తున్న అ పెద్దమనిషిని చూసి నిశ్చేష్టుడయ్యాడు శక్తి.
బాణాశంకర్... వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. పట్టుపంచె, పట్టు లాల్చీ. మెడలో గోల్డ్ చెయిన్ అయిదు వేళ్ళకూ అయిదు ఉంగరాలు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు.
"ఈ పరిస్థితుల్లో మీ దగ్గరికి తలుపు తీసుకొని చనువుగా వచ్చే అధికారం నానొక్కడికే ఉంది" నవ్వుతూ కూర్చున్నాడు బాణశంకర్.
బాణశంకర్ సడన్ గా రావడం ఆశ్చర్యంగా వుంది శక్తికి.
"ఫామిలీ మేళ ప్రొప్రైటర్ రెండుసార్లు నాకోసం ఫోన్ చేశార్ట. ఆయన ఫోన్ కోసం చూస్తుంటే విచిత్రంగా మీరొచ్చారు" నవ్వుతూ అన్నాడు శక్తి.
"ఫామిలీ మేళ ప్రొప్రైటర్ మూడోసారి కూడా ఫోన్ చేసాడు. మీరు ఆఫీసులో ఉన్నారని తెలిసే మీ దగ్గరకొచ్చాడు" బాణశంకర్ మొహంలో ఏదో వెలుగు.
"ఆయన కూడా వచ్చారా?"
"అవును. వాడే వీడు... శక్తి సాబ్"
తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు శక్తి.
బాణశంకర్ ఫామిలీ మేళకు ప్రొప్రైటర్ కావడం మేబీ ఇటీజ్ ఎ మిరకిల్.
"ఆశ్చర్యపోతున్నారు కదూ శక్తి సాబ్. జీవితంలో అన్నివిధాలా ఓడిపోయి, ఆఖరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చిన బాణశంకర్ తో ఫామిలీ మేళకు ఎదురుగా షాప్ ఓపెన్ చెయ్యమన్నారు మీరు. జ్ఞాపకం వుందా" గోల్డ్ సిగరెట్ బాక్సులోంచి రోత్ మెన్ సిగరెట్ తీసి వెలిగించాడు బాణశంకర్.
"అవును"
"మీరు చెప్పినట్లుగనే చేసాడు ఈ బాణశంకర్. శంకర్ రెడీమేడ్ గార్మెంట్స్ మొదటి వారంరోజులూ బిజినెస్ డల్ గా ఉన్నా ఆ తర్వాత బిజినెస్ పికప్ అయింది.
మొదట్లో రోజుకు వెయ్యిరూపాయలు మెటీరియల్ సేల్స్ అయ్యేది. నెలరోజులు గడిచాయి.
ఫెస్టివల్ సీజన్ స్టార్టయింది. ఏ పత్రికలో చూసినా ఫామిలీ మేళా ఎడ్వర్ టైజ్ మెంట్లే. ఆ యాడ్ కాంపైన్ కోసమే ఫామిలీ మేళా వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో పాటు అయిదుకోట్ల రూపాయల లేటెస్ట్ మెటీరియల్ ని సూరత్ నుంచి తెప్పించారు.
నా గుండెల్లో రాయి పడింది.
ఫామిలీ మేళా దెబ్బకు మనం ఎగిరిపోవడం ఖాయం అనుకున్నాను.
గాడ్ ఈజ్ గ్రేట్- అప్పుడే ఒక మిరకిల్ జరిగింది."
ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు బాణశంకర్.
"ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడానికి రెండ్రోజులు ముందు ఉదయం పదిగంటలవేళ-
ఫామిలీ మేళ షోరూం మీద ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాడి జరిగింది. ఎక్కడ ఏం జరిగిందో తెలీదు.
వారం రోజులపాటు మొత్తం షోరూంలో వెరిఫికేషన్ జరిగింది.
ఆరోజు రాత్రి-
అప్పుడే షాపు నుండి ఇంటికెళ్ళాను.
అప్పటికే ఇంటి దగ్గర మారుతీకార్లో కూర్చుని నా కోసం ఎదురుచూస్తున్నాడు ఫామిలీమేళా ప్రొప్రైటర్ భజరంగదాసు-
సంగతంతా చెప్పాడాయన.
చాలా ఇన్వెస్ట్ చేశాను ఫెస్టివల్ సీజన్ కోసం. అయిదుకోట్ల రూపాయల మెటీరియల్ తెచ్చాను. గిట్టని వాళ్ళెవరో కంప్లయింట్ చేశారు. ఈ ఇన్ కమ్ టాక్స్ కుట్రకి అసలు కారణం ఏంటో నాకు తెలుసు. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఈ టైమ్ లో మీరే నన్ను రక్షించాలి అంటూ భజరంగదాసు నన్ను ప్రాధేయపడ్డాడు.
నేనాయనకు ఎలా సహాయపడగలనో నాకర్థం కాలేదు.
ఈ ఫెస్టివల్ సీజన్లో నేను షోరూంని ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అందుచేత గోడౌన్ లోని మెటీరియల్ ని మీకు హేండోవర్ చేస్తాను.
మీరు అమ్ముకోండి. ట్వంటీ పర్ సెంట్ తీసుకోండి" అని అన్నాడు.
బాణశంకర్ ఒక్కక్షణం ఆపాడు చెప్పటం.
"మీరు ఫామిలీ మేళాకు ప్రొప్రైటర్ ఎలా అయ్యారు" ఆసక్తిగా అడిగాడు శక్తి.
"ఫెస్టివల్ సీజన్లో మొత్తం సరుకంతా వెళ్ళిపోయింది. కష్టాల్లో వున్న భజరంగదాసు దగ్గర ట్వంటీ పర్ సెంట్ కమీషన్ తీసుకోదలచుకోలేదు. ఏరోజూ సేల్స్ కు సంబంధించిన ఎమౌంట్ ని ఆరోజే ఇచ్చేసాను. నాలో ఏ గుణం ఆయనకు నచ్చిందో తెలీదు.
పదిపైసల వాటా ఇస్తూ ఫామిలీ మేళాలో నన్ను కూర్చోబెట్టాడు. ఫామిలీ మేళా షోరూమ్స్ సూరత్, అహ్మదాబాద్, పూనే, బాంబేల్లో కూడా వున్నాయి.
నీలాంటివాడే నాకు కావాలి. కాదనకు. ఇవాల్టి నుంచి ఫామిలీ మేళా నీదే అని ఇక్కడ షోరూంని నాకప్పగించి బొంబాయి వెళ్ళిపోయాడు భజరంగదాసు. నా షాపుని నేను లీజుకిచ్చేసాను. ప్రస్తుతం డైలీ టూ లేక్స్ బిజినెస్ చేస్తున్నాను. పెను తుఫానులో వడ్డుకొచ్చిన వాడికి స్వర్ణనిధి దొరికిన ఆనందం. నిన్న పైసాకు టికాణాలేని బాణశంకర్ నేడు లక్షాధికారి" ఆనందంగా చెప్పాడు బాణశంకర్.
బాయ్ కూల్ డ్రింక్ తెచ్చాడు. అందుకొని సిప్ చేస్తున్నాడు బాణశంకర్.
"మొట్టమొదటసారి నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు కనీసం ఒక పదిరూపాయలైనా మీకు ఫీజు ఇవ్వలేకపోయాను. నేను మీ బాకీ చెల్లించడానికి వచ్చాను" ఖాళీ బాటిల్ ని పక్కన పెడుతూ అన్నాడు బాణశంకర్.



